పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పీఐబీ నుంచి అమాంతం తీసుకోవడం జరిగింది.

దేశ ప్రజలను ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి చేసిన ప్ర‌సంగం పూర్తి పాఠం

ప్రియ‌మైన నా దేశ పౌరులారా,

దీపావ‌ళి ప‌ర్వ‌దిన వేడుక‌ల‌ను స‌రికొత్త ఆశ‌ల‌తో, సంతోషంతో ముగించార‌ని ఆశిస్తున్నాను. ఇవాళ, నేను కొన్నిక్లిష్టమైన సమస్యలు, ముఖ్యమైన నిర్ణయాల గురించి మీతో మాట్లాడబోతున్నాను. ఈ రోజు మీకంద‌రికీ నేను ఒక ప్ర‌త్యేక అభ్య‌ర్థ‌న చేయ‌ద‌ల‌చాను. 2014 మే నెల‌లో మీరు మాకు అత్యంత క‌ష్ట‌సాధ్య‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గించిన రోజున దేశ ఆర్థిక ప‌రిస్థితి ఎలా ఉందో మీకు గుర్తుండే ఉంటుంది. బిఆర్ ఐ సి ఎస్ (BRICS) కూట‌మి విష‌యానికొస్తే బి ఆర్ ఐ సి ఎస్ లోని ‘ఐ’ అక్ష‌రం అంటే ఇండియా. ఇండియా దుర్బ‌లంగా ఉంద‌న్న మాట వినిపించింది. నాటి నుండి మ‌నం రెండు సంవత్సరాలు తీవ్ర అనావృష్టిని ఎదుర్కొన్నాము. అయిన‌ప్ప‌టికీ, గ‌డ‌చిన రెండున్న‌ర సంవత్సరాలలో 125 కోట్ల మంది భార‌తీయుల మ‌ద్ద‌తుతో ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భార‌త‌దేశం “ఉజ్జ్వ‌ల తార”గా ఆవిర్భ‌వించింది. ఈ మాట కేవ‌లం మేం చెబుతున్నది కాదు; స్వయంగా అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌ నిధి సంస్థ, ప్ర‌పంచ బ్యాంకు లు చెప్పిన వాస్త‌వ‌ం ఇది.

అభివృద్ధి దిశ‌గా సాగిన ఈ కృషిలో ‘అంద‌రితో క‌లిసి అంద‌రికీ ప్ర‌గ‌తి’ అన్న‌దే మా నినాదం: పౌరులంద‌రి ప్ర‌గ‌తి కోసం పౌరుంల‌ద‌రితో క‌లిసి మేం ప్రయాణిస్తున్నాము. ఈ ప్ర‌భుత్వం పేద‌ల‌కే అంకితం.. ఇక‌ మీద‌ట కూడా వారికే అంకిత‌మై ఉంటుంది. పేద‌రికంపై మా పోరాటంలో మా ప్ర‌ధాన ల‌క్ష్యం పేద‌ల‌కు సాధికారితను క‌ల్పించ‌డం, ఆర్థిక అభ్యుద‌య‌ ప్ర‌యోజ‌నాల్లో వారిని చురుకైన భాగ‌స్వాముల‌ను చేయ‌డ‌మే.

ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌న‌,

జ‌న సుర‌క్ష యోజ‌న‌,

చిన్న పారిశ్రామిక‌వేత్త‌ల కోసం ప్ర‌ధాన‌ మంత్రి ముద్రా యోజ‌న‌,

ద‌ళితులు, ఆదివాసీలు, మ‌హిళ‌ల కోసం ‘స్టాండ్- అప్ ఇండియా’ కార్యక్రమం,

పేద‌ల ఇళ్ల‌కు వంట‌ గ్యాస్ క‌నెక్ష‌న్ ల కోసం ప్ర‌ధాన మంత్రి ఉజ్జ్వ‌ల పథకం,

రైతులకు పంట‌ల, ఆదాయ‌ ర‌క్ష‌ణ‌కు ప్ర‌ధాన‌ మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, ప్ర‌ధాన మంత్రి కృషి సించాయీ యోజ‌న,

రైతుల భూముల నుండి అత్య‌ధిక ఫ‌ల‌సాయం సాధ‌న ల‌క్ష్యంగా భూసార కార్డుల ప‌థ‌కం, వీట‌న్నిటితో పాటు

రైతులు త‌మ దిగుబ‌డికి గిట్టుబాటు ధ‌ర పొంద‌గ‌లిగేలా ‘ఇ-నామ్’ (e-NAM) పేరిట జాతీయ మార్కెట్ ప‌థ‌కం..

