పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మన్కీబాత్ – మనసులోమాట(36వ భాగం)

 

నా ప్రియమైన దేశప్రజలారా, మీ అందరికీ నమస్కారం! ఆకాశవాణి ద్వారా మీ అందరితో మనసులో మాటలు చెప్తూ చెప్తూండగా మూడేళ్ళు గడిచిపోయాయి. ఇవాళ్టి మనసులో మాట 36వ అంకం. ఒక రకంగా చెప్పాలంటే, భారతదేశం నలుమూలల్లోనూ నిండి ఉన్నఆలోచనలు, ఆశలు, ఆకాంక్షల రూపం , ఒక అనుకూలమైన శక్తి ఈ ’మనసులో మాట’ . కొన్ని చోట్ల నుండి ఫిర్యాదులు కూడా ఉన్నాయి కానీ ప్రజల మనసుల్లో పొంగిపొరలే ఆలోచనలన్నింటితో నేను ముడిపడే ఒక పెద్ద అద్భుతమైన అవకాశాన్ని నాకు ఈ మనసులో మాట ఇచ్చింది. ఇవి నా మనసులో మాటలని నేనెప్పుడూ చెప్పలేదు. ఈ మనసులో మాట దేశప్రజలందరి మనసులతో ముడిపడి ఉంది. వారి భావాలతో, వారి ఆశలూ-ఆకాంక్షలతో జతపడి ఉంది. ఈ మనసులో మాటలో నేను చెప్పే కబుర్లు దేశం నలుమూలల నుండీ నాకు ప్రజలు పంపిన మాటలే. ఇంకా అవన్నీ చాలా తక్కువగానే చెప్తాను నేనింకా మీతో కొన్ని మాటలే పంచుకోగలుగుతాను కానీ నాకు మాత్రం ఒక మాటల భాండాగారమే లభిస్తోంది. ఈ -మెయిల్ ద్వారా, టెలీఫోన్ ద్వారా , mygov ద్వారా , NarendraModiApp ద్వారా ఇన్ని మాటలు నాకు చేరతాయి. వీటిలో చాలవరకూ నాకు ప్రేరణను కలిగించేవే. చాలావరకూ ప్రభుత్వంలో మార్పుల్ని తెచ్చేలాంటివే ఉంటాయి. కొన్ని వ్యక్తిగత ఫిర్యాదులు ఉమ్టే, కొన్ని సామూహిక సమస్యల పట్ల దృష్టిని నిలిపేలాంటివి ఉంటాయి. నెలలో ఒకసారి, ఒక అరగంట మీ సమయాన్నే నేను తీసుకుంటున్నాను కానీ ప్రజలు మాత్రం నెలలో ముఫ్ఫై రోజులూ ’మనసులో మాట’ కోసం తమ మాటలు చేరవేస్తూ ఉంటారు. ఇందుకు పరిణామంగా ఏమి జరిగిందంటే ప్రభుత్వంలో కూడా సున్నితత్వం ఏర్పడింది. సమాజంలో దూరప్రాంతాల్లో ఎలాంటి శక్తులు ఉన్నాయో, వారి పట్ల దృష్టి వెళ్ళే ప్రయత్నం జరిగింది. అందువల్ల మూడేళ్ళ ఈ మనసులో మాట ప్రయాణం దేశవాసులందరి మనోభావాల, అనుభూతుల తాలూకూ ప్రయాణం. ఇంత తక్కువ సమయంలో భారతదేశంలోని సామాన్యపౌరుడి భావాలను తెలుసుకుని అర్థం చేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేశప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనసులో మాట చెప్పే ప్రతిసారీ నేను ఆచార్య వినోభా భావే చెప్పిన మాటలను గుర్తుంచుకున్నాను. ఆచార్య వినోభా భావే ఎప్పుడూ అనేవారు ‘अ-सरकारी, असरकारी ’ అని. అంటే ప్రభుత్వేతరంగా ఉంటేనే లాభకారి అవుతారు అని. నేను కూడా మనసులో మాటలో ఎప్పుడూ ప్రజలనే ప్రధానాంశంగా ఉంచుకునే ప్రయత్నం చేసాను. రాజకీయపు రంగు దీనికి అంటకుండానే చూశాను. ఎప్పటికప్పుడు, పరిస్థితుల్లో ఎంతటి తీవ్రత ఉన్నా, ఆక్రోశాలున్నా, వాటితో పాటూ నేనూ కదిలిపోకుండా, ఒక స్థిరమైన మనసుతో, మీతో కలిసి ఉండే ప్రయత్నమే చేశాను.
