పిఎంఇండియా

ప్రధాన మంత్రిని గురించి తెలుసుకోండి

know_the_pm

శ్రీ న‌రేంద్ర‌ మోదీ భార‌తదేశ ప్ర‌ధాన మంత్రిగా 2014 మే 26వ తేదీన బాధ్య‌త‌లు చేప‌ట్టారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించుకొన్న అనంతర కాలంలో జ‌న్మించిన వ్య‌క్తి ప్ర‌ధాన మంత్రి పదవిని అలంకరించడం దేశ చ‌రిత్ర‌లో ఇదే తొలి సారి. ఈ ఘనత శ్రీ నరేంద్ర మోదీ దే. క్రియాశీలమైన, అంకిత భావమూ, ప‌ట్టుద‌లా కలిగిన శ్రీ నరేంద్ర మోదీ వంద కోట్ల పై చిలుకు భార‌తీయుల ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిబింబం.

అభివృద్ధిపై మెరుపు దృష్టి, ఏ ప‌నిలో అయినా మంచి ఫ‌లితాలు రాబ‌ట్ట‌గ‌ల స‌మ‌ర్థ నాయ‌క‌త్వం శ్రీ న‌రేంద్ర‌ మోదీని దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ గ‌ల నాయ‌కుల్లో ఒక‌రుగా నిల‌బెట్టాయి. ప్ర‌తి ఒక్క భార‌తీయుడి ఆశ‌లు, ఆకాంక్ష‌లు, ఆశ‌యాలు తీర్చ‌గ‌ల శ‌క్తిమంతమైన‌, సౌభాగ్య‌వంత‌మైన‌, స‌మ్మిళిత వృద్ధికి ఆల‌వాల‌మైన దేశాన్ని నిర్మిస్తామ‌న్నది ఆయ‌న హామీ. శ్రీ న‌రేంద్ర‌ మోదీ భార‌తదేశ ప్ర‌ధాన మంత్రిగా అధికార బాధ్య‌త‌లను స్వీక‌రించిన క్ష‌ణం నుంచే ఈ హామీని నెర‌వేర్చేందుకు న‌డుం బిగించారు. వ‌రుస‌లోని చివ‌రి వ్య‌క్తికి కూడా ఫ‌లితం అందించాలి- అనే అంత్యోదయ సిద్ధాంతమే ఆయ‌న‌లో స్ఫూర్తిని రగిలిస్తున్నది.

న‌వ్య ఆలోచ‌నా ధోర‌ణులు, స‌రికొత్త చొర‌వ‌ల‌తో మోదీ ప్ర‌భుత్వం అభివృద్ధి చ‌క్ర‌గ‌మ‌నాన్ని మ‌రింత వేగ‌వంతం చేసింది. త‌ద్వారా అభివృద్ధి ఫ‌లాలు ప్ర‌తి పౌరుడికి చేరుతున్నాయి. ప‌రిపాల‌న ఎలాంటి దాప‌రికాలు లేకుండా స‌ర‌ళంగా మారింది. శ్రీ న‌రేంద్ర‌ మోదీ ప్ర‌వేశ‌పెట్టిన “ప్ర‌ధాన‌ మంత్రి జ‌న్‌ ధ‌న్ యోజ‌న” ప్ర‌తి భార‌తీయుడిని దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో అంత‌ర్గ‌త భాగ‌స్వామి ని చేసింది. దేశ‌ చ‌రిత్ర‌లో ఇలాంటి ప‌థ‌కం ఆచ‌ర‌ణ‌లోకి రావ‌డం ఇదే ప్ర‌థ‌మం. అలాగే “మేక్ ఇన్ ఇండియా” అంటూ ఆయ‌న పూరించిన శంఖారావం పెట్టుబ‌డిదారులు, ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లలో కొత్త శ‌క్తిని నింపింది. దేశంలో వ్యాపారాల నిర్వ‌హ‌ణ అత్యంత స‌ర‌ళంగా మారింది. “శ్ర‌మయేవ జ‌య‌తే” అంటూ ప్రారంభించిన కార్మిక సంస్క‌ర‌ణ‌లు చిన్న‌ పరిశ్రమల, మ‌ధ్య‌ త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల కార్మికులలో సాధికార‌త తెచ్చింది. నైపుణ్యాలు గ‌ల యువ‌త‌ లోని శ‌క్తి సామ‌ర్థ్యాల‌కు కొత్త ఊపిరులు ఊదింది.

