పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పీఐబీ నుంచి అమాంతం తీసుకోవడం జరిగింది.

ద్వారకాధీశ్ దేవాలయంలో పూజలు చేసిన ప్ర‌ధాన మంత్రి; ద్వారకలో బహిరంగ సభలో ప్రసంగం

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ద్వారక లోని ద్వారకాధీశ్ దేవాలయంలో ఈ రోజు పూజలు చేసి, గుజరాత్ లో రెండు రోజుల పాటు తన పర్యటనను మొదలుపెట్టారు.

ఓఖా మరియు బేట్ ద్వారక ల నడుమ ఒక వంతెనకు, ఇంకా ఇతర రహదారి అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన సూచకంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాలను ఆయన ఆవిష్కరించారు.

ద్వారకలో ఈ రోజు ఒక కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తాను గమనించానని ప్రధాన మంత్రి అన్నారు. పునాదిరాయి వేసినటువంటి సేతువు కు అర్థం మనం మన ప్రాచీన వారసత్వంతో మనం మళ్లీ అనుబంధాన్ని పెంచుకోవడమే అని ఆయన చెప్పారు. ఇది పర్యటనకు ఉత్తేజాన్ని అందిస్తుందని, ఈ వంతెన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని వివరించారు. పర్యటనకు ప్రోత్సాహాన్ని అందించేది అభివృద్ధేనని కూడా ఆయన తెలిపారు.

అవస్థాపన లోపించడం కొన్నేళ్లుగా బేట్ ద్వారక వాసులకు ఎటువంటి ఇక్కట్లను మరియు సవాళ్లను తెచ్చిపెట్టిందీ ప్రధాన మంత్రి గుర్తుచేశారు.

పర్యటన రంగం యొక్క వికాసం అనేది ఒంటరితనంలో చోటు చేసుకోజాలదు అని ప్రధాన మంత్రి అన్నారు. మరింత మంది పర్యాటకులను మనం గిర్ వైపునకు ఆకర్షించాలంటే ద్వారక వంటి సమీప దర్శనీయ స్థలాలకు కూడా వెళ్లేటట్లుగా వారికి స్ఫూర్తిని అందించాల్సివుందని ఆయన చెప్పారు.

ఆర్థిక కార్యకలాపాలను మౌలిక సదుపాయాల కల్పన పెంపొందించాలని, అభివృద్ధి వాతావరణానికి తోడ్పడాలని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. మనం ఓడరేవుల వికాసాన్ని, నౌకాశ్రయాలు నాయకత్వం వహించే ప్రగతిని కోరుకొందాం; నీలి విప్లవం భారతదేశ పురోగతికి మరింత దోహదం చేయాల్సివుందని ఆయన అన్నారు.

మత్స్యకారుల సాధికారిత దిశగా భారత ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ప్రధాన మంత్రి వెల్లడించారు. కాండ్లా నౌకాశ్రయాన్ని మెరుగుపరచేందుకు వనరులను కేటాయించిన కారణంగా కాండ్లా ఓడరేవు ఇంతకు ముందు ఎరుగని విధంగా వృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. అలంగ్ కు ఒక నూతన జవసత్వాలను అందించడం జరిగింది, అక్కడ పనిచేస్తున్న శ్రామికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకొన్నాం అని ఆయన వివరించారు.

సముద్ర సంబంధిత భద్రత యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆధునికీకరిస్తున్నదని ప్రధాన మంత్రి అన్నారు. ఇందుకోసం ఒక సంస్థను దేవభూమి అయినటువంటి ఈ ద్వారకలో ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు.

జిఎస్ టి కౌన్సిల్ నిన్నటి సమావేశంలో ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయాలను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉన్నప్పుడు, విధానాలకు సదుద్దేశాలతో రూపకల్పన చేసినప్పుడు దేశ హితం రీత్యా మాకు ప్రజలు మద్దతివ్వడం స్వాభావికమే అన్నారు.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తోడ్పడాలని, అలాగే పేదరికంతో పోరాటం జరపాలని ప్రభుత్వం కోరుకొంటున్నట్లు ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.

ప్రపంచం దృష్టి భారతదేశం వైపునకు మళ్లుతోంది, ఇక్కడకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రజలు తరలివస్తున్నారు అని ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘భారతదేశ అభివృద్ధికి గుజరాత్ తన వంతుగా చురుకైన తోడ్పాటును అందిస్తుందని నేను భావిస్తున్నాను. ఈ కోణంలో నుండి గుజరాత్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***