– ఇవ‌న్నీ మా విధానాల‌కు ప్ర‌తింబింబాలు.

గ‌డ‌చిన ద‌శాబ్దాల్లో అవినీతి భూతం, న‌ల్ల‌ధ‌నం విప‌రీతంగా విజృంభించాయి. పేద‌రిక నిర్మూల‌న కృషిని అవి దుర్బ‌లం చేశాయి. ఒక‌వైపు ఆర్థిక వృద్ధి శాతం రీత్యా మ‌నం నంబ‌ర్ వ‌న్‌. కానీ, మ‌రొక వైపు చూస్తే రెండు సంవత్సరాల కింద‌ట మ‌నం ప్ర‌పంచ అవినీతిక‌ర దేశాల జాబితాలో దాదాపు 100వ స్థానానికి ద‌గ్గ‌రగా ఉన్నాం. ఎన్నో చ‌ర్య‌లు తీసుకున్న త‌రువత కూడా నేడు 76వ స్థానానికి మాత్ర‌మే చేరుకోగ‌లిగాము. నిజ‌మే.. ప‌రిస్థితి కాస్త మెరుగుప‌డింది గానీ.. అవినీతి, న‌ల్ల‌ధ‌నం ఊడ‌లు ఎంత‌గా విస్త‌రించిపోయాయో దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

స‌మాజంలోని కొన్ని వ‌ర్గాలు త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం అవినీతి మ‌హ‌మ్మారిని విస్త‌రింప‌జేశాయి. ఆ వ‌ర్గాలు పేద‌ల‌ను విస్మ‌రించి, ప్ర‌యోజ‌నాల‌న్నిటినీ దోచుకున్నాయి. కొంతమంది వ్య‌క్తులు వారి స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం ప‌ద‌వుల‌ను దుర్వినియోగం చేశారు. మ‌రొక వైపు నిజాయతీప‌రులు ఈ మ‌హ‌మ్మారితో పోరాడారు. కోట్లాది సామాన్య స్త్రీ, పురుషులు నిజాయతీతో జీవించారు. త‌మ వాహ‌నాల్లో వ‌దలివెళ్లిన బంగారు న‌గ‌ల‌ను పేద ఆటోరిక్షా డ్రైవ‌ర్లు వాటి య‌జ‌మానుల‌కు అప్ప‌గించిన ఉదంతాల గురించి మ‌నం వింటూ ఉంటాము. వాహ‌నాలలో విలువైన సెల్‌ఫోన్ లను మ‌ర‌చిపోతే వాటి య‌జ‌మానుల కోసం టాక్సీ డ్రైవ‌ర్లు క‌ష్ట‌ప‌డి వెద‌క‌డం గురించి వింటుంటాము. వినియోగ‌దారులు పొర‌పాటున ఎక్కువ‌గా డ‌బ్బు చెల్లిస్తే తిరిగి ఇచ్చేసే కూర‌గాయ‌ల వ్యాపారుల గురించి కూడా వింటూ ఉంటాము.

ఓ దేశ ప్ర‌గ‌తి చ‌రిత్రలో క‌ఠిన‌మైన, నిర్ణ‌యాత్మ‌క చ‌ర్య తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డ‌టంతో పాటు ఆ స‌మ‌యం కూడా ఆస‌న్న‌మ‌వుతుంది. అనేక ఏళ్లుగా చీము ప‌ట్టిన పుండ్ల‌ లాంటి అవినీతి, న‌ల్ల‌ధ‌నం, ఉగ్రవాదం ఈ దేశాన్నిస‌తాయిస్తూ పురోగ‌మ‌న ప‌రుగు పందెంలో వెన‌క్కులాగుతూ వ‌చ్చాయి.

ఉగ్ర‌వాదం ఓ భ‌యంకర ముప్పు. దాని కార‌ణంగా అనేక‌ మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ, ఈ ఉగ్ర‌వాదుల‌కు డ‌బ్బు ఎక్క‌డి నుండి వ‌స్తోందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? స‌రిహ‌ద్దుల ఆవ‌లి నుండి శత్రువులు న‌కిలీ నోట్ల‌తో వారి కార్య‌క‌లాపాలను సాగిస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా కొన‌సాగుతోంది. అనేక‌సార్లు ఇలాంటి న‌కిలీ 500 రూపాయల, 1,000 రూపాయ‌ల నోట్లను చెలామ‌ణీ చేసే వారిని ప‌ట్టుకుంటున్నాము. అటువంటి న‌కిలీ నోట్ల‌ను భారీగా స్వాధీనం చేసుకుంటున్నాము.