ఇప్పుడు మూడేళ్ళు పూర్తయ్యాయి కాబట్టి సామాజిక శాస్త్రవేత్తలూ, విశ్వవిద్యాలయాలూ, పరిశోధనా పండితులు, మీడియా నిపుణులూ తప్పకుండా దీని విశ్లేషణ చేస్తారు. మంచి,చెడు రెంటినీ ఎత్తిచూపుతారు. కానీ ఇటువంటి విశ్లేషణాత్మక చర్చలే భవిష్యత్తులో మనసులో మాటకు ఎంతో ఎక్కువగా ఉపయోగపడతాయి. ఒక సరికొత్త స్పృహను, కొత్త ఉత్సాహాన్నీ అందిస్తాయి. భోజనం చేసేప్పుడు – మనకి ఎంత అవసరం అని ఆలోచించి, సరిపడినంతే తినాలి. పదార్థాలను వృధా చెయ్యకూడదు అని నేనిదివరకూ ’మనసులో మాట’లో ఒకసారి చెప్పాను. ఆ తర్వాత దేశం నలుమూలల నుండీ, అనేక సామాజిక సంస్థలు, అనేకమంది యువకులు ముందునుంచే ఇటువంటి పనులు చేస్తున్నారని చెప్తూ నాకు ఎన్నో ఉత్తరాలు వచ్చాయి. కంచంలో వదిలేసిన అన్నాన్ని ఒక చోట చేర్చి, దానిని ఎలా సద్వినియోగపరచాలని ఆలోచించేవాళ్ళు ఎంతో మంది ఉన్నారన్న సంగతి నా దృష్టికి వచ్చాకా, నాకు చాలా ఆనందమూ, ఎంతో సంతోషమూ కలిగాయి.
మరోసారి మనసులో మాటలో నేను మహరాష్ట్రలో పదవీ విరమణ చేసిన ఒక ఉపాధ్యాయుడు శ్రీ చంద్రకంత్ కులకర్ణీ గురించి చెప్పాను. ఆయనకు వచ్చే పదహారు వేల పెన్షన్ లోంచి ఐదు వేల రూపాయిలు తీసి, 51 పోస్ట్ డేటెడ్ చెక్ ల రూపంలో పారిశుధ్యం కోసం దానమిచ్చేసారు. ఆ తరువాత పరిశుభ్రత నిమిత్తమై ఇటువంటి పనులు చెయ్యడానికి ఎందరో ముందుకు వచ్చారు.
మరోసారి నేను హర్యానా లో ఒక సర్పంచ్ తీసుకున్న ’సెల్ఫీ విత్ డాటర్’ ఫోటో చూసి, దాని గురించి మనసులో మాటలో అందరితో చెప్పాను. చూస్తూండగానే ఒక్క భారతదేశంలోనే కాక, యావత్ ప్రపంచం లోనే ’సెల్ఫీ విత్ డాటర్’ అనే ఒక పెద్ద ఉద్యమం మొదలైంది. ఇది కేవలం సామాజిక మాధ్యమం తాలూకూ విషయం మాత్రమే కాదు. ప్రతి అమ్మాయిలోనూ ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్నీ, నూతన గర్వాన్నీ ఉత్పన్నం చేసే సంఘటన ఇది. అందరు తల్లిదండ్రులకీ తమ కుమార్తెలతో సెల్ఫీ తీసుకోవాలి అని అనిపించింది. ప్రతి అమ్మాయికీ తనలో ఏదో గొప్పతనం ఉందనీ, తనకు ప్రాముఖ్యత ఉందనీ నమ్మకం కలిగింది.
కొద్ది రోజుల క్రితం నేను భారత ప్రభుత్వం వారి పర్యాటక శాఖా విభాగంలో కూర్చుని ఉన్నాను. అక్కడ ప్రయాణానికి వెళ్తున్న వారితో incredible India (అద్భుతమైన భారతదేశం) లో ఎక్కడికి వెళ్తే అక్కడ ఫోటోలు తీసి పంపించమని చెప్పాను. అప్పుడు భారతదేశం మారుమూల ప్రాంతాల నుండీ కూడా వచ్చిన లక్షల కొద్దీ చిత్రాలు, ఒక రకంగా పర్యాటక రంగంలో పనిచేసేవారందరికీ చాలా పెద్ద సంపదగా నిలిచాయి. ఒక చిన్న సంఘటన ఎంత పెద్ద ఉద్యమాన్ని లేవదీయగలదో మనసులో మాట ద్వారా నాకు అనుభవమైంది. మూడేళ్లు పూర్తయ్యాయన్న ఆలోచన రాగానే నా మనసు వాకిట్లో ఎన్నో సంఘటనలు మెదిలాయి. సరైన దిశలో నడవటానికి దేశం ఎప్పుడూ ముందే ఉంటుంది. దేశంలో ప్రతి పౌరుడూ, తోటి పౌరుడి హితం కోసం, సమాజానికి మంచి జరగడం కోసం, దేశ ప్రగతి కోసం, ఏదో ఒకటి చెయ్యాలనే అనుకుంటున్నాడు. ఇది నా మూడేళ్ళ ’మనసులో మాట ’ ప్రచారంలో భాగంగా దేశప్రజల నుండి విన్న, తెలుసుకున్న, నేర్చుకున్న సంగతి. ఏ దేశానికైనా సరే, అన్నింటికన్నా పెద్ద పెట్టుబడి, అతి పెద్ద శక్తి ఇదే. దేశప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను.
