ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో 2026 అక్టోబర్ 15న సాయంత్రం దాదాపు 4:30 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. ఆసియా క్రీడలు- 2026లో పాల్గొన్న భారతీయ క్రీడాకారుల బృందంతో ముఖాముఖి సంభాషించనున్నారు. ఈ సందర్భంగా హాజరైన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతారు.
జపాన్లోని ఐచి-నాగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్.. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో సహా మొత్తం 85 పతకాలను గెలుచుకొని పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో అగ్రస్థానంలో నిలిచిన ఐదు దేశాల జాబితాలో భారత్ వరుసగా రెండోసారి చోటు దక్కించుకోవడం అనేది విభిన్న క్రీడాంశాలలో పెరుగుతున్న దేశ పోటీతత్వాన్ని తెలియజేస్తోంది.
ఈ క్రీడల్లో భారత్ పలు కీలక ఘనతలను సాధించింది. ఇందులో రికర్వ్ ఆర్చరీలో చారిత్రాత్మక ప్రదర్శనలు, ఒకే సీజన్లో పురుషులు- మహిళల హాకీ జట్లు రెండూ స్వర్ణ పతకాలను కైవసం చేసుకోవడం, సాఫ్ట్ టెన్నిస్- మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లలో (ఎంఎంఏ) తొలిసారిగా పతకాలను సాధించడం వంటి విశేషాలు ఉన్నాయి. మహిళల ట్రాప్ విభాగంలో భారత్కు మొట్టమొదటి స్వర్ణ పతకం లభించడం, 28 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా క్రీడల వెయిట్లిఫ్టింగ్లో రజత పతకం దక్కడం, గ్రెకో-రోమన్ రెజ్లింగ్లో 64 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఒక భారతీయ రెజ్లర్ ఫైనల్కు చేరి రజత పతకాన్ని కైవసం చేసుకోవడం ఇతర ముఖ్యమైన విజయాలుగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో భారతీయ బృందానికి చెందిన క్రీడాకారులు, వారి కోచ్లు, సహాయక సిబ్బంది, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధికారులు, జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు, కేంద్ర యువజన వ్యవహారాలు- క్రీడల మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొననున్నారు.
***