దేశ‌ చ‌రిత్ర‌లోనే మొదటి సారిగా ప్ర‌భుత్వం మూడు సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కాలను ప్ర‌వేశ‌పెట్టింది. వ‌యోవృద్ధుల‌కు పింఛ‌ను, నిరుపేద‌ల‌కు బీమా ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంపై దృష్టి పెట్టింది. 2015 జూలైలో సాంకేతిక ప‌రిజ్ఞానం స‌హాయంతో ప్ర‌జ‌ల జీవితాల్లో నాణ్య‌త తీసుకురావ‌డం ల‌క్ష్యంగా ప్ర‌ధాన మంత్రి “డిజిట‌ల్ ఇండియా” కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. 2015 అక్టోబ‌రు 2వ తేదీన జాతి పిత మ‌హాత్మా గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని జాతి స్వ‌చ్ఛ‌త కోసం “స్వ‌చ్ఛ భార‌త్” పేరిట ప్ర‌జా ఉద్య‌మానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ శ్రీ‌కారం చుట్టారు. ఈ ఉద్య‌మం ప‌రిధిలో గాని, ప్ర‌భావంలో గాని చ‌రిత్ర‌లోనే అతి పెద్దది.

శ్రీ న‌రేంద్ర‌ మోదీ విదేశాంగ విధానంలో తీసుకుంటున్న చొర‌వ‌ల వ‌ల్ల ప్ర‌పంచం లోని అతి పెద్ద ప్ర‌జాస్వామిక దేశంగా భార‌త‌దేశం పూర్తి స్థాయి శ‌క్తి సామ‌ర్థ్యాలు వినియోగంలోకి వ‌స్తున్నాయి. ప్ర‌పంచ య‌వ‌నిక‌పై భార‌తదేశం మ‌రింత కీల‌క పాత్ర‌ధారిగా మారింది. సార్క్ దేశాధినేత‌లంద‌రి సమ‌క్షంలో ప్ర‌ధానమంత్రిగా శ్రీ మోదీ రాజ‌కీయాలలో కొత్త పాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. ఐక్య‌ రాజ్య‌ స‌మితి స‌ర్వ‌ ప్ర‌తినిధి స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగానికి ప్ర‌పంచం యావ‌త్తు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది. సుదీర్ఘ విరామం త‌రువాత నేపాల్‌, ఆస్ట్రేలియా, ఫిజీ, సెశెల్స్ లలో ద్వైపాక్షిక ప‌ర్య‌ట‌న‌లు చేసిన తొలి ప్ర‌ధాన మంత్రిగా శ్రీ న‌రేంద్ర‌ మోదీ చ‌రిత్ర సృష్టించారు. 17 సంవ‌త్స‌రాల అనంతరం నేపాల్‌, 28 సంవ‌త్స‌రాల అనంతరం ఆస్ట్రేలియా, 31 సంవ‌త్స‌రాల అనంతరం ఫిజీ, 34 సంవ‌త్స‌రాల అనంతరం సెశెల్స్‌లో ప‌ర్య‌టించిన మొట్టమొదటి భార‌త ప్ర‌ధాన మంత్రి ఆయ‌నే. ప్ర‌ధాన మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఐక్య‌ రాజ్య‌ స‌మితి, బి ఆర్ ఐ సి ఎస్ (బ్రిక్స్‌), ఎస్ ఎ ఎ ఆర్ సి (సార్క్‌), జి-20 వంటి ప్ర‌ధాన సంస్థ‌ల శిఖ‌రాగ్ర స‌ద‌స్సుల‌కు హాజ‌రై, భిన్న అంశాల‌పై జ‌రుగుతున్న చ‌ర్చ‌లలో జోక్యం చేసుకొని భార‌తదేశ వాణిని వినిపించారు. ప్ర‌పంచం ఎదుర్కొంటున్న భిన్న ఆర్థిక‌, రాజ‌కీయ స‌మ‌స్య‌ల‌పైన భార‌తదేశం ప్ర‌క‌టించిన అభిప్రాయాలు స‌ర్వే స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు అందుకొన్నాయి. జ‌పాన్‌లో ప్ర‌ధాన మంత్రి ప‌ర్య‌ట‌న భార‌తదేశం- జ‌పాన్ సంబంధాలో ఒక నూతన శ‌కానికి తెర తీసింది. మంగోలియాను సందర్శించిన భార‌తదేశ తొలి ప్ర‌ధాన మంత్రిగా శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఖ్యాతి గ‌డించారు. చైనా, ద‌క్షిణ కొరియాలలో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు అత్యంత విజ‌య‌వంత‌ం అయ్యాయి. భారతదేశానికి పెట్టుబ‌డులను ఆక‌ర్షించాయి. ఫ్రాన్స్, జ‌ర్మ‌నీల‌కు త‌న ప‌ర్య‌ట‌న ద్వారా భార‌త్‌కు యూరోపియ‌న్ యూనియ‌న్ ఎంత ముఖ్య‌మో శ్రీ మోదీ నిరూపించారు.

