Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బీహార్ ప్రభుత్వంలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ప్రధాని అభినందన

బీహార్ ప్రభుత్వంలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ప్రధాని అభినందన


బీహార్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి పట్ల వారి నిబద్ధత బీహార్‌ను సరికొత్త అభివృద్ధి శిఖరాలకు చేరుస్తుందన్న పూర్తి విశ్వాసం తనకుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బలమైన బీహార్, అభివృద్ధి చెందిన భారత్‌లను నిర్మించుకోవాలన్న సంకల్పం సాకారమయ్యేలా అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

పాట్నా పర్యటన సందర్భంగా ఎనలేని ఆప్యాయతను చూపి, ఆశీర్వదించిన బీహార్ ప్రజలకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఘన స్వాగతం తనను ముగ్ధుడిని చేసిందన్న ప్రధానమంత్రి… తనకు మద్దతుగా ఉత్సాహంగా తరలివచ్చిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి, ప్రజా సేవల్లో ప్రభుత్వ నిబద్ధతకు ప్రజల నుంచి లభిస్తున్న బలమైన మద్దతుకు ప్రజల్లో కనిపిస్తున్న ఈ అపూర్వమైన ఉత్సాహమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“బీహార్ ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సహచరులందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు! రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిపై మీకున్న నిబద్ధత మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. రండి.. బలమైన బీహార్‌నుఅభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించాలన్న సంకల్పాన్ని మనమంతా కలిసి సాకారం చేసుకుందాం.”

“బీహార్‌లోని నా పాట్నా కుటుంబీకుల ప్రేమ, ఆశీర్వాదాలకు నేనెంతో ముగ్ధుడినయ్యాను. ఇంతటి ఆత్మీయ స్వాగతాన్ని పలికిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అభివృద్ధి, ప్రజా సేవ పట్ల మా సంకల్పానికి ప్రజల నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని మీ అపూర్వమైన ఉత్సాహాన్ని బట్టి స్పష్టమవుతోంది.” 

***