పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క‌ర్ణాట‌క‌లోని ఉజీర్ లో 2017 అక్టోబ‌ర్ 29 నాడు జరిగిన ఓ జన సభలో ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగ పాఠం

ఇక్క‌డ పెద్ద సంఖ్య‌లో హాజ‌రైన ప్రియ‌మైన సోద‌ర సోద‌రీమ‌ణులారా,

భ‌గ‌వాన్ మంజునాథుడి పాద‌ ప‌ద్మాల‌కు ప్ర‌ణ‌మిల్లే మ‌హ‌త్త‌ర అవ‌కాశంతో పాటు మీ అంద‌రినీ క‌లుసుకొనే అవ‌కాశం నాకు ల‌భించ‌డం నిజంగా నా మ‌హద్భాగ్యంగా భావిస్తున్నాను. గ‌త వారం నేను కేదార్‌నాథ్‌లో ఉన్నాను. వేలాది సంవ‌త్స‌రాల క్రిత‌మే ఆదిశంక‌ర భ‌గ‌వ‌త్పాదుల‌ వారు అక్క‌డ ఎంత‌టి మ‌హ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని చేశారో క‌దా. ఇవాళ ద‌క్షిణాదిన మంజునాథేశ్వ‌రుని పాద‌ ప‌ద్మాల చెంత‌కు వ‌చ్చే మ‌హ‌త్త‌ర అవ‌కాశం నాకు ల‌భించింది.

న‌రేంద్ర‌ మోదీ చేత డాక్ట‌ర్ వీరేంద్ర‌ హెగ్డే గారిని గౌర‌వించుకోవ‌డం త‌గిన‌దో, తగినది కాదో నాకు తెలియ‌దు. డాక్ట‌ర్ వీరేంద్ర హెగ్డే గారి త్యాగాలను, వారి క‌ఠోర ప‌రిశ్ర‌మ‌ను, వారి జీవితాన్ని గ‌మ‌నించిన‌పుడు ఒక జీవితం- ఒక ల‌క్ష్యం అన్న ఆద‌ర్శానికి 20 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు లోనే వారు వారి యొక్క జీవితాన్ని అంకితం చేసిన మ‌హ‌నీయులు. అంత‌టి ప‌రిపూర్ణ‌ జీవితం వారిది. వ్య‌క్తిగా వారిని గౌర‌వించుకోవ‌డానికి నేను చాలా చిన్న‌ వాడిని. అయితే ప్ర‌జా జీవితం లో ఉన్న వ్య‌క్తిగా 125 కోట్ల మంది ప్ర‌జ‌లకు ప్రాతినిధ్యం వ‌హించే ఉన్న‌త స్థానంలో మీచేత కూర్చోబెట్ట‌బ‌డిన ప‌ద‌వికి గ‌ల గౌర‌వం రీత్యా వారిని గౌర‌వించుకోవ‌డం నాకు ల‌భించిన మ‌హ‌త్త‌ర అవ‌కాశంగా భావిస్తున్నాను.

ప్ర‌జా జీవితంలో, అది కూడా దైవం స‌న్నిధిలో, ఆధ్యాత్మిక ప్ర‌దేశంలో ఆలోచ‌నల, చేత‌ల ల‌క్ష్యం ఒక్క‌టిగా చేసుకొని, అదే ప‌విత్ర‌ భావ‌న‌ను మ‌న‌స్సులో నింపుకొని మాట‌లలో, చేత‌ల‌లో దానినే అనుస‌రిస్తూ ముందుగా నిర్ణ‌యించుకున్న‌ ల‌క్ష్యాన్ని చేరుకోవడానికి మ‌న కోసం కాకుండా ఇత‌రులంద‌రి కోసమ‌ని, త‌న కోసం కాకుండా మ‌నంద‌రి కోసమ‌ని, నా కోసం కాకుండా ఇత‌రుల కోస‌మ‌ని- ఇలా జీవితాన్ని సాగిస్తున్న‌ప్పుడు- ఎవ‌రైనా ప్ర‌తి క్ష‌ణం ప‌రీక్ష‌కు గురి కాక త‌ప్ప‌దు. ఆ వ్య‌క్తి చెప్పిన ప్ర‌తి మాట‌, ఆ వ్య‌క్తి చేసే ప్ర‌తి ప‌నిని అందుబాటులో ఉన్న ప్ర‌తి ప్ర‌మాణం రీత్యా ప‌రీక్షించి చూస్తారు. అందుకే యాభై సంవ‌త్స‌రాలుగా వారు చేసిన క‌ఠోర ప‌రిశ్ర‌మ‌, నా వంటి కోట్లాది మందికి ప్రేరణగా నిలుస్తూ వ‌స్తోంది; అందుకే వారికి నేను విన‌మ్రంగా శిర‌స్సును వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను.

వారిని గౌర‌వించుకొనే అవ‌కాశం నాకు సులభంగా ద‌క్కింది. నేను ఎప్పుడు హెగ్డే జీ ని క‌లిసినా, వారి మోములో ఎన్న‌డూ చిరున‌వ్వు చెరిగిపోలేదు. వారి ల‌క్ష్య భారం గురించిన ఆన‌వాళ్లు ఏవీ వారి ముఖంలో క‌నిపించేవి కావు. భ‌గ‌వ‌ద్గీత‌ లో చెప్పిన‌ట్లు వేటితోనూ సంబంధం లేకుండా విధ్యుక్త ధ‌ర్మాన్ని నిర్మ‌మ‌గా నిర్వ‌ర్తించే పూర్ణ పురుషులు వారు. వారిని నేను గౌర‌వించుకొంటూ ఉంటే, వారు సహజం గానే, మోదీ జీ మీరు యాభై సంవ‌త్స‌రాలు పూర్త‌ి అయినందుకు గౌర‌విస్తున్న‌ట్టుగా కాక‌, మ‌రో యాభై సంవ‌త్స‌రాలు ఇదే ప‌నిని కొన‌సాగిస్తాన‌ని హామీ ఇవ్వ‌ండంటూ గౌర‌విస్తున్న‌ట్టుగా ఉన్నది అని నాతో అన్నారు. ఇటువంటి గౌర‌వం వారికే ద‌క్కింది. భ‌గ‌వంతుడి కృప వారిపై ఉంది. 800 సంవ‌త్స‌రాల క‌ఠోర‌ శ్ర‌మ‌తో కూడిన గొప్ప వార‌స‌త్వం వారి వెంట ఉంది. ఇవి అన్నీ ఉండి కూడా త‌మ‌దైన ధ‌ర్మ మార్గాన్ని అనుస‌రించ‌డాన్ని గ‌మ‌నించిన‌పుడు మ‌నం హెగ్డే జీ నుండి మాత్ర‌మే దీనిని నేర్చుకోవ‌ల‌సి ఉంద‌ని నాకు అనిపిస్తుంది. యోగ‌ కానివ్వండి, విద్య లేదా ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పేద ప్ర‌జ‌ల సంక్షేమం, భ‌విష్య‌త్ త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే సంక్షేమ కార్య‌క్ర‌మాలు- ఇలా ఏవైనా వారు వారి యొక్క ఆలోచ‌న‌ల ప్ర‌కారం, ఆయా కాల‌మాన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా చేప‌డుతూ వ‌స్తున్నారు. ప‌లు రాష్ట్రాల‌లో చేప‌డుతున్న నైపుణ్యాభివృద్ధి కార్య‌క్ర‌మాలు, వాటి కోసం అనుస‌రిస్తున్న ప‌ద్ధ‌తులు, పెద్ద ఎత్తున వాటి అమ‌లు వంటివి అన్నీ చాలా వ‌ర‌కు ఇక్క‌డ డాక్ట‌ర్ వీరేంద్ర జీ హెగ్డే చేసిన ప్ర‌యోగాల‌ నుండి తీసుకున్న‌వేన‌ని చెప్ప‌డానికి నేను వెనుకాడ‌ను.

