నా మంత్రివర్గ సభ్యుడు డాక్టర్ జితేంద్ర సింగ్, భారత ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారు అజయ్ సూద్, నోబెల్ బహుమతి గ్రహీతలైన శాస్త్రవేత్తలు, ఇతర ప్రముఖ అతిథులు, సోదరీ సోదరులారా…
ఈ రోజు విజ్ఞాన, సాంకేతిక రంగాలకు చెందిన ఎంతోమంది ప్రతినిధులు ఇక్కడ సమావేశమయ్యారు. మన యువ ఆవిష్కర్తలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడికి వచ్చే ముందు కొందరు అంకుర సంస్థల వ్యవస్థాపకులతో మాట్లాడాను. భారత యువత ఆలోచిస్తున్న తీరు, వారు ముందుకు సాగుతున్న ఆత్మవిశ్వాసం నిజంగా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది.
మిత్రులారా,
గతంలోనూ నేను ఈ సదస్సుకు హాజరయ్యాను. ఈసారి మనం అభివృద్ధి చెందుతున్న విజ్ఞానశాస్త్రం, సాంకేతికతపై చర్చిస్తున్నాం. దశాబ్దాల కిందట భారత్‌కు విజ్ఞానశాస్త్రం, సాంకేతికత అంటే ఇతర దేశాలతో సమానంగా ఎదగడమే. ప్రపంచంలో ఏదైనా కొత్త ఆవిష్కరణ జరిగినప్పుడు, ఆ సాంకేతికత మన దేశానికి చేరడానికి కొన్ని సంవత్సరాలు పట్టేది. ఆ తర్వాత దాన్ని స్వీకరించడమో, చిన్నచిన్న మార్పులు చేయడమో చేసి ముందుకు సాగేవాళ్లం. కానీ నేడు 21వ శతాబ్దపు భారత్ కొత్త ఆలోచనా విధానంతో, కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. భారత్ కోసం, ప్రపంచం కోసం, నేటి అవసరాల కోసం, భవిష్యత్తు కోసం కొత్త సాంకేతికతలను సృష్టించడం, వాటికి దిశానిర్దేశం చేయడం, ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలు చూపగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ఇప్పుడు మన లక్ష్యం. కోవిడ్ సమయంలో దీనికి ఒక ఉదాహరణ చూశాం. ప్రపంచంలోని అనేక దేశాలు టీకాల కొరతతో ఇబ్బందులు పడుతున్నప్పుడు, భారత్ సొంతంగా టీకాను అభివృద్ధి చేసింది. భారీ స్థాయిలో టీకా కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా, ఇతర దేశాలకు కూడా టీకాలను సరఫరా చేసింది. ఇదే 21వ శతాబ్దపు భారతదేశ ఆత్మవిశ్వాసం. తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని చేరుకున్నాం. ఇంతకుముందు ఎవరూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చేరుకున్నాం. అందుకే నేను దృఢంగా విశ్వసిస్తున్నాను: భవిష్యత్తు సాంకేతికతలను భారత్ అందిపుచ్చుకోవాలి, ధైర్యంగా కొత్త ఆవిష్కరణలు చేయాలి, వాటిని సృష్టించడంలో ప్రపంచానికి నాయకత్వం వహించాలి.
మిత్రులారా,
సున్నా ఆవిష్కరణ నుంచి సంఖ్యా వ్యవస్థ, ఖగోళశాస్త్రం వరకు భారత్‌ది ఎప్పుడూ విజ్ఞాన, ఆవిష్కరణల సంప్రదాయమే. నేడు ఆధునిక సాంకేతికతలను, నూతన ఆత్మవిశ్వాసాన్ని జోడించి ఈ శాస్త్రీయ వారసత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. గత ఏడాది చోటుచేసుకున్న కొన్ని ఉదాహరణలు ఈ మార్పును మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి దోహదపడతాయి. అక్టోబర్ 30న దేశం డాక్టర్ హోమీ జహంగీర్ భాభా జయంతిని జరుపుకోనుంది. అందుకే అణుశక్తి రంగంతో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను.