సోద‌ర సోద‌రీమ‌ణులారా,

ఒక‌ వైపు ఉగ్ర‌వాద స‌మ‌స్య; మ‌రొక వైపు అవినీతి, న‌ల్ల‌ధ‌నం విసురుతున్న స‌వాలు. మేం అధికారంలోకి రాగానే అవినీతిపై పోరాటాన్ని మొదలుపెట్టాము. ఇందులో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయ‌మూర్తి నేతృత్వంలో ప్ర‌త్యేక ప‌రిశోధ‌క బృందం (ఎస్ ఐ టి) ని ఏర్పాటు చేశాము. అప్ప‌టి నుండి..

• విదేశాల్లో దాచిన న‌ల్ల‌ధ‌నం వెల్ల‌డి కోసం 2015లో ఒక చ‌ట్టం ఆమోదించాము;

• బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల స‌మాచార ఆదాన ప్ర‌దానం కోసం కొత్త నిబంధ‌న‌లు చేర్చే విధంగా అమెరికా స‌హా అనేక దేశాల‌తో ఒప్పందాలు చేసుకున్నాము;

• అవినీతి మార్గాల్లో ఆర్జించిన న‌ల్ల‌ధ‌నాన్ని బేనామీ లావాదేవీల ద్వారా చెల్లుబాటు చేసుకోవ‌డాన్ని అరిక‌ట్టేందుకు ఓ క‌ఠిన చ‌ట్టాన్ని 2016 ఆగ‌స్టు నుండి అమ‌లులోకి తెచ్చాము;

• గ‌ట్టి జ‌రిమానా చెల్లించి న‌ల్ల‌ధ‌నం వెల్ల‌డించేలా ఒక ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టాము.

ప్రియ‌మైన నా దేశ పౌరులారా,

అవినీతిప‌రులు దాచిన ల‌క్షా 25వేల కోట్ల రూపాయ‌ల న‌ల్ల‌ధ‌నాన్ని గ‌డ‌చిన రెండున్న‌రేళ్లుగా ఇలాంటి అనేక చ‌ర్య‌ల‌ ద్వారా బ‌హిర్గ‌తం చేయ‌గ‌లిగాము. అవినీతి, న‌ల్ల‌ధ‌నం, బేనామీ ఆస్తులు, ఉగ్ర‌వాదం, న‌కిలీ నోట్లు త‌దిత‌రాల‌పై ఈ పోరాటం కొన‌సాగాల‌ని నిజాయతీప‌రులైన పౌరులు ఆకాంక్షిస్తున్నారు. ప్ర‌భుత్వాధికారుల ప‌డ‌క‌ గ‌దులలోని ప‌రుపుల కింద కోట్ల రూపాయల విలువైన నోట్లు దాచిపెట్టిన‌ట్లు లేదా గోనె సంచుల నిండా నోట్ల‌క‌ట్ట‌లు కుక్కి దాచిన‌ట్లు వ‌చ్చే వార్త‌ల‌తో బాధ‌ప‌డ‌ని నిజాయతీప‌రుడైన పౌరుడు ఎవ‌రైనా ఉంటారా ?

చెలామ‌ణిలో ఉన్న న‌గ‌దు ప‌రిమాణం అవినీతి స్థాయితో ముడిప‌డి ఉంది. అవినీతి మార్గాల్లో ఆర్జించిన సొమ్ము విస్త‌రించ‌డం వ‌ల్ల‌ ద్ర‌వ్యోల్బ‌ణం ప‌రిస్థితి మ‌రింత అధ్వాన‌ం అవుతుంది. ఈ భార‌మంతా పేద‌ ప్ర‌జ‌లే మోయవలసి వ‌స్తుంది. పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల కొనుగోలు శ‌క్తిపై ప్ర‌త్య‌క్ష దుష్ప్ర‌భావం ప‌డుతుంది. ఎంతో కొంత భూమి లేదా ఇల్లు కొనుగోలు సంద‌ర్భంగా మీరు చెక్కు ద్వారా చెల్లించిన మొత్తం పోగా, మిగిలిన సొమ్మును న‌గ‌దుగా చెల్లించాల‌ని మిమ్మ‌ల్ని విక్రేత‌లు డిమాండ్ చేయ‌డం మీకు ఇప్పటికే అనుభ‌వంలోకి వ‌చ్చి ఉండ‌వ‌చ్చు. నిజాయతీప‌రుడైన వ్య‌క్తి ఆస్తిని కొనుగోలు చేయాలంటే, ఇది స‌మ‌స్య‌లను సృష్టిస్తుంది. న‌గ‌దును ఇలా దుర్వినియోగం చేయ‌డం భూమి, ఇళ్లు, ఉన్న‌త విద్య, ఆరోగ్య సంర‌క్ష‌ణ త‌దిత‌ర వ‌స్తుసేవ‌ల ధ‌ర‌లలో కృత్రిమ పెరుగుద‌ల‌కు దారి తీస్తుంది. న‌గ‌దు చెలామణి ప‌రిమాణం అధికంగా ఉన్న‌పుడు న‌ల్ల‌ధ‌నం, ఆయుధాల అక్రమ కొనుగోళ్ల‌తో ప్ర‌త్య‌క్షంగా ముడిప‌డిన‌ హ‌వాలా వ్యాపారాన్నిమ‌రింత బ‌లోపేతం చేస్తుంది. ఇక ఎన్నిక‌ల‌లో న‌ల్ల‌ధ‌నం పాత్ర పైనా ఎన్నో ఏళ్లుగా చ‌ర్చ న‌డుస్తోంది.

