Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2015 అనంతర అభివృద్ధి అజెండా (న్యూయార్క్, 2015 సెప్టెంబర్ 25) అనే అంశంపై ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధాని ఆంగ్ల ప్రకటన పూర్తి పాఠం

2015 అనంతర అభివృద్ధి అజెండా (న్యూయార్క్, 2015 సెప్టెంబర్ 25) అనే అంశంపై ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధాని ఆంగ్ల ప్రకటన పూర్తి పాఠం

2015 అనంతర అభివృద్ధి అజెండా (న్యూయార్క్, 2015 సెప్టెంబర్ 25) అనే అంశంపై ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధాని ఆంగ్ల ప్రకటన పూర్తి పాఠం

2015 అనంతర అభివృద్ధి అజెండా (న్యూయార్క్, 2015 సెప్టెంబర్ 25) అనే అంశంపై ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధాని ఆంగ్ల ప్రకటన పూర్తి పాఠం

2015 అనంతర అభివృద్ధి అజెండా (న్యూయార్క్, 2015 సెప్టెంబర్ 25) అనే అంశంపై ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధాని ఆంగ్ల ప్రకటన పూర్తి పాఠం


మహోదయులారా,

“మనం చూడలేని ప్రపంచం గురించి ప్రతీ ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలి” అని మహాత్మాగాంధీ ఒక సారి అన్నారు.

ప్రపంచ మానవాళి తన బాధ్యతలు గుర్తెరిగి కలిసికట్టుగా పని చేయడంతో పాటు భవిష్యత్ తరాల పట్ల బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు వాస్తవానికి మానవ ప్రపంచం ఎంతో పురోగమించింది.

ఒక విషాదపూరితమైన యుద్ధానికి తెర పడి కొత్త శకానికి ఆశలు చిగురించిన ఏడు దశాబ్దాల తర్వాత మానవాళి, మనం నివశిస్తున్న భూమండలం భవిష్యత్ దిశను రూపొందించేందుకు మనందరం సమావేశమయ్యాం. ఇది చాలా కీలకమైన సమావేశమని నేను భావిస్తున్నాను. ఈ సదస్సు ఏర్పాటు చేసినందుకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి కృతజ్ఞతలు.

2030 తర్వాత కాలానికి మన దృక్కోణం అతి ఉన్నతమైనది, లక్ష్యాలు సమగ్రమైనవి. దశాబ్దాల తరబడి మనని వేధిస్తున్న సమస్యలకు ఆ అజెండా ప్రాధాన్యత ఇస్తోంది. మన జీవితాలను నిర్వచిస్తున్న సామాజిక, ఆర్థిక, పర్యావరణపరమైన అంశాల పట్ల మన అవగాహనను అది ప్రతిబింబిస్తోంది.

మనం గతంలో కనివిని ఎరుగని సంపన్నవంతమైన యుగంలో జీవనం సాగిస్తున్నాం. అదే సమయంలో ఆ సంపద నిరాకరణకు గురవుతున్న వారు కూడా ఎందరో ఉన్నారు.

ఈ ప్రపంచం నుంచి అన్ని రకాలైన పేదరికాన్ని తరిమివేయాలన్నది మన లక్ష్యాల్లో అగ్రస్థానంలో ఉన్నదని తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను. ప్రపంచంలోని 130 కోట్ల మంది పేదల అవసరాలు తీర్చడం వారి జీవితాలను ఉద్ధరించడంతో ముడిపడిన అంశం మాత్రమే కాదు…వారి ఆత్మగౌరవానికి, మన నైతిక బాధ్యతకు కూడా దర్పణం పడుతుంది. శాంతియుతమైన, సుస్థిరమైన, న్యాయబద్ధమైన ప్రపంచాన్ని సృష్టించడం కీలక అవసరం కూడా అని నేనున తెలియచేస్తున్నాను.

ప్రముఖ భారత తాత్వికుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ తన ఆలోచనలను ఆవిష్కరించే విషయంలో నిరుపేదల సంక్షేమానికి పెద్ద పీట వేశారు. 2030 అజెండాలో కూడా అదే ఆలోచనా ధోరణిని మేం చూస్తున్నాం. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శతవసంతోత్సవాలను ఇదే రోజు మేం ప్రారంభిస్తూ ఉండడం యాదృచ్ఛికమే.

మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించడానికి, ప్రపంచాన్ని అభివృద్ధిపథంలో నడిపించడానికి ఆర్థిక వృద్ధి, పారిశ్రామికీకరణ, మౌలిక వసతులు, ఇంధనం కీలకం.

పర్యావరణపరమైన లక్ష్యాలకు ప్రత్యేకించి వాతావరణ మార్పులు, సుస్థిరమైన వినియోగానికి ఇస్తున్న ప్రాధాన్యతలను మేం ఆహ్వానిస్తున్నాం. అలాగే సముద్ర పర్యావరణాన్ని కాపాడేందుకు తీసుకున్న కట్టుబాటు కూడా అందుకు ఎదురవుతున్న సవాలుకు, అవకాశాలకు దర్పణం పడుతోంది. అంతే కాదు సముద్ర ద్వీపకల్ప దేశాల భవిష్యత్తుపై కూడా మనం దృష్టి సారించాల్సిన అవసరాన్ని అది గుర్తు చేస్తోంది.

సముద్ర, నీలి గగన సంపదను పరిరక్షించుకోవడం, వాటిని సుస్థిరమైన అభివృద్ధికి ఉపయోగించుకోవడం లక్ష్యంగా నీలి విప్లవం గురించి నేను తరచు మాట్లాడుతున్నాను.

ఈ రోజు భారత అభివృద్ధి అజెండా మొత్తం స్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ప్రతిబింబిస్తోంది.

దేశానికి స్వాతత్ర్యం సిద్ధించిన నాటి నుంచి పేదరిక నిర్మూలన కలను సాకారం చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. పేదల్లో సాధికారత ద్వారా పేదరికాన్ని నిర్మూలించడం మా ధ్యేయం. విద్య, నైపుణ్యాల వృద్ధిపై మేం దృష్టి పెడుతున్నాం.

పేదరికంపై పోరాటంలో మేం సాంప్రదాయిక అభివృద్ధి పథకాలతో పాటు సమ్మిళిత వృద్ధి, సాధికారత లక్ష్యంగా కొత్త శకాన్ని కూడా ఆవిష్కరించాం. తద్వారా సుదూల స్వప్నాలను తక్షణ అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాం. 180 మిలియన్ కొత్త బ్యాంకు ఖాతాలు తెరిచాం. ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాలు అందుబాటులోకి తెచ్చాం. ఇంతవరకు బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాలకు బ్యాంకు సేవలు విస్తరించాం. బీమాను అందరికీ అందుబాటులోకి తెచ్చాం. జీవితంలో చరమ దశకు వస్తున్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తున్నాం.

ప్రపంచం యావత్తు ప్రైవేటు, ప్రభుత్వ రంగాల గురించి మాట్లాడుతోంది. తాజాగా మేం వ్యక్తిగత పారిశ్రామిక నైపుణ్యాలను, సూక్ష్మ పరిశ్రమలు, మైక్రో ఫైనాన్స్ విభాగాలను ప్రోత్సహించేందుకు కొత్తగా పర్సనల్ సెక్టార్ను ఆవిష్కరించాం. డిజిటల్, మొబైల్ అప్లికేషన్ల శక్తిని కూడా వినియోగంలోకి తెస్తున్నాం.

ప్రజలందరికీ ఇల్లు, విద్యుత్తు, నీరు, పారిశుధ్య వసతుల కల్పనపై దృష్టి సారించాం. ఇవి ప్రజల సంక్షేమానికే కాదు…మానవాళి ఆత్మగౌరవానికి కూడా కీలకమన్నది మా భావన. ఇవేవీ ఆశావహ లక్ష్యాలు కాదు…నిర్దిష్ట తేదీకి సాధించాలనుకుంటున్న లక్ష్యాలు. భారత దేశ అభివృద్ధిని మహిళా సాధికారతతో అనుసంధానం చేశాం. ఇందులో భాగంగా బాలికలందరినీ విద్యావంతులను చేయడం ప్రతి ఒక్క కుటుంబ ప్రాధాన్యతగా నిర్దేశించాం.

