పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఫిలిప్పీన్స్ కు బయలుదేరే ముందు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఫిలిప్పీన్స్ సందర్శనకు బయలుదేరే ముందు విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.

‘‘ నవంబర్ 12 మొదలుకొని మూడు రోజుల పాటు నేను మనీలా లో పర్యటిస్తాను. ఫిలిప్పీన్స్ కు ఇది నా మొదటి ద్వైపాక్షిక పర్యటన. నేను ఏశియాన్- ఇండియా మరియు ఈస్ట్ ఏశియా సమిట్ లలో కూడా పాలు పంచుకొంటాను. వాటిలో నేను పాలు పంచుకోవడం నా ప్రభుత్వం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలిసీ ఫ్రేమ్ వర్క్ పరిధికి లోబడి ఉండటంతో పాటు ఏశియాన్ సభ్యత్వ దేశాలతో, మరీ ముఖ్యంగా, ఇండో- పసిఫిక్ ప్రాంత దేశాలతో సంబంధాలను గాఢతరం చేసుకోవడాన్ని కొనసాగించాలన్న భారతదేశ నిబద్ధతకు సంకేతంగా కూడా ఉంటుంది.

ఈ శిఖర సదస్సులే కాక, నేను ఏశియాన్ యొక్క 50వ వార్షికోత్సవ ప్రత్యేక వేడుకలలోనూ, రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్ నర్ షిప్ (ఆర్ సిఇపి) లీడర్స్ మీటింగ్ లోనూ, ఇంకా ఏశియాన్ బిజినెస్ అండ్ ఇన్ వెస్ట్ మెంట్ సమిట్ లోనూ పాల్గొంటాను.

ఏశియాన్ సభ్యత్వ దేశాలతో మన వ్యాపార సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడానికి మనం అనుసరిస్తున్న సన్నిహిత సహకార వైఖరిని ఏశియాన్ బిజినెస్ అండ్ ఇన్ వెస్ట్ మెంట్ సమిట్ ఉత్తేజితం చేయగలదు. మనం చేస్తున్నటువంటి మొత్తంమీద వ్యాపారంలో గణనీయంగా అంటే, 10.85 శాతం వ్యాపారం ఒక్క ఏశియాన్ సభ్యత్వ దేశాలతోనే జరుగుతోంది.

ఫిలిప్పీన్స్ లో నా మొదటి పర్యటన సందర్భంగా నేను ఫిలిప్పీన్స్ అధ్యక్షులు శ్రీ రాడ్రిగో డూటర్ట్ తో జరిపే ద్వైపాక్షిక సమావేశం కోసం ఎదురుచూస్తున్నాను. ఏశియాన్ కు మరియు ఈస్ట్ ఏశియా సమిట్ కు చెందిన ఇతర నాయకులతో కూడా నేను భేటీ అవుతాను.

ఫిలిప్పీన్స్ లోని భారతీయ సముదాయంతో సమావేశం కావడం కోసం నేను వేచివున్నాను. మనీలా లో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్ఆర్ఐ) మరియు మహావీర్ ఫిలిప్పీన్స్ ఫౌండేషన్ ఇన్ క్. (ఎమ్ పిఎఫ్ఐ) లను కూడా నేను సందర్శిస్తాను.

శాస్త్రీయ పరిశోధన మరియు అభివృద్ధి అండదండలతో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్ఆర్ఐ) శ్రేష్ఠతరమైన, గుణాత్మకమైన వరి విత్తనాన్ని ఆవిష్కరించింది. తద్వారా ఆహార కొరత సమస్యలను పరిష్కరించడంలో గ్లోబల్ కమ్యూనిటీ కి సహాయపడింది. ఐఆర్ఆర్ఐ లో భారతీయ శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో పనిచేస్తూ, ఈ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డి) కి వారి వంతు సేవలను అందజేస్తున్నారు. ఐఆర్ఆర్ఐ దక్షిణ ఆసియా ప్రాంతీయ కేంద్రాన్ని వారాణసీ లో నెలకొల్పుతామంటూ వచ్చిన ఒక ప్రతిపాదనకు 2017 జులై 12వ తేదీన నా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది ఫిలిప్పీన్స్ లోని ఐఆర్ఆర్ఐ ప్రధాన కేంద్రానికి వెలుపల ఏర్పడబోయే ఒకటో ఐఆర్ఆర్ఐ పరిశోధన కేంద్రం కానుంది. వారాణసీ కేంద్రం వరి దిగుబడిని పెంపొందించి, సాగు ఖర్చును తగ్గించి, విలువను జోడించి, వ్యవసాయదారుల నైపుణ్యాలను వివిధీకరించడం మరియు ఇనుమడింపచేయడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడంలో సహాయపడగలదు.

మహావీర్ ఫిలిప్పీన్స్ ఫౌండేషన్ ఇన్ క్. (ఎమ్ పిఎఫ్ఐ) ను నేను సందర్శించడం కృత్రిమ అవయవాలు అవసరమైన వారికి ఉచితంగా ‘జైపుర్ పాదాల’ పంపిణీ దిశగా ఆ సంస్థ చేపడుతున్న కార్యకలాపాలకు భారతదేశం తరఫున మద్దతు తెలపడానికి ఒక సంకేతం కాగలదు. 1989లో ఎమ్ పిఎఫ్ఐ స్థాపించబడినప్పటి నుండి ఫిలిప్పీన్స్ లో సుమారు 15,000 మంది అంగచ్ఛేద బాధితులకు ఒక కొత్త జీవితాన్ని గడిపేందుకు వీలుగా జైపుర్ పాదాలను అమర్చడం జరిగింది. ఈ ఉత్తమమైనటువంటి ఉపకార కార్యకలాపాలలో ఫౌండేషన్ కు భారత ప్రభుత్వం తన వంతుగా నిరాడంబరమైన తోడ్పాటును అందిస్తోంది.

మనీలా లో నా పర్యటన ఫిలిప్పీన్స్ తో భారతదేశం నెరపుతున్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలకు ఓ నూతనోత్తేజాన్ని అందించగలదని, అంతే కాక ఏశియాన్ తో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా మనం నెలకొల్పుకొన్న బంధాలను మరింతగా బలోపేతం చేయగలదన్న నమ్మకం నాకుంది. ’

****