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా,

అవినీతి, న‌ల్ల‌ధ‌నం క‌బంధ హ‌స్తాలను ఛేదించే దిశ‌గా ప్ర‌స్తుతం చెలామణిలో ఉన్న 500 రూపాయల, 1,000 రూపాయ‌ల నోట్లను ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించాము. ఆ మేర‌కు ఈ అర్ధ‌రాత్రి నుంచే… అంటే 2016 న‌వంబ‌రు 8వ తేదీ రాత్రి 12:00 గంట‌ల నుంచి వీటి చ‌ట్ట‌ప‌ర‌మైన చెల్లుబాటు ర‌ద్ద‌వుతుంది. అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత లావాదేవీల‌కు ఈ నోట్లు అంగీకార‌యోగ్యం కావ‌న్న మాట‌. జాతి వ్య‌తిరేక‌ శక్తులు, అసాంఘిక శ‌క్తులు 500 రూపాయల, 1,000 రూపాయ‌ల నోట్ల రూపంలో గుట్ట‌లుగా దాచిన ధ‌నం ఇక ఏ విలువా లేని చిత్తు కాగిత‌పు ముక్క‌లతో స‌మాన‌ం అవుతుంది. కానీ, నిజాయతీప‌రులతో పాటు క‌ష్ట‌జీవుల హ‌క్కులు, ప్ర‌యోజ‌నాలకు పూర్తి ర‌క్ష‌ణ క‌ల్పిస్తాము. 100, 50, 20, 10, 5, 2 రూపాయల నోట్లు, ఒక రూపాయి నోట్లు, ఇత‌ర చిల్ల‌ర నాణాలు చ‌ట్ట‌బ‌ద్ధంగా చెల్లుబాట‌ు అవుతాయి. వాటిపై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌దని భ‌రోసా ఇస్తున్నాము.

అవినీతి, న‌ల్ల‌ధ‌నం, న‌కిలీ క‌రెన్సీపై సామాన్యుడి పోరాటానికి ఈ చ‌ర్య మ‌రింత బ‌లం చేకూరుస్తుంది. రానున్న రోజుల్లో పౌరుల ఇబ్బందుల‌ను త‌గ్గించే దిశ‌గా అనేక చ‌ర్య‌లు తీసుకున్నాము.

1. పాత 500 రూపాయల నోట్లు, 1,000 రూపాయ‌ల నోట్లు క‌లిగి ఉన్న వ్య‌క్తులు ఎలాంటి ప‌రిమితి లేకుండా న‌వంబ‌రు 10వ తేదీ నుండి డిసెంబ‌రు 30వ తేదీ వ‌ర‌కు వాటిని త‌మ బ్యాంకు లేదా త‌పాలా కార్యాల‌యాల ఖాతాల‌లో జ‌మ చేసుకోవ‌చ్చు.

2. అంటే మీ ద‌గ్గ‌రున్న నోట్లు జ‌మ‌చేసుకోవ‌డానికి 50 రోజుల స‌మ‌యం ల‌భిస్తుంది కనుక ఆందోళ‌న చెంద‌న‌క్కరలేదు.

3. మీ డ‌బ్బు మీదిగానే ఉంటుంది… మీరు దీనిపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు.

4. మీ డ‌బ్బును మీ ఖాతాలో జ‌మ చేసిన త‌రువాత మీకు అవ‌స‌ర‌మైన‌ప్పుడు వెంట‌నే తిరిగి తీసుకోవ‌చ్చు.