మిత్రులారా,
వికసిత భారత్ నిర్మాణానికి పెద్ద ఎత్తున అణుశక్తి అవసరమని మీ అందరికీ తెలుసు. అణు ఇంధనం కోసం దిగుమతులపై ఆధారపడటం మన ఇంధన భద్రతకు సవాలుగా మారుతోంది. అందుకే భారత్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సాంకేతికతను వేగంగా అభివృద్ధి చేస్తోంది. కొన్ని నెలల క్రితమే దేశంలో 500 మెగావాట్ల సామర్థ్యం గల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తొలిసారిగా క్రిటికాలిటీ దశను చేరుకుంది. అణుశక్తి రంగంలో దీర్ఘకాలిక సామర్థ్యాలను బలోపేతం చేసుకునే దిశగా ఇది అత్యంత కీలకమైన ముందడుగు.
మిత్రులారా,
ఇంధన భద్రత అయినా, సాంకేతిక స్వావలంబన అయినా, భారత్ లక్ష్యం తన అవసరాలను తీర్చుకోవడానికే పరిమితం కాదు. కీలక సాంకేతిక రంగాల్లో సామర్థ్యాన్ని మరింత విస్తరించుకోవడం కూడా మన లక్ష్యం. ఈ ఏడాది అంతరిక్ష రంగంలోనూ భారత్ కొత్త మైలురాళ్లను అధిగమించింది. భారత అంతరిక్ష స్టార్టప్ ఒకటి స్వదేశీ రాకెట్ సాయంతో తొలి ప్రయత్నంలోనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఉపగ్రహాలను అంతరిక్షంలో ఒకదానితో మరొకటి అనుసంధానించే సామర్థ్యాన్ని కూడా భారత్ సాధించింది. నేడు అనేక భారతీయ స్టార్టప్‌లు అంతరిక్ష విజ్ఞాన రంగంలో సరికొత్త పరిష్కారాలను అందిస్తున్నాయి. ఈ రంగంలో యువ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరుగుతోంది.
మిత్రులారా,
వివిధ రంగాల్లో భారత్ గతంలో ఎన్నడూ లేనంతగా విజయాలు సాధిస్తోంది. ఈ ఏడాదే ఏఐ ఇంపాక్ట్ సదస్సును నిర్వహించడంతో పాటు, సొంత ఏఐ నమూనాను కూడా భారత్ ఆవిష్కరించింది. భారత్‌లో తయారైన చిప్‌ల తొలి సరఫరాలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు చేరడం ప్రారంభమైంది. బ్యాటరీ నిల్వ రంగంలో కూడా దేశీయంగా అందుబాటులో ఉన్న ముడి పదార్థాల ఆధారంగా సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేస్తున్నాం.
మిత్రులారా,
అణుశక్తి నుంచి అంతరిక్షం వరకు, కృత్రిమ మేధ నుంచి సెమీకండక్టర్ల వరకు.. ఈ రంగాల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ ఇవన్నీ ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో భారత్ తన సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేసుకుంటోంది. భారత్‌కు మరో బలం కూడా ఉంది. అదే పెద్ద ఎత్తున పరిష్కారాలను అందించగల సామర్థ్యం. మన దేశంలో ఒక పరిష్కారం విజయవంతమైతే, ప్రపంచంలోని అనేక దేశాల సమస్యలను పరిష్కరించేందుకు అది కొత్త మార్గాలను చూపుతుంది. మన డిజిటల్ వ్యవస్థ దీనికి అద్భుతమైన ఉదాహరణ. 5జీ సాంకేతికత కూడా అలాంటిదే. పెద్ద సంఖ్యలో ప్రజలకు చేరువయ్యేలా సురక్షితమైన పరిష్కారాలను అభివృద్ధి చేసే దిశగా భారత్ ముందుకు సాగుతోంది.
