పిఎంఇండియా
ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్ల సుదీర్ఘ నాయకత్వాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ కేంద్ర మంత్రివర్గం నేడు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇది కేవలం అభినందన మాత్రమే కాదు.. ‘దేశమే ప్రథమం, పౌరుడే ప్రథమం’ అనే సూత్రంతో ముందుకు సాగుతున్న ప్రధాని శ్రీ మోదీ అసాధారణ ప్రస్థానాన్ని వేడుకగా జరుపుకుంటుంది. గుజరాత్లో మూడు వరుస ఎన్నికల్లో సాధించిన అఖండమైన మెజారిటీలు, వరుసగా జరిగిన మూడు లోక్‌సభ ఎన్నికల్లో లభించిన మద్దతు.. ప్రధానమంత్రి శ్రీ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన అందించిన నాయకత్వం నుంచి భారత ప్రధానమంత్రిగా నాయకత్వం వరకు కొనసాగుతున్న ఈ నిరంతర ప్రయాణాన్ని కింద పేర్కొన్న పది ముఖ్యమైన అంశాలు వివరిస్తున్నాయి.
1. గుజరాత్ నుంచి భారత్ వరకు విస్తరిస్తోన్న అభివృద్ధి దార్శనికత
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్లో విజయవంతమైన కార్యక్రమాలను జాతీయ స్థాయికి ఎలా తీసుకెళ్లారో కేంద్ర మంత్రివర్గ తీర్మానం వివరిస్తోంది. ప్రజల సమస్యలను స్వయంగా విని పరిష్కరించేందుకు ఆయన ప్రారంభించిన స్వాగత్ కార్యక్రమానికి 2010లో ఐక్యరాజ్యసమితి ప్రజా సేవా పురస్కారం లభించింది. ఆ తర్వాత నిలిచిపోయిన ప్రాజెక్టులను సమీక్షించడం, ఎదురవుతున్న అడ్డంకులను పరిష్కరించడం, పనులను వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వాలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన ప్రగతి కార్యక్రమానికి స్పూర్తిగా నిలిచింది. జ్యోతిగ్రామ్ పథకం కింద వ్యవసాయానికి ప్రత్యేక విద్యుత్ ఫీడర్లను ఏర్పాటు చేసిన గుజరాత్ విధానం కూడా జాతీయ స్థాయిలో అనుసరించదగిన విధానంగా మారింది. గుజరాత్లో అమలు చేసిన అనుభవాలను దేశవ్యాప్తంగా విస్తరించారు.
2.. పేదల పట్ల సానుభూతి, భారీ స్థాయిలో గౌరవప్రదమైన జీవితం
చిన్నతనంలో తన తల్లి ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులు, దేశవ్యాప్తంగా పర్యటన సమయంలో పేదరికాన్ని స్వయంగా చూడటం వల్ల ప్రధానమంత్రి శ్రీ మోదీకి పేదల పట్ల ఆవేదన, స్పందన పెరిగింది. ఈ వ్యక్తిగత అనుభవాలే ఇళ్లు, తాగునీరు, బ్యాంకింగ్, వైద్య సేవలను అందించే సంక్షేమ పథకాలుగా మారాయని ఈ తీర్మానం పేర్కొంది. దాదాపు 60 కోట్ల జన్ ధన్ ఖాతాలు, 4 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం, 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడటం వంటి అంశాలు.. వ్యక్తిగతంగా పేదల పరిస్థితిని అర్థం చేసుకోవడం, ప్రభుత్వ స్థాయిలో చర్యలుగా మారిన తీరును చూపిస్తున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా కుటుంబాలకు మరింత గౌరవప్రదమైన జీవితం అందుతోంది.