ఒకసారి మనసులో మాటలో నేను ఖాదీ గురించి మాట్లాడాను. ఖాది అనేది ఒక వస్త్రం కాదు, ఒక ఆలోచన అని చెప్పాను. ఈ మధ్య కాలంలో ప్రజల్లో ఖాదీ పట్ల ఆసక్తి పెరగటం గమనించాను. నేను మిమ్మల్ని స్వభావరీత్యా ఖాదీధారణ అలవరచుకోమని చెప్పలేదు కానీ మీరు వాడే రకరాకల వస్త్రాల్లో ఒక ఖాదీ వస్త్రాన్ని కూడా ఎందుకు కలుపుకోకూడదూ అని అడిగాను. కర్టెన్ గానో, దుప్పటి గానో, కనీసం రుమాలుగానైనా సరే. ఆ తర్వాత యువతలో ఖాదీ పట్ల ఆసక్తి పెరగడాన్ని నేను గమనించాను. ఖాదీ అమ్మకాలు పెరిగాయి. ఆ కారణంగా పేదల ఇళ్ళల్లో వారికి అవసరమైన ఉపాధి లభించింది. అక్టోబర్ రెండు గురించి ఖాదీ అమ్మకాల్లో డిస్కౌంట్ లు ఇవ్వబడతాయి. చాలావరకూ తగ్గింపు లభిస్తుంది. ఈ ఖాదీ ప్రచారాన్ని ఇలానే ముందుకు నడిపించి, పెంచాలని నేను మరోసారి కోరుతున్నాను. ఖాదీ వస్త్రాలని కొని పేదవారి ఇళ్లల్లో దీపావళి దీపాలను వెలిగించండి. ఈ భావనతో మనం పనిచేద్దాం. మన దేశంలోని పేదలకు ఈ పని వల్ల ఒక బలం చేకూరుతుంది. మనం అలా చెయ్యాలి కూడా. ఖాదీ పట్ల ఆసక్తి పెరిగిన కారణంగా, ఖాదీ రంగంలో పనిచేసేవారిలోనూ, భారత ప్రభుత్వం లో ఖాదీతో సంబంధం ఉన్న వారిలోనూ ఒక కొత్త కోణంలో ఆలోచించే ఉత్సాహం కూడా పెరిగింది. కొత్త సాంకేతికత ని ఎలా తేవాలి, ఉత్పాదన శక్తిని ఎలా పెంచాలి , సౌరశక్తితో పనిచేసే చేతి మగ్గాలు ఎలా తేవాలి, 20-20, 25-25, 30-30 ఏళ్ల నుండీ మూసుకుపోయి ఉన్న ప్రాచీన సాంప్రదాయాన్ని ఎలా పునరుధ్ధరించాలి – మొదలైన ఆలోచనలు పెరిగాయి.
ఉత్తర్ ప్రదేశ్ వారణాసి జిల్లాలోని సేవాపురి లో 26 ఏళ్ల నుండీ మూసుకుపోయిన ఖాదీ ఆశ్రమం పునరుధ్ధరించబడింది. అనేకమైన ప్రవృత్తులను జోడించారు. అనేకమందికి ఉపాధి అవకాశాలు ఉత్పన్నమయ్యాయి. కాశ్మీరు లోని పంపోర్ లో మూసుకుపోయిన ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల శిక్షణా కేంద్రాన్ని తిరిగి మొదలుపెట్టారు. ఈ రంగానికి ఇవ్వడానికి కాశ్మీరులో చాలా పని ఉంది. ఇప్పుడీ శిక్షణా కేంద్రం తిరిగి ప్రారంభమైన సందర్భంగా కొత్త తరాల వారికి నిర్మాణంలో, నేయడంలో, కొత్త వస్తువులు చెయ్యటంలో సహాయం లభిస్తుంది. ఈ మధ్యన పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు దీపావళి బహుమతులుగా ఇవ్వడానికి ఖాదీ వస్తువులని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రజలు కూడా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునేప్పుడు ఖాదీ వస్తువులను ఎన్నుకోవడం మొదలుపెట్టారు. కొన్ని వస్తువులు సహజంగా ఎలా ముందుకు వెళ్తాయో మనందరికీ అనుభవంలోకి వచ్చింది.
నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రితం నెలలోని మనసులో మాటలో మనందరమూ ఒక సంకల్పాన్ని చేసుకున్నాం. గాంధీ జయంతికి పదిహేను రోజుల ముందు నుండీ దేశమంతటా పరిశుభ్రతా ఉత్సవాన్ని జరుపుకోవాలని మనం నిర్ణయించుకున్నాం. ప్రజలందరినీ పరిశుభ్రతతో కలుపుకుందామనుకున్నాం. మన గౌరవనీయులైన రాష్ట్రపతి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యావత్ దేశం ఏకమైంది. పిల్లలు-పెద్దలూ, పురుషులు, స్త్రీలు , నగరాల్లో, పల్లెల్లో, ప్రతిఒక్కరూ ఇవాళ పారిశుధ్య ప్రచారంలో భాగస్థులయ్యారు. “సంకల్పంతో సాధించగలం” అని నేను చెప్పినట్లుగా, ఈ పారిశుధ్య ప్రచారం ఏ రకంగా ముందుకు నడుస్తోందో మనం కళ్ల ముందరే చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ ప్రచారాన్ని స్వీకరించి, దీనికి సహకరించి, సఫల పరచడానికి తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఇందువల్ల ఆదరణీయులైన రాష్ట్రపతి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారితో పాటుగా దేశంలోని ప్రతి వర్గం వారు కూడా దీనిని సొంత పనిలా భావిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ ప్రచారంతో జతపడ్డారు. క్రీడారంగంలో వారు, సినీ రంగంలో వారు, విద్యావేత్తలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, రైతులు, కూలీలు, అధికారులు, పోలీసులు, పిల్లలు, జవానులు – ప్రతి ఒక్కరూ దీనితో కలిసిపోయారు. సార్వజనీన ప్రదేశాల్లో ఒక వత్తిడి కనబడుతోంది.. ఈ ప్రదేశాలు చెత్తగా ఉంటే ప్రజలు ఊరుకోరు అన్న అవగాహన కనబడుతోంది. అక్కడ పనిచేసేవారిలో కూడా ఈ వత్తిడి కనబడుతోంది. ఇది చాలా మంచిది. ’పరిశుభ్రతే సేవ’ అనే ప్రచారం మొదలుపెట్టిన నాలుగురోజుల్లోనే డెభ్భై ఐదు లక్షల కంటే అధికంగా ప్రజలు, నలభై వేల కన్నా అధికంగా ప్రజలు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాల్లో భాగమైపోయారు. కొందరైతే పరిణామాలు తప్పక చూపెడతామన్న లక్ష్యంతో నిరంతరం పని చేస్తున్నారు. ఈసారి మరో కొత్త సంగతి కూడా గమనించాం – ఒక పక్క పారిశుధ్య కార్యక్రమాలు చేస్తూ, మరో పక్క చెత్త పారేయకుండా జాగ్రత్త పడుతూండడం. పరిశుభ్రతను ఒక స్వభావంగా మార్చుకోవాలంటే, భావోద్వేగ ఉద్యమం కూడా అవసరమే. ఈసారి “పరిశుభ్రతే సేవ” ద్వారా ఎన్నో పోటీలు జరిగాయి. రెండున్నర వేల కంటే ఎక్కువమంది పిల్లలు ఈ పరిశుభ్రత తాలుకు వ్యాస రచన పోటీల్లో పాల్గొన్నారు. వేల మంది పిల్లలు చిత్రాలు తయారుచేశారు. తమ తమ ఊహలతోనే పరిశుభ్రత గురించిన చిత్రాలు వేసారు. చాలా మంది కవితలు రాసారు. చిన్న చిన్న పిల్లలు నాకు వేసి పంపించిన బొమ్మలను నేను సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంటున్నాను. వారిని మెచ్చుకుంటున్నాను. పారిశుధ్యం మాట వచ్చినప్పుడల్లా మీడియా వారికి ధన్యవాదాలు తెలపడం నేనెప్పుడూ మర్చిపోను. ఈ ప్రచారాన్ని వారు ఎంతో పవిత్రపూర్వకంగా ముందుకు నడిపించారు. వారి వారి పధ్ధతులలో ఈ ప్రచారంతో ముడిపడి, ఒక అనుకూలమైన వాతావరణం తయారుచెయ్యడానికి వారెంతో సహకరించారు. ఇప్పుడు కూడా వారు తమ పధ్ధతులలో పారిశుధ్య ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారు. మన దేశం లోని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, దేశానికి ఎంత సేవ చేస్తున్నారో “పరిశుభ్రతే సేవ” ఉద్యమంలో మనం చూస్తున్నాం. ఈమధ్యన శ్రీనగర్ కు చెందిన బిలాల్ డార్ అనే పధ్ధెనిమిదేళ్ల యువకుడు గురించి ఎవరో నాకు చెప్పారు. శ్రీనగర్ పురపాలక సంఘం “పారిశుధ్యం” కోసం ఈ బిలాల్ డార్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిందని తెలిస్తే మీరు సంతోషపడతారు. బ్రాండ్ అంబాసిడర్ అనగానే అతడు సినీ రంగానికి చెందినవాడేమో, క్రీడా రంగానికి చెందిన హీరో ఏమో అని మీరు అనుకోవచ్చు. కానే కాదు. బిలాల్ డార్ తన పన్నెండు-పదమూడేళ్ళ వయసు నుంచీ, గత ఐదారేళ్ళుగా పరిశుభ్రతపైనే దృష్టి పెట్టాడు. ఆసియాలోనే అతిపెద్దదైన సరస్సు శ్రీనగర్ లో ఉంది కదా. అక్కడ ప్లాస్టిక్, పాలిథీన్, వాడేసిన బాటిల్స్, చెత్తా