5. కొత్త నోట్ల స‌ర‌ఫ‌రా అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, ముందుగా కొంత‌కాలం పాటు వారానికి 20,000 రూపాయ‌ల‌కు మించ‌కుండా రోజుకు 10,000 రూపాయ‌ల దాకా తీసుకొనేలా ప‌రిమితిని విధించాము. త‌రువాతి రోజుల‌లో ఈ ప‌రిమితిని పెంచుతాము.

6. మీ నోట్ల‌ను మీ బ్యాంకు ఖాతాలో జ‌మ చేసుకోవ‌డంతో పాటు మ‌రో స‌దుపాయం కూడా ఉంది.

7. మీ త‌క్ష‌ణావ‌స‌రాల కోసం మీరు ఏ బ్యాంకుకైనా, ప్ర‌ధాన/ ఉప త‌పాలా కార్యాల‌యానికైనా వెళ్లి… ఆధార్ కార్డు, ఓట‌రు కార్డు, రేష‌న్ కార్డు, పాస్‌పోర్టు, పాన్ (PAN) కార్డు, లేదా ఇత‌ర ఏదైనా చెల్లుబాట‌య్యే మీ గుర్తింపు రుజువును చూపి పాత 500 రూపాయల నోట్లను లేదా 1,000 రూపాయ‌ల నోట్ల‌ను కొత్త నోట్ల‌తో మార్పిడి చేసుకోవ‌చ్చు.

8. న‌వంబ‌రు 10 నుంచి న‌వంబ‌రు 24వ‌ర‌కు 4,000 రూపాయ‌ల ప‌రిమితికి లోబ‌డి ఇలా మార్పిడి చేసుకోవ‌చ్చు. న‌వంబ‌రు 25వ తేదీనుంచి డిసెంబ‌రు 30వ తేదీ దాకా ఈ ప‌రిమితిని పెంచుతాము.

9. ఏదైనా కార‌ణంవ‌ల్ల కొంత‌ మంది 2016 డిసెంబ‌రు 30వ తేదీలోగా త‌మ పాత 500 రూపాయల నోట్లను, 1,000 రూపాయ‌ల నోట్ల‌ను త‌మ ఖాతాల్లో జ‌మ చేసుకోలేక‌పోవ‌చ్చు.

10. అటువంటి వారు 2017 మార్చి 31లోగా నిర్దేశిత రిజ‌ర్వ్ బ్యాంకు కార్యాలయాల‌కు వెళ్లి వాంగ్మూలం స‌మ‌ర్పించి పాత నోట్ల‌ను మార్చుకోవ‌చ్చు.

11. న‌వంబ‌రు 9వ తేదీ, కొన్ని ప్రాంతాల్లో న‌వంబ‌రు 10వ తేదీన కూడా ఎటిఎమ్ (ATM) లు ప‌నిచేయ‌వు. ఆ త‌రువాతి రోజు నుండి కొంత‌కాలం పాటు ప్ర‌తి కార్డుపై రోజుకు 2,000 రూపాయ‌ల‌కు మించ‌కుండా మాత్ర‌మే తీసుకునే వీలుంటుంది.

12. అనంత‌రం ఈ ప‌రిమితిని 4,000 రూపాయ‌ల‌కు పెంచుతాము.

13. నవంబ‌రు 8వ తేదీ అర్ధ‌రాత్రి నుండి 500 రూపాయల నోట్లు, 1000 రూపాయ‌ల నోట్లు చెల్ల‌వు. కానీ, కరుణామయ కారణాలతో పౌరుల ఇబ్బందులను తొల‌గించే దిశ‌గా తొలి 72 గంట‌ల‌ పాటు అంటే న‌వంబ‌రు 11వ తేదీ అర్ధ‌రాత్రి 12:00 గంట‌ల‌ దాకా కొన్ని ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశాము.

14. ఈ మూడు రోజుల‌లో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులలో చెల్లింపుల‌కు 500 రూపాయల నోట్లను, 1000 రూపాయ‌ల నోట్ల‌ను స్వీక‌రిస్తారు.

15. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న‌ వారి కుటుంబాల కోసం ఈ వెసులుబాటు క‌ల్పించాము.

16. వైద్యులు రాసే మందుచీటీ ఆధారంగా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లోని మందుల దుకాణాల్లోనూ మందుల కొనుగోలుకు ఈ నోట్ల‌ను వినియోగించుకోవ‌చ్చు.

17. నవంబ‌రు 11వ తేదీ అర్ధ‌రాత్రి దాకా- 72 గంట‌ల‌ పాటు- రైల్వే, ప్రభుత్వ బ‌స్సుల‌, విమానాశ్ర‌యాల్లోని విమాన సంస్థ‌ల టికెట్ల కౌంట‌ర్ల‌లో టికెట్ల కొనుగోలుకు పాత నోట్ల‌ను వాడుకోవ‌చ్చు. ఈ 72 గంట‌ల వ్య‌వ‌ధిలో ప్ర‌యాణాలు చేసే వారి కోసం ఈ వెసులుబాటును క‌ల్పించాము.