l2014100257537

అర‌బ్ ప్ర‌పంచంలో బ‌లీయ‌మైన సంబంధ బాంధ‌వ్యాల‌కు శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 2015 ఆగ‌స్టులో ఆయ‌న యు ఎ ఇ ని సంద‌ర్శించారు. 34 సంవ‌త్స‌రాల విరామం అనంతరం యు ఎ ఇ ని సంద‌ర్శించిన తొలి భార‌త ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ. గ‌ల్ఫ్ దేశాల‌తో ఆర్థిక సంబంధాల ప‌టిష్ఠ‌త‌కు ఈ ప‌ర్య‌ట‌న ద్వారా పునాదులు వేశారు. 2015 జూలైలో ఆయ‌న ఐదు సెంట్ర‌ల్ ఆసియా దేశాలలో ప‌ర్య‌టించారు. ఇది కొత్త సంబంధాల‌కు తెర తీసిన ఒక చారిత్ర‌క ప‌ర్య‌ట‌న‌గా చ‌రిత్ర సృష్టించింది. ఈ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో ఆ దేశాల‌తో ఇంధ‌నం, వాణిజ్యం, సాంస్కృతిక‌, ఆర్థిక రంగాలలో భారతదేశ భాగ‌స్వామ్యానికి కీల‌కమైన ఒప్పందాలు కుదిరాయి. 2015 అక్టోబ‌రులో న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ఇండియా- ఆఫ్రికా శిఖ‌రాగ్ర స‌మావేశంలో 54 ఆఫ్రికా దేశాలు పాల్గొన్నాయి. 41 ఆఫ్రికా దేశాల అగ్ర‌ నేత‌లు స‌మావేశాల‌కు హాజ‌రై భార‌త‌- ఆఫ్రికా సంబంధాలను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంపై సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపారు. భార‌తదేశానికి వ‌చ్చిన ఆఫ్రికా దేశాల నాయ‌కుల‌తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ద్వైపాక్షిక చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు.
2015 న‌వంబ‌రులో ప్ర‌ధాన మంత్రి పారిస్‌లో జ‌రిగిన సి ఒ పి- 21 స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు. వాతావ‌ర‌ణ మార్పుల‌కు సంబంధించిన అంశాల‌పై ఆ స‌ద‌స్సుకు హాజ‌రైన ప్ర‌పంచ నాయ‌కులు చ‌ర్చించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లోనే శ్రీ న‌రేంద్ర‌ మోదీ, ఫ్రాన్స్ అధ్య‌క్షుడు హోలెండ్ ఇంటర్ నేషనల్ సోలార్ అల‌య‌న్స్ ను ఆవిష్క‌రించారు. ఇళ్ళ‌లో దీపాలు వెలిగించేందుకు సౌర‌ శ‌క్తిని వినియోగంలోకి తెచ్చే వేదిక ఇది.