చెదారం, అన్నింటినీ శుభ్రపరుస్తూ వస్తున్నాడు ఈ కుర్రాడు. వాటితో కాస్తంత ఆదాయం కూడా అతడికి లభిస్తోంది. అతడి తండ్రి చిన్నతనంలోనే కేన్సర్ తో చనిపోతే, తన జీవనానికి సరిపడే జీవనోపాధికి పారిశుధ్యాన్ని కూడా జతపరిచాడీ యువకుడు. బిలాల్ ఏడాదికి పన్నెండు వేల కిలోల కంటే ఎక్కువ చెత్తను శుభ్రపరిచాడని ఒక అంచనా. పారిశుధ్యం పట్ల ఇంతటి శ్రధ్ధ చూపిస్తున్నందుకు, బ్రాండ్ అంబాసిడర్ ఆలోచన చేసినందుకు గానూ శ్రీనగర్ నగరపాలక సంఘాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే శ్రీనగర్ ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతమే కాక భారతదేశంలో ప్రతి ఒక్కరూ వెళ్లాలని కోరుకునే నగరమైన శ్రీనగర్ లో ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమాలు జరగడం చాలా పెద్ద విషయం. బిలాల్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకోవడమే కాక అతడికి పురపాలక సంస్థ వాహనాన్ని ఇచ్చి, యూనిఫారమ్ ని ఇచ్చింది. బిలాల్ ఇతర ప్రాంతాలకు వెళ్ళి ప్రజలు పరిశుభ్రతను పాటించేందుకు తగిన శిక్షణను ఇస్తాడు. ప్రేరణను అందిస్తూ, ప్రజలు కార్యరంగంలోకి దిగే దాకా వారి వెంటనే ఉంటాడు. వయసులో చిన్నవాడైనా పరిశుభ్రత పట్ల ఆసక్తి ఉన్న వారందరికీ ఇతడు ప్రేరణకర్త. బిలాల్ దార్ కి అనేకానేక అభినందనలు అందిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, భవిష్యత్ చరిత్ర, గత చరిత్రలోంచే జన్మిస్తుందని మనం ఒప్పుకోవాలి. చరిత్ర సంగతి వస్తే, మహాపురుషులు గుర్తుకురావడం స్వాభావికమే. ఈ అక్టోబర్ నెల ఎందరో మహాపురుషులను స్మరించుకోవాల్సిన నెల. మహాత్మా గాంధీ మొదలుకొని సర్దార్ పటేల్ వరకూ ఎందరో మహాపురుషులు మన ముందర ఉన్నారు. వారంతా కూడా ఇరవైయ్యవ, ఇరవై ఒకటవ శతాబ్దాల కోసం మనందరికీ దారి చూపారు. నాయకత్వం వహించారు. మార్గదర్శకంగా నిలిచారు. దేశం కోసం వారంతా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అక్టోబర్ రెండవ తేదీన మహాత్మా గాంధీ, లాల బహదూర్ శాస్త్రి గార్ల జయంతి అయితే అక్టోబర్ పదకొండు జయప్రకాశ్ నారాయణ్, నానాజీ దేశ్ ముఖ్ గార్ల జయంతి. సెప్టెంబర్ 25 పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి జయంతి. ఈసారి నానాజీ గారిదీ, పండిట్ దీన్ దయాళ్ గారిదీ శతాబ్ది సంవత్సరం కూడా. ఈ మహాపురుషులందరి కేంద్ర బిందువు ఏమిటో తెలుసా? అందరిలో ఉన్న ఒక సాధారణ విషయం ఏమిటంటే దేశం కోసం బ్రతకడం, దేశం కోసం ఏదైనా చెయ్యడం. కేవలo ఉపదేశాలివ్వడమే కాక తమ జీవితాల ద్వారా నిరూపించి చూపెట్టిన మహానుభావులు వాళ్ళు. గాంధీ గారు, జయప్రకాశ్ గారు, దీన్ దయాళ్ గారూ ఎటువంటి మహాపురుషులంటే వారు జనసందోహాల నుండి మైళ్ల దూరంలో ఉండి కూడా ప్రజాజీవితాలతో పాటుగా క్షణం క్షణం జీవించారు. ’బహుజన హితాయ-బహుజన సుఖాయ’ అన్నట్లుగా ప్రజాహితం కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. నానాజీ దేశ్ ముఖ్ గారు రాజకీయ జీవితాన్ని వదిలేసి, గ్రామోదయం పనిలో నిమగ్నమయ్యారు. ఇవాళ వారి శతజయంతి జరుపుకుంటూంటే వారి గ్రామోదయ కార్యక్రమం పట్ల గౌరవభావం కలగడం స్వాభావికమే.
భారతదేశ మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారు యువకులతో మాట్లాడిన ప్రతిసారీ నానాజీ దేశ్ ముఖ్ గారి గ్రామీణ అభివృధ్ధికి సంబంధించిన విషయాలే చెప్పేవారు. ఎంతో గౌరవంతో ఉదహరిస్తూ ఉండేవారు. వారు స్వయంగా నానాజీ చేపట్టిన కార్యక్రమాలను చూసేందుకు గ్రామాలకు వెళ్ళారు.
మహాత్మా గాంధీ గారి లాగనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు కూడా సమాజంలో చివరి వరుసలో కూర్చున్న వ్యక్తి గురించి మట్లాడేవారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు కూడా సమాజంలో చివరి వరుసలో కూచున్న పేద, పీడిత,వంచిత, దోపిడీకి గురైనవారి జీవితాలలో విద్య ద్వారా, ఉపాధి ద్వారా ఎలా మార్పుని తీసుకురావచ్చో చెప్తూ ఉండేవారు.
ఈ మహాపురుషులందరినీ స్మరించుకోవడం వారికి ఉపకారం చెయ్యడానికి కాదు. ముందుకి నడవడానికి మనకి దారి దొరుకుతుందని. మనం సరైన దిశలో పయనించాలని.
