న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ”ఆధునిక శాస్త్ర–సాంకేతిక–ఆవిష్కరణల సదస్సు-2026ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ– అంకుర వ్యవస్థాపకులతో ఇవాళ ఉదయం తన చర్చల అనంతరం తనలో ఉప్పొంగిన ఉత్సాహాన్ని సభికులతో పంచుకున్నారు. ఆ సంభాషణల సందర్భంగా దేశ యువతరం ప్రదర్శించిన విశాల దృక్పథం, సాహసోపేత సంకల్పం ప్రశంసనీయమన్నారు. “భారత యువతరం ఆలోచనల స్థాయి, ముందడుగు వేయడంలో వారి ఆత్మవిశ్వాసం స్ఫూర్తిదాయకం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఇంతకుముందు కూడా ఈ సదస్సులో తాను పాల్గొనడాన్ని గుర్తు చేసుకుంటూ గత దశాబ్దాల నాటి అంశాలను ప్రస్తావించారు. ఆనాడు విదేశీ ఆవిష్కరణలను కొన్నేళ్ల తర్వాత అనుసరించడం లేదా మార్పులు చేసి అందిపుచ్చుకోవడానికి మాత్రమే భారత్ ప్రయత్నించేదని చెప్పారు. అయితే, ప్రస్తుత 21వ శతాబ్దపు భారత్ అసలుసిసలు సాంకేతికతల సృష్టి, ప్రపంచానికి దిశానిర్దేశం, అంతర్జాతీయ సవాళ్ల పరిష్కారం తదితరాలపై లక్ష్యనిర్దేశం చేసుకున్నదని ఆయన అన్నారు. నేటి ఈ దేశం కోవిడ్-19 నుంచి రక్షణ దిశగా తన జనాభాకు టీకాలు వేయడానికే కాకుండా ఇతర దేశాలకు సరఫరా చేయడం కోసం స్వదేశీ వ్యాక్సిన్లను రూపొందించిందని గుర్తుచేశారు. అంతేకాకుండా తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకున్నదని, ఏ దేశమూ అడుగుపెట్టని రీతిలో చంద్రుని దక్షిణ ధ్రువంపై పాదం మోపిందని పేర్కొన్నారు. ఇలాంటి విజయాలను ప్రస్తావిస్తూ– దేశం కోసం సాహసోపేత సాంకేతిక దార్శనికతను అనుసరించడంలో చొరవను ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. అలాగే, “భారత్ భవిష్యత్ సాంకేతికతలను స్వీకరిండమే కాకుండా సాహసోపేత ఆవిష్కరణలకు నడుం బిగించాలి. దీంతోపాటు ఈ దిశగా ప్రపంచానికి మనం నాయకత్వం వహించాలి” అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
సున్నా ఆవిష్కరణ సహా సంఖ్యా శాస్త్రం నుంచి ఖగోళ శాస్త్రం దాకా భారత్‌కు సుసంపన్న ఆవిష్కరణల వారసత్వం ఉన్నదని ప్రముఖంగా ప్రస్తావించారు. నిరుడు దేశం సాధించిన అనేక విజయాలు నిరూపించిన మేరకు ఆధునిక సాంకేతికత, నవ్యోత్సాహంతో ఈ శాస్త్రవిజ్ఞాన వారసత్వాన్ని కొనసాగిస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 30న డాక్టర్ హోమీ జహంగీర్ భాభా జయంతి నిర్వహించనున్న నేపథ్యంలో ఇటీవలి ప్రగతిపై తన సమీక్షకు అణు రంగంతో శ్రీకారం చుట్టాలని నిర్ణయించకున్నట్లు తెలిపారు. “ఆ మేరకు మనం అణుశక్తితో ప్రారంభిద్దాం” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
వికసిత భారత్ సాకారం దిశగా భారీ అణుశక్తి సామర్థ్యం అవసరమే అయినా, అణు ఇంధన దిగుమతి పరాధీనత నుంచి బయటపడకపోతే ఇంధన భద్రతకు సవాలు ఎదురవుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సాంకేతికతను భారత్ శరవేగంగా అభివృద్ధి చేస్తున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు కొన్ని నెలల కిందట 500 మెగావాట్ల స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తొలి అంచె ‘క్రిటికాలిటీ’ని విజయవంతంగా సాధించిందని గుర్తుచేశారు. “అణుశక్తి రంగంలో మన దీర్ఘకాలిక బలాలను పటిష్టం చేసుకునే దిశగా ఇదొక కీలకఘట్టం” అని ఆయన పేర్కొన్నారు.
