Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాల తయారీ పర్యావరణ వ్యవస్థ బలోపేతం పథకానికి రూ. 11,000 కోట్లతో మంత్రివర్గ ఆమోదం


రూ. 11,000 కోట్ల వ్యయంతో ‘నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాల తయారీ వ్యవస్థ బలోపేత పథకానికి’ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ (ఎంహెచ్ఐ) అమలు చేయనున్న ఈ పథకం.. దేశీయంగా నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాలు, వాటి విడిభాగాల తయారీని ప్రోత్సహించడంతోపాటు, దేశంలో ప్రత్యేక సీఐఈ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా స్వావలంబనను పెంపొందిస్తూ అంతర్జాతీయ సీఐఈ మార్కెట్‌లో భారత్‌ను కీలక శక్తిగా నిలిపేందుకు ఇది దోహదపడుతుంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 97,500 కోట్ల మార్కెట్ పరిమాణంతో.. చైనా, అమెరికా తర్వాత భారత నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాల పరిశ్రమ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద వ్యవస్థగా ఉంది. మౌలిక సదుపాయాలు (రహదారులు, ఓడరేవులు), గృహ నిర్మాణ రంగాల్లో వేగవంతమైన వృద్ధి ద్వారా ఈ పరిశ్రమ రెట్టింపు కన్నా ఎక్కువగా వృద్ధి చెంది.. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి దాదాపు రూ. 2,28,100 కోట్ల మార్కెట్ పరిమాణానికి చేరుకుంటుందని అంచనా.

నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగంలో వేగవంతమైన వృద్ధి నేపథ్యంలో.. షిప్-టు-షోర్ క్రేన్లు, టన్నెల్ బోరింగ్ మెషీన్లు, హైడ్రాలిక్ ఎక్స్‌కవేటర్లు, ఆఫ్-హైవే ట్రక్కులు మొదలైన సాంకేతిక అధునాతన పరికరాల తయారీని ప్రోత్సహించాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో అత్యాధునిక ప్రత్యేక సీఐఈ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే నిబంధనలు కూడా ఈ పథకంలో ఉన్నాయి.

2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఎనిమిదేళ్ల కాలపరిమితితో ఈ పథకాన్ని రూపొందించారు. ఇందులో తయారీ కేంద్రాల ఏర్పాటుకు రెండేళ్ల ప్రారంభ దశ (2026-27 నుంచి 2027-28)గాను, ఆ తర్వాత అయిదేళ్ల పాటు (2028-29 నుంచి 2032-33) ప్రోత్సాహకాల పంపిణీ కాలంగాను ఉంటాయి. అనంతరం చివరి సంవత్సరం (2033-34)లో 2032-33 ఆర్థిక సంవత్సరపు అదనపు అమ్మకాలపై ప్రోత్సాహకాలను చెల్లిస్తారు.

ఈ పథకంలో రెండు భాగాలున్నాయి:

  1. అమ్మకాల ఆధారిత ప్రోత్సాహకం: అర్హత కలిగిన ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (ఓఈఎం), విడిభాగాల తయారీదారులు అనే రెండు విభాగాల్లో ఆమోదం పొందిన దరఖాస్తుదారులకు.. అర్హత గల సీఐఈ పరికరాలు, విడిభాగాల అదనపు అమ్మకాల విలువపై ప్రోత్సాహకాలను అందిస్తారు. అయిదేళ్ల కాలానికి అదనపు అమ్మకాల విలువపై గ్రేడెడ్ ప్రోత్సాహక రేట్లు 13% నుంచి 8% వరకు ఉంటాయి.
  2. సీఐఈ పరీక్ష కేంద్రం కోసం గ్రాంట్: ప్రత్యేక సీఐఈ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూపంలో రూ. 375 కోట్ల వరకు గ్రాంటును అందిస్తారు.

దేశీయ నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాల తయారీ వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంపొందించే దిశగా భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక కీలక మైలురాయి. సీఐఈ తయారీలో దేశీయ సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా.. సరఫరా వ్యవస్థ భద్రతను ఈ పథకం పెంపొందిస్తుంది. ఉపాధి అవకాశాలను పెచండమే కాకుండా ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహిస్తుంది. ‘వికసిత్ భారత్ @2047’ దార్శనికతకు అనుగుణంగా.. సాంకేతికంగా స్వావలంబన కలిగిన, అంతర్జాతీయంగా పోటీపడగల, సుస్థిరమైన పారిశ్రామిక పునాదులను నిర్మించాలన్న ప్రభుత్వ అచంచల నిబద్ధతకు ఇది అద్దం పడుతోంది.  

***