రాబోయే మన్ కీ బాత్ లో నేను తప్పకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్తాను. అక్టోబర్ 31 నాడు దేశం మొత్తం రన్ ఫర్ యూనిటీ – ’ఒక శ్రేష్ఠ భారత దేశం’ కార్యక్రమాన్ని చేపట్టాలి. దేశం లోని ప్రతి నగరంలోనూ, పెద్ద ఎత్తున రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జరగాలి. వాతావరణం కూడా పరిగెత్తాలనిపిచేంత ఆహ్లాదకరంగా ఉంది. సర్దార్ గారంతటి ఉక్కు శక్తిని పొందాలంటే ఇది అవసరం. ఆయన దేశాన్ని ఏకం చేసారు. మనం కూడా ఏకత్వం కోసం పరిగెత్తి, ఏకత్వ మంత్రాన్ని ముందుకు నడిపించాలి.
భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశ ప్రత్యేకత అని సాధారణంగా చెప్తూ ఉంటాము. భిన్నత్వాన్ని మనం గౌరవిస్తాం కానీ మీరెప్పుడైనా ఈ భిన్నత్వాన్ని అనుభూతి చెందే ప్రయత్నం చేసారా? మనం ఒకానొక జాగృతావస్థలో ఉన్నాం అని నేను ప్రతిసారీ చెప్తూ వస్తున్నాను. భారతదేశంలోని వైవిధ్యాలను అనుభూతి చెందండి, వాటిని స్పృశించండి, వాటి పరిమళాన్ని అస్వాదించండి అని ప్రత్యేకంగా మన యువతతో చెప్పాలనుకున్నాను. మీరు చూడండి, మీ వ్యక్తిత్వ వికాసానికి కూడా మన దేశంలోని వైవిధ్యాలు పెద్ద పాఠశాలలుగా మారగలవు. సెలవు రోజులు గడుస్తున్నాయి. దీపావళి దగ్గర పడుతోంది. దేశంలో ఏదో ఒక చోటికి ప్రయాణించి వెళ్ళే ఆలోచనలో అంతా ఉన్నారు. అందరూ పర్యాటకులుగా వెళ్లడం సాధారణమైన విషయమే. కానీ బాధని కలిగించే విషయం ఏమిటంటె, ప్రజలు మన దేశాన్ని చూడరు, దేశం లోని వైవిధ్యాలను చూడరు. తెలుసుకోరు. కానీ తళుకుబెళుకుల మాయలో పడి విదేశీ పర్యటన చేసేందుకు మాత్రం సంసిధ్ధంగా ఉన్నారు. మీరు ప్రపంచాన్ని చూడండి. నాకే అభ్యంతరమూ లేదు. కానీ ఎప్పుడైనా మన ఇంటిని కూడా చూడండి. ఉత్తర భారతదేశంలో వ్యక్తికి దక్షిణ భారత దేశం గురించి ఏం తెలుస్తుంది? పశ్చిమ భారత వ్యక్తికి తూర్పు వైపున ఏముందో ఎలా తెలుస్తుంది? మన దేశం ఎన్నోఈ వైవిధ్యాలతో నిండి ఉంది.
మన మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి మాటల్లో చూస్తే ఒక సంగతి తెలుస్తుంది. మహాత్మా గాంధీ, లోకమాన్య తిలక్, స్వామీ వివేకానంద, మొదలైనవారు భారతదేశ పర్యటన చేసినప్పుడు వారికి భారతదేశాన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికీ, దేశం కోసం పోరాడి, ప్రాణాలర్పించడానికి ఒక కొత్త ప్రేరణ లభించింది. ఈ మహానుభావులందరూ కూడా దేశంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పని మొదలుపెట్టే ముందు,భారతదేశాన్ని తెలుసుకుని, అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. భారతదేశాన్ని తనలో నింపుకుని జీవించే ప్రయత్నం చేసారు. మనం మన దేశం లోని భిన్న భిన్న రాజ్యాలని, వైవిధ్యమైన సమాజాలనీ, సమూహాలనీ, వారి రీతి-రివాజులనీ, వారి సంప్రదాయాన్నీ, వారి వేషభాషలనూ, భోజన అలవాట్లను, వారి ప్రమాణాలను ఒక విద్యార్థిగా నేర్చుకుని, అర్థం చేసుకుని,జీవించే ప్రయత్నం చెయ్యగలమా?
మనం పరిచయస్థుల్లా కాకుండా, ఒక విద్యార్థిగా ఇతరులను తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తేనే పర్యాటనలో వేల్యూ ఎడిషన్ ఉంటుంది. నా స్వీయ అనుభవం ఏమిటంటే నాకు భారతదేశంలోని సుమారు ఐదువందల కన్న ఎక్కువ జిల్లాలకు వెళ్ళే అవకాశం లభించి ఉంటుంది. నాలుగువందల ఏభై కంటే ఎక్కువ జిల్లాల్లో నాకు రాత్రిపూట గడిపే అవకాశం లభించింది. ఇవాళ్టిరోజున భారతదేశంలో నేనింత పెద్ద బాధ్యత వహిస్తున్నానంటే, ఆ ప్రయాణం తాలూకూ అనుభవాలు నాకు చాలా ఉపయోగపడటం వల్లనే. విషయాలను అర్థం చేసుకోవడానికి నాకు చాలా సౌకర్యాలు లభిస్తాయి. “భిన్నత్వం లో ఏకత్వం” అనే కేవలం నినాదం చెప్పడం కాకుండా, ఈ విశాల భారత దేశాన్ని, మన అపారమైన శక్తి భాండాగారాన్నీ మీరంతా అనుభూతి చెందాలని నేను కోరుకుంటున్నాను. “ఒకే భారతం -శ్రేష్ఠ భారతం” కల ఇందులోనే దాగి ఉంది. మన భోజనాది విషయాల్లో ఎంతో వైవిధ్యం ఉంది. జీవితాంతం ప్రతి రోజూ ఒకో కొత్త రకం పదార్థం తింటూ ఉన్నా కూడా పునరావృత్తo అవ్వనన్ని వైవిధ్యాలు మన భోజనాలలో ఉన్నాయి.