దేశీయ ఇంధన భద్రత, సాంకేతిక స్వావలంబనకే పరిమితం కాకుండా, కీలక సాంకేతిక రంగాలలో తన ఉనికిని విస్తరించాలన్నది భారత్ ఆశయమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఏడాది అంతరిక్ష రంగంలో సాధించిన కీలక విజయాలను కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ రాకెట్‌తో స్వదేశీ అంతరిక్ష అంకుర సంస్థ తొలి ప్రయత్నంలోనే ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టడం ఇందులో ఒకటని చెప్పారు. అలాగే, ఉపగ్రహ అనుసంధాన సామర్థ్యంలోనూ దేశం నైపుణ్యం సాధించిందని తెలిపారు. ఈ రంగంలో యువ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం పెరుగుతుండగా, అనేక దేశీయ అంకుర సంస్థలు నవ్య అంతరిక్ష విజ్ఞాన పరిష్కారాలను పరిచయం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. “కీలక సాంకేతిక రంగాలలో మన శక్తిసామర్థ్యాలను విస్తరించాలన్నది కూడా మా లక్ష్యం” అని శ్రీ మోదీ ప్రస్ఫుటం చేశారు.
అనేక రంగాల్లో భారత్ అసాధారణ విజయాలు సాధించిందని, ఇందులో భాగంగా ఈ ఏడాది ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ను నిర్వహించడమే కాకుండా సొంత ‘ఏఐ’ నమూనాను ఆవిష్కరించిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. భారత్‌లో తయారైన సెమీకండక్టర్ చిప్‌లను ప్రపంచానికి ఎగుమతి చేయడం కూడా ప్రారంభించిందని పేర్కొన్నారు. దేశీయ ముడి పదార్థాలపై పూర్తిగా ఆధారపడుతూ బ్యాటరీ నిల్వ సామర్థ్యాన్ని దేశం రూపొందిస్తోందని కూడా ఆయన వివరించారు. “భారత్ వివిధ రంగాలలో సాధిస్తున్న విజయాలు అసాధారణమైనవి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
అణు, అంతరిక్షం.. నుంచి ఏఐ, సెమీకండక్టర్ల దాకా వివిధ రంగాల అవసరాలు వేర్వేరు అయినప్పటికీ, అత్యాధునిక సాంకేతికతలలో భారత్ సామర్థ్యం, విశ్వాసం పెరుగుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. దేశీయ ఆవిష్కరణలు ప్రపంచ సవాళ్లను పరిష్కరించేలా ‘భారీ ఎత్తున పరిష్కారాల’ను రూపొందించగల దేశ విశిష్ట సామర్థ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. డిజిటల్ స్టాక్, స్వదేశీ 5జీ సాంకేతికత విజయాలను ఉటంకిస్తూ– సురక్షిత, విస్తృత జనాభా స్థాయి వేదికల రూపల్పన దిశగా సాగుతున్న కృషిని ఆయన పునరుద్ఘాటించారు. “ప్రజలకు పెద్ద ఎత్తున చేరువకాగల సురక్షిత పరిష్కారాల రూపకల్పన దిశగా భారత్ ముందడుగు వేస్తున్నది” అని శ్రీ మోదీ ప్రకటించారు.
గతంలో శాస్త్ర, సాంకేతిక రంగాలను ఆయుధాలుగా ఉపయోగించాలనే ధోరణికి.. వాటిని మానవాళి సేవకు వినియోగించాలన్నది భారతీయ తత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రధానమంత్రి వివరించారు. శాస్త్ర, సాంకేతికతప్రయోగశాలలకే పరిమితం కాకుండా సామాన్యుల జీవితాలను మెరుగుపరచడం, పెద్ద సమస్యలకు పరిష్కారాలు చూపడం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య, ఉపాధి, విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఉపయోగపడినప్పుడే నిజమైన విజయం సాధించినట్లు అని అన్నారు. దేశీయ అంకుర సంస్థలు ఈ రంగాలకు ప్రాధాన్యం ఇస్తుండటం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మెదడు