Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని


అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని ఆ దేశ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌‌తో పాటు ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్–అమెరికా భాగస్వామ్యానికి ఉన్న శాశ్వతమైన బలాన్ని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలు కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, ఇరు దేశ ప్రజల అపరిమిత సామర్థ్యాలపై గల నమ్మకం అనే ఉమ్మడి విలువల పునాదిపై ఈ బంధం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

“అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ చారిత్రాత్మక సందర్భంగా 140 కోట్ల మంది భారతీయ ప్రజల తరపున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు అమెరికా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

భారత్, అమెరికాల మధ్య బంధం కేవలం ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలనపై మనకున్న ఉమ్మడి నమ్మకం, మన ప్రజల అపరిమితమైన సామర్థ్యమే మన మైత్రిని ప్రపంచ శ్రేయస్సుకు ఒక బలమైన శక్తిగా నిలిపాయి.

రాబోయే 250 సంవత్సరాలు అమెరికాకు మరింత శ్రేయస్సును, శాంతిని, ప్రగతిని చేకూర్చాలని.. భారత్–అమెరికా భాగస్వామ్యాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.”

 

***