పిఎంఇండియా
క్రియాశీలక పాలన, సకాలంలో అమలు లక్ష్యంగా గల, ఐసీటీ ఆధారిత బహుళ-విధాన వేదిక ప్రగతి 53వ సమావేశం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు ఉదయం సేవా తీర్థ్ వేదికగా జరిగింది.
రైల్వేలు, రహదారులు, విద్యుత్ రంగాలకు సంబంధించి తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఆరు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఈ సమావేశంలో ప్రధానమంత్రి సమీక్షించారు. వీటి మొత్తం వ్యయం రూ.30,000 కోట్లకు పైగా ఉంది. అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి, పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలకు మద్దతునివ్వడానికి, ప్రజా సేవలను మెరుగుపరచడానికి కీలకమైన ఈ ప్రాజెక్టులను… కాలపరిమితులకు కట్టుబడి ఉండటం, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం, వేగంగా పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ప్రధానమంత్రి సమీక్షించారు.
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జాప్యం వల్ల వ్యయంలో పెరుగుదల మాత్రమే కాకుండా… పౌరులు, వ్యాపార, ఆర్థిక వ్యవస్థకు అందాల్సిన ప్రయోజనాలూ ఆలస్యమవుతాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను విడివిడి విభాగాలుగా, భాగాలుగా, ప్యాకేజీలుగా కాకుండా… ఒక సమగ్రమైన భాగంగా పరిగణిస్తూ పర్యవేక్షించాలని ఆయన అన్నారు. ఒక్కో ప్యాకేజీలో సాధించిన పురోగతి… అంతిమంగా మొత్తం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి, కార్యాచరణలోకి తీసుకురావడానికి దోహదపడాలని ఆయన పేర్కొన్నారు. దీని కోసం మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు సమగ్రమైన విధానాన్ని అవలంబించాలని సూచించారు. ప్రాజెక్టుల ప్రారంభాన్ని, ప్రయోజనాల పంపిణీని ఆలస్యం చేయగల కీలక లోపాలను పరిష్కరించాలని ఆయన కోరారు. ప్రాజెక్టు అమలులోని ప్రతి స్థాయిలో మరింత యాజమాన్య భావాన్ని పెంపొందిస్తూ… మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల్లో చురుకైన పని సంస్కృతిని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రధాన రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రణాళిక సమయంలో… సాధ్యమైన చోటల్లా మౌలిక సదుపాయాల సేవల కోసం ఉమ్మడి వినియోగ కారిడార్లను అన్వేషించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. అటువంటి సమీకృత విధానాల సాంకేతిక, ఆర్థిక సాధ్యతను దృష్టిలో ఉంచుకుని… ప్రణాళిక దశలోనే వాటిని పరిశీలించాలని ఆయన మంత్రిత్వ శాఖలకు, రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.
పనుల అమలులో వేగంతో పాటు నాణ్యత విషయంలోనూ రాజీ పడకూడదని ప్రధానమంత్రి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ… ప్రతి దశలోనూ నాణ్యత హామీ, పర్యవేక్షణను బలోపేతం చేయాలని ఆయన మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, అమలు చేసే సంస్థలకు పిలుపునిచ్చారు.
డిజిటల్ వ్యవసాయ మిషన్ కింద అగ్రిస్టాక్ సంబంధిత సమీక్షలో… వ్యవసాయ డేటా నుంచి మరింత విలువను రాబట్టడానికి కృత్రిమ మేధ సహా సరికొత్త డిజిటల్ టెక్నాలజీలను వినియోగించుకోవాల్సిన అవసరాన్నీ ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇన్‌పుట్ ప్రణాళిక నుంచి ప్రాసెసింగ్ వరకు, వ్యవసాయ సంబంధిత వాణిజ్య కార్యకలాపాలన్నింటిలో డేటా వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. తద్వారా మరింత సమాచారంతో కూడిన కార్యాచరణకు, మెరుగైన లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుందని ఆయన ఉద్ఘాటించారు. అగ్రిస్టాక్ వ్యవస్థను నిర్మించడంలో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రైతులకు మెరుగైన ఫలితాలను అందించడానికి దీని వినియోగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
డిజిటల్ అరెస్టుల వంటి ఘటనలు సహా సైబర్ మోసాల కేసుల సమీక్ష సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ… శిక్షణ, అవగాహన, సంబంధిత విద్యపై నిరంతర దృష్టితో నివారణను బలోపేతం చేయాలన్నారు. సాధారణంగా మోసం చేయడం కోసం ఉపయోగించే పద్ధతులు, హెచ్చరిక సంకేతాలు, సురక్షిత డిజిటల్ పద్ధతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, యువత, ఇతర బలహీన వర్గాల కోసం నిరంతర, సముచిత ప్రజావగాహన ప్రచారాల ఆవశ్యకతనూ ఆయన స్పష్టం చేశారు. సైబర్ మోసాల విషయంలో కొత్త పద్ధతులను గుర్తించి, వాటిపై త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు… ఇందులో పాలుపంచుకుంటున్న సిబ్బంది సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం ఎప్పటికప్పుడు వారికి శిక్షణ అందించాలనీ ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
***
Rs. 30,000 crore worth of projects across 9 states covering railways, roads and power sectors…this is what we reviewed during today’s PRAGATI session.
— Narendra Modi (@narendramodi) August 25, 2026
Focus areas remain - better connectivity, higher growth, better public services and lesser delays.
Here are the details……