పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ‘ఇండియన్ ఫారిన్ సర్వీస్’ (ఐఎఫ్ఎస్)-2025 బ్యాచ్ ఆఫీసర్ ట్రైనీలు ఈ రోజు ఉదయం సేవా తీర్థ్‌లో సమావేశమయ్యారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ‘ఐఎఫ్ఎస్’కు ఎంపికైన 50 మంది ఆఫీసర్ ట్రైనీలు ఈ బృందంలో ఉన్నారు.
ఈ సందర్భంగా యువ దౌత్యవేత్తలనుద్దేశించి మాట్లాడుతూ- విదేశాల్లో నియామకం తర్వాత క్షేత్రస్థాయిలో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా స్థానిక సమాజాలతో భారత్ స్నేహబంధాన్ని మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. భారత రాయబార కార్యాలయాలు కేవలం ప్రభుత్వాలు, సంస్థలతోనే కాకుండా సామాజిక స్థాయిలో ప్రజలతోనూ అర్థవంతమైన సంబంధాలు నెరపాలని ఆయన స్పష్టం చేశారు. సంప్రదాయ దౌత్య వర్గాలకు అతీతంగా నెట్వర్క్ విస్తరణకు యత్నించాలని, ముఖ్యంగా ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకోవాలని కోరారు. భారత అంతర్జాతీయ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా దేశ నాగరికతా బలాన్ని సాంకేతికత, ఆవిష్కరణలు, సమర్థ సమాచార ఆదానప్రదానంతో మేళవించాలని ప్రధానమంత్రి సలహా ఇచ్చారు.
ప్రపంచ దేశాలతో భారత్ ఆర్థిక సంబంధాలను మరింత ఉత్తేజితం చేయాలని, ఆయన ఆఫీసర్ ట్రైనీలకు పిలుపునిచ్చారు. భారత రాయబార కార్యాలయాల డిజిటల్ ఉనికిని పటిష్ఠం చేయాల్సిన ప్రాముఖ్యాన్ని ప్రస్ఫుటం చేశారు. ప్రజలు ఏదైనా వ్యవస్థతో సంబంధాలు నెరపాలంటే సాధారణంగా ఒక వెబ్సైట్ వంటి మొదటి మాధ్యమంగా ఉంటుందని పేర్కొన్నారు. తదనుగుణంగా కాన్సులర్, తదితర సేవలను మరింత నిరాటంకంగా, వేగంగా, పౌర-కేంద్రకంగా అందింగలిగేలా సాంకేతికత వినియోగం పెంచాలని పిలుపునిచ్చారు.
భారత నాగరికత, సాంస్కృతిక-భౌగోళిక ప్రాశస్త్యానికి విస్తృత ప్రాచుర్యం ద్వారా మన దేశాన్ని మరింత ఆకర్షణీయ ప్రపంచ పర్యాటక గమ్యంగా మార్చడానికి కృషి చేయాలని ప్రధానమంత్రి కోరారు. ప్రపంచ యువతరంలో భారత్‌పై ఆసక్తిని రగిలించడంలో భాగంగా “భారత్ గురించి తెలుసుకోండి” (భారత్ కో జానియే) క్విజ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటువంటి కార్యక్రమాలను మరింత ఆకర్షణీయంగా రూపొందించంలో కృత్రిమ మేధ (ఏఐ), గేమింగ్‌లను ఉపకరణాలు వాడుకోవాలని చెప్పారు.
ప్రధానమంత్రితో మాటామంతీలో భాగంగా తమ శిక్షణ విశేషాలతో పాటు భారత్ దర్శన్ అనుభవాలను ఆఫీసర్ ట్రైనీలు ఆయనతో పంచుకున్నారు. ప్రపంచంతో భారత నాగరికత, సాంస్కృతిక బంధాన్ని అర్థం చేసుకోవడంలోని ప్రాధాన్యం గురించి కూడా వారు ప్రస్తావించారు.
***
Interacted with the Officer Trainees of the 2025 Batch of the Indian Foreign Service.
— Narendra Modi (@narendramodi) August 24, 2026
Called upon our young diplomats to:
Take diplomacy beyond traditional diplomatic circles and engage meaningfully with local communities and the diaspora.
Become catalysts for India’s economic… pic.twitter.com/g24XJ4iOxf