పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ప్రగతి’ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ముఖాముఖి సంభాషణ

‘ప్రగతి’ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ముఖాముఖి సంభాషణ

ఐసిటి ఆధారితమైన మల్టి- మోడల్ ప్లాట్ ఫామ్ ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేషన్ (‘ప్రగతి’) మాధ్యమం ద్వారా ఈ రోజు జరిగిన 18వ ముఖాముఖి సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

రైల్వేలకు సంబంధించిన ఫిర్యాదుల పరిశీలన మరియు పరిష్కారం దిశగా పురోగతిని ప్రధాన మంత్రి సమీక్షించారు. ఫిర్యాదులలో చాలా వరకు అధికారుల అవినీతి చర్యలకు సంబంధించినవే ఉండడాన్ని ప్రధాన మంత్రి గమనించి, అవినీతికి బాధ్యులని తేలిన రైల్వే అధికారులపై సాధ్యమైనంత కఠిన చర్యలను తీసుకోవాలంటూ ఆదేశించారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హెల్ప్ లైన్ సేవ సహా అన్ని రకాల ఫిర్యాదులకు మరియు ప్రశ్నలకు ఏకీకృతమైన పద్ధతిలో ఒకే టెలిఫోన్ నంబరును సమకూర్చే దిశగా భారతీయ రైల్వేలు కసరత్తు చేయాలని ఆయన సూచించారు.

రైల్వే, రహదారి మరియు విద్యుత్తు రంగాలలో కీలకమైన అవస్థాపన ప్రాజెక్టుల పురోగతిని ప్రధాన మంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టులు మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళ నాడు, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము & కశ్మీర్, అస్సామ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, త్రిపుర మరియు నాగాలాండ్ లు సహా అనేక రాష్ట్రాలలో అమలవుతున్నాయి.

ఈ రోజు సమీక్షించిన పథకాలలో ముంబై మెట్రో, తిరుపతి-చెన్నై హైవే, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మరియు మణిపూర్ లలో చిరకాలంగా పెండింగ్ పడ్డ రహదారి పథకాలు, ఇంకా జమ్ము & కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలలో ముఖ్యమైన విద్యుత్తు ప్రసార మార్గాలు ఉన్నాయి. చిన్న పిల్లలకు ఉద్దేశించిన సార్వత్రిక టీకాల కార్యక్రమం ‘మిషన్ ఇంద్ర ధనుష్’ను గురించి సమీక్షించిన ప్రధాన మంత్రి, ఈ విషయంలో అత్యంత పేలవమైన పనితీరుతో ఉన్న 100 జిల్లాలకు ఖచ్చితమైన కాల వ్యవధులను నిర్దేశించే విషయంలో దృష్టి సారించవలసిందిగా సూచించారు. వ్యాధి నిరోధక టీకాల ప్రయోజనం బాలలందరికీ లభించే విధంగా తగిన ప్రచారాన్ని చేపట్టడంలో ఎన్ సిసి, నెహ్రూ యువ కేంద్ర వంటి యువజన సంస్థల తోడ్పాటును పొందవచ్చని ఆయన అన్నారు.

స్వచ్ఛతా కార్యాచరణ పథకాల అమలు తీరును ప్రధాన మంత్రి సమీక్షిస్తూ, స్వచ్ఛతా పక్షోత్సవం వంటి కార్యక్రమాలను శాశ్వత పరిష్కారాలను సాధించే ఉద్యమాలుగా మార్చుకోవాలని చెప్పారు. ‘అమృత్ మిషన్’ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, ఎల్ఇడి బల్బులు వంటి ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా సాధించగల ఫలితాలు మరియు ప్రయోజనాలు గురించి నివేదికలు ఇవ్వాలని, ఇలా చేస్తే తత్సంబంధిత ప్రయోజనాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలుగుతారని పేర్కొన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 2022 వ సంవత్సరం కల్లా 75 ఏళ్లు అవుతాయని, అప్పటికల్లా ఒక పరివర్తన పూర్వకమైన ఫలితాన్ని సాధించేందుకు నిర్ధిష్ట పథకాలతోను, లక్ష్యాలతోను ముందుకు రావలసిందిగా భారత ప్రభుత్వ కార్యదర్శులకు, వివిధ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. స్వచ్ఛతకు సంబంధించినంత వరకు, 2019లో మహాత్మ గాంధీ 150వ జయంతి కన్నా ముందే గరిష్ఠ స్థాయిలో కృషి చేయాలని ప్రధాన మంత్రి కోరారు.

***