3.. సమాజంలో అన్ని వర్గాలకూ సాధికారత
ప్రజలు తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకునేలా సహాయం చేయాలనే ప్రధాని శ్రీ మోదీ సంకల్పం ఈ తీర్మానం ప్రధానంగా కనిపిస్తుంది. దాదాపు 3.5 కోట్ల మంది మహిళలు ‘లఖ్పతి దీదీలుగా మారగా.. ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ ద్వారా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్‌ను కల్పించారు. అంకుర సంస్థలు, నైపుణ్యాభివృద్ధి, విద్య రంగంలో చేపట్టిన సంస్కరణలు యువతకు అవకాశాలను విస్తరించాయి. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి రూ. 4 లక్షల కోట్ల కంటే ఎక్కువ నగదు బదిలీ జరిగింది. అలాగే పీఎం-జన్మన్ పథకం ద్వారా అత్యంత వెనుకబడిన గిరిజన తెగలకు ప్రత్యేకంగా సహాయం అందిస్తున్నారు. ఈ విధంగా గతంలో నిర్లక్ష్యానికి గురై, అభివృద్ధికి దూరంగా ఉన్న వర్గాలకు కూడా సంక్షేమాన్ని చేరవేశారు.
4.. సంస్కరణల పట్ల అచంచలమైన నిబద్ధత
రాజకీయ ఇబ్బందులు ఉన్నప్పటికీ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చూపిన ధైర్యాన్ని ఈ తీర్మానం ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. జీఎస్టీ తెచ్చిన మార్పులు, సంక్షేమ పథకాల పంపిణీలో చేపట్టిన సంస్కరణలు, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకురావడం వంటి నిర్ణయాలు దీర్ఘకాలికంగా ఉన్న సవాళ్లను పరిష్కరించడంలో ఆయనకున్న పట్టుదలను స్పష్టం చేస్తున్నాయి. పారిశుధ్యం, డిజిటల్ చెల్లింపులు, స్థానిక ఉత్పత్తుల వాడకంపై ఆయన చేసిన విజ్ఞప్తులు పౌరులను మార్పు వైపు ఆకర్షించాయి. దృఢ సంకల్పం, ప్రజా భాగస్వామ్యం. జాతీయ లక్ష్యాలతో కూడిన ఆయన నాయకత్వంలో సంస్కరణలు అనేది ఒక నిరంతరం నిబద్ధత కలిగిన ప్రక్రియగా మారాయి.
5.. ఆత్మనిర్భర భారత్ దిశగా బలమైన పునాది
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వ మూలధన వ్యయం రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్లకు పైగా పెరిగింది. అలాగే జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే విద్యుదీకరణ కూడా వేగవంతమయ్యాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 13 లక్షల కోట్లకు పైగా పెరిగింది. రక్షణ రంగ ఉత్పత్తులు, సెమీండక్టర్ల తయారీ రంగాల్లో సాధించిన పురోగతి వంటివి దేశీయ అవసరాలను భారత్ స్వయంగా తీర్చుకోగల సామర్థ్యాన్ని బలోపేతం చేయాలన్న ప్రధాని శ్రీ మోదీ సంకల్పాన్ని ప్రతిబింబిస్తాయి.
6.. సాంకేతికతతో ప్రజలకు సేవలు, జాతీయ లక్ష్యాల విస్తరణ
రోజువారీ సేవల నుంచి అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక రంగాల వరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సాంకేతికపై ఉన్న విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. జన్ ధన్, ఆధార్, మొబైల్ అనుసంధానం సంక్షేమ పథకాల పంపిణీని మెరుగుపరిచాయి. డిజిటల్ చెల్లింపుల రంగంలో యూపీఐ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. భారత్ సొంతంగా కోవిడ్ వ్యాక్సిన్లను తయారు చేయడం, చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3ని విజయవంతంగా దింపడం వంటివి శాస్త్రీయంగా సామర్థ్యం కలిగిన, ఆత్మనిర్భర్ భారత్ దృక్పథానికి నిదర్శనాలు. అంతరిక్ష రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యం, కృత్రిమ మేధ, క్వాంటం సాంకేతికత, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో సాధిస్తున్న పురోగతి సైతం ఇదే దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. సాంకేతికత ప్రజల జీవితాలను మెరుగుపరుస్తూనే జాతీయ అవకాశాలను విస్తరింపజేస్తుంది.