ఇవాళ‌, 21 వ శ‌తాబ్దంలో బాగా సుసంప‌న్న దేశాలు కూడా నైపుణ్యాభివృద్ధిని గురించి మాట్లాడుతున్నాయి. నైపుణ్యాభివృద్ధిని ప్ర‌ధాన రంగంగా భావిస్తున్నారు. భార‌తదేశం వంటి దేశంలో 65 శాతం జ‌నాభా, 80 కోట్ల మంది ప్ర‌జ‌లు 35 సంవ‌త్స‌రాల లోపు ఉన్న‌ వారే. ఇది మ‌న‌కు నిజంగా గ‌ర్వ‌ కార‌ణం. ఇటువంటి దేశంలో నైపుణ్యాభివృద్ధి జీవ‌నోపాధికి మార్గం మాత్ర‌మే కాక, మ‌న దేశం యొక్క గొప్ప‌ క‌ల‌ల‌ను నెర‌వేర్చ‌డానికి ఉప‌క‌రిస్తుంది కూడాను. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా నైపుణ్యం క‌ల ప‌ని వారి డిమాండుకు, అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్టు మ‌నం సిద్ధం కావ‌ల‌సి ఉంది. అటువంటి అభివృద్ధి, నైపుణ్యం మీ చేతుల్లోకి రావాలి. డాక్ట‌ర్ వీరేంద్ర హెగ్డే జీ ఎన్నో సంవ‌త్స‌రాల క్రిత‌మే దీనిని ఊహించారు. ఆ దిశ‌గా వారు ప‌నిచేశారు.

నేను అడిగేదేమంటే, ఈ ప్ర‌ధాన ప‌నిని మ‌రింత ముందుకు తీసుకు వెళ్ల‌డానికి మ‌న దేశంలో ఎటువంటి యాత్రా స్థ‌లాలు ఉండాలి ? వివిధ విశ్వాసాలు, సంప్ర‌దాయాలు క‌లిగిన ప్ర‌జ‌ల ల‌క్ష్యం ఏమై ఉండాలి ? దుర‌దృష్టవ‌శాత్తు మ‌న దేశంలొ జ‌ర‌గ‌వ‌ల‌సిన అధ్య‌య‌నాలు ఇక్క‌డ జ‌ర‌గలేదు. ప్ర‌పంచంలో ఎక్క‌డెక్క‌డ అత్యున్న‌త బిజినెస్ స్కూళ్లు ఉన్నాయో, వాటి ర్యాంకులు ఎంతో, ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. దేశం లోని పేరున్న‌మ్యాగ‌జైన్ లు ర్యాంకులను ఇస్తున్నాయి. అయితే నేను ఇవాళ ధ‌ర్మ‌స్థ‌ల వంటి ప‌విత్ర ప్ర‌దేశానికి వ‌చ్చి చూసిన‌పుడు, శ్రీ వీరేంద్ర హెగ్డే జీ పాద ప‌ద్మాల చెంత‌కు చేరిన సంద‌ర్భంగా, ప్ర‌పంచంలోని అత్యున్న‌త స్థాయి విశ్వ‌విద్యాల‌యాల‌ను, మ‌న‌ దేశం లోని విశ్వ‌విద్యాల‌యాల‌ను నేను ఆహ్వానిస్తున్నాను. మ‌నం మ‌న ఆస్ప‌త్రుల‌పై స‌ర్వేలు ఎలా నిర్వ‌హిస్తామో, వాటి ప‌నితీరును ఎలా అధ్యయ‌నం చేస్తామో, ఇంజినీయరింగ్‌ కాలేజీ ల‌పై అధ్య‌య‌నం ఎలా చేస్తామో, వాటి ర్యాంకులను ఎలా నిర్ణ‌యిస్తామో చ‌ర్చిస్తున్నాం. కానీ మ‌న రుషుల ప‌రంప‌ర ఎటువంటి వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేసిందో, దానిపై మ‌న విశ్వ‌విద్యాల‌యాలు అధ్య‌య‌నం చేయాలి. ఆ వ్య‌వ‌స్థ‌లు వారిని ఎలా ముందుకు తీసుకు వెళ్లాయో, ఆ విలువ‌లు త‌ర త‌రాలుగా ఎలా మార్గ‌నిర్దేశం చేస్తూ వ‌చ్చాయో అధ్య‌య‌నం జ‌ర‌గాలి. నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో వారు అనుస‌రించిన ప్ర‌క్రియ‌పై అధ్య‌య‌నం జ‌ర‌గాలి. వారు ఎటువంటి ఆర్థిక నిర్వ‌హ‌ణ విధానాన్ని అనుస‌రించారో, పార‌ద‌ర్శ‌క‌త‌ను ఎలా పాటించారో, మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలా మార్పులు తీసుకువ‌చ్చారో అధ్య‌య‌నం చేయాలి. ఆయా కాలాలు, సంద‌ర్భాల‌కు అనుగుణంగా ఈ వ్య‌వ‌స్థ‌ల స్ఫూర్తిని వారు ఎలా కాపాడుకుంటూ వ‌చ్చారో గ‌మ‌నించాలి. ఒక‌టి కాదు, రెండు కాదు, వేల కొల‌ది సంస్థ‌లు, వేలాది ఉద్య‌మాలు, వేలాది సంస్థలు కోట్లాది ప్ర‌జ‌ల‌కు నా అన్న భావ‌న‌ను వ‌దలి మాన‌వ‌ జాతి మ‌నుగ‌డ‌కు నేటికీ స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తున్నాయి. అటువంటి వాటిలో ధ‌ర్మ‌స్థ‌ల ఒక‌టి. దీనికి 800 సంవ‌త్స‌రాల మ‌హోన్న‌త వార‌స‌త్వం ఉంది. ప్ర‌పంచ విశ్వ‌విద్యాల‌యాలు భార‌త‌దేశం లోని ఈ త‌ర‌హా ఉద్య‌మాన్ని అధ్యయ‌నం చేయాలి. ఇది ఒక గొప్ప ఉదాహ‌ర‌ణ‌. వారు త‌ప్ప‌కుండా దీనిని ద‌ర్శించాలి. మ‌న‌కు ఎటువంటి గొప్ప సంస్థ‌లు ఉన్నాయో చూసి ప్ర‌పంచం నివ్వెర పోతుంది. అవి ఎలా ప‌నిచేశాయో, ఆధ్యాత్మిక చైత‌న్యం స‌మాజంలో నిండుగా ఎలా ఉండేదో.. ఇవి అన్నీ తెలుసుకొని వారు ఆశ్చ‌ర్య‌పోతారు. శ‌తాబ్దాలుగా ఉన్న మ‌న‌ లోని మంచిని గొప్ప‌గా భావించి దాని నుండి మారుతున్న‌ కాలానికి అనుగుణంగా మ‌రింత గొప్ప‌గా దానిని తీర్చిదిద్ద‌డానికి మ‌నం ప్ర‌య‌త్నించాలి. కేవ‌లం విశ్వాసాల‌కు క‌ట్టుబ‌డ‌డ‌మే కాకుండా ఈ సంప్ర‌దాయాల శాస్త్రీయ విధానాల‌ వైపు యువ‌త‌రాన్ని ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