ఇదే మన దేశ పర్యాటనలో ఉన్న పెద్ద శక్తి. నా విన్నపం ఏమిటంటే, మీరీ సెలవులలో ఏదో బయటకు వెళ్ళడం కోసమో , మార్పు కోసమో బయల్దేరామని కాకుండా ఏదన్నా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో బయటకు వెళ్లండి. భారతదేశాన్ని మీ లోపల దర్శించుకోండి. ఈ అనుభవాలతో మీ జీవితం సమృధ్ధమవుతుంది. మీ ఆలోచనా పరిథి విశాలమవుతుంది. అనుభవాలకు మించిన పాఠాలేముంటాయి?సాధారణంగా అక్టోబర్ నుండి మార్చి దాకా ఎక్కువగా పర్యాటనకు బావుంటుంది. ప్రజలు అలానే వెళ్తూంటారు. మీరీసారి వెళ్తే గనుక నా ప్రచారాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తారని నాకు నమ్మకం. మీరెక్కడికి వెళ్ళినా మీ అనుభవాలను పంచుకోండి. చిత్రాలను పంచుకోండి.#incredibleindia ( హ్యాష్ టాగ్ incredibleindia) లో మీ ఫోటోని తప్పక పంపించండి. మీరు వెళ్ళిన చోట కలిసిన మనుషుల చిత్రాలను కూడా పంపించండి. కేవలం నిర్మాణాల గురించే కాకుండా, కేవలం ప్రకృతి సౌందర్యాన్నే కాకుండా అక్కడి జనజీవన విధానాల గురించి కూడా రాయండి. మీ ప్రయాణం గురించిన చక్కని వ్యాసాన్ని రాయండి. Mygov లేదాNarendraModiApp కి పంపించండి. మన పర్యాటక శాఖను ప్రోత్సహించడానికి నాకొక ఆలోచన వచ్చింది. మీ రాష్ట్రం లోని ఏడు ఉత్తమమైన పర్యాటక ప్రదేశాలను గురించి రాయండి. ప్రతి భారతీయుడూ మీ రాష్ట్రం లోని ఆ ఏడు ప్రాంతాల గురించీ తెలుసుకోవాలి. వీలైతే వెళ్లాలి. ఈ విషయంలో మీరేదైనా సమాచారాన్ని అందించగలరా? NarendraModiApp లో ఆ సమాచారాన్ని ఇవ్వగలరా? #incredibleindia లో పెట్టగలరా? మీరు చూడండి, ఒకే రాష్ట్రం నుండి అందరూ అందించిన సమాచారం నుండి పరిశీలించి, వాటిల్లో ఎక్కువగా వచ్చిన ఏడు ప్రదేశాలను గురించి ప్రచార సాహిత్యాన్ని తయారుచెయ్యవలసిందిగా ప్రభుత్వానికి నేను చెప్తాను. ఒక రకంగా చెప్పాలంటే, ప్రజల అభిప్రాయాల వల్ల పర్యాటక ప్రదేశాల ప్రచారం జరుగుతుందన్నమాట. ఇలానే దేశం మొత్తంలో మీరు చూసిన ప్రదేశాలలోకెల్లా చూసి తీరాల్సిన ఏడు ప్రదేశాల గురించి, మరెవరైనా చూస్తే చాలా బావుంటుంది, తెలుసుకోవాలి అనిపించే ప్రదేశాల గురించిన వివరాలనుMyGov కీ, NarendraModiApp కీ తప్పకుండా పంపించండి. భారత ప్రభుత్వం వాటిపై తప్పక పనిచేస్తుంది. అటువంటి ఉత్తమ ప్రదేశాలపై చిత్రాల తయారీ, వీడియోలు చేయడం, ప్రచార-సాహిత్యాన్ని తయారు చెయ్యడం, వాటిని ప్రోత్సహించడం ద్వారా మీ నుంచి అందిన, ఎన్నిక కాబడ్డ ప్రదేశాల సమాచారాన్ని ప్రభుత్వం స్వీకరిస్తుంది. రండి, నాతో కలిసి నడవండి. ఈ అక్టోబర్ నెల నుండీ మార్చి నెల వరకూ ఉన్న సమయాన్ని దేశ పర్యాటనలో ఉపయోగించుకుందుకు, ప్రోత్సహించేందుకు మీరు కూడా ఒక పెద్ద ఉత్ప్రేరక సాధకులుగా మారచ్చు. మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, ఒక మనిషిగా ఎన్నో విషయాలు నన్నూ కదుపుతాయి. నా మనసుని ఆందోళనకు గురి చేస్తాయి. నా మనసుపై గాఢమైన ప్రభావాన్ని వదిలివెళ్తాయి. ఎంతైనా నేను కూడా మీలాగే మనిషిని కదా. గత కొద్ది రోజుల్లో జరిగిన ఒక సంఘటన మీ దృష్టికి కూదా వచ్చే ఉంటుంది.. మహిళా శక్తి, దేశ భక్తి ల అనూహ్యమైన ఉదాహరణను మన దేశప్రజలందరమూ చూశాము.
