Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తొలి ప్రపంచ యోగాసన పోటీలకు ప్రధానమంత్రి శ్రీకారం

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తొలి ప్రపంచ యోగాసన పోటీలకు  ప్రధానమంత్రి శ్రీకారం


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించే తొలి ‘ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- “అంతర్జాతీయ క్రీడా చరిత్రలో అహ్మదాబాద్ గడ్డపై నేడొక కొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది” అన్నారు.

ఈ చారిత్రక పోటీలలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులను స్వాగతిస్తూ, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తుండటం తనకెంతో ఆనందాన్నిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. “యునెస్కో ప్రపంచ వారసత్వ నగరాల్లో అహ్మదాబాద్ కూడా ఒకటి. భారత్‌లోని ఇలాంటి చారిత్రక నగరంలో ఈ కార్యక్రమ నిర్వహణ యావద్దేశానికీ గర్వకారణం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్త యోగా వేడుకల సంగమాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- మరో పక్షం రోజుల్లో జూన్ 21న వివిధ దేశాల్లో ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ (ఐడీవై) నిర్వహించనున్న నేపథ్యంలో ప్రధాన కార్యక్రమాన్ని మన దేశంలోని మరొక చారిత్రక నగరం కోల్‌కతాలో నిర్వహిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. “అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు ఆరోగ్యం, శ్రేయస్సును ద్విగుణీకృతం చేస్తూ ‘ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్’ ఇవాళ శ్రీకారం చుట్టుకుంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయంగా యోగాకు ప్రాచుర్యం కల్పించే దిశగా భారత్‌ కృషిని గుర్తుచేస్తూ- ఈ ప్రాచీన భారతీయ సంప్రదాయాన్ని మానవాళి ఆరోగ్యం-సామూహిక శ్రేయస్సుతో అనుసంధానించాలని తలపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ లక్ష్యంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ కోసం ఓ రోజును నిర్ణయించాలని దాదాపు దశాబ్దం కిందట ఐక్యరాజ్య సమితిలో భారత్‌ ఒక ప్రతిపాదనను సమర్పించిందని చెప్పారు. “ఆనాడు 190 దేశాలు మన ప్రతిపాదనకు మద్దతిచ్చాయి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా నేడు యోగాకు ప్రజాదరణ ఇనుమడిస్తుండటంపై హర్షం వ్యక్తం చేస్తూ- ఈనాడు లక్షలాది ప్రజానీకం యోగాను దైనందిన జీవనంలో భాగం చేసుకోవడం ఎంతో ఆనందాన్నిస్తోందని చెప్పారు. ధ్యాన్యం, ప్రాణాయామం జీవనశైలిలో అంతర్భాగంగా మారుతోందని తెలిపారు. ప్రతి సజీవ సంప్రదాయ పరిణామ స్వభావాన్ని స్పష్టం చేస్తూ- సమకాలీన ఔచిత్యంతో యోగా నేడొక పరిణామాత్మక దశలో ప్రవేశించడాన్ని ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్ సూచిస్తున్నదని ఆయన అభివర్ణించారు. యోగాను గుర్తింపు పొందిన స్పర్థాత్మక క్రీడగా నిలపడంలో ఈ పోటీల ప్రాధాన్యాన్ని వివరిస్తూ, భవిష్యత్తులో ఇది అగ్రశ్రేణి ప్రపంచ క్రీడా స్పర్థలలో భాగం కాగలదని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు “ఈ పోటీల ద్వారా యోగాభ్యాసానికి ఒక స్పర్థాత్మక క్రీడగా గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్తులో  ఒలింపిక్‌ క్రీడలు లేదా ఇతర బహుళ క్రీడా పోటీలలో గానీ, అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలలో యోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలదని నా దృఢ విశ్వాసం” అని ఉద్ఘాటించారు.

ఈ క్రమంలో అహ్మదాబాద్ మార్గదర్శక పాత్రను ప్రస్తావిస్తూ- యోగాభ్యాసానికి ప్రపంచ ప్రధాన క్రీడలలో ఒకటిగా గుర్తింపు లభించే దిశగా ఈ తొలి ఛాంపియన్‌షిప్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచంలో వివిధ రంగాలు, వాటిలో అందివస్తున్న అవకాశాలను ఆయన ప్రస్తావించారు. ఇదేవిధంగా యోగా ఒక క్రీడగా ఎదగడం ద్వారా విస్తృత ఆర్థిక, వృత్తిగత ప్రభావం చూపగలదన్నారు. ఈ మేరకు “యోగాసన క్రీడ విస్తరిస్తున్న కొద్దీ  కొత్త అవకాశాలు అందివస్తాయి. తదనుగుణంగా క్రీడాకారులు, శిక్షకులు, క్రీడా శాస్త్రవేత్తలు, పరిశోధకులు సహా ఈవెంట్ మేనేజర్లకూ వృత్తిగత అవకాశాల దిశగా బాటలు వేస్తుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి “ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా”ను ఇతివృత్తంగా నిర్ణయించినట్లు ప్రధానమంత్రి చెప్పారు. సమకాలీన ప్రపంచ ఆరోగ్య సమస్యలు, దీర్ఘాయువును ఆకాంక్షించే ఆధునిక ప్రజానీకానికి యోగా ఎంత ప్రధానమో ఆయన వివరించారు. ఈ మేరకు “నేటి తరం దీర్ఘాయురారోగ్యాలతో, చురుగ్గా జీవించే మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో యోగాభ్యాసం వారికెంతో అనువైనది” శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు.

యోగాతో ఉభయతారక ప్రయోజనాలను ప్రస్తావిస్తూ- నేటి అనేక దుష్ప్రభావాల నుంచి అది మనను విముక్తం చేస్తుందన్నారు. దీంతోపాటు నామమాత్రపు ఖర్చుతో ఆరోగ్యకర జీవనశైలిని కొనసాగించేందుకు ఇంతకన్నా ఉత్తమమైనది మరొకటి లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు యోగా నివారణ శక్తిని యావత్‌ ప్రపంచం గ్రహించే విధంగా ‘నిత్య యోగాభ్యాసం – వ్యాధులన్నీ దూరం’ అనే తారకమంత్రాన్ని గుర్తుంచుకోవాలని శ్రీ మోదీ సూచించారు.

ఈ దార్శనికతను ఉన్నత శిఖరాలకు చేరుస్తూ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ‘యోగా 365’ పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ప్రపంచ యోగాసన పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులంతా ఈ సందేశాన్ని వారి దేశాలకు చేర్చాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. తదనుగుణంగా ఆయా దేశాల్లో ‘యోగా 365’కు రాయబారులుగా వ్యవహరిస్తూ విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. “యోగాపై మీ విశ్వాసం, మీ అనుభవాలతో ప్రపంచాన్ని అనుసంధానించండి” అని ఉద్బోధించారు.

ప్రపంచ యోగాసన పోటీల్లో విజేతలు ఎవరన్నదానితో నిమిత్తం లేకుండా ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వాములైన క్రీడాకారులందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. వారంతా నేటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకోవడం కూడా ఎంతో ప్రాధాన్యం గల అంశమేనని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుల స్ఫూర్తిదాయక శక్తిని ప్రస్తావిస్తూ- వారి ప్రతిభ, క్రమశిక్షణ ప్రపంచవ్యాప్త యువతకు ఎనలేని ఉత్తేజాన్నిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మేరకు ”మీ అంకిత భావం యావత్‌ ప్రపంచ యువతరాన్ని చైతన్యపరుస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

చివరగా- “అహ్మదాబాద్‌ నగరంలో తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్-2026 ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటిస్తున్నాను!” అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

 

***