పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పీఐబీ నుంచి అమాంతం తీసుకోవడం జరిగింది.

వారాణసీ లో ప్రధాన మంత్రి

వారాణసీ లో ప్రధాన మంత్రి

– దీన్ దయాళ్ హస్తకళా సంకుల్ ను దేశ ప్రజలకు అంకితమిచ్చారు

– వారాణసీ మరియు వడోదర ల మధ్య నడిచే మహామనా ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రారంభ సూచక పచ్చజెండాను ఊపారు

– అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించారు

వారాణసీ లో హస్తకళల వర్తక సమన్వయ కేంద్రం ‘దీన్ దయాళ్ హస్తకళా సంకుల్’ ను దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అంకితమిచ్చారు. ఈ కేంద్రానికి 2014 నవంబర్ లో ప్రధాన మంత్రి పునాదిరాయిని వేశారు. ఈ కేంద్రాన్ని ఆయన ఈ రోజు సందర్శించి దీనిని దేశ ప్రజలకు అంకితమివ్వడానికన్నా ముందు, ఇక్కడ అభివృద్ధిపరచిన సదుపాయాలను గురించిన వివరాలను సంబంధిత అధికారులు ఆయన దృష్టికి తీసుకువ‌చ్చారు.

శ్రీ నరేంద్ర మోదీ ఒక వీడియో లింక్ ద్వారా మహామనా ఎక్స్ ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపి, ఆ రైలును ప్రారంభించారు. ఈ రైలు వారాణసీని గుజరాత్ లోని సూరత్ తోను, వడోదర తోను కలుపుతుంది.

నగరంలో వేరు వేరు అభివృద్ధి పథకాలను ప్రజలకు అంకితమివ్వడానికి మరియు వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయడానికి ఉద్దేశించినటువంటి శిలా ఫలకాలను ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. ఉత్కర్ష్ బ్యాంకు యొక్క బ్యాంకింగ్ సేవలను ఆయన ప్రారంభించారు. అలాగే, ఆ బ్యాంకు ప్రధాన కేంద్ర భవన నిర్మాణానికి పునాదిరాయిని కూడా వేశారు.

వారాణసీ ప్రజలకు జల్ అంబులెన్స్ సేవను మరియు జల్ శవ్ వాహన్ సేవను ఒక వీడియో లింక్ సాయంతో ప్రధాన మంత్రి అంకితం చేశారు. నేత కార్మికులకు మరియు వారి పిల్లలకు ఉపకరణాల పెట్టెలను, సౌర దీపాలను ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఒకే వేదిక మీది నుండి ఒకే కార్యక్రమంలో 1000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను అయితే ప్రజలకు అంకితం చేయడమో, లేదా పునాదిరాయి వేయడమో జరిగిందన్నారు.

ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్ వారాణసీ ప్రజలకు సుదీర్ఘ కాలంలో లభించినటువంటి పెద్ద ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టు అంటూ ఆయన అభివర్ణించారు. చేతి వృత్తి కళాకారులకు మరియు నేత కార్మికులకు వారి నైపుణ్యాలను ప్రపంచానికి చాటిచెప్పడంలో ఈ సెంటర్ తోడ్పాటును అందిస్తుందని, తద్వారా వారికి ఒక ప్రకాశవంతమైన భవిష్యత్తును ప్రసాదించడంలో సహాయపడుతుందని ఆయన చెప్పారు. యాత్రికులు అందరూ ఈ కేంద్రాన్ని సందర్శించే విధంగా వారిని ప్రోత్సహించాలని ప్రజలను ఆయన కోరారు. ఇలా చేయడం హస్తకళలకు గిరాకీ ని పెంచడానికి దారి తీయగలదని, అంతేకాక వారాణసీ యొక్క పర్యటక సామర్థ్యాన్ని, నగర ఆర్థిక వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తుందని చెప్పారు.

అన్ని సమస్యలకు అభివృద్ధే పరిష్కారమని ప్రధాన మంత్రి అన్నారు. పేదల మరియు వారి రాబోయే తరాల వారి జీవితాలలో ఒక సకారాత్మకమైనటువంటి పరివర్తనను తీసుకురావడం పైన ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఉత్కర్ష్ బ్యాంక్ కృషిని ఆయన ప్రశంసించారు.

ఈ రోజు ప్రారంభమైన జల్ అంబులెన్స్ మరియు జల్ శవ్ వాహిని సేవలను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ సేవలు జల మార్గాలలో సైతం అభివృద్ధి దూసుకుపోతున్నదనడానికి ప్రతీకలు అని వివరించారు.

మహామనా ఎక్స్ ప్రెస్ రైలు ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, వడోదర మరియు వారాణసీ.. ఈ రెండు నియోజకవర్గాలు 2014 పార్లమెంటరీ ఎన్నికలలో తాను పోటీ చేసిన నియోజకవర్గాలు అని, ప్రస్తుతం ఇవి రైల్వేల వ్యవస్థ ద్వారా ఒకదానితో మరొకటి జతపడ్డాయన్నారు.

దేశం ప్రస్తుతం వేగంగా పురోగమిస్తోందని, దేశ ప్రజల హితం కోసం దృఢ నిర్ణయాలు తీసుకొంటున్నారని ప్రధాన మంత్రి అన్నారు. తూర్పు భారతావని దేశ పశ్చిమ ప్రాంత పురోగతితో తుల తూగాల్సివుందని, ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు ఈ లక్ష్యాన్ని సాధించడంలో దోహదం చేయగలవని ఆయన వివరించారు.