పిఎంఇండియా
వేదికపై ఆసీనులైన మాననీయ వ్యక్తులారా,
ఇది అలహాబాద్ హైకోర్టు 150 వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమం. గత ఏడాది కాలం నుండి జరుగుతున్న ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు న్యూ ఇండియా సాధన కు కంటున్న కలల సాకారానికి కొత్త శక్తి, కొత్త ఉత్తేజం, