Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్‌లోని బలోత్రాలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి

రాజస్థాన్‌లోని బలోత్రాలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం,   శంకుస్థాపన కార్యక్రమాల ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజస్థాన్‌లోని బలోత్రాలో సుమారు రూ. 1.06 లక్షల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడాన్ని అభినందిస్తూ… తీవ్రమైన వేసవి ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం ప్రస్తుత ప్రభుత్వానికి లభించిన గొప్ప ఆమోదంగా ప్రధానమంత్రి అభివర్ణించారు.

‘ఎక్స్’ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో కార్యక్రమ ముఖ్యాంశాలను పంచుకుంటూ, శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

జోధ్‌పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది.

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు… ఇది రాజస్థాన్ వ్యాప్తంగా పర్యాటకం, వాణిజ్యం, ఆర్థిక అవకాశాలనూ బలోపేతం చేస్తుంది.

అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన, దేశంలోని ప్రతి ప్రాంతాన్నీ అనుసంధానించాలనే మన నిబద్ధతతో భారత విమానయాన రంగం దూసుకుపోతూనే ఉంది.

పచ్‌పద్రలో ఈ రోజు హెచ్‌పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ పేరుతో సమీకృత రిఫైనరీ–కమ్–పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ప్రారంభించుకున్నాం. ఈ చరిత్రాత్మక ప్రాజెక్టు భారత ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తుంది. ఉపాధినీ కల్పిస్తుంది. ఆర్థిక పరివర్తనను వేగవంతం చేస్తుంది. స్వయం సమృద్ధ భారత్ దిశగా మన ప్రయాణంలో ఇది మరో కీలక ముందడుగు.

రాజస్థాన్‌లోని బలోత్రాలో ఉన్న దేశపు తొలి గ్రీన్‌ఫీల్డ్ సమీకృత రిఫైనరీ–కమ్–పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను సందర్శించే అవకాశం నాకు లభించింది. ఈ అత్యాధునిక రిఫైనరీ మన ఇంధన రంగానికి కొత్త ఊపునిస్తుంది.

నగరాల అనుసంధానాన్ని వేగంగా విస్తరించడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ దిశగా, ఈ రోజు జైపూర్ మెట్రో రెండో దశకు శంకుస్థాపన చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.

ఈ రోజు, రాజస్థాన్‌కు చెందిన సుమారు 54,000 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేయడం నాకు అపారమైన సంతృప్తినిస్తోంది. నేను వారిని అభినందిస్తూ, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

రాజస్థాన్‌లోని బలోత్రాకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నా కుటుంబ సభ్యుల ఉత్సాహం… రాష్ట్రంలో జరుగుతున్న సర్వతోముఖాభివృద్ధి పనుల పట్ల వారు ఎంత సంతోషంగా ఉన్నదీ తెలియజేస్తుంది.

గత దశాబ్ద కాలంగా దేశ ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి మనం అపూర్వమైన ప్రయత్నాలు చేశాం. ఈ ప్రయత్నాల ఫలితంగానే 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని నవ భారత్ సంకల్ప బలం విజయవంతంగా అధిగమించింది.

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తలెత్తిన డీజిల్, పెట్రోల్ సంక్షోభ సమయంలో… రకరకాల వదంతులు, రాజకీయ భయాందోళనలు ప్రచారంలో పెట్టారు. భారత్ తన దౌత్యం, స్నేహం ద్వారా ప్రతి సంక్షోభాన్నీ అధిగమించి, దురుద్దేశపూర్వక బెదిరింపులన్నింటినీ తిప్పికొట్టింది.

యుద్ధకాలంలో రైతులకు తలెత్తిన ఎరువుల సమస్య అయినా… ఎంఎస్ఎంఈలు ఎదుర్కొన్న సవాళ్లు అయినా… వాటిని పరిష్కరించడానికి మేం సకాలంలో, సరైన చర్యలు తీసుకున్నాం. దీని కారణంగానే, వారు ఈ రోజు సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నారు.

మన ప్రభుత్వం ఇతర ఇంధన వనరులపైనా పని చేస్తోంది. రాజస్థాన్‌పై సూర్యుని అనుగ్రహం ఉన్నందున, ప్రపంచ స్థాయి సోలార్ పార్కులు, సౌరశక్తి సంబంధిత ప్రాజెక్టుల అభివృద్ధికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

***