Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల మార్గదర్శకాలలో మార్పులకు ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్


భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే దేశాల (ఎల్‌బీసీ) నుంచి వచ్చే పెట్టుబడులకు సంబంధించిన మార్గదర్శకాలలో సవరణలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ప్రస్తుత విధానాన్ని సమీక్షించి ఈ కింది విధంగా సవరించారు:

అ. ‘వాస్తవ యజమాన్యం (బెనిఫీషియల్ ఓనర్- బీఓ)’ నిర్ధారించేందుకు నిర్వచనం, ప్రమాణాలను కొత్తగా చేర్చడం –

మనీ లాండరింగ్ నిరోధక నియమాలు- 2003 (పీఎంఎల్ఏ) ప్రకారం పెట్టుబడిదారుల సంఘం విస్తృతంగా ఉపయోగించే ‘వాస్తవ యాజమాన్యం’ నిర్వచనం, ప్రమాణాలను ఈ సవరణ అందిస్తుంది. 

ఈ వాస్తవ యాజమాన్యం పరీక్షను పెట్టుబడి పెట్టే సంస్థ స్థాయిలో వర్తింపజేస్తారు.

నియంత్రణ అధికారం లేని ఎల్‌బీసీ వాస్తవ యాజమాన్యం 10 శాతం వరకు ఉన్న పెట్టుబడిదారులను సంబంధిత రంగాల పరిమితులు, నిబంధనలకు లోబడి ‘స్వయం చాలిత మార్గం’ కింద అనుమతిస్తారు. అటువంటి పెట్టుబడులకు సంబంధించి పెట్టుబడి పొందే సంస్థ దానికి సంబంధించిన వివరాలను డీపీఐఐటీకి నివేదించాల్సి ఉంటుంది.

ఆ. నిర్దిష్ట రంగాల్లో పెట్టుబడులకు వేగవంతమైన అనుమతులు –

మూలధన వస్తువులు, ఎలక్ట్రానిక్ మూలధన వస్తువులు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, పాలీసిలికాన్, ఇంగాట్-వేఫర్ వంటి తయారీ రంగాలకు సంబంధించి ఎల్‌బీసీ పెట్టుబడి ప్రతిపాదనలను 60 రోజుల్లోపు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. 

క్యాబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలోని కార్యదర్శుల కమిటీ (సీఓఎస్) ఈ నిర్దిష్ట రంగాల జాబితాను అవసరానికి అనుగుణంగా సవరించవచ్చు. 

ఈ సందర్భాల్లో పెట్టుబడి పొందే సంస్థ మెజారిటీ వాటా, నియంత్రణ నివాసితులైన భారతీయ పౌరుడు(లు) లేదా స్థానిక భారతీయ సంస్థ(లు) వద్ద ఉండటమే కాకుండా దీని నియంత్రణ ఎల్లప్పుడూ నివాసిత భారతీయుల వద్దే ఉండాలి.

నేపథ్యం- 

కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతీయ కంపెనీలను అవకాశవాదంగా చేజిక్కించుకోవడం లేదా కొనుగోలు చేయడాన్ని అరికట్టడానికి ప్రభుత్వం 17.04.2020 నాటి ‘ప్రెస్ నోట్ 3 (2020)’ (పీఎన్3) ద్వారా అప్పటి ఎఫ్‌డీఐ విధానాన్ని సవరించింది. పీఎన్3 ప్రకారం భారత్‌తో భూ సరిహద్దును పంచుకునే దేశానికి చెందిన ఏదైనా సంస్థ లేదా భారత్‌లో పెట్టే పెట్టుబడికి ‘వాస్తవ యజమాని’ సంబంధిత దేశంలో ఉన్నా లేదా ఆ దేశ పౌరుడైనా సరే వారు కేవలం ప్రభుత్వ అనుమతి ద్వారా మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. దీనికి అదనంగా భారత్‌లో ఒక సంస్థలో ఇప్పటికే ఉన్న లేదా భవిష్యత్తులో వచ్చే ఎఫ్‌డీఐ ద్వారా యాజమాన్య బదిలీ జరిగినప్పుడు దాని ఫలితంగా ‘వాస్తవ యజమాన్యం’ పైన పేర్కొన్న దేశాల పరిధిలోకి వస్తే దానికి కూడా ప్రభుత్వ ముందస్తు ఆమోదం తప్పనిసరి.

వ్యూహాత్మక ప్రయోజనం లేని, నియంత్రణ అధికారం లేని స్వల్ప వాటాలు కలిగిన ఎల్‌బీసీ పెట్టుబడిదారులకు కూడా పీఎన్3 ఆంక్షలు వర్తింపజేయడం వల్ల ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ వంటి గ్లోబల్ ఫండ్స్ నుంచి వచ్చే పెట్టుబడుల ప్రవాహంపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు గుర్తించారు. 

ప్రయోజనాలు:

ఈ కొత్త మార్గదర్శకాలు భారత్‌లో వ్యాపార నిర్వహణను సులభతరం చేయటంతో పాటు పెట్టుబడుల విషయంలో స్పష్టతనిస్తాయని భావిస్తున్నారు. ఇవి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రవాహాన్ని పెంచడమే కాకుండా సరికొత్త సాంకేతికతలను పొందడానికి, దేశీయ విలువ జోడింపు, భారతీయ కంపెనీల విస్తరణ, ప్రపంచ సరఫరా గొలుసుతో అనుసంధానమవడానికి దోహదపడతాయి. ఇది పెట్టుబడులు, తయారీ రంగానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశంగా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. పెరిగిన ఎఫ్‌డీఐ పెట్టుబడులు దేశీయ మూలధనానికి అదనపు బలాన్ని ఇస్తాయి.. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు మద్దతుగా నిలుస్తాయి.. మొత్తం ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయి.

 

***