ఈ రోజు రూపే డెబిట్ కార్డుల‌ను మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క బృందాల‌కు అందించే అవ‌కాశం నాకు ద‌క్కింది. గ‌త న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్‌, జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి మాసాల‌లో పార్ల‌మెంటు స‌భ్యుల ప్ర‌సంగాలు మీరు వినే ఉంటారు.. మీరు విన‌క‌పోయినా, అవి పార్ల‌మెంటు రికార్డుల‌లో భ‌ద్రంగా ఉన్నాయి. వాటిని మీరు చ‌ద‌వ‌వచ్చు. దేశంలో పేద‌రికం ఉంది, నిర‌క్ష‌రాస్య‌త ఉంది, అలాంటి దేశంలో డిజిట‌ల్ లావాదేవీలు ఎలా సాధ్య‌మ‌ని ఎంతో మంది మేధావులు అన్నారు. న‌గ‌దు ర‌హితంగా ప్ర‌జ‌లు లావాదేవీలు ఎలా జ‌రుపుతార‌న్నారు. ఇది సాధ్యం కాద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు మొబైల్ ఫోన్ లు లేవ‌న్నారు. వారు అన్నిర‌కాల వ్య‌తిరేక ధోరణి మాట‌లు మాట్లాడారు. ఈ విష‌యంలో వారు ఏ మాత్రం నీళ్లు న‌మ‌ల‌కుండా మాట్లాడారు. ఇవాళ డాక్ట‌ర్ వీరేంద్ర హెగ్డే జీ పార్ల‌మెంటులో అలా మాట్లాడిన వారంద‌రి మాట‌ల‌కు స‌మాధానం ఇచ్చారు.

గ్రామీణ ప్రాంతాల‌ లోని నా త‌ల్లులు, సోద‌రీమ‌ణులు అక్ష‌రాస్యులా ? కాదా ? అన్న‌దానితో సంబంధం లేదు. వారు చ‌దువుకున్న‌ వారా ? కాదా ? అన్న‌ దానితో సంబంధం లేదు. వారు ఇవాళ ఒక ప్ర‌తిజ్ఞ చేశారు. 12 ల‌క్ష‌ల మంది. అంత‌కంటే త‌క్కువేమీ కాదు. 12 ల‌క్ష‌ల మంది త‌మ స్వ‌యం స‌హాయ‌ బృందాల వ్యాపార కార్య‌క‌లాపాల‌న్నీ న‌గ‌దు ర‌హితంగా చేస్తామ‌ంటూ ప్ర‌తిజ్ఞ చేశారు. వారు న‌గ‌దును వాడ‌బోరు. వారు డిజిట‌ల్ లావాదేవీల‌ను చేస్తారు. వారు దానిని రూపే డెబిట్ కార్డుల ద్వారా చేస్తారు. వారు దానిని ‘భీమ్ యాప్’ (Bhim app) ద్వారా చేస్తారు. ఉద్దేశాలు మంచివి అయిన‌ప్పుడు కొన్నిసార్లు అవ‌రోధాలు కూడా వేగం పుంజుకోవ‌డానికి అవ‌కాశాలు క‌ల్పిస్తాయి. డాక్ట‌ర్ వీరేంద్ర హెగ్డే జీ దానిని ఇవాళ ప్ర‌ద‌ర్శించి, కన్నుల మందు నిలిపారు.

నేను మీకంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. డిజిట‌ల్ ఇండియా దిశ‌గా దేశాన్ని తీసుకు వెళ్లేందుకు మీరు భ‌విష్య‌త్ భార‌త‌దేశానికి మంచి బీజాలు నాటే ప్ర‌య‌త్నం చేశారు. త‌క్కువ న‌గ‌దు గ‌ల స‌మాజాన్నిఏర్పాటు చేయ‌బోతున్నారు. ఆయా రంగాల‌ లోని ప్ర‌జ‌ల హృద‌యాల‌ను స్పర్శించారు. ఇదే ప్ర‌జ‌ల హృద‌యాల‌ను తాక‌డానికి ప్ర‌భుత్వానికి బ్యాంకింగ్ రంగానికి ఎన్ని ద‌శాబ్దాలు ప‌ట్టిందో ఎవ‌రికీ తెలియ‌దు.