18. 72 గంట‌ల‌ పాటు 500 రూపాయల నోట్లను, 1,000 రూపాయల నోట్లను కింది ప్ర‌దేశాలలోనూ అంగీక‌రిస్తారు :-

• ప్ర‌భుత్వ‌ రంగ చ‌మురు సంస్థ‌ల అధీకృత పెట్రోలు, డీజిల్‌, సీఎన్‌జీ గ్యాస్ స్టేష‌న్ లలో..

• కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల అధీకృత‌ వినియోగ‌దారు స‌హ‌కార సంఘ దుకాణాలలో..

• రాష్ట్ర ప్ర‌భుత్వ అధీకృత‌ పాల విక్ర‌య కేంద్రాల‌లో..

• శ్మ‌శానాలు, విద్యుత్ ద‌హ‌న‌ వాటిక‌ల‌లో..

• ఆయా ప్రదేశాలలో నిర్వాహ‌కులు ఈ వ‌సూళ్లు, వ‌స్తు నిల్వ‌ల రికార్డుల‌ను స‌వ్యంగా నిర్వ‌హించాలి.

19. అంత‌ర్జాతీయ విమాన‌శ్ర‌యాలలో వ‌చ్చే పోయే ప్రయాణికుల వ‌ద్ద గ‌ల‌ 500 రూపాయల నోట్లను, 1000 రూపాయ‌ల నోట్ల‌ను 5,000 రూపాయ‌ల‌కు మించ‌కుండా కొత్త నోట్ల‌తో లేదా ఇత‌ర చ‌ట్టబ‌ద్ధ మార్పిడికి ఏర్పాట్లు చేశాము.

20. విదేశీ ప‌ర్యాట‌కులు కూడా వారి క‌రెన్సీ లేదా భార‌తదేశపు పాత క‌రెన్సీ నోట్ల‌ను 5,000 రూపాయ‌ల‌కు మించ‌కుండా మార్పిడి చేసుకోవ‌చ్చు.

21. నేనిక్క‌డ మ‌రో విష‌యం చెప్ప‌ద‌ల‌చుకున్నా… ఈ మొత్తం క‌స‌ర‌త్తు సంద‌ర్భంగా న‌గ‌దులో కాకుండా చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, ఎల‌క్ట్రానిక్ రూపంలో న‌గ‌దు బ‌దిలీ వంటి వాటిపై ఎలాంటి ఆంక్ష‌లు, నిబంధ‌న‌లు లేవని నొక్కిచెప్తున్నా.

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా,

ఇన్ని ర‌కాలుగా జాగ్ర‌త్త‌లు తీసుకున్నా నిజాయతీప‌రులైన పౌరుల‌కు కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఎదురు కావ‌చ్చు. అయితే, జాతి హితం కోసం త్యాగాలు చేయ‌డానికి, క‌ష్టాల‌ను ఎదుర్కొన‌డానికి సామాన్య పౌరులు స‌దా సిద్ధ‌మేన‌ని మ‌న అనుభ‌వం చెబుతోంది. ఓ పేద వితంతువు త‌న వంట‌ గ్యాస్ రాయితీని వ‌దలివేసినప్పుడు, ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు స్వ‌చ్ఛ‌ భార‌త్ కోసం త‌న పెన్ష‌న్‌ను విరాళంగా ఇచ్చినప్పుడు, ఒక పేద ఆదివాసీ త‌న ఇంట్లో మ‌రుగుదొడ్డి నిర్మించేందుకు మేక‌ల‌ను అమ్మివేసిన‌ప్పుడు, ఓ సైనికుడు త‌న గ్రామ ప‌రిశుభ్ర‌త కోసం 57,000 రూపాయ‌ల విరాళం ఇచ్చిన సంద‌ర్భంలోనూ ఆ స్ఫూర్తిని నేను చూశాను. దేశ ప్ర‌గ‌తికి దోహ‌దం చేస్తుందంటే ఏం చేయ‌డానికైనా సామాన్య పౌరుడు దృఢ సంక‌ల్పాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం నేను చూశాను. కాబ‌ట్టి..

