Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ (జీఎస్ఎంఏ) బోర్డు సభ్యులతో సమావేశమైన ప్రధానమంత్రి

గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ (జీఎస్ఎంఏ) బోర్డు సభ్యులతో సమావేశమైన ప్రధానమంత్రి


ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ ప్రారంభానికి ముందు… ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సేవా తీర్థలో గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ (జీఎస్ఎంఏ) బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా గల మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు, అనుబంధ పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తూ… మొబైల్ రంగాన్ని ఒకే తాటిపైకి తెచ్చే ఒక అంతర్జాతీయ కూటమిగా జీఎస్ఎంఏ పనిచేస్తుంది.

 

సాంకేతికత ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చేదిగా, పర్యావరణానికి మేలు చేసే సుస్థిర అభివృద్ధికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సమాజంలో ఏ ఒక్క వర్గం వెనకబడిపోకుండా ఉండాలంటే సాంకేతికత అందరికీ అందుబాటులోకి రావడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రపంచంలోని వెనకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల (గ్లోబల్ సౌత్) కోసం సాంకేతిక, డిజిటల్ సేవలను తక్కువ ఖర్చుతో, సులభంగా అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్నీ ఆయన గుర్తు చేశారు. డిజిటల్ రంగంలో ధనిక, పేద వ్యత్యాసాలు మరింత పెరగకుండా నిరోధించడానికి సాంకేతికతను సమాజంలోని చివరి వ్యక్తికీ చేర్చడం ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

 

అభివృద్ధి చెందుతున్న దేశాల రూపురేఖలను మార్చడంలో ‘డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ (డీపీఐ) శక్తిమంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచ దేశాల అధినేతలతో జరిగిన చర్చల్లో డీపీఐకి గల అంతర్జాతీయ ప్రాధాన్యం స్పష్టమైందని పేర్కొన్నారు. వెనకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు వేగంగా ప్రగతి సాధించడానికి ఇటువంటి డిజిటల్ వేదికలు ఊతమిస్తాయని ఆయన వివరించారు.

రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్, సైబర్ మోసాల సవాలు గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ… ఈ సమస్యకు సాంకేతిక ఆధారిత పరిష్కారాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. సంభావ్య మోసపూరిత ఫోన్ కాల్స్ గురించి ప్రజలను ముందే హెచ్చరించేందుకు, వారిలో అవగాహన కల్పించేందుకు వినియోగదారులకు నిరంతరం అప్రమత్తత సందేశాలను పంపాలని ఆయన సూచించారు.

 

అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు ప్రపంచ స్థాయి ప్రమాణాలు, ఉమ్మడి నియమాలు ఉండాల్సిన అవసరాన్నీ ప్రధానమంత్రి స్పష్టం చేశారు. డీప్‌ఫేక్‌లు, ఏఐ-సృష్టించిన కంటెంట్ వల్ల పెరుగుతున్న ముప్పు విషయంలో, వినియోగదారులు దాని మూలాన్ని తక్షణమే గుర్తించేందుకు వీలు కల్పించే యంత్రాంగాలను అన్వేషించాలని ఆయన సూచించారు.

 

డిజిటల్, మొబైల్ కనెక్టివిటీలో భారత్… ప్రపంచంలోనే అగ్రగామిగా ఆవిర్భవించడాన్ని జీఎస్ఎంఏ బోర్డు సభ్యులు ప్రముఖంగా ప్రస్తావించారు. 4జీ, 5జీల వేగవంతమైన విస్తరణ, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల స్థాయి, టెలికాం, మొబైల్ తయారీ రంగంలో వృద్ధినీ వారు గుర్తించారు. భారత్ అనుసరిస్తున్న పెట్టుబడి-హితమైన విధాన ప్రణాళికనూ వారు ప్రశంసించారు. నిరంతర డిజిటల్ వృద్ధికి తోడ్పడటంలో సురక్షితమైన, పటిష్ఠమైన, విశ్వసనీయమైన డిజిటల్ మౌలిక సదుపాయాల పాత్రనూ ప్రముఖంగా ప్రస్తావించారు.

 

5జీ, 6జీ, ఏఐ, సైబర్ భద్రత, అందరికీ అందుబాటులో డిజిటల్ సేవలు, ఉపగ్రహ అనుసంధానత వంటి రంగాల్లో భారత్‌తో అంతర్జాతీయ సహకారానికి పెరుగుతున్న అవకాశాలనూ బోర్డు సభ్యులు ప్రస్తావించారు.

 

ఈ సమావేశంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జీఎస్‌ఎమ్‌ఏ బోర్డు సభ్యులు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

***