పిఎంఇండియా
‘వికసిత వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్– 2026’లో పాల్గొన్న వారితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వర్చువల్ విధానంలో సంభాషించారు. హిమాచలప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్‌లోని సరిహద్దు గ్రామాలకు చెందిన యువ ‘మైభారత్’ స్వచ్ఛంద కార్యకర్తలు ఈ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, రవాణా, ప్రజా సేవల ద్వారా ఈ గ్రామాల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులతోపాటు.. మహిళల సారధ్యంలో అభివృద్ధి, పర్యాటకం, సామాజిక భాగస్వామ్యం, బలమైన జాతీయ సమగ్రతను చాటేలా ఈ సంభాషణ సాగింది. దేశవ్యాప్తంగా 245 జిల్లాలకు చెందిన 5,000 మందికి పైగా ‘మైభారత్’ స్వచ్ఛంద కార్యకర్తలు వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని పరిచయం చేస్తూ.. దాద్రా – నాగర్ హవేలీ, డామన్ – డయ్యూకు చెందిన ‘మైభారత్’ స్వచ్ఛంద కార్యకర్త శ్రీ దివ్యాంశ్ జోషి మాట్లాడారు. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, వికసిత భారత్ యూత్ పార్లమెంట్, బడ్జెట్ ట్విస్ట్, మార్గనిర్దేశక, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. మైభారత్ కార్యక్రమాల ద్వారా 2.30 కోట్లకు పైగా యువత లబ్ధి పొందారనీ, అలాగే దేశవ్యాప్త క్విజ్ పోటీలో 2.86 లక్షల మంది యువత పాల్గొనగా.. వారిలో 403 మంది స్వచ్ఛంద కార్యకర్తలు సరిహద్దు గ్రామాల సందర్శన కోసం ఎంపికయ్యారనీ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో ఉన్న లియో గ్రామంలో తన సందర్శనను ఆయన గుర్తు చేసుకున్నారు. అక్కడి ప్రజలు, వయోవృద్ధులు, బడి పిల్లలతో తన సంభాషణలనూ, అలాగే స్థానిక యువతకు కెరీర్ కౌన్సెలింగ్, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళా సర్పంచ్ నాయకత్వ పటిమ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పనితీరును ఆయన వివరించారు. భాషా, రాష్ట్ర సరిహద్దులకు అతీతంగా పరస్పర అనుబంధం ఉంటుందని అక్కడి వసతి గృహం (హోమ్ స్టే)లో తనకు స్పష్టంగా అర్థమైందన్నారు. కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద దేశ వీర జవాన్లకు వలంటీర్లు నివాళి అర్పించారనీ, వికసిత భారత్ ఆశయ సాధనకు కట్టుబడి ఉంటూ.. తాము కూడగట్టుకున్న అనుభవాలను ప్రధానమంత్రికి వివరిస్తారని ఆయన చెప్పారు.
మైభారత్ క్విజ్ ద్వారా ఎంపికవడంతో.. మొదటిసారిగా స్వతంత్రంగా ప్రయాణించే అవకాశం తనకు వచ్చిందనీ, కిన్నౌర్ జిల్లా ధర్ చంగో నిచ్లా గ్రామంలో పర్యటించాననీ దాద్రా – నాగర్ హవేలీ, డామన్ – డయ్యూకు చెందిన ‘మైభారత్’ స్వచ్ఛంద కార్యకర్త నికితా ప్రవీణ్ సోలంకి చెప్పారు. గ్రామస్తుల ఆత్మీయ స్వాగతం తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందనీ, మహిళల పట్ల మారుతున్న సామాజిక దృక్పథానికి ఇది అద్దం పడుతోందనీ తెలిపారు. మహిళా సర్పంచ్, పంచాయతీ ప్రతినిధులు, రైతులు, వయోవృద్ధులు, పిల్లలతో ముచ్చటించిన ఆమె.. గ్రామీణ మహిళలు అనేక బాధ్యతలను ఏకకాలంలో భుజాన వేసుకున్న తీరును ప్రత్యక్షంగా చూశారు. గతంలో తాను అనుకున్నట్టు కాకుండా.. అక్కడ నాణ్యమైన రోడ్లు, నిరంతర విద్యుత్తు, తాగునీటి వసతి, డిజిటల్ అనుసంధానాలను గ్రామంలో ఆమె గమనించారు. ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ పథకాల వల్లే ఇవి సాధ్యమయ్యాయని స్థానికులు చెప్పినట్టు ఆమె తెలిపారు. అలాగే పరిశుభ్రత, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొన్నారు. తన స్వస్థలం గురించి ఆ ఊరి పిల్లలు ఎంతో ఉత్సాహంతో అడిగిన విషయాలను గుర్తుచేసుకున్నారు. తనకు ఆతిథ్యమిచ్చిన కుటుంబంతో తాను ఇప్పటికీ మాట్లాడుతూంటానని ఆమె చెప్పారు.
2016లో దీపావళి వేళ చాంగో ప్రాంతంలో తన పర్యటనను ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ దేశపు మహిళల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి సోలంకి ప్రయాణం నిదర్శనమనీ, వ్యక్తిగత ప్రయాణాలతో దేశాన్నంతటినీ ఒకే కుటుంబంగా ‘మైభారత్’ వేదిక మలచిందనీ అన్నారు. ‘‘ఒక్కరిగా ప్రయాణించడమన్నది ఆత్మాన్వేషణకూ, ప్రపంచాన్వేషణకూ మార్గం’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
రాజస్థాన్ జలోర్‌కు చెందిన ‘మైభారత్’ స్వచ్ఛంద కార్యకర్త శ్రీ సునిల్ కుమార్ కేలా మాట్లాడుతూ.. తనది కూడా సరిహద్దు గ్రామమే కావడంతో హిమాచలప్రదేశ్‌లోని ‘ధర్ చంగో ఉప్రేలా’ గ్రామ ప్రజలతో త్వరగానే కలిసిపోయానని చెప్పారు. భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్లో తేడాలున్నప్పటికీ.. ధైర్యం, దేశభక్తి, ఆత్మీయత వంటి అంశాలు ఇరుప్రాంతాల ప్రజలనూ ఒక్క తాటిపై నిలిపాయని ఆయన పేర్కొన్నారు. సట్లేజ్ నది, పాఠశాల, జనఔషధీ కేంద్రం, ఆసుపత్రి, క్రీడా సౌకర్యాలను వీడియో కాల్ ద్వారా చూపిస్తూ.. కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాననీ, అలాగే మైభారత్ గురించి తెలుసుకోవాల్సిందిగా మిత్రులను ప్రోత్సహించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాననీ చెప్పారు. రోడ్లు, వసతి, విద్యుత్తు, మొబైల్ కనెక్టివిటీ గురించి మొదట్లో తనకు కొంత ఆందోళన ఉండేదన్నారు. అయితే హోమ్‌స్టే వరకు ఉన్న నాణ్యమైన రోడ్లు, సౌర విద్యుత్ ఏర్పాట్లు, దైనందిన జీవితాన్ని సులభతరం చేసేలా ఉన్న మెరుగైన మౌలిక సదుపాయాలను చూశాక తన అభిప్రాయాలు పటాపంచలయ్యాయని తెలిపారు. తనకు ఆతిథ్యమిచ్చిన కుటుంబంతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉన్నాననీ, రాజస్థాన్‌ను సందర్శించాల్సిందిగా వారిని ఆహ్వానించాననీ ఆయన చెప్పారు.
రాజస్థాన్, కాశ్మీర్, హిమాచలప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సరిహద్దు గ్రామాల యువత అంతా ఒకే విశాల దృక్పథంతో ఉన్నారనీ, సరిహద్దు గ్రామాల ప్రజలు భౌగోళికంగా దూరంగా ఉన్నప్పటికీ.. భావోద్వేగపరంగా వారికి దేశంతో బలమైన అనుబంధముందనీ ప్రధానమంత్రి అన్నారు. “గతంలో నిరాదరణకు గురైన వీరికి నేడు ప్రథమ ప్రాధాన్యమిస్తున్నాం’’ అని శ్రీ మోదీ చెప్పారు.
విద్యాపరమైన అంశాలే కాకుండా, కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపనే ‘మైభారత్’ దిశగానూ, తద్వారా ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా హర్సిల్ లోయ వైపూ తనను నడిపించిందని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన ‘మైభారత్’ స్వచ్ఛంద కార్యకర్త భవ్యశ్రీ చెప్పారు. తెలియని వాతావరణం, ఆహారం, సంస్కృతి, జీవనశైలి గురించి మొదట్లో కొంత ఆందోళనపడ్డాననీ, అయితే స్థానికులు, అధికారుల ఆతిథ్యంతో ఆ దిగులంతా తొలగిపోయిందనీ అన్నారు. ఇండో–టిబెటన్ సరిహద్దు భద్రతాదళాలతో సంభాషణలు, వారి క్రమశిక్షణ, నిరాడంబరత, అంకితభావం, దేశం పట్ల వారి నిబద్ధత తనలో వారిపట్ల గౌరవాన్ని మరింత పెంచాయన్నారు. వివిధ రాష్ట్రాలు, భాషలు, సంస్కృతులకు చెందిన వలంటీర్లంతా అపరిచితులుగానే అక్కడికి చేరుకున్నప్పటికీ.. ఒకే కుటుంబంగా తిరిగి వెళ్లారని ఆమె అన్నారు. ఇది ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి అద్దం పడుతోందన్నారు. నేలాంగ్, జాదుంగ్ లోయలూ, యాపిల్ తోటల ఫొటోలు తన మిత్రుల్లో ఎంతగానో ఆసక్తిని కలిగించాయనీ, వారిలో చాలామంది ఆ తర్వాత ‘మైభారత్’లో పేర్లు నమోదు చేసుకున్నారనీ తెలిపారు. చలి వాతావరణానికి తట్టుకునేలా వలంటీర్లకు ప్రత్యేక సామగ్రిని అందించారన్నారు. కొండచరియలు విరిగిపడే ముప్పు పొంచి ఉన్నా, ఇబ్బందులు ఎన్ని ఎదురైనాసరే.. సొంత ఊళ్లోనే ఉండాలని నిశ్చయించుకున్న ఓ స్థానికుడి పట్టుదలను ఆమె గుర్తు చేసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఆనందోత్సాహాలతో సాగే జానపద నృత్యరీతులకు భిన్నంగా.. ప్రశాంతంగా, ధ్యానచిత్తాన్ని పోలి ఉండేలా సాగే గర్వాలీ నృత్యాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఉత్తరాఖండ్‌లోని ముఖ్వా గ్రామంలో తన పర్యటనను ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారత యువత దేశానికే ప్రథమ ప్రాధాన్యమిస్తారన్న తన నమ్మకాన్ని ఆ సంభాషణ మరింత బలోపేతం చేసిందని ఆయన అన్నారు. “ఏక్ భారత్, శ్రేష్ఠతా భారత్ స్ఫూర్తిని మీరంతా అందిపుచ్చుకొన్న తీరు.. మరింత మంది యువతకు స్ఫూర్తినిస్తుంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