మీరు కింది నుండి పైకి మార్పు తీసుకు వచ్చే విధానాన్ని ప్రారంభించారు. దీనిని మీరు చేసి చూపించారు. దేశానికి ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన బృహ‌త్త‌ర ప్ర‌చారాన్ని ప్రారంభించిన డాక్ట‌ర్ హెగ్డే జీ కి, స్వ‌యంస‌హాయ‌క బృందాల సోద‌రీమ‌ణుల‌కు నా అభినంద‌న‌లు తెలియ‌జేసుకుంటున్నాను. ఇప్పుడు కాలం మారింది. క‌రెన్సీ మౌలికంగా న‌గ‌దు ప్ర‌తి త‌రం లోనూ మారుతూ వ‌చ్చింది. ఒక ద‌శ‌లో నాణేల‌ను, రాతితో త‌యారు చేసిన వాటిని, కూడా వాడారు. కాగితంతో త‌యారైన క‌రెన్సీ ని కొంత‌కాలం వాడారు, ప్లాస్టిక్
క‌రెన్సీనీ వాడారు. ఇలా క‌రెన్సీ మారుతూ వ‌స్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ వ‌స్తోంది. ఇక ఇప్ప‌డు భార‌త‌దేశంలో డిజిట‌ల్ క‌రెన్సీ కాలం న‌డుస్తోంది. భార‌త దేశం ఈ విష‌యంలో కాల‌యాప‌న కూడ‌దు. స‌మాజంలో మ‌రీ ఎక్క‌ువ న‌గ‌దు చెలామ‌ణిలో ఉంటే అది సాంఘిక దురాచారాల‌కు కార‌ణ‌మౌతుంది. సంప‌న్న‌ కుటుంబాల‌లో ఎదుగుతున్న కుమారుడో, కుమార్తెనో ఉంటే వారు త‌మ పిల్ల‌ల‌కు పాకెట్‌ మ‌నీ కింద డ‌బ్బు ఇచ్చినా దానికి ఒక ప‌రిమితితో ఇస్తారు. ఎందుకంటే పిల్ల‌ల చేతిలో ఎక్కువ డ‌బ్బు ఆడితే వారు చెడు వ్య‌స‌నాల‌కు బానిస‌లు కావ‌చ్చ‌ని అలా చేస్తారు. వారికి కొద్ది కొద్దిగా అవ‌స‌ర‌మైన మేర‌కు త‌ల్లితండ్రులు డ‌బ్బు ఇస్తుంటారు. ఆ త‌రువాత ఆ డ‌బ్బును వారు స‌రిగా ఖ‌ర్చు చేస్తున్నారా ? లేదా ? అని గ‌మ‌నిస్తుంటారు. డ‌బ్బు ఎక్కువ‌గా చేతిలో ఉంటే, పిల్ల‌లు త‌ప్పుదారి ప‌ట్టే ప్ర‌మాదం ఉంద‌ని ఆ త‌ల్లి తండ్రుల‌కు తెలుసు. అందుకే స‌మాజం స్వీయ జ‌వాబుదారుతనానికి అవ‌కాశం క‌ల్పించింది. ఈ స్వీయ జ‌వాబుదారుతనం స‌మాజంలో ఉంటే, అది ఎంతో గొప్ప విష‌యంగా చెప్పుకోవ‌చ్చు.

ఇవాళ డాక్ట‌ర్ హెగ్డే జీ మ‌న‌ల్ని తీసుకు పోతున్న మార్గం, మ‌నకు భ‌విష్య‌త్తు లో మంచి అవ‌కాశాలు క‌ల్పిస్తుంద‌ని నేను విశ్వ‌సిస్తున్నాను. ఈరోజు ఇంకొక‌టి కూడా జ‌రిగింది. ఈ లోగోను ప్ర‌జ‌ల‌కు అంకితం చేశాం. ఇది పుడ‌మి తల్లి ప‌ట్ల మ‌న బాధ్య‌త‌ను నెర‌వేర్చ‌డానికి మ‌న‌కు స్ఫూర్తిని ఇస్తూ ఉంటుంది. వృక్షాలు మ‌న‌కు ప్రాణ‌ వాయువును ఇవ్వాలి; కానీ వాటిని ర‌క్షించే బాధ్య‌త మ‌నకు లేద‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంటాం. వృక్షాలు మ‌న‌కు ప్రాణ‌ వాయువును ఇస్తూనే ఉండాలి అనే హ‌క్కు తోనే మ‌నం ఈ భూమి మీద‌కు వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నాం. పుట్టుక‌ తోనే మనకు ఈ హ‌క్కు సంక్రమించిన‌ట్టు, ధరణి మాత బాధ్య‌త మ‌నల్ని పోషించడ‌మేన‌న్న‌ట్టు మనం వ్య‌వ‌హ‌రిస్తున్నాం. నిజానికి అది స‌రి కాదు. పుడ‌మి త‌ల్లికి బాధ్య‌త ఉంద‌నుకున్న‌ట్టే, ఆమె పిల్ల‌లుగా మ‌న‌కూ కొన్ని బాధ్య‌త‌లు ఉన్నాయి. వృక్షాలకు ప్రాణ‌ వాయువు విడుద‌ల చేయాల్సిన బాధ్య‌త ఉంద‌ని అనుకున్న‌ట్టే, వాటిని ర‌క్షించాల్సిన బాధ్య‌త, వాటిని సంర‌క్షించాల్సిన,పెంచాల్సిన బాధ్య‌త మ‌న‌కూ ఉంది. అయితే అలా కాకుండా ఇచ్చే వారు మాత్రం నిరంత‌రాయం ఇస్తూనే ఉండాల‌ని, తీసుకొనే వారు, వినియోగ‌దారు మాత్రం దాని నుండి ల‌బ్ధిని పొంద‌డం మిన‌హా మ‌రేమీ చేయ‌కూడ‌దు అన్న‌రీతిలో వ్య‌వ‌హరిస్తే స‌మాజంలో ఒక‌ ర‌క‌మైన అస‌మతుల్య‌త ఏర్ప‌డుతుంది. ఇది గ్లోబ‌ల్ వార్మింగ్ వంటి స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది.

ఈ రోజు మొత్తం ప్ర‌పంచం చెబుతోంది భ‌విష్య‌త్తు లో రాబోయే నీటి కొర‌త మాన‌వాళికి పెను స‌వాల్ విస‌ర‌నున్న‌దీ అని. మనం ఒక విష‌యాన్ని మ‌రిచిపోకూడ‌దు.. ఈ నాడు మ‌నం ఒక గ్లాసు నీళ్లు తాగుతున్నామంటే- ఒక బ‌కెట్ నీటితో స్నానం చేస్తున్నామంటే- దీని వెన‌ుక మ‌న కృషి దాగి లేదు. ఇది మ‌న హ‌క్కు కూడా కాదు. మ‌న పూర్వీకులు ఎంతో ముందుచూపుతో, స‌మ‌న్వ‌యంతో కృషి చేయ‌డం వ‌ల్ల‌నే మ‌న‌కు ఈ నీటి వ‌న‌రులు అందుబాటులో ఉంటున్నాయి. అందుకే మ‌నం నీళ్లు తాగ‌గ‌లుగుతున్నాం, స్నానం చేయ‌గ‌లుగుతున్నాం. ఈ వ‌న‌రుల‌ను పొందే హ‌క్కు మ‌న భావి త‌రాల‌కు కూడా ఉంది. ఈ రోజు మ‌నం మ‌న భావి త‌రాల‌కు చెందవలసిన వాటిని కూడా ఇప్పుడు అనుభ‌విస్తున్నాం. మ‌న పూర్వీకులు మ‌న‌ కోసం వ‌న‌రులు వ‌దలిపెట్టిన‌ట్టే మ‌నం కూడా మ‌న భ‌విష్య‌త్తు త‌రాల‌ కోసం వదలివేయాలి. ఇటువంటి ఆలోచ‌న‌లు ప్ర‌తి ఒక్క‌రిలో క‌ల‌గ‌డానికిగాను ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించాల‌నే భారీ ఉద్య‌మం ధ‌ర్మ‌శాల‌ నుండి మొద‌ల‌వుతోంది. ఇది మొత్తం ప్ర‌పంచానికి చేసే మ‌హోత్త‌ర‌మైన సేవ‌.

ప్ర‌కృతితో మ‌నం ఎలా బంధాన్ని ఏర్ప‌రుచుకోగ‌లం ? 2022 లో భార‌త‌దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుక‌లను జ‌రుపుకోనుంది. ధ‌ర్మ‌శాల‌ నుండి భారీ ఉద్య‌మం మొద‌లైంది. డాక్ట‌ర్ హెగ్డే జీ ఆశీస్సుల‌తో ఉద్య‌మం మొద‌లైతే, ఇక ఆ ఉద్య‌మం త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని నేను విశ్వాసంతో ఉన్నాను.

ఈనాడు మ‌నం మ‌న విజ్ఞానం కార‌ణంగానో, అధికారం వ‌ల్ల‌నో, మ‌న అత్యాశ కార‌ణంగానో పృథ్వి మాత‌ను దోచుకొంటున్నాం. ఈ దోపిడీ కొన‌సాగుతోంది కూడా. మ‌నం మ‌న త‌ల్లి ని గురించి ఆలోచించ‌డం లేదు. మాతృమూర్తి అస్వ‌స్థురాలు అవుతున్నా, చింతించ‌డం లేదు. మొద‌ట్లో మ‌నం ఏడాదికి ఒక పంట‌ను పండించే వాళ్లం. ఆ త‌రువాత రెండు పంట‌లు అయ్యాయి.. మూడు పంట‌ల‌య్యాయి. వైవిధ్య‌మైన పంట‌లను పండిస్తున్నాం. అనేక రసాయ‌నాలను, ర‌సాయ‌నిక ఎరువులను ఉప‌యోగించి పంట‌లు పండిస్తున్నాం. భూమికి ఏమైనా స‌రే మ‌నం చింతించ‌కుండా, స‌త్వ‌ర ఫ‌లితాల కోసం ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నాం. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే, ఇది ఎంత‌వ‌ర‌కు పోతుందో నాకు అర్థం కావ‌డం లేదు.

డాక్ట‌ర్ హెగ్డే జీ నాయ‌క‌త్వం కింద ధ‌ర్మ‌స్థ‌ల‌ నుండి మ‌నం ఒక ప్ర‌తిన తీసుకుందామా ? ఈ ప్రాంతం లోని రైతులంతా ఈ ప్ర‌తిజ్ఞ చేయ‌గ‌లుగుతారా ? 2022 కల్లా మ‌నం 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుక‌లను జ‌రుపుకునే నాటికి యూరియా వినియోగాన్ని యాభై శాతానికి త‌గ్గిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేయ‌గ‌ల‌రా ? ఇప్పుడు మ‌నం ఉప‌యోగిస్తున్న మొత్తాన్ని 2022 నాటికి స‌గం చేయాలి. ఈ ప‌ని చేస్తే అది ధ‌ర‌ణీమాత‌కు మ‌నం చేసే మ‌హ‌త్త‌ర‌మైన సేవ అవుతుంది. ఈ నిర్ణ‌యం వ‌ల్ల రైతుల డ‌బ్బు ఆదా అవుతుంది. ఖ‌ర్చులు త‌గ్గుతాయి. ఉత్ప‌త్తిలో త‌గ్గుద‌ల కూడా ఏమీ ఉండ‌దు. ఇలా చేయ‌డం వ‌ల్ల రైతుల వ్య‌వ‌సాయ క్షేత్రాలే కాదు, భూమాత కూడా మ‌న‌ల్ని ఆశీర్వ‌దిస్తుంది. త‌ద్వారా మ‌న‌కు అధిక లాభాలు వ‌స్తాయి.

అలాగే నీటిని తీసుకొందాం. క‌ర‌వు వ‌ల్ల క‌ర్ణాట‌క‌లో ఎటువంటి ప‌రిస్థితి దాపురించిందో మ‌న‌కు తెలుసు. నీటి కొర‌త కార‌ణంగా ఎటువంటి ప‌రిస్థితి ఏర్ప‌డుతున్న‌దో మీకు తెలుసా ? నేను చూశాను.. మ‌న యూడ్యూర‌ప్ప గారు నా ద‌గ్గ‌ర‌కు ప‌రిగెత్తుకొని వ‌చ్చే వారు. నేను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న కాలంలో ఆయ‌న నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి, న‌న్ను ప‌ట్టుకొని ‘మోడీ జీ. ద‌య‌చేసి వ‌క్క‌ పంట‌ను కొనుగోలు చేయండి, మంగ‌ళూరు ప్రాంత‌ రైతుల‌ను కాపాడండి’ అంటూ విన్నవించే వారు. ఇందుకోసం ఆయ‌న నా ద‌గ్గ‌ర‌కు ఆగ‌మేఘాల మీద వ‌చ్చే వారు.

నీళ్ల‌ను పొదుపుగా వాడుకోవాలంటే, మ‌న రైతులు సూక్ష్మ నీటి పారుద‌ల, బిందు సేద్యం, ప్ర‌తి బిందువు ను స‌క్ర‌మంగా ఉప‌యోగించుకొని అధిక పంట‌ల‌ను పండించాలనే సంక‌ల్పం 2022 నాటికి నెర‌వేరేటట్టు ప్ర‌తిజ్ఞ చేయ‌గ‌ల‌మా ? ప్ర‌తి నీటి బిందువును ఒక విలువైన ర‌త్నం అనుకొని, ప‌ని చేయాలి. నీటిని విలువైన ర‌త్నంలా భావించిన‌ప్పుడు, మ‌నం ఎలా ప‌ని చేస్తామో అలా ప‌ని చేయాల‌న్న‌ మాట‌. ఇటువంటి అంశాల‌ను దృష్టిలో పెట్టుకొని మ‌నం కృషి చేస్తే, త‌ప్ప‌కుండా మనం అమోఘ‌మైన మార్పును సాధించ‌గ‌లం.