మా పంటభూములను మరింత ఉత్పాదకంగా మారుస్తున్నాం. మార్కెట్లతో అనుసంధానం మెరుగుపరుస్తున్నాం. రైతన్నలకు ప్రకృతి కరుణాకటాక్షాలపై ఆధారనీయతను తగ్గిస్తున్నాం.

తయారీ రంగాన్ని ఉత్తేజితం చేయడం, సేవల రంగాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాం. మౌలిక వసతులపై కనివిని ఎరుగని విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. నగరాలను ఆకర్షణీయమైనవిగాను, సుస్థిరమైనవిగాను తీర్చిదిద్దుతున్నాం. పురోగతికి చోదకశక్తులుగా అభివృద్ధి చేస్తున్నాం.

సుసంపన్నత కోసం స్థిరమైన బాటలో పయనించాలన్న దీక్ష తీసుకున్నాం. మా సహజసిద్ధమైన సంస్కృతి, సంప్రదాయాల నుంచి ఇది ఆవిర్భవించింది. భవష్యత్తు పట్ల మా కట్టుబాటు ఎంత పటిష్ఠంగా ఉన్నది ఇవి నిరూపిస్తున్నాయి.

మనం నివశించే భూమిని భూమాతగా పిలుచుకునే సాంప్రదాయానికి మేం ప్రతినిధులం.

“స్వచ్ఛంగా ఉండండి…మన భూమాత కోసం, ఆమె పిల్లలం మనందరం…”అని మా సంస్కృతి చెబుతోంది.

మా జాతీయ ప్రణాళికలు ఆశావహమైనవి, ఒక లక్ష్యంతో కూడుకున్నవి. ఇంధన సామర్థ్యం సాధించేందుకు వచ్చే ఏడు సంవత్సరాల కాలంలో 175 గిగావాట్ల పునర్ వినియోగ ఇంధన ఉత్పత్తిని జోడించడం లక్ష్యంగా పెట్టుకున్నాం.

మానవాళితో ఆరింట ఒక వంతు మంది సుస్థిర అభివృద్ధిని సాధించడం మన ప్రపంచానికి, సుందరమైన మన భూమండలానికి అత్యంత కీలకం. అలాంటి ప్రపంచం అతి స్వల్పమైన సవాళ్ళు, భారీ ఆశలు, విజయం పట్ల అకుంఠిత విశ్వాసంతో కూడినదిగా ఉంటుంది.

మా విజయం మా మిత్రులకు మరిన్ని వనరులు అందించేదిగా ఉంటుంది. ప్రపంచం అంతటినీ ఒకే కుటుంబంగా చూడాలని మా ప్రాచీన విలువలు సూచిస్తున్నాయి.

ఆసియా, ఆఫ్రికా ఖండాలకు చెందిన అభివృద్ధి భాగస్వాములు, పసిఫిక్ నుంచి అట్లాంటిక్ వరకు ద్వీపకల్ప దేశాల పట్ల మేం మాకున్న బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం.

సుస్థిర అభివృద్ధి దేశాలన్నింటి జాతీయ బాధ్యత. అందుకు అవసరమైన విధానాలు కూడా అవసరం.

అభివృద్ధి లక్ష్యాల సాధనకైనా, వాతావరణ మార్పులకు వ్యతిరేక పోరాటానికైనా అంతర్జాతీయ భాగస్వామ్యాలు అవసరమని భావిస్తున్నందు వల్లనే ఐక్యరాజ్యసమితి వేదికగా మనందరం ఇక్కడ సమావేశమయ్యాం.

మనందరి ఈ ఉమ్మడి ప్రయత్నానికి ఉమ్మడివే అయినా వేర్వేరు బాధ్యతల నిర్వహణ సూత్రం కీలకమైనది.

మనం వాతావరణ మార్పుల గురించి మాట్లాడుతున్నామంటే మన జీవనశైలిలో కోర్కెలు తీర్చుకోవడం అన్న అభిప్రాయానికి తావు ఏర్పడవచ్చు. కాని వాతావరణ న్యాయం గురించి మాట్లాడితే మాత్రం పేదలందరినీ ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడాలన్న మన కట్టుబాటు కనిపిస్తుంది.

వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాల విషయానికి వస్తే మనం దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు అవసరమైన పరిష్కారాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. స్వచ్ఛమైన, పునర్ వినియోగ ఇంధనాన్ని అందుబాటు ధరలకే అందరికీ అందించాలంటే సాంకేతిక పరిజ్ఞానం, నవ్యత, ఆర్థిక వనరులకు సంబంధించి అంతర్జాతీయ ప్రభుత్వ భాగస్వామ్యాలు అవసరం.

ఇదే సమయంలో ఇంధనంపై ఆధారనీయత తగ్గించుకుని మరింత స్థిరమైన వినియోగం దిశగా అడుగేయడానికి వీలుగా మన జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోవాలి.

ప్రకృతిని పరిరక్షించి, దీర్ఘకాలం పాటు మనగలిగేదిగా తీర్చి దిద్దేందుకు అంతర్జాతీయ విద్యా చైతన్య కార్యక్రమం ప్రారంభించడం అవసరం.

అభివృద్ధి, వాతావరణ మార్పుల కోసం ప్రపంచం పట్ల తమకు గల ఆర్థిక బాధ్యతను సంపన్న దేశాలు సక్రమంగా నిర్వర్తిస్తాయని నేను ఆశిస్తున్నాను.

స్వంత లాభాల కోసం కాకుండా సార్వత్రిక శ్రేయస్సు లక్ష్యంగా టెక్నాలజీ సహాయ యంత్రాంగాన్ని సాంకేతిక పరిజ్ఞానం, నవ్యతకు సాధనంగా ఉపయోగపడుతుందని కూడా నేను ఆశిస్తున్నాను.

దూరంగా ఉన్నంత మాత్రాన సవాళ్ళ నుంచి రక్షణ సాధ్యం కాదు. దూర ప్రాంతాల మధ్య ఏర్పడే సంఘర్షణలు, లేమి వల్ల అవి మరింత పెద్దవిగా మారతాయి.

తోటి మానవాళి సంఘీభావం నుంచి లభించే బలం, మన స్వప్రయోజనాల్లో పరిణతి ద్వారా మనం అంతర్జాతీయ భాగస్వామ్యాల తీరులో మార్పు తీసుకురావాలి.

మరింత విశ్వసనీయత, చట్టబద్ధత తీసుకురావడం, మరింత ఎక్కువ మందికి ప్రతినిధిగా నిలిచి మన లక్ష్యాలను నెరవేర్చుకోగల సమర్థ వ్యవస్థగా తీర్చి దిద్దేందుకు ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి రెండింటిలోనూ సంస్కరణలు తీసుకురావడం అవశ్యం.

ఈ ప్రపంచంలోకి ప్రవేశించే ప్రతి ఒక్క జీవికి భవిష్యత్తుకు భరోసా, అవకాశాలు, ఆత్మగౌరవం అందించగలదిగా ఈ భూమండలాన్ని తీర్చి దిద్దడాన్ని మించిన బాధ్యత మరొకటి ఉండదు. అప్పుడే మనం ప్రపంచాన్ని భవిష్యత్ తరాలకు మరింత మెరుగైన వసతులు అందించేదిగా తీర్చి దిద్దగలుగుతాం.

విజ్ఞత, అనుభవం, ఔదార్యం,కరుణ, నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం అండతో ఆ సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు పాటు పడతామన్న భావనతోనే మనందరం ఈ 70వ వార్షికోత్సవ సమయంలో ఇక్కడ కలుసుకున్నాం. దాన్ని సాధించగలమన్న నమ్మకం నాకుంది.

చివరిలో మా ప్రాచీన రచనల నుంచి ఈ కొన్ని వాక్యాలు మనందరి కోసం వల్లించి ముగించాలనుకుంటున్నాను.

అందరూ ఆనందంగా ఉండు గాక, అందరూ ఆరోగ్యంగా ఉండు గావుత, ఎవరికీ ఎలాంటి విచారాలు లేకుండా అందరూ సుఖసౌఖ్యాలతో జీవనం సాగింతురుగాక…

ధన్యవాదాలు.