కార్యకలాపాలను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే ధరించగలిగే ఈఈజీ సాంకేతికత, స్వదేశీ వైర్లెస్, ఉపగ్రహ సమాచార వ్యవస్థలు, ప్రత్యేక పోషకాహార ఉత్పత్తులు, కొత్త సెమీకండక్టర్ సాంకేతికతలు, ఉక్కు పరిశ్రమ వ్యర్థమైన స్లాగ్‌ను వినియోగించుకునే పరిష్కారాల కోసం పనిచేస్తున్న అంకుర సంస్థలు, దేశీయ సంస్థలను ఆయన ఉదహరించారు. “ప్రయోగశాల నుంచి బయటకు వచ్చి సామాన్య పౌరుడి జీవితాన్ని మెరుగుపరిచినప్పుడే విజ్ఞాన శాస్త్రానికి నిజమైన విజయం లభిస్తుంది” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
చెన్నైలోని ఐఐటీ మద్రాస్‌లో ఇటీవల తన పర్యటనను గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి.. అక్కడ ఆధునిక బ్రెయిన్ సెంటర్‌ను ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారు. మానవ మెదడుకు అత్యంత స్పష్టతతో కూడిన డిజిటల్ 3డీ చిత్రాలను రూపొందించడంతో పాటు, సంక్లిష్టమైన నాడీ సంబంధిత వ్యాధులపై లోతైన అవగాహన కల్పించేందుకు ఈ కేంద్రం ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలిచే మెదడు చిత్రీకరణ సాంకేతిక వేదికను అభివృద్ధి చేసిందని తెలిపారు. సమాజానికి ఉపయోగపడటం, సాంకేతికత ద్వారా మార్పు తీసుకురావడం అనేవే శాస్త్రీయ ప్రగతికి అంతిమ ప్రమాణాలు కావాలని ఆయన పేర్కొన్నారు. “ఈ ప్రమాణాల ఆధారంగానే భారత్ తన ప్రగతిని పరీక్షించుకుంటూ ముందుకు సాగుతోంది” అని శ్రీ మోదీ అన్నారు.
ఒక దేశం సాంకేతికతను అభివృద్ధి చేయగల సామర్థ్యం, కీలక సాంకేతిక రంగాల్లో స్వావలంబన సాధించడం బలమైన పరిశోధనలపై ఆధారపడి ఉంటాయని ప్రధానమంత్రి తెలిపారు. తన ‘జై విజ్ఞాన్, జై అనుసంధాన్’ నినాదం వెనుక ఉన్న స్ఫూర్తి కూడా ఇదేనని వివరించారు. అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. గత ఏడాది ఇదే వేదికపై పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల కోసం రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని చేసిన హామీని కూడా గుర్తుచేశారు. గత ఏడాది కాలంలో మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ప్రయోగశాల సాంకేతికతల అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.12,000 కోట్లకు సమానంగా ప్రైవేటు పెట్టుబడిదారులు మరో రూ.12,000 కోట్లు సమకూర్చారని ప్రధానమంత్రి వెల్లడించారు. ‘‘కేవలం ఒక్క ఏడాదిలోనే పరిశోధన, అభివృద్ధి రంగాలకు మొత్తం రూ.24,000 కోట్ల కొత్త పెట్టుబడి నిబద్ధత ఏర్పడింది’’ అని ప్రధాని పేర్కొన్నారు.
దేశీయ పరిశోధన వ్యవస్థ నిరంతరం విస్తరిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. గత దశాబ్దంలో మేధో సంపత్తి సృష్టి గణనీయంగా పెరిగిందని తెలిపారు. పదేళ్ల క్రితం ఏడాదికి 50 వేల కంటే తక్కువగా ఉన్న పేటెంట్ దరఖాస్తుల సంఖ్య, గత ఏడాది దాదాపు 1.5 లక్షలకు చేరిందని వెల్లడించారు. ఈ పెరుగుదల కేవలం సంఖ్యలకు సంబంధించినది మాత్రమే కాదని, దేశంలో పరిశోధన, ఆవిష్కరణల రంగంలో చోటుచేసుకుంటున్న గణనీయమైన మార్పునకు సంకేతమని పేర్కొన్నారు. “భారత్‌లో పరిశోధన, ఆవిష్కరణలు బలమైన సంస్కృతిగా మారుతున్నాయనడానికి ఇవి నిదర్శనం” అని శ్రీ మోదీ అన్నారు.
