పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ ‘సముద్ర మంథన్– జాతీయ సముద్రాంతర అన్వేషణ’ పథకానికి ఆమోదముద్ర వేసింది. పెట్రోలియం–సహజ వాయువుల మంత్రిత్వశాఖ పరిధిలో మొత్తం రూ.84,084 కోట్లతో 2030-31 వరకు ఈ కేంద్ర రంగ పథకం అమలవుతుంది.
భారత అపార సముద్ర గర్భ ఇంధన సామర్థ్య సద్వినియోగం కోసం 2025లో స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట పైనుంచి ప్రధానమంత్రి ప్రకటించిన ఆధునిక సముద్రాన్వేషణ దృక్కోణానికి ఈ పథకం ఒక ప్రతీక. దేశ ఇంధన భద్రత బలోపేతం, దేశీయ అన్వేషణ–ఉత్పత్తి పెంపు, సాంకేతిక ముందంజకు ప్రోత్సాహం, వికసిత భారత్ సంకల్పం దిశగా ప్రస్థానంలో ఇదొక కీలక మలుపు.
సముద్రాంతర్భాగంలో అన్వేషణ విలువ వ్యవస్థ మొత్తం ఈ పథకం పరిధిలో సమగ్ర కార్యకలాపాలు చేపడతారు. ఇందులో భాగంగా అధిక–నాణ్యత గల భూకంప సమాచార విస్తృత సేకరణ–పరిశీలన–విశ్లేషణ చేస్తారు. అలాగే, లోతైన–అత్యంత లోతైన జలాల్లో అన్వేషణాత్మక తవ్వకాన్ని ముమ్మరం చేయడం సహా కొత్త బేసిన్లలో శాస్త్రీయ డ్రిల్లింగ్, ఉమ్మడి సముద్రాంతర ఉత్పాదన–తరలింపు మౌలిక సదుపాయాల కల్పన, సమీకృత చమురు–గ్యాస్ తయారీ, సేవల మండలి ఏర్పాటు వంటి వాటికీ ఈ పథకం వీలు కల్పిస్తుంది. దేశంలో సముద్రాంతర అన్వేషణ–ఉత్పత్తిని ముమ్మరం చేయగల సమీకృత వ్యవస్థ సృష్టి, డిజిటల్ ప్రోగ్రామ్ నిర్వహణ, సామర్థ్య వికాసం, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ, వాటాదారుల భాగస్వామ్యం సహా అంతర్జాతీయంగా విస్తరణ దిశగానూ ఇందులో ప్రత్యేక వెసులుబాట్లు ఉన్నాయి.
ఈ పథకం 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురుకు సమానమైన నిల్వల పెరుగుదలకు దోహదం చేస్తుందని, సముద్రాంతర్భాగంలో అన్వేషణ కార్యకలాపాలను గణనీయంగా పెంచుతుందని, దేశీయ చమురు–గ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని, పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తుందని అంచనా. అంతేకాకుండా మేక్ ఇన్ ఇండియా, స్వయంసమృద్ధ భారత్ కింద దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు సముద్రాంతర సాంకేతికతలు–సేవల రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల వ్యవస్థ రూపకల్పనకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. అన్వేషణ–ఉత్పత్తి విలువ శ్రేణి అంతటా గణనీయ పెట్టుబడులను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక, ఆవిష్కరణ, ఆర్థిక వృద్ధికి దీర్ఘకాలిక అవకాశాలను సృష్టించగలదని ఆశిస్తున్నారు.
అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరీకరణ వైపు భారత్ వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో సముద్ర మంథన్ ఒక పరిణామాత్మక జాతీయ కార్యక్రమంగా నిలుస్తుంది. దేశంలోని సముద్రతీర ఇంధన వనరుల వెలికితీత, దీర్ఘకాలిక ఇంధన భద్రత బలోపేతం, సాంకేతిక సామర్థ్యాల పెంపు, ఆర్థిక వ్యవస్థతోపాటు భావితరాలకు శాశ్వత విలువ సృష్టి తదితరాలకు దోహదం చేయగలదు.
మొత్తం మీద గడచిన దశాబ్దంలో ప్రభుత్వం అప్‌స్ట్రీమ్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చింది. ఇందులో భాగంగా దాదాపు మొత్తం ఆఫ్‌షోర్ ప్రాంత అన్వేషణకు అనుమతించింది. శాసన–ఒప్పంద చట్రం ఆధునికీకరణ, జాతీయ డేటా భాండాగార బలోపేతం వంటివి అమలు చేసింది. ఈ సంస్కరణలు ప్రాతిపదికగా వ్యూహాత్మక ప్రభుత్వ పెట్టుబడి, అత్యాధునిక సాంకేతికతలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల ద్వారా ఆఫ్‌షోర్ అన్వేషణను ముమ్మరం చేయడంలో సముద్ర మంథన్ పథకం నవ శకానికి నాంది పలకనుంది.
***
The Cabinet’s approval of ‘Samudra Manthan’ marks a transformative leap towards strengthening India’s energy security and unlocking our vast offshore potential.
— Narendra Modi (@narendramodi) July 31, 2026
By combining investment, cutting-edge technology, skilled human capital and modern infrastructure, Samudra Manthan…