నేను ‘డిజిట‌ల్ ఇండియా’ను గురించి మాట్లాడుతుంటే, కేంద్ర ప్ర‌భుత్వం ఈ మ‌ధ్య‌ ఒక కొత్త కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. దీని పేరు జిఇఎం (GeM). ఇది ఎంతో ప్ర‌త్యేక‌మైన కార్య‌క్ర‌మం. నేను ప్ర‌త్యేకంగా మ‌న స్వ‌యం స‌హాయ‌క బృందాల‌ను ఆహ్వానిస్తున్నాను.. వ‌స్తువుల‌ను ఉత్ప‌త్తి చేసే వారు, త‌మ వ‌స్తువుల‌ను అమ్ముకోవాలంటే వారు కేంద్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ జిఇఎం లో త‌మ పేరును న‌మోదు చేసుకోవలసి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ‌కు ఏవైన వ‌స్తువులు కావాల‌నుకుంటే ప్ర‌భుత్వాలు వెంట‌నే ఈ పోర్ట‌ల్ వేదిక మీద‌క‌కు వ‌చ్చి త‌మ‌కు కావలసిన అవ‌స‌రాల‌ను అడుగుతాయి. త‌మ‌కు కావలసిన కుర్చీలు, టేబుళ్లు, రిఫ్రిజ‌రేట‌ర్లు.. ఇలా ఏవి కావాలన్నా వాటి వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ పోర్ట‌ల్ లో అడుగుతాయి. జిఇఎంలో త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నా వారు- గ్రామీణ ప్ర‌జ‌లైనా స‌రే- త‌మ ప్ర‌తిపాద‌న‌ల‌ను ఈ పోర్ట‌ల్ లో ఉంచి నా ద‌గ్గ‌ర ఈ ఈ వ‌స్తువులు ఉన్నాయి, వీటిని అమ్మాల‌ని అనుకుంటున్నాను అని తెలియ‌జేస్తే చాలు.. మొత్తం వ్య‌వ‌స్థ పార‌ద‌ర్శ‌కంగా నడుస్తుంది.

ఈ పోర్ట‌ల్ ను నేను ఆగ‌స్టు 9 వ తేదీన ప్రారంభించాను. ఇది నూత‌న వ్య‌వ‌స్థ‌. ప్రారంభించిన కొంత కాలానికే జిఇఎం పోర్ట‌ల్ లో 40,000 మంది త‌మ పేర్ల‌ను న‌మోదు చేయించుకున్నారు. 15 రాష్ట్రాలు ఎంఓయులు కుదుర్చుకున్నాయి. జిఇఎం ద్వారా వేల‌ కోట్ల రూపాయ‌ల విలువైన వ‌స్తువుల‌ను ప్ర‌భుత్వాలు కొనుగోలు చేయ‌డం జ‌రిగింది. టెండ‌రు ఉండ‌దు, తెర‌చాటు త‌తంగం ఉండ‌దు, ప్ర‌తిదీ వ్య‌వ‌స్థ‌లో అంద‌రికీ క‌నిపిస్తుంటుంది. ఇది చాలా మంచి విధానం. గ‌తంలో ప్ర‌భుత్వాలు త‌మ‌కు కావాల్సిన వ‌స్తువుల‌ను వంద‌ కోట్ల రూపాయ‌లు వెచ్చించి కొనుగోలు చేస్తే.. ఇప్పుడు అవే వ‌స్తువుల‌ను యాభై నుండి అర‌వై కోట్ల రూపాయలతో కొనుగోలు చేస్తున్నాయి.
అంతే కాదు, ఈ విధానంవ‌ల్ల వ‌స్తువుల ఎంపిక‌కు ఎక్కువ అవ‌కాశం ఉంటుంది. గ‌తంలో పెద్ద పెద్ద వ్యాపారులు మాత్ర‌మే ప్ర‌భుత్వానికి త‌మ ద‌గ్గరున్న వ‌స్తువుల‌ను స‌ర‌ఫ‌రా చేసే వారు. ఇప్పుడు గ్రామాల‌కు చెందిన సామాన్యుడు కూడా త‌న ఉత్ప‌త్తుల‌ను ప్ర‌భుత్వానికి స‌ర‌ఫ‌రా చేయ‌గ‌లుగుతున్నాడు. స్వ‌యం స‌హాయ‌క బృందాలకు చెందిన మ‌హిళ‌ల‌కు ఆహ్వానం ప‌లుకుతున్నాను; వారు త‌మ ఉత్ప‌త్తుల‌ను జిఇఎం పోర్ట‌ల్ ద్వారా సులువుగా అమ్మ‌వ‌చ్చు.

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి నేను పిలుపునిస్తున్నాను. ఇప్ప‌టికే జిఇఎం (GeM) పోర్ట‌ల్‌కు సంబంధించి 15 రాష్ట్రాలు కేంద్ర ప్ర‌భుత్వంతో ఎంఓయులు కుదుర్చుకున్నాయి. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కూడా ఇక ఎంత‌మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ముందుకు రావాలి. ఈ ఎంఓయు కార‌ణంగా క‌ర్ణాట‌క‌ లోని సామాన్యులు వారు ఉత్ప‌త్తి చేసే వ‌స్తువుల‌ను భారీ విపణిలో విక్రయించడానికి వీలు కలుగుతుంది. ప్ర‌భుత్వం అతి పెద్ద కొనుగోలుదారు. దేశం లోని పేద‌వాళ్లు వారు ఏదైనా ఉత్ప‌త్తి చేస్తే, వారికి ఖ‌చ్చిత‌మైన మార్కెట్ ల‌భిస్తుంది. ఆశించిన ధ‌ర ల‌భిస్తుంది.

క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం దీనికి ఆమోదం తెలుపుతుంద‌ని, క‌ర్ణాట‌క‌ లోని సామాన్యులు ఈ పోర్ట‌ల్ ద్వారా ల‌బ్ధిని పొందుతార‌ని నేను కోరుకొంటున్నాను.