7.. సంక్షోభ సమయాల్లోనూ స్థిరమైన నాయకత్వం
ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు, అనిశ్చితి పరిస్థితులు నెలకున్న సమయాల్లోనూ భారత్‌ను సరైన దిశలో ముందుకు నడిపించడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చూపిన నాయకత్వ సామర్థ్యాన్ని తీర్మానం ప్రస్తావించింది. కోవిడ్ సమయంలో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావంతోపాటు స్వదేశీ వ్యాక్సిన్ల తయారీకి ప్రోత్సాహం అందించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా వేగంగా చేపట్టారు. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, ఇంధన భద్రతా చర్యలు భారత్‌పై ఎటువంటి తీవ్ర ప్రభావం పడకుండా కాపాడాయి. తక్షణ చర్యలతోపాటు, సంవత్సరాలుగా నిర్మించుకున్న వ్యూహాత్మక సామర్థ్యాలను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా కష్టకాలంలో దేశానికి తిరుగులేని స్థిరత్వాన్ని , ఆత్మవిశ్వాసాన్ని అందించింది.
8.. శాంతి, భద్రతను పెంపొందించేలా నిర్ణయాత్మక నాయకత్వం
2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ వైమానిక దాడులు, 2025 ఆపరేషన్ సిందూర్ … దేశ భద్రత విషయంలో ప్రధాని శ్రీ మోదీ నాయకత్వంలో భారత్ అనుసరిస్తున్న స్పష్టమైన వైఖరిని తెలియజేస్తాయని తీర్మానం పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవి ఏర్పాటు వంటి నిర్ణయాలను కూడా తీర్మానం ప్రస్తావించింది. మావోయిస్టు ఉగ్రవాదంపై కఠిన చర్యలు, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి కోసం చేపట్టిన ప్రయత్నాలు కూడా జాతీయ సంకల్పంతో పాటు అభివృద్ధి, స్థిరత్వం, ప్రజల విశ్వాసానికి ప్రాధాన్యం ఇచ్చే నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది.
9. ప్రపంచ వేదికపై బలపడుతోన్న భారత్ స్వరం
ప్రపంచ వేదికపై భారత్ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో దేశాల మధ్య విభేదాలను అధిగమించి సహకారాన్ని పెంపొందించడంలో ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వాన్ని తీర్మానం ప్రస్తావించింది. జీ20, బ్రిక్స్ వేదికలపై ఏకాభిప్రాయం, అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున భారత్ తరచుగా తన వాదనను వినిపించడం, ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో చేర్చడం వంటి చర్యలు ప్రధాని దౌత్య నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వ్యాక్సిన్ మైత్రీ కార్యక్రమం ద్వారా భారత్ తన సామర్థ్యాలను ఇతర దేశాలకు కూడా ఉపయోగపడేలా చేసింది. 36 దేశాల నుంచి అందిన గౌరవాలు ప్రధాని శ్రీ మోదీకి లభిస్తున్న అంతర్జాతీయ గౌరవాన్ని, ప్రపంచ సమస్యల పరిష్కారంలో భారత్‌కు పెరుగుతున్న ప్రభావం, సహకారానికి లభిస్తున్న గుర్తింపును తెలియజేస్తున్నాయి.
10. వారసత్వం, భాద్యతో కూడిన అభివృద్ధి
అభివృద్ధిని, సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని, పర్యావరణ పరిరక్షణ బాధ్యతలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత ఏకతాటిపైకి తెస్తుంది. గుజరాత్లో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం నుంచి ప్రారంభమైన పర్యావరణ పరిరక్షణ చర్యలు.. నేడు పునరుత్పాదక ఇంధన విస్తరణ, అంతర్జాతీయ భాగస్వామ్యాల స్థాయికి పెరిగాయి. యోగా, చిరుధాన్యాలు, కాశీ విశ్వనాథ్ ధామ్, అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు భారత్‌కు సాంస్కృతిక వారసత్వంతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేశాయి. 2047 నాటికి సుసంపన్నమైన, స్వావలంభనతో కూడిన, అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించేందుకు సమష్టి కృషి చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతపై కొత్త నిబద్ధతతో ఈ తీర్మానం ముగిసింది.
***