భారత సైన్యానికి లెఫ్టేనెంట్ స్వాతి, నిధి ల రూపాల్లో ఇద్దరు వీర వనితలు లభించారు. వీరు అసామాన్యులు. అసామాన్యులు అని ఎందుకు అంటున్నానంటే భారతమాత కి సేవ చేస్తూ, చేస్తూ వారి భర్తలు స్వర్గస్థులయ్యరు. చిన్న వయసులో సంసారం ఛిన్నాభిన్నమయిపోతే వారి మన:స్థితి ఎలా ఉంటుందో మనం ఊహించగలం. కానీ అమరవీరుడు కర్నల్ సంతోష్ మహాదిక్ భార్య స్వాతి మహాదిక్ ఇటువంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూనే భారత సైన్యంలో చేరాలని నిశ్చయించుకుంది. భారత సైన్యంలో చేరింది. పదకొండు నెలలపాటు ఆమె కఠినమైన పరిశ్రమతో శిక్షణ పొంది, తన భర్త కలలను సాకారం చెయ్యడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. అలానే నిధీ డూబే భర్త ముఖేష్ డూబే కూదా సైన్యంలో పని చేస్తూ, మృత్యుభూమికి మరలిపోయారు. ఆయన భార్య నిధి కూడా సైన్యంలోనే చేరాలని పట్టుబట్టి, చేరింది. ప్రతి భారతీయుడికీ మన ఈ మాతృ శక్తి పట్ల, మన ఈ వీర వనితల పట్ల గౌరవభావం కలగడం స్వాభావికమే. నేను ఈ ఇద్దరు సోదరీమణులకూ హృదయపూర్వకంగా అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు దేశం లోని కోటాదికోట్ల ప్రజలకి కొత్త ప్రేరణనూ, కొత్త ఉత్తేజాన్నీ అందించారు. ఆ ఇద్దరు సోదరీమణులకూ అనేకానేక అభినందనలు.
నా ప్రియమైన దేశప్రజలారా, నవరాత్రి ఉత్సవాలు, దీపావళి పండుగల నడుమ మన దేశ యువతకి ఒక పెద్ద అవకాశం వేచి ఉంది. FIFA under-17 ప్రపంచ కప్ మన దేశంలో జరుగుతోంది. నలువైపులా ఫుట్ బాల్ శబ్దాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయని నా నమ్మకం. ప్రతి తరానికీ ఫుట్ బాల్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. భారతదేశం లోని ఏ పాఠశాలలోనూ, కళాశాల లోనూ ఫుట్ బాల్ ఆట ఆడుతూండే యువకులు లేని గ్రౌండ్ ఉండదు. ప్రపంచమంతా భరతభూమిపై ఆడడానికి తరలివస్తోంది. రండి, మనందరమూ ఆటని మన జీవితాలలో భాగం చేసుకుందాం.
నా ప్రియమైన దేశప్రజలారా, నవరాత్రి పండుగ జరుగుతోంది. దుర్గాదేవి పూజ జరుగుతోంది. వాతావరణమంతా పవిత్రంగా, సుగంధభరితంగా ఉంది. నలువైపులా ఆధ్యాత్మిక వాతావరణం, ఉత్సవ వాతావరణం, భక్తితో నిండిన వాతావరణం ఉంది. ఇదంతా శక్తి సాధన ఉత్సవంగా పరిగణించబడుతుంది. వీటిని శారద నవరాత్రులని కూడా అంటారు. ఇప్పటి నుండీ శరదృతువు ప్రారంభమవుతుంది. పవిత్రమైన నవరాత్రి సందర్భంగా దేశప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. దేశంలోని సామాన్యపౌరుడి జీవితంలోని ఆశలు, ఆకాంక్షలన్నీ తీర్చేందుకు మన దేశం ఉన్నత శిఖరాలను అందుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అన్నిరకాల సవాళ్లనూ ఎదుర్కొనే సామర్థ్యం దేశానికి రావాలని కోరుకుంటున్నాను. దేశం వేగంగా ముందుకు సాగాలనీ, 2022 లో భారతదేశం స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకునేనాటికి, స్వాతంత్ర్యసమరయోధుల కలలన్నీ సాకారం చేసే ప్రయత్నం, 125కోట్ల దేశప్రజల సంకల్పం, అవిరామ కృషి, అవిరామ ప్రయత్నాలు, సంకల్ప సిధ్ధికి తయారుచేసుకున్న ఐదేళ్ల రోడ్ మ్యాప్ పై ప్రయాణానికి అమ్మవారు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఉత్సవాలను జరుపుకోవాలి. ఉత్సాహాన్నీ పెంచుకోవాలి.
అనేకానేక ధన్యవాదాలు.