మీరు ఈ రోజు చూసే ఉంటారు, మేం రూపే కార్డును ఆధార్ తోను, మొబైల్ ఫోను తోను అనుసంధానించాం. ఈ రోజు బ్యాంకింగ్ రంగ సేవ‌లు ఫోన్ లో ల‌భ్య‌ం అవుతున్నాయి. మ‌న దేశంలో పేద ప్ర‌జ‌ల కోసం అనేక సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు అమ‌ల‌వుతున్నాయి. అయితే ఇవి ల‌బ్ధిదారుల‌కు చేరుతున్నాయా ? లేక ప‌క్క‌దారి ప‌డుతున్నాయా ? అనేది ఎవ‌రికీ తెలిసేది కాదు. మ‌ధ్య‌ లోనే ఇవి నీరుగారిపోతున్నాయా ? లేదా ? అనేది తెలిసేది కాదు. గ‌తంలో మ‌న ప్ర‌ధానులలో ఒక‌రు ల‌బ్ధిదారుల‌కు చేరే ప‌థ‌కాల గురించి మాట్లాడుతూ, ఢిల్లీ నుండి గ్రామానికి వెళ్లే ప్ర‌తి రూపాయిలో కేవ‌లం 15 పైస‌లు లబ్ధాదారుడికి చేరుకొంటున్నట్లు తెలిపారు. పేద‌వాడికి చెందవలసిన రూపాయిని తిన‌డం వెనుక ఎవ‌రి హ‌స్తం ఉంది ? ఒక రూపాయిని క్ర‌మ‌ క్ర‌మంగా 15 పైస‌ల స్థాయికి దిగ‌జార్చిన చేయి ఎవ‌రిది ? ఢిల్లీ నుండి గ్రామాల‌కు రూపాయిని పంపిస్తే, మొత్తం వంద పైస‌లు ల‌బ్ధిదారును చేరుకోవాల‌ని మేం నిర్ణ‌యించాం. 99 పైస‌లు చేరుతున్నాయి చాలు లే అని అనుకొనే ప్ర‌స‌క్తి కూడా లేదు. వాటి పైన ఎవ‌రికి హ‌క్కు ఉందో, వారికే చేరాలి. ప్ర‌తి పైసా ల‌బ్ధిదారుల‌కే నేరుగా చెందేటట్టు మేం వ్య‌వ‌స్థ‌ను తీర్చిదిద్దాం. అందుకు అనుగుణంగా పేర్ల‌ను న‌మోదు చేయించ‌డం జ‌రిగింది. నేను ఇక్క‌డ ఈ ప‌విత్ర‌మైన ప్ర‌దేశంలో, డాక్ట‌ర్ వీరేంద్ర హెగ్డే జీ ప‌క్క‌న కూర్చొని ఈ విష‌యాన్ని చెబుతున్నాను.. ఈ ప్ర‌దేశం ప‌విత్ర‌త గురించి నాకు పూర్తిగా తెలుసును. ఈ ప్ర‌దేశం లోని నిజాయతీ మీద నాకు పూర్తి అవ‌గాహన వుంది. ఈ ప‌విత్ర‌మైన ప్ర‌దేశం నుండి నేను చెబుతున్నాను.. ఈ కార్య‌క్ర‌మంలో కొన్ని రాష్ట్రాలు చేరాయి. ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించింది. ఇంత‌వ‌ర‌కూ 57,000 కోట్ల రూపాయ‌ల‌ను ఆదా చేయ‌గ‌లిగాం. ఈ మొత్తం గ‌తంలో అక్ర‌మార్కుల చేతుల్లోకి వెళ్లేది. అంటే ఈ మొత్తం దొంగ‌త‌నానికి గుర‌య్యేది అన్న‌ మాట‌. ఇప్పుడు ఇటువంటి అక్ర‌మాలు ఆగిపోయాయి. స‌రైన ల‌బ్ధిదారుల‌కు చేరవలసిన మొత్తం వారికి చేరుతోంది.

ఇప్పుడు చెప్పండి.. 50- 60 వేల‌ కోట్ల రూపాయ‌ల‌ దాకా ప్ర‌తి ఏడాది ప‌క్క‌దారి ప‌ట్టే డ‌బ్బు ఆగిపోయింది. ఆ ప‌ని చేస్తున్న అక్ర‌మార్కులకు మోదీ ఎలా న‌చ్చుతారు ? వారికి మోదీ అంటే కోపం ఉంటుందా? లేదా? వారు మోదీ ని ల‌క్ష్యంగా చేసుకుంటారా ? లేదా ?

స్నేహితులారా, మీరు ఈ మార్పుల‌కు సాక్షులు. నేను ఈ విష‌యాన్ని ఈ ప‌విత్ర‌మైన ప్ర‌దేశంలో ఉండి చెబుతున్నాను. నేను జీవించి ఉన్నా, లేకపోయినా .. నా దేశాన్ని ధ్వంస‌ం కానివ్వను. నా కోసం జీవించ‌డాన్ని నేను నేర్చుకోలేదు. నా చిన్నతనం నుండి ఇత‌రుల కోసం జీవించడాన్నే నేర్చుకున్నాను.

అందుకే సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, నా మ‌న‌స్సులో ఓ ఆలోచ‌న రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ ఆలోచనను డాక్ట‌ర్ వీరేంద్ర‌ జీ దృష్టికి తీసుకు వచ్చేందుకు సాహ‌సం కూడగట్టుకొంటున్నాను. ఈ ఆలోచ‌న‌కు సంబంధించిన శాస్త్రీయ అంశాలు గురించి నాకు పెద్ద‌గా తెలియ‌దు. ఒక సాధార‌ణ పౌరుని వలెనే నేను మీకు వీటిని గురించి వివరిస్తాను. దీనిని మీరు అనుస‌రించగలర‌నే నేను న‌మ్ముతున్నాను. మంగ‌ళూరులో సమీపంలో ఓ తీర ప్రాంతం ఉంది. కోస్తా తీర ప్రాంతాల‌లో పనిచేసే మ‌న మ‌త్స్యకార సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులు ఏడాదిలో కొన్ని నెల‌లు మాత్ర‌మే ఉపాధిని పొందుతున్నారు. వానా కాలం వ‌చ్చిందంటే వీరి ప‌ని ఆగిపోతుంది. కోస్తా తీర‌ ప్రాంతాలలో మ‌నం మ‌రో ప‌నిని కూడా చేపట్టవ‌చ్చు.. అది, స‌ముద్రపు మొక్కలను కోస్తా తీర‌ ప్రాంతాలలో సాగు చేయ‌డం. ఇందుకోసం చెక్క గొట్టం ఉంటే స‌రిపోతుంది. అందులో స‌ముద్రపు నాచు విత్త‌నం వేసి, తీరానికి ద‌గ్గ‌ర‌లో ఉంచాలి. ఈ గొట్టం తేలియాడుతూ ఉండి, 45 రోజులలో పంట సిద్ధమై కోతకు వస్తుంది. ఇది నిండా నీరు ఉండి చూడ‌డానికి చాలా అందంగా ఉంటుంది.ః

