ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్వయంగా నాలుగు సార్లు కలుసుకొనే ప్రత్యేక అవకాశం నాకు దక్కింది. అయితే, ఆ విషయంలోకి వెళ్ళే ముందుగా ప్రధాన మంత్రి కి ఇవే నా జన్మదిన శుభాకాంక్షలు. ఈ దేశం తన అపారమైన సామర్థ్యాన్ని నిరూపించుకొనేటట్లుగా మీరు కృషి చేయాలి గాక. ఎట్టకేలకు మనం చిన్న స్థాయి నుండి ఎదిగినటువంటి, సంపన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి కానటువంటి ఒక ప్రధాన మంత్రి ని చూస్తున్నాము. ఈ కారణంగా ఆయనకు సామాన్య మానవుడి నాడి ఏమిటన్నది తెలుసును.
అంతేకాదు, కఠిన పరిశ్రమ చేయడం కూడా ఆయనకు ఎరుకే. ఆయనతో సన్నిహితంగా పని చేస్తున్న ఒక కేబినెట్ మంత్రి ఒక రోజు ఆయనను గురించి ‘‘ఒక వ్యత్యాసం కలిగిన కర్మ యోగి వంటి వారు ఆయన. అలుపెరగకుండా పని చేయడంతో పాటు ఇతరులను ఎంతో అప్రమత్తంగా ఉంచేటటువంటి వ్యక్తి కూడా’’ అని అభివర్ణించారు. ఫలితాలు మన కళ్ళ ముందు ఉన్నాయి: ఇరుగు పొరుగు దేశాలతో పోలిస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంది. ఉత్తరదాయిత్వంగా అందిన అస్తవ్యస్తత నడుమ ఒక క్రమాన్ని నెలకొల్పడం అంత సులభమైన పని ఏమీ కాదు. సమస్యలు ఉన్నాయనుకోండి; ఏళ్ళ తరబడి ఉపరితలానికి దిగువన రగులుతూ వచ్చిన కొన్ని సమస్యలు ఇప్పుడు ఒక్కసారిగా భళ్ళుమని బద్దలయ్యాయి. ఉదాహరణకు కశ్మీర్ లో హింస, అసహనం తాలూకు చర్చ, గోరక్షణకు సంబంధించిన భయానక అంశాల వంటివి. ఇవి ఇదివరకు చాయ్ వాలా గా పని చేసిన వ్యక్తి ప్రధాన మంత్రి కావడాన్ని జీర్ణించుకోలేని కొంత మంది కులీనులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
సముద్ర మంథనం వంటి పరిణామం ఏదైనా సంభవించినప్పుడల్లా మొట్టమొదట వెలికివచ్చేది హాలాహలం తప్ప, అమృతం ఆ తరువాత బయటపడుతుందన్న సంగతిని నేను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. అమృతం ఎప్పుడు వస్తుందా అని మనం వేచి ఉందాం. అది తప్పక వెలువడుతుందన్న నమ్మకం ఉంది. ఇక ఇప్పుడు, ప్రధాన మంత్రితో నా భేటీల గురించి వివరిస్తాను.
ఒకటో సారి అహమదాబాద్ లో మేం భేటీ అయ్యాం. అప్పట్లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మై ఆటోబయోగ్రఫీ, అప్రెంటిస్డ్ టు ఎ హిమాలయన్ మాస్టర్ అనే పుస్తకం తాలూకు గుజరాతీ అనువాదం ఆవిష్కరణ సందర్భం అది. ప్రధాన మంత్రి పదవికి బిజెపి అభ్యర్థిగా శ్రీ నరేంద్ర మోదీ పేరును ఆధికారికంగా నామ నిర్దేశం చేయబోయే సమయం కూడా. ఆయన ఆ సాయంత్రం పూట ఢిల్లీకి బయలుదేరవలసివుంది. ఈ కారణంగా గాంధీ నగర్ లోని ఆయన నివాసానికి నన్ను ఉదయం పూట ఆహ్వానించారు.
ఆయన స్వయంగా నాకు హృదయపూర్వక స్వాగతం పలికారు. నేను నిజానికి అనామకుడిని అని భావిస్తూ ఉండి, ఆయన చూపిన మర్యాదకు, ఓపికకు చకితుడినయ్యాను. ప్రధాన మంత్రి పదవిని అలంకరించబోయే వ్యక్తి అంత నిరాడంబరంగా కనిపించారు. మత సామరస్య ప్రచారానికి గాను కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ఒక దీర్ఘకాలిక నడకను చేపట్టబోతున్నానని ఆయనకు చెప్పడంతోనే, ఆయన నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. గుజరాత్ లో మాకు సహాయం చేస్తానని చెప్పారు. అప్పటికల్లా ఆయన బహుశా ఢిల్లీలో ఉండే అవకాశం ఉందని నేను గుర్తు చేసిన మీదట, ఆయన చిరునవ్వు నవ్వి మిన్నకుండి పోయారు; ఏ వ్యాఖ్య చేయలేదు.