అవినీతి, న‌ల్ల‌ధ‌నం, న‌కిలీ నోట్లు, ఉగ్ర‌వాదంపై ఈ పోరాటంలో.. దేశాన్ని ప‌విత్రీక‌రించే ఈ ఉద్య‌మంలో మ‌న ప్ర‌జ‌లు కొన్ని రోజుల‌ పాటు ఈ మాత్రం క‌ష్టాన్ని భ‌రించ‌లేరా ? ప‌్ర‌తి పౌరుడూ పిడికిలి బిగించి ఈ ‘మహా య‌జ్ఞం’లో పాల్గొన‌డానికి సిద్ధంగా ఉన్నాడ‌న్న దృఢ విశ్వాసం నాకుంది.

ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా,

ఈ దీపావ‌ళి పండుగ సంబరాల త‌రువాత ‘ఈ నిజాయతీభరిత వేడుక‌ను, ఈ ప్ర‌మాణ‌పూర్వ‌క ప‌ర్వాన్ని, చిత్త‌శుద్ధి- విశ్వ‌స‌నీయ‌త‌ల వేడుక‌ల‌ను’ జరుపుకొనేందుకు జాతితో చేయిచేయి క‌లిపి ముందుకు న‌డ‌వండి.

అన్ని రాజ‌కీయ పక్షాలు, అన్ని ప్ర‌భుత్వాలు, సామాజిక సేవా సంస్థ‌లు, ప‌త్రిక‌లు- ప్రసార మాధ్య‌మాలు, ఒక్క‌మాట‌లో స‌మాజంలోని అన్నివ‌ర్గాలు మ‌హోత్సాహంతో ఇందులో పాల్గొని, దీనిని విజ‌య‌వంతం చేస్తాయ‌ని నేను ఘంటాప‌థంగా చెప్ప‌గ‌ల‌ను.

ప్రియ‌మైన నా దేశ‌వాసులారా,

ఈ చ‌ర్య‌ను ర‌హ‌స్యంగా ఉంచ‌డం ఎంతో అవ‌స‌ర‌మైంది. నేనిప్పుడు మీతో మాట్లాడుతుండ‌గా మాత్రమే బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, రైల్వేలు, ఆస్ప‌త్రులు ఇత్యాది సంస్థ‌ల‌న్న‌ింటికీ స‌మాచారం వెళ్లింది. అతి త‌క్కువ స‌మ‌యంలోనే రిజ‌ర్వ్ బ్యాంకు, ఇత‌ర బ్యాంకులు, త‌పాలా కార్యాల‌యాలు త‌గిన ఏర్పాట్లను చేసుకోవలసి ఉంది. సహ‌జంగానే దీనికంతా స‌మ‌యం అవ‌స‌రం. అందువ‌ల్ల బ్యాంకుల‌న్నిటినీ న‌వంబ‌రు 9వ తేదీన మూసివేస్తారు. ఇది మీకు కొంత అసౌక‌ర్యం క‌లిగించ‌వ‌చ్చు. అయితే, జాతీయ ప్రాముఖ్యం గ‌ల ఈ బృహ‌త్కార్యాన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు విజ‌య‌వంతంగా నెర‌వేర్చ‌గ‌ల‌వ‌ని నేను ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తున్నాను. ఈ స‌వాలును సంయ‌మ‌నం, సంక‌ల్పంతో ఎదుర్కొన‌డంలో బ్యాంకులు, పోస్టాఫీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని మీకంద‌రికీ విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.

ప్రియ‌మైన నా దేశ పౌరులారా,

క‌రెన్సీ అవ‌స‌రాల‌కు అనుగుణంగా కేంద్ర ప్ర‌భుత్వ ఆమోదంతో రిజ‌ర్వు బ్యాంకు ఎప్ప‌టిక‌ప్పుడు ఎక్కువ విలువ‌గ‌ల నోట్ల‌ను విడుద‌ల చేస్తూ ఉంటుంది. 5,000 రూపాయల నోట్ల, 10,000 రూపాయ‌ల నోట్ల జారీ కోసం రిజ‌ర్వు బ్యాంకు 2014లో సిఫార‌సులు పంపింది. ఈ ప్ర‌తిపాద‌న‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించిన అనంతరం తిర‌స్క‌రించాము. ఇప్పుడు ఈ క‌స‌ర‌త్తులో భాగంగా 2,000 రూపాయ‌ల నోట్ల జారీకి రిజ‌ర్వ్ బ్యాంకు చేసిన సిఫార‌సును ఆమోదించాము. ఈ నేప‌థ్యంలో 500 రూపాయలు, 2,000 రూపాయ‌ల నోట్లు పూర్తిగా కొత్త స్వ‌రూపంతో విడుద‌ల‌ అవుతాయి. పూర్వానుభ‌వాల దృష్ట్యా రిజ‌ర్వ్ బ్యాంకు ఇక‌పై దేశంలో చెలామణి అయ్యే మొత్తం ధ‌నంలో పెద్ద నోట్ల వాటాను ప‌రిమిత స్థాయిలో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తుంది.