2016 ఏప్రిల్‌లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అణుభ‌ద్ర‌తా స‌ద‌స్సుకు హాజ‌రై ప్ర‌స్తుత ప్ర‌పంచానికి అణు భ‌ద్ర‌త ఆవ‌శ్య‌క‌త‌పై ఎలుగెత్తి ఘోషించారు. అదే ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న సౌదీ అరేబియాను కూడా సంద‌ర్శించారు. సౌదీ రాజు అబ్దుల‌జీజ్ ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీకి ఆ దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారం బ‌హూక‌రించారు.

శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధికారం చేప‌ట్టిన త‌రువాత ఆస్ట్రేలియా ప్ర‌ధాని టోనీ ఎబాట్‌, చైనా అధ్య‌క్షుడు శీ జిన్ పింగ్‌, శ్రీ‌లంక అధ్య‌క్షుడు మైత్రిపాల‌ సిరిసేన, ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, జ‌ర్మ‌నీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ వంటి ప‌లువురు ప్ర‌పంచ నాయ‌కులు భార‌తదేశాన్ని సంద‌ర్శించారు. వారి ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా ఆయా దేశాల‌తో స‌హ‌కారం- విస్త‌ర‌ణ‌ లపై చారిత్ర‌క ఒప్పందాలు కుదిరాయి. 2015 సంవ‌త్స‌ర‌ గ‌ణ‌తంత్ర దిన వేడుక‌ల‌కు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్య‌క్షుడు భార‌తదేశ గ‌ణ‌తంత్ర వేడుక‌ల్లో పాల్గొన‌డం చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం. 2015 ఆగ‌స్టులో ఎఫ్ ఐ పి ఐ సి శిఖ‌రాగ్ర స‌ద‌స్సును భారతదేశం నిర్వ‌హించింది. ప‌సిఫిక్ దీవుల అగ్ర నాయకులు ఈ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు. ఆయా దేశాల‌తో భార‌తదేశ సంబంధాల‌పై కీల‌కాంశాల‌ను చ‌ర్చించారు.

ప్ర‌పంచం యావ‌త్తు సంవ‌త్స‌రంలో ఒక రోజు “అంత‌ర్జాతీయ యోగ దినోత్స‌వం”గా పాటించాల‌న్న శ్రీ న‌రేంద్ర‌ మోదీ పిలుపున‌కు ఐక్య‌ రాజ్య‌ స‌మితి లో విశేష స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌పంచం లోని 177 దేశాలు ఒక్క‌టిగా నిలచి జూన్ 21వ తేదీని “ఐక్య‌ రాజ్య‌ స‌మితి అంత‌ర్జాతీయ యోగ దినోత్స‌వం”గా పాటించేందుకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు.

గుజరాత్లోని ఒక చిన్న పట్టణంలో 17 సెప్టెంబర్ 1950 న జన్మించారు. తన కుటుంబం సమాజంలోని అట్టడుగు వర్గాలలోని ఇతర వెనుకబడిన వర్గానికి చెందినది. ఆయన ఎంతో ప్రేమ ఉండి, రూపాయి ఆదాలేని పేద కుటుంబంలో పెరిగారు. జీవిత ఆరంభదశలో తాను ఎదుర్కున్న కష్టాలు, కష్టపడి పనిచేయడం యొక్క విలువను నేర్పించడమే కాకుండా సామాన్య ప్రజలకు నివారించగల బాధలను కూడా అతనికి బహిర్గతం చేశాయి. ఇది ఆయనను చాలా చిన్న వయస్సులోనే ప్రజాసేవ మరియు దేశ సేవకు అంకితమయ్యేందుకు ప్రోత్సహించింది.  తొలినాళ్ళలో, ఆయన జాతీయవాద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో అంకితభావంతో పనిచేశారు, తర్వాత ఆయన జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీలో పనిచేసి రాజకీయాలలో తనను తాను అంకితం చేసుకున్నారు.  శ్రీ మోదీ గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో తన ఎంఏ డిగ్రీ పూర్తి చేశారు.