ఈ మొక్కను ఔషధ ప్రపంచంలో చాలా శ‌క్తివంత‌మైన ప‌దార్థంగా ఎంచుతున్నారు. అయితే, ఈ విష‌యంలో నేను మరొక స‌ల‌హాను కూడా ఇవ్వగలను. సముద్ర నాచు పంట‌ను సాగు చేయ‌డానికి స్వ‌యం స‌హాయ‌క బృందాల మ‌హిళ‌లు ముందుకు రావాలి. ఈ పంట కేవ‌లం 45 రోజుల్లో చేతికొస్తుంది. ఏడాదంతా సాగు చేయ‌వ‌చ్చు. అంతేకాదు ఈ పంట‌ను రైతులు వారి భూముల్లో కూడా చేర్చుకోవ‌చ్చు. భూమిని దున్నే స‌మ‌యంలో ఈ ప‌ని చేయ‌వ‌చ్చు. ఈ నాచు పంట‌లో చాలా పౌష్టిక విలువ‌లు ఉన్నాయి. అంతే కాదు నాచు నీటితో నిండి వుంటుంది. ధ‌ర్మ‌స్థ‌ల కు ద‌గ్గ‌ర‌ లోని గ్రామాల్లో ఈ విష‌యాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా చేప‌ట్ట‌వ‌చ్చు. సముద్ర నాచు మొక్క‌లు పంట‌ భూముల నాణ్య‌త‌ను పెంచుతాయన్న నమ్మకం నాకుంది. అంతే కాదు ఈమొక్క‌ల‌ను చాలా త‌క్కువ ఖ‌ర్చుతో పెంచ‌వ‌చ్చు. ఈ సముద్ర నాచు మొక్క‌ల వ‌ల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది. వీటి లోని అత్య‌ధిక నీటి కార‌ణంగా భూమిలో కూడా నీటి శాతం పెరుగుతుంది. భూమిని బ‌లోపేతం చేస్తాయి. ధ‌ర్మ‌స్థ‌ల గడ్డ మీదే ఈ ప్ర‌యోగాన్ని నిర్వహించాల‌ని నేను తలుస్తాను. మీరు ప్ర‌యోగం చేసిన త‌రువాత దీనికి సంబంధించిన శాస్త్ర‌వేత్త‌, విద్యారంగ నిపుణులు ఈ అధ్య‌య‌నానికి సంబంధించిన నివేదిక‌ను నాకు పంప‌గ‌ల‌రు. నేను ఈ విష‌యాన్ని మునుపటి ప్ర‌భుత్వ అధికారుల‌కు చెప్ప‌లేదు. ఈ ప్ర‌యోగాన్ని గురించి మొద‌టి సారిగా ఇక్క‌డ మీకు వెల్లడిస్తున్నాను. ఈ ప్ర‌దేశం ఎంత బాగుందంటే మీరు ఇక్క‌డ ప్ర‌యోగం చేయ‌వ‌చ్చు. ప్ర‌భుత్వం ద్వారా ఈ పని చేయాలంటే అనేక నియ‌మ నిబంధ‌న‌లు ఉంటాయి. మీరు ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా స్వ‌చ్ఛ‌మైన‌ మ‌న‌స్సుతో ఈ ప‌ని చేపట్టవలసింది. ఈ ప్ర‌యోగం అనంతరం ఈ ప్రాంతం ఎంతో మారిపోతుంది. ఉత్ప‌త్తి పెరిగిపోతుంది. క‌ర‌వు రోజుల్లోనూ మ‌న వ్యవసాయదారులు ఎటువంటి ఇబ్బందులు ప‌డ‌రు. అందుకని పుడమి తల్లిని కాపాడుకోవడానికి మ‌న ద‌గ్గ‌ర అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. వాటన్నింటినీ అమ‌లు చేయ‌డానికి మ‌నం ముందుకు క‌ద‌లాలి.

మ‌రొక్క సారి నేను ఈ ప్రాంతానికి వ‌చ్చాను. డాక్ట‌ర్ వీరేంద్ర జీ ఆశీస్సులు తీసుకున్నాను. శ్రీ మంజునాధేశ్వ‌రుని ఆశీస్సులు తీసుకున్నాను. నూత‌న స్ఫూర్తితో, ఉత్సాహంతో తిరిగి వెడుతున్నాను. ఈ ప్రాంతానికి చెందిన స‌గ‌టు విద్యావంతులైన మ‌హిళ‌లు ముందుకువచ్చి- అంటే ఒక 12 ల‌క్ష‌ల మంది సోద‌రీమ‌ణులు ముందుకువచ్చి- న‌గ‌దు ర‌హిత వ్య‌వ‌స్థ‌ను అమ‌లు చేయాలి. అప్పుడు నేను ఈ మ‌హిళ‌ల‌తో, ఈ స్వయం స‌హాయ‌క బృంద మ‌హిళ‌ల‌తో పోటీ ప‌డాల‌ని, వారి కంటే వెన‌క‌బ‌డి పోవ‌ద్ద‌ని మొత్తం జిల్లా వాసుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తాను. ‘భీమ్ యాప్’ (Bhim App) ను ఎలా ఉప‌యోగించాలో మ‌నం నేర్చుకోవాలి. న‌గ‌దు ర‌హిత లావాదేవీలు ఎలా చేయాలో తెలుసుకోవాలి. దేశంలో నిజాయతీకి సంబంధించి ఒక నూత‌న యుగం ప్రారంభ‌మైంది. నిజాయితీ ప‌రుల‌ను బ‌లోపేతం చేస్తే చాలు నిజాయతీ ర‌హిత వ్య‌వ‌స్థ క్ర‌మ‌క్ర‌మంగా మ‌రుగున‌ ప‌డిపోతుంది. గ‌తంలో నిజాయతీ లేని త‌నానికి ప్రోత్సాహం వుండేది. ఇప్పుడు నిజాయతీకి ప్రోత్సాహం ల‌భిస్తోంది. ఇదే ఇప్పుడు మ‌న బ‌లం. మ‌నం ఒక దీపాన్ని వెలిగిస్తే, అది త‌ప్ప‌కుండా చీక‌టిని త‌రిమి కొడుతుంది. అదే విధంగా నిజాయతీని బ‌లోపేతం చేస్తే నిజాయతీ ర‌హిత వ్య‌వ‌స్థ దానంత‌ట అదే ముగిసిపోతుంది. ఈ ప్ర‌తిజ్ఞ‌తో మ‌నం ముందుకు పోవాలి. మీకంద‌రికీ నా అభినంద‌న‌లు, డాక్ట‌ర్ వీరేంద్ర హెగ్డే జీ కి అభినంద‌న‌లు. ఆయ‌న‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. ఆయ‌న ఇలాగే దేశానికి, ఈ ప్రాంతానికి, రాబోయే యాభై సంవత్సరాల పాటు, 50 ఏళ్ల సుదీర్ఘ‌ కాలం సేవ‌ చేయాల‌ని కోరుకొంటున్నాను.

మీకు అనేక ధన్యవాదాలు.

******