మిత్రులారా,
విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో ఎప్పటి నుంచో ఉన్న ఒక సవాలు మీ అందరికీ తెలుసు. ఈ రంగాలను ఆయుధాల తయారీకి ఉపయోగించే సాధనాలుగా చూసే ధోరణి ఒకటి ఉంది. అయితే విజ్ఞానశాస్త్రం, సాంకేతికత మానవాళి సేవకు ఉపయోగపడే సాధనాలని భారత్ విశ్వసిస్తోంది. ప్రయోగశాలల నుంచి సామాన్య పౌరుల జీవితాల్లోకి చేరి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచినప్పుడే విజ్ఞానశాస్త్రం నిజమైన విజయం సాధించినట్లు. ప్రయోగశాల నుంచి క్షేత్రస్థాయికి చేరే ఈ సాంకేతికత విజయం అది ఎంత ఆధునికమైనదనే అంశంపై మాత్రమే ఆధారపడి ఉండదు. ఎంత పెద్ద సమస్యను పరిష్కరిస్తోంది, ఎంతమంది జీవితాల్లో మార్పు తీసుకొస్తోంది అన్నదే దాని అసలైన బలం. అందుకే అభివృద్ధి చెందుతున్న విజ్ఞాన, సాంకేతిక రంగాలంటే మనకు ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసే పరిష్కారాలు. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చే సాంకేతికతలు.విద్య, ఉపాధిలో కొత్త అవకాశాలు కల్పించే ఆవిష్కరణలు. విపత్తుల నిర్వహణకు తోడ్పడే పరిష్కారాలు. భారత్‌లో స్టార్టప్‌ల విప్లవం ఇలాంటి అంశాలకు ప్రాధాన్యమివ్వడం నాకు సంతోషంగా ఉంది. మెదడు కార్యకలాపాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే, ధరించగలిగే ఈఈజీ సాంకేతికతపై ఒక స్టార్టప్ పనిచేస్తోంది. భారతీయ కంపెనీలు స్వదేశీ వైర్లెస్, ఉపగ్రహ సమాచార ప్రసార పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నాయి. పోషకాహార రంగంలో ప్రత్యేక ఆహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తులను రూపొందిస్తున్నారు. సెమీకండక్టర్ రంగంలోనూ భారతీయ కంపెనీలు కొత్త సాంకేతికతల అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. స్టీల్ స్లాగ్ వంటి పారిశ్రామిక వ్యర్థాలను వినియోగించుకునే పరిష్కారాలపైనా మన దేశంలో పరిశోధనలు జరుగుతున్నాయి.
మిత్రులారా,
కొద్ది రోజుల క్రితమే నేను చెన్నైని సందర్శించే అవకాశం లభించింది. ఆ అనుభవాన్ని మీతో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. అక్కడ ఐఐటీ మద్రాస్‌లో ఆధునిక మెదడు పరిశోధనా కేంద్రాన్ని (బ్రెయిన్ సెంటర్) ప్రారంభించాను. ప్రపంచం మొత్తానికే రోల్ మోడల్‌గా నిలిచే మెదడు ఇమేజింగ్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను ఈ కేంద్రం అభివృద్ధి చేసింది. మానవ మెదడుకు సంబంధించిన హై ప్రెసిషన్ డిజిటల్ 3డీ చిత్రాలను రూపొందించే దిశగా ఈ బ్రెయిన్ సెంటర్ కృషి చేస్తోంది. ఈ మిషన్ విజయవంతమైతే నాడీ సంబంధిత వ్యాధులకు ఎదురయ్యే అనేక క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి దోహదపడుతుంది. సమాజం కోసం విజ్ఞానశాస్త్రం. మార్పు కోసం సాంకేతికత మన శాస్త్రీయ ప్రగతికి ప్రామాణికంగా ఉండాలి. ఈ ప్రమాణాన్ని కొలమానంగా తీసుకుని భారత్ ముందుకు సాగుతోంది.
మిత్రులారా,
ఒక దేశ సాంకేతికత, సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారుచేసే సామర్థ్యం దాని పరిశోధనలపైనే ఆధారపడి ఉంటుందని మనందరికీ తెలుసు. ఒక దేశం తన సొంత సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి, కీలకమైన సాంకేతికతల్లో స్వయంసమృద్ధి సాధించడానికి కావాల్సిన సామర్థ్యాన్ని పరిశోధనే అందిస్తుంది. అందుకే నేను ‘జై విజ్ఞాన్, జై అనుసంధాన్‘ అని పిలుపునిచ్చాను. వికసిత భారత్ కోసం మనం మన పరిశోధనా రంగాన్ని నిరంతరం బలోపేతం చేస్తున్నాం. ఈ సంకల్పంతోనే ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‘ను వేగవంతం చేస్తున్నాం. గతేడాది ఇదే వేదికపై పరిశోధన, అభివృద్ధి, నవకల్పనల కోసం లక్ష కోట్ల రూపాయల కేటాయింపులు చేస్తామన్న ప్రతిజ్ఞ చేశాం. నేడు దానికి సంబంధించిన ఫలితాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. గడిచిన ఒక సంవత్సరంలోనే ప్రయోగశాల నుంచి మార్కెట్‌కు తరలించడానికి సిద్ధంగా ఉన్న సాంకేతికతల కోసం దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాం. ఈ ప్రయత్నంలో ప్రైవేట్ పెట్టుబడిదారులు కూడా సమానంగా భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం అందించే పన్నెండు వేల కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు ప్రైవేట్ రంగం కూడా పన్నెండు వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతోంది. అంటే కేవలం ఒకే సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి కోసం మొత్తం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల కొత్త కేటాయింపులు జరిగాయి.