2001లో శ్రీ న‌రేంద్ర‌ మోదీ త‌న సొంత రాష్ర్టం గుజ‌రాత్ ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించి, వ‌రుస‌గా నాలుగు ప‌ర్యాయాలు ముఖ్య‌మంత్రిగా సేవ‌లందించి రికార్డు ను సృష్టించారు. చ‌రిత్ర‌లోనే క‌నివిని ఎరుగ‌ని విధ్వంసం నమోదైన భూకంపం కారణంగా శిథిలమైన గుజ‌రాత్‌ను దేశాభివృద్ధికి చోద‌క‌ శ‌క్తిగా తీర్చిదిద్దడానికి అలుపెరుగ‌ని కృషి చేశారు శ్రీ మోదీ. భార‌త‌దేశం లోనే కాకుండా అంత‌ర్జాతీయ సంస్థ‌ల నుంచి కూడా నాలుగు ప‌ర్యాయాలు ఆద‌ర్శ ముఖ్య‌మంత్రిగా శ్రీ న‌రేంద్ర‌ మోదీ ప్ర‌త్యేక ప్ర‌శంస‌లు పొందారు.

శ్రీ న‌రేంద్ర‌ మోదీ ‘ప్ర‌జా నాయ‌కుడు’. సామాన్య ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చ‌డానికి, వారి బాగోగుల‌కు ఆయ‌న తన జీవితాన్ని అంకితం చేశారు. ప్ర‌జ‌లతో మ‌మేక‌ం కావడం, వారి ఆనందం లోను, విచారాల లోను కూడా పాలు పంచుకోవ‌డం లో శ్రీ మోదీ ఆనందాన్ని అనుభ‌విస్తారు. ప్ర‌జ‌ల‌తో నిరంత‌రం అనుసంధాన‌మై ఉండేందుకు ఆయ‌న సాంకేతిక విజ్ఞానాన్ని వార‌ధిగా చేసుకొన్నారు. సాంకేతిక ప‌రిజ్ఞానం ప‌ట్ల విశేష‌మైన మ‌క్కువ గ‌ల నాయ‌కునిగా శ్రీ మోదీ కి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పున‌కు కూడా వెబ్‌నే వార‌ధిగా ఎంచుకున్నారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, గూగుల్ ప్ల‌స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సౌండ్ క్లౌడ్‌, లింక్ డ్ ఇన్‌, వీబో ల వంటి భిన్న సామాజిక మీడియా వేదిక‌ల‌పైన ఆయ‌న చాలా చురుగ్గా ఉంటూ, ప్ర‌జ‌ల‌తో భావాలు పంచుకొంటూ ఉంటారు.

రాజ‌కీయాలే కాదు.. శ్రీ న‌రేంద్ర‌ మోదీకి ర‌చ‌నాభిలాష కూడా మిక్కుటంగానే ఉంది. ఆయ‌న క‌విత్వంతో పాటు ప‌లు గ్రంథాలు ర‌చించారు.

శ్రీ న‌రేంద్ర‌ మోదీ దిన‌ చ‌ర్య యోగాతో ప్రారంభం అవుతుంది. క్ష‌ణం తీరిక లేకుండా సాగిపోయే ఆయ‌న రోజువారీ కార్య‌క‌లాపాలలో కూడా ప్ర‌శాంతం గాను, దృఢ‌చిత్తం తోను వ్య‌వ‌హ‌రించ‌డానికి యోగా ఆయ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతోంది. ధైర్యం, ద‌య‌, దృఢ‌సంక‌ల్పం మూర్తీభ‌వించిన శ్రీ న‌రేంద్ర‌ మోదీపై దేశ ప్ర‌జానీకం ఎలాంటి భీతి లేకుండా జాతి నిర్మాణ భారాన్ని మోపారు. భార‌త‌దేశాన్ని పున‌రుజ్జీవ‌న బాట‌లో న‌డిపి, ప్ర‌పంచానికే ఒక వెలుగు రేఖ‌గా నిల‌బెడ‌తార‌ని ప్ర‌జ‌లు అపార‌మైన విశ్వాసం పెట్టుకున్నారు.

http://www.narendramodi.in/categories/timeline
http://www.narendramodi.in/humble-beginnings-the-early-years
http://www.narendramodi.in/the-activist
http://www.narendramodi.in/organiser-par-excellence-man-with-the-midas-touch