ఒక‌ దేశ చ‌రిత్రలో కొన్ని ఉద్య‌మాలు వ‌స్తుంటాయి.. అలాంటి సంద‌ర్భాల్లో తానూ అందులో ఒక భాగం కావాల‌ని, ఆ దిశగా దేశ ప్ర‌గ‌తిలో త‌న భాగ‌స్వామ్యం కూడా ఉండాల‌ని ప్ర‌తి వ్య‌క్తి భావిస్తాడు. అటువంటి సంద‌ర్భాలు చాలా అరుదుగా వ‌స్తాయి. ఇదుగో.. ఇప్పుడిది అలాంటి అవ‌కాశ‌మే. అవినీతి, న‌ల్ల‌ధ‌నం, న‌కిలీ నోట్ల‌ వ‌ల్ల వాటిల్లే న‌ష్ట‌ నివార‌ణ‌కు మ‌హా య‌జ్ఞంలా సాగే ప్ర‌స్తుత పోరులో ప్ర‌తి పౌరుడూ భాగ‌స్వామి కాగ‌ల అవ‌కాశం వ‌చ్చింది. ఇందులో మీరు ఎంత‌గా స‌హ‌క‌రిస్తారో అంత‌గా ఈ ఉద్య‌మం ఘ‌న విజ‌యాన్ని సాధిస్తుంది.

అవినీతి, న‌ల్ల‌ధ‌నం మ‌న జీవితంలో ఒక భాగమ‌న్న‌ భావ‌న మ‌న‌లో ఉండ‌డం ఎంతో శోచ‌నీయ‌మైన విష‌యం. ఈ త‌ర‌హా ఆలోచ‌నా ధోర‌ణి మ‌న రాజకీయాల‌ను, మ‌న పాల‌న వ్య‌వ‌స్థ‌ను, మ‌న స‌మాజాన్ని చెద‌పురుగులా తొలిచేస్తూ ఉండడం బాధాక‌రం. మ‌న ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లు ఏవీ ఈ చెద‌పురుగుల‌కు అతీతం కావు. అవినీతిని అంగీక‌రించ‌డ‌మా, అసౌక‌ర్యాన్ని భ‌రించ‌డ‌మా అన్న సందిగ్ధం ఏర్ప‌డిన‌ప్పుడు దేశ స‌గ‌టు పౌరుడు స‌దా అసౌక‌ర్యాన్ని భ‌రించ‌డానికే సిద్ధ‌ప‌డి, అవినీతిని స‌మ‌ర్థించ‌రాద‌నే నిర్ణ‌యానికే రావ‌డం నేను అనేక‌ సార్లు గ‌మ‌నించాను. కాబ‌ట్టి దీపావ‌ళి పండుగ మరునాడు మీ ప‌రిస‌రాలను శుభ్రం చేసిన రీతిలో మ‌న దేశ ప్ర‌క్షాళ‌న కోసం మీ వంతుగా గొప్ప త్యాగం చేయ‌డానికి ముందుకు రావాల‌ని మిమ్మ‌ల్నంద‌ర్నీ మ‌రోసారి ఆహ్వానిస్తున్నాను.

రండి.. మ‌న‌మందరం ఒక్క‌టై –

తాత్కాలిక ఇబ్బందుల‌ను విస్మ‌రిద్దాం.

నిజాయతీ, విశ్వ‌స‌నీయ‌త‌ల వేడుక‌లో ఏక‌మ‌వుదాము.

భ‌విష్య‌త్త‌రాలు త‌లెత్తుకుని జీవించేలా చేద్దాము.

అవినీతిపై, న‌ల్ల‌ధ‌నంపై పోరాడుదాము.

జాతి సంప‌ద పేద‌ల‌కు ల‌బ్ధిక‌లిగించేలా భ‌రోసానిద్దాం.

చ‌ట్టానికి క‌ట్టుబ‌డే పౌరులకు వారి వాటా ల‌భించేలా చేద్దాం.

భార‌తదేశం లోని 125 కోట్ల‌ మందిపై నాకెంతో న‌మ్మ‌క‌ం ఉంది.. దేశం విజ‌యం సాధిస్తుంద‌నేదే నా దృఢ విశ్వాసం.

మీకంద‌రికీ ధ‌న్య‌వాదాలు.. అనేకానేక కృత‌జ్ఞ‌త‌లు.

న‌మ‌స్కారం.

భార‌త్ మాతా కీ జయ్.