అండమాన్ – నికోబార్ దీవులకు చెందిన 21 ఏళ్ల ‘మైభారత్’ స్వచ్ఛంద కార్యకర్త సాయంతిక మిస్త్రీ మాట్లాడుతూ.. కోట్లాది మంది యువత దేశ పురోగతిలో భాగస్వాములయ్యేలా ‘మైభారత్’ వేదికను తీర్చిదిద్దిన ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సముద్ర మట్టానికి దాదాపు 17,000 అడుగుల ఎత్తులో ఉన్న లద్దాఖ్‌లోని ‘మాన్’ గ్రామంలో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ… ఆ సమయంలో తాను అనారోగ్యానికి గురయ్యాననీ, ఆ క్లిష్ట పరిస్థితుల్లో ‘మైభారత్’ బృందం, ఐటీబీపీ సిబ్బంది తనను ఎంతగానో ఆదరించారనీ తెలిపారు. ముఖ్యంగా అక్కడి వైద్యులు తమ సిబ్బంది కన్నా ముందే.. ఒక అతిథిగా భావించి తనకు ప్రాధాన్యమిచ్చి వైద్యం అందించినట్లు ఆమె పేర్కొన్నారు. ఐటీబీపీ సిబ్బంది సరిహద్దులను రక్షించడమే కాకుండా, ప్రజా సంక్షేమం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతారన్న విషయం ఈ అనుభవంతో తనకు తెలిసిందనీ, అలాగే అత్యంత ఎత్తైన ప్రాంతాల ప్రాంతాల్లో జీవించడానికి ఎంతటి పట్టుదల అవసరమో కూడా తెలుసుకున్నాననీ చెప్పారు. సరిహద్దు ప్రాంతంలో కనెక్టివిటీ సరిగ్గా ఉండదని ఆమె కుటుంబ సభ్యులు భావించినప్పటికీ.. అందుకు భిన్నంగా అక్కడ మెరుగైన ఇంటర్నెట్, క్యూఆర్ కోడ్, యూపీఐ చెల్లింపు సౌకర్యాలు, వైఫై వంటివన్నీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే స్థానిక పిల్లలతోనూ ముచ్చటించారు. వారిలో ఒకరు అండమాన్, నికోబార్ దీవులను సందర్శించాలన్న కోరికను వ్యక్తపరిచిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. వివాహాలు, మఠాలకు సంబంధించిన వేడుకలను గ్రామస్తులంతా కలిసి నిర్వహించడం, దెబ్బతిన్న మొబైల్ టవర్‌ను పునరుద్ధరించడం, దాని బ్యాటరీల కోసం ప్రత్యేకంగా నిల్వ కేంద్రాన్ని నిర్మించుకోవడం వంటివన్నీ అక్కడి ప్రజల సామాజిక ఐక్యతా స్ఫూర్తిని చాటేలా ఉన్నాయన్నారు.
వ్యాసాల రూపంలో లేదా పుస్తక రూపంలో తన అనుభవాలను నిక్షిప్తం చేయాల్సిందిగా మిస్త్రీకి ప్రధానమంత్రి సూచించారు. దాంతో దేశ విస్తృతినీ, ప్రజలనూ, వారి ఆత్మీయతా ఆత్మీయతా భావననూ మరింత విస్తృతంగా అవగతం చేసుకునే అవకాశం అందరికీ లభిస్తుందన్నారు. ‘‘ఆనందాన్ని పంచుకుంటే, అది రెట్టింపవుతుంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో యువత సూచనలను అందించే అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రికి.. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాకు చెందిన మైభారత్ వలంటీర్ శ్రీ ఆశిష్ సోని కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ప్రస్తుతం సివిల్ సర్వీసుల పరీక్షకు సిద్ధమవుతున్నారు. హిమాచలప్రదేశ్‌లోని స్పితి ప్రాంతంలో ఉన్న కాజా ఖాస్ వద్ద తాను పొందిన అనుభవాలను ఆయన ప్రధానమంత్రికి వివరించారు. దాదాపు 14,000 అడుగుల ఎత్తు నుంచి తాను తల్లిదండ్రులకు వీడియో కాల్ చేశాననీ, అయితే మారుమూల ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ కష్టంగా ఉండే రోజులను గుర్తుచేసుకుంటూ వారెంతో ఆశ్చర్యానుభూతికి లోనయ్యారని చెప్పారు. ఇబ్బందులను ఎదుర్కొన్న తరానికీ, విప్లవాత్మక మార్పులకు సాక్షీభూతంగా నిలుస్తున్న తరానికీ నడుమ వారధిగా మైభారత్‌ను ఆయన అభివర్ణించారు. హిక్కింలో ఉన్న ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలోని పోస్టాఫీసు నుంచి ప్రధానమంత్రికీ, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకూ, రక్షణ మంత్రికీ, జిల్లా మేజిస్ట్రేటుకూ లేఖలు రాసిన రోజులను గుర్తు చేసుకున్నారు. మెట్రోలూ, విమానాశ్రయాలూ మాత్రమే కాదు.. అత్యంత మారుమూల ప్రాంతాల్లోనూ సేవలందించే సంస్థలు కూడా దేశాన్ని అనుసంధానించాయని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు 14,500 అడుగుల ఎత్తులో క్యూఆర్ కోడ్ చెల్లింపులు జరుగుతున్న తీరును ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా ‘డిజిటల్ ఇండియా’ విశ్వసనీయతకు అది నిదర్శనమన్నారు. వసతి గృహాలు (హోమ్ స్టే), డిజిటల్ వేదికలు, సీ బక్‌థార్న్ ఉత్పత్తుల ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్న తీరును.. మహిళా స్వయం సహాయక సంఘాలతో సంభాషణల సందర్భంగా ఆయన తెలుసుకున్నారు. అదే సమయంలో జీవనోపాధిని విస్తరించే దిశగా.. ప్రధానమంత్రి ముద్ర యోజన, దీన్‌దయాళ్ అంత్యోదయ యోజనల అమలుపైనా చర్చించారు. అనుసంధానం, పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరచడంలో సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిన చిచామ్ వంతెన కీలకంగా మారిన తీరును కూడా ఆయన వివరించారు. నైట్ టూరిజానికి ఈ ప్రాంతంలో విస్తృతమైన అవకాశాలున్నాయని తెలిపారు.
సాంకేతికత దేశంలోని ప్రతి మూలకూ చేరుకుందనీ, స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఉపాధి లభిస్తుందనీ, అది జీవనోపాధికి తోడ్పడుతుందనీ, దేశవ్యాప్తంగా ప్రాంతీయ అస్తిత్వం నిలబడుతుందనీ శ్రీ మోదీ పేర్కొన్నారు. ‘‘మీరు ఎక్కడికి వెళ్లినా, మీ ప్రయాణ బడ్జెటులో కనీసం అయిదు శాతాన్ని స్థానిక ప్రజల వద్దే వస్తువుల కొనుగోలుకు ఉపయోగించండి’’ అని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న యువతకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి ఈ సంభాషణను ముగించారు. దేశ సరిహద్దు గ్రామాల పరివర్తన వేగాన్ని యువత ప్రత్యక్షంగా వీక్షించేందుకూ, కాలం చెల్లిన అపోహలను తొలగించడంలోనూ.. అలాగే దేశ సాంస్కృతిక వైవిధ్యం, పురోగతి, సామాజిక భాగస్వామ్యం, ఏక్ భారత్ – శ్రేష్ఠతా భారత్ స్ఫూర్తి పట్ల వారి అవగాహనను మరింత విస్తృతం చేయడంలోనూ ‘మైభారత్’ పాత్రను స్పష్టంగా చాటేలా ఈ కార్యక్రమం కొనసాగింది.
***
Interacting with the participants of the Viksit Vibrant Village Programme. Great to see that the initiative is instilling a deeper sense of nation-building among the youth.#Youth4ViksitBharat #MYBharat https://t.co/2vCFle03vY
— Narendra Modi (@narendramodi) July 26, 2026
विकसित गांव, विकसित भारत की भी आधारशिला है: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 26, 2026
हमारी सरकार ने, सीमावर्ती गांवों को... देश का प्रथम गांव माना: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 26, 2026
विकसित Vibrant Village की ये यात्रा... सबको जोड़ने, सबसे जुड़ने का ही एक माध्यम है: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 26, 2026