ఆయన ప్రధాన మంత్రి అయిన తరువాత నెల రోజులకు, మా తదుపరి భేటీ జరిగింది. నేను యుఎస్ఎ కు బయలుదేరుతూ, ఆయనను కలుసుకోవాలని ఉందని చెప్పాను. ఆయనను నేను అభినందించాను. అది కూడా ఒక హృదయ పూర్వకమైనటు వంటి భేటీయే. రేస్ కోర్స్ రోడ్డులోని 7వ నంబరు నివాస భవనంలో ఆయన ఎంతో శాంతంగా కనిపించారు. అక్కడ మేం ఉభయులమే ఉన్నాం; సహచరులు గాని, కార్యదర్శులు గాని లేరు. మా సంభాషణ కొనసాగింది. ఆయన తన బాధ్యతలను గంభీరంగా స్వీకరించడానికి ఆసక్తి కనబరిచారు. మా మూడో భేటీ బెంగళూరులో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని ఏర్పాటైంది. పాదయాత్ర బెంగళూరు గుండా సాగుతోంది.. రాజ్ భవన్ లో నన్ను ఆయన కలుసుకొన్నారు. ఈసారి నా ఆరోగ్యం ఎలా ఉంది ?, నేను నా నడకను ఎలా కొనసాగిస్తున్నాను ? అనే విషయాలు వాకబు చేయడమే కాకుండా నాకు కొన్ని మంచి సలహాలు కూడా ఇచ్చారు. నాలుగో భేటీ మళ్ళీ రేస్ కోర్స్ రోడ్డు లోని 7వ నంబర్ నివాస భవనంలో జరిగింది. పాదయాత్ర ఢిల్లీకి సమీపిస్తున్న తరుణం అది. ఆ వేళ ప్రసార మాధ్యమాలలో అసహనం పై చర్చ రోజూ సాగుతూనే ఉంది. మత సామరస్యం వ్యాప్తి చేయడంలో నాకు విజయం చేకూరాలని ఆయన మరో మారు ఆకాంక్షించారు.
నా ఆరోగ్యం పట్ల ఆందోళనను వ్యక్తం చేశారు. అయితే, పాదయాత్ర గుజరాత్ లో ప్రవేశించిన సమయంలో నన్ను ఎంతగానో కదలించిన ఘటన చోటు చేసుకుంది.. అప్పుడు సమయం ఉదయం ఆరున్నర గంటలు. నాతో మాట్లాడడానికి పిఎమ్ఒ ప్రయత్నిస్తున్నట్లుగా నా సహాయకుడు నా చెవిన వేశారు. నాతో సంభాషించడానికి నేరుగా ప్రధాన మంత్రి లైన్ లోకి వచ్చారని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ‘‘ఆప్ కో గుజరాత్ మే స్వాగత్ హై. సబ్ ఠీక్ హై, ఆప్ కా సేహత్ కైసా హై’’ ( గుజరాత్ లోకి మీకు ఇదే స్వాగతం. అంతా బాగానే ఉంది కదా. మీ ఆరోగ్యం ఎలా ఉంది..?) మన దేశం వంటి విశాలమైన దేశంలో, అనేక బాధ్యతలను నిర్వహించేటటువంటి ప్రధాన మంత్రి ఒక పాదయాత్ర పురోగతిని శ్రద్ధగా గమనిస్తూ ఉండడమూ, అది గుజరాత్ లోకి ప్రవేశించే సమయానికి రాజకీయంగా పెద్దగా ప్రాముఖ్యం లేని నా వంటి మనిషితో మాట్లాడాలన్న ఆలోచనతో ఉండడమూ ఎన్నో విషయాలను చాటి చెబుతుంది. కొంత మంది దుష్ప్రచారం చేయాలనుకున్న ఒక వ్యక్తికి సంబంధించిన మానవీయ పార్శ్వాన్ని గురించి నేను ఈ పలుకులు చెబుతున్నాను.
ఇప్పుడు - ఆయన 66వ పుట్టిన రోజు సందర్భంగాను, ఆయన ప్రభుత్వం మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన తరుణంలోను ఆయనకు అంతా మంచే జరగాలని నేను కోరుకుంటున్నాను. అయితే, నా వైపు నుండి ఒక అభ్యర్థన కూడా లేకపోలేదు. అయ్యా, మీ పుట్టిన రోజు నాడు ఒక మంచి పనిని చేపడతారాండీ, దయచేసి మీరు స్వయంగా నా స్వరాష్ట్రమైన కేరళలోని ఉత్తరాది ప్రాంతంలో వామ, దక్షిణ వర్గాల మధ్య భయానక హింసను పరిష్కరించడం కోసం ఒక సంభాషణకు నాంది పలుకుతారా; అలాగే, కశ్మీర్ లో ఇదే మాదిరి చొరవను తీసుకొంటారా, కేరళకు సంబంధించినంత వరకు నాకు తెలిసి ఉభయ వర్గాలు చర్చకు సముఖంగా ఉన్నాయి.
ఈ ప్రతిష్టంభనను ముగించవలసిన సమయం వచ్చింది. ప్రధాన మంత్రి గారూ, మీరు ఒక్కరు మాత్రమే కె నుండి కె (కేరళ నుండి కశ్మీర్) వరకు ఈ పనిని చేయగలుగుతారు. అయ్యా, మీకు మరో మారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.