21వ శతాబ్దపు రెండో త్రైమాసికంలో కృత్రిమ మేధ యుగంలో శాస్త్రీయ ఆలోచనా విధానం ఎలా మారుతుందనే కీలక ప్రశ్నను ప్రధానమంత్రి లేవనెత్తారు. వేదికపై ఉన్న ప్రముఖ ప్రయోగశాల శాస్త్రవేత్తలు, నోబెల్ పురస్కార గ్రహీతలు చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, ప్రయోగాలు చేయడం, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడం, సంప్రదాయ పద్ధతులను ప్రశ్నించడం, ఇతరులు గుర్తించని సూక్ష్మ అంశాలను గమనించడం ద్వారా ఎన్నో ఏళ్లలో తమ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారని గుర్తుచేశారు. ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధ సాధారణ పనులను వేగంగా పూర్తి చేసినప్పటికీ.. అది స్వతంత్ర ఆలోచనా సామర్థ్యాన్ని పరిమితం చేయకుండా మరింత మెరుగుపరచాలని ప్రధానమంత్రి హెచ్చరించారు. ఏఐ వల్ల ఆదా అయ్యే సమయాన్ని పరిశోధకులు మరింత క్లిష్టమైన సమస్యల పరిష్కారం, కొత్త ప్రయోగాలు, ఆలోచనల ధ్రువీకరణకు వినియోగించుకోవాలని సూచించారు. “కృత్రిమ మేధ మనకు త్వరగా సమాధానాలు ఇవ్వగలదు. అయితే ఆ సమాధానాలు వాస్తవమైనవో కాదో పరీక్షించే బాధ్యత మాత్రం శాస్త్రవేత్తలదే” అని ప్రధాని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
భవిష్యత్తును తీర్చిదిద్దే సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తలు, పరిశోధనా సంస్థలు నిరంతరం సన్నద్ధమయ్యేలా ప్రత్యేక జాతీయ మిషన్లను కొనసాగించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. సెమీకండక్టర్లు, క్వాంటం సాంకేతికతలు, బయోటెక్నాలజీ, అధునాతన పదార్థాలు, రోబోటిక్స్, అంతరిక్షం, స్వచ్ఛ ఇంధనం, తదుపరి తరం సమాచార ప్రసార సాంకేతికతలు వంటి రంగాల్లో భారత్ నుంచే కొత్త ఆవిష్కరణలు వెలువడాలని ఆకాంక్షించారు. కృత్రిమ మేధ, సింథటిక్ బయాలజీ, స్వయంచాలక వ్యవస్థల అభివృద్ధిలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఏఐ యుగంలో ఆర్థిక లావాదేవీల వ్యవస్థలు, జాతీయ భద్రతకు సైబర్ ముప్పులు పెరుగుతున్నాయని హెచ్చరించారు. దేశంలోని కీలక వ్యవస్థలను రక్షించడంతో పాటు మానవాళికి ఉపయోగపడేలా కృత్రిమ మేధ ఆధారిత, క్వాంటం సాంకేతికతతో కూడిన భద్రతా పరిష్కారాలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. “భారత్‌కు సాధికారత కల్పించడంతో పాటు మానవాళి సమస్యల పరిష్కారానికి కూడా దోహదపడే సాంకేతికతలను అభివృద్ధి చేయడమే మన లక్ష్యం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి పరిశోధకుడు, పారిశ్రామికవేత్త, అంకుర సంస్థ వ్యవస్థాపకుడు, విద్యార్థి రాబోయే మూడేళ్లకు ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. ఏ సాంకేతికత, నమూనా, ప్రయోగాత్మక ప్రాజెక్టు లేదా ఉత్పత్తి అభివృద్ధికి తాము సహకరించగలరో స్పష్టంగా నిర్ణయించుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడటంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా సమస్యలకు పరిష్కారాలు అందించే కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశం కేవలం చర్చలకే పరిమితం కాకుండా, ఆచరణలో కనిపించే ఫలితాలను అందించాలని స్పష్టం చేశారు. “ఈ సదస్సు కేవలం ఆలోచనల మార్పిడికే పరిమితం కాకూడదు. స్పష్టమైన ఫలితాలను సాధించే వేదికగా మారాలి” అని ప్రధాని అన్నారు.
ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ ప్రతిభ, పట్టుదలతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కేవలం భాగస్వాములుగా ఉండే తరం కాకుండా, వాటికి నాయకత్వం వహించే తరాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘మనమది సాధించి తీరుతాం’ అనే సమష్టి స్ఫూర్తి, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిస్తూ, సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. “అభివృద్ధి చెందుతున్న శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కేవలం పాల్గొనే తరం కాకుండా, నాయకత్వం వహించే తరాన్ని మనం సిద్ధం చేయాలి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
***
A Viksit Bharat will be built on strong foundations of scientific research, discoveries and the spirit of innovation. Speaking at the Emerging Science, Technology and Innovation Conclave in New Delhi. https://t.co/7VshP2K7GU
— Narendra Modi (@narendramodi) October 27, 2026
India must innovate and lead the world in shaping the technologies of tomorrow. https://t.co/jCI8XwQxsJ
— PMO India (@PMOIndia) October 27, 2026
India aims to achieve self-reliance and build strength in critical technologies. https://t.co/H8YNQbRf3G
— PMO India (@PMOIndia) October 27, 2026
AI can give quick answers, but it is essential to verify them. https://t.co/6lIKdPC7i2
— PMO India (@PMOIndia) October 27, 2026