మిత్రులారా,
భారతదేశపు పరిశోధనా వ్యవస్థ కూడా నిరంతరం విస్తరిస్తోంది. పేటెంట్ దరఖాస్తుల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. పదేళ్ల క్రితం ఒక సంవత్సరంలో యాభై వేల కంటే తక్కువ పేటెంట్ దరఖాస్తులు నమోదయ్యేవి. కానీ గతేడాది ఈ సంఖ్య దాదాపు లక్షన్నరకు చేరింది. ఈ గణాంకాలు కేవలం పెరుగుతున్న సంఖ్యను మాత్రమే తెలియజేయటం లేదు. పరిశోధన, నవకల్పనలు భారతదేశంలో ఒక బలమైన సంస్కృతిగా రూపాంతరం చెందుతున్నాయనడానికి ఇవి నిదర్శనం.
మిత్రులారా,
21వ శతాబ్దపు ఈ రెండో పావుభాగంలో మరొక ప్రశ్న అత్యంత ప్రాముఖ్యమైందిగా మారింది. అదే.. ‘కృత్రిమ మేధ యుగంలో శాస్త్రీయ దృక్పథం ఏ విధంగా రూపాంతరం చెందుతుంది?’. మన ప్రయోగశాలలను నడిపిస్తున్న శాస్త్రవేత్తలు సంవత్సరాల తరబడి అనుభవం ద్వారా తమ నైపుణ్యాన్ని పెంపొందించుకున్నారు. ఈ వేదికపై కూడా పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలు ఉన్నారు. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం, ప్రయోగాలు చేయడం, వైఫల్యాల నుంచి నేర్చుకోవడం ద్వారానే వారు తమ అవగాహనను పెంచుకున్నారని మనందరికీ తెలుసు. ఒక శాస్త్రవేత్త కేవలం అందుబాటులో ఉన్న సమాచారాన్ని పునరావృతం చేయడు. ఒక శాస్త్రవేత్త ఇప్పటికే ఉన్న మూస పద్ధతులను ప్రశ్నిస్తాడు. కొత్త కోణాల్లో పరిష్కారాలను అన్వేషిస్తాడు. ఇతరులు గమనించని అంశాలను గుర్తించి ముందుకు తెస్తాడు. ఈ ప్రక్రియ ద్వారానే శాస్త్రీయ దృక్పథం రూపుదిద్దుకుంటుంది. అయితే నేడు ఏఐ యుగంలో మన ముందు ఒక కొత్త సవాలు ఎదురవుతోంది. ఏఐ అనేక సాధారణ పనులను చాలా వేగంగా పూర్తి చేయగలదు. ఇది పరిశోధనా ఉత్పాదకతను పెంచుతుంది. కానీ ఏఐ శాస్త్రీయ ఆలోచనను, స్వతంత్ర విచక్షణను పరిమితం చేయకుండా.. వాటిని మరింత పెంచేలా చూసుకోవడం మన బాధ్యత. ఏఐ ద్వారా ఆదా అయిన సమయాన్ని మరింత సవాలుతో కూడుకున్న సమస్యలను పరిష్కరించడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి, నూతన ఆలోచనలను పరీక్షించడానికి ఉపయోగించాలి. ఏఐ వేగంగా సమాధానాలను అందించగలదు. కానీ ఆ సమాధానాల నిజానిజాలను ధ్రువీకరించే బాధ్యత మాత్రం శాస్త్రవేత్తపైనే ఉండాలి.
మిత్రులారా,
మనం మన శాస్త్రవేత్తలను, సంస్థలను నేటి అవసరాల కోసమే కాకుండా భవిష్యత్ సవాళ్ల కోసం కూడా నిరంతరం సన్నద్ధం చేయాలి. సెమీకండక్టర్లు, క్వాంటం సాంకేతికతలు, జీవ సాంకేతికత, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, రోబోటిక్స్, అంతరిక్షం, స్వచ్ఛ ఇంధనం, తదుపరి తరం కమ్యూనికేషన్స్ వంటి రంగాలు భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి. భారత్ ఈ రంగాలన్నింటిలోనూ బలమైన శాస్త్రీయ పునాదులను నిర్మిస్తోంది. ఈ ఉద్దేశంతోనే అనేక జాతీయ మిషన్లను కూడా ప్రారంభించాం. ఈ రంగాల్లో నూతన ఆవిష్కరణలు భారత్ నుంచే రావాలన్నదే మన లక్ష్యం. అయితే మన బాధ్యత కేవలం నవకల్పనలకే పరిమితం కాదు. ఏఐ కావచ్చు.. సింథటిక్ బయాలజీ కావచ్చు లేదా అటానమస్ వ్యవస్థలు కావచ్చు.. భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఏఐ యుగంలో సైబర్ భద్రత పరంగా కూడా కొత్త సవాళ్లు, కొత్త ముప్పులు ఎదురవుతున్నాయి. మన ఆర్థిక నెట్‌వర్క్‌ల నుంచి జాతీయ భద్రతా వ్యవస్థల వరకు ప్రతి ఒక్కరూ ఈ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కాబట్టి దేశ వ్యవస్థలను ఈ ముప్పుల నుంచి సురక్షితంగా ఉంచగల ఏఐ ఆధారిత పరిష్కారాలపై, క్వాంటం భద్రతా పరిష్కారాలపై మనం పనిచేయడం అత్యంత ముఖ్యం. భారత్‌ను బలోపేతం చేయడంతో పాటు మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లకు కూడా పరిష్కారాలను అందించే సాంకేతికతలను అభివృద్ధి చేయడమే మన లక్ష్యం.
మిత్రులారా,
ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రతి పరిశోధకుడికి, పరిశ్రమల అధిపతికి, అంకుర వ్యవస్థాపకుడికి, యువ విద్యార్థికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మీ కోసం ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. రాబోయే మూడు సంవత్సరాల్లో వికసిత భారత్ నిర్మాణానికి తోడ్పడే ఏ సాంకేతికతను, ప్రోటోటైప్‌ను, పైలట్ ప్రాజెక్ట్‌ను లేదా ఉత్పత్తిని మీరు అందించబోతున్నారు? అని ఆలోచించండి. అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి దోహదపడే నవకల్పనలను మనం సృష్టిద్దాం. ప్రపంచ స్థాయి పరిష్కారాలకు భారత్‌ను కేంద్ర బిందువుగా మార్చే ఆవిష్కరణలను మనం రూపొందిద్దాం. అందువల్ల ఈ సదస్సు కేవలం ఆలోచనల మార్పిడికే పరిమితం కాకూడదని నేను ఆశిస్తున్నాను. ఇది కచ్చితమైన కొలమాణం కలిగిన ఫలితాలను అందించే ఒక వేదికగా మారాలి.
మిత్రులారా,
నేడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ యువజనులున్న దేశం భారత్. మనకు ప్రతిభ ఉంది. కొత్తగా ఏమైనా సృష్టించాలనే సంకల్పం ఉంది. వర్ధమాన శాస్త్ర సాంకేతికతల్లో కేవలం భాగస్వామ్యం వహించడమే కాకుండా దానికి నాయకత్వం వహించే ఒక తరాన్ని మనం నిర్మించాలి. మన భావన నిరంతరం ‘మనం సాధిద్దాం, మనం చేసి చూపిద్దాం‘ అని ఉండాలి. ‘మనం తప్పకుండా చేయగలం‘ అన్నదే మన ఆత్మవిశ్వాసం కావాలి. మరొకసారి ఈ సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటూ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి హిందీలో ప్రసంగించారు.
***
A Viksit Bharat will be built on strong foundations of scientific research, discoveries and the spirit of innovation. Speaking at the Emerging Science, Technology and Innovation Conclave in New Delhi. https://t.co/7VshP2K7GU
— Narendra Modi (@narendramodi) October 27, 2026
India must innovate and lead the world in shaping the technologies of tomorrow. https://t.co/jCI8XwQxsJ
— PMO India (@PMOIndia) October 27, 2026
India aims to achieve self-reliance and build strength in critical technologies. https://t.co/H8YNQbRf3G
— PMO India (@PMOIndia) October 27, 2026
AI can give quick answers, but it is essential to verify them. https://t.co/6lIKdPC7i2
— PMO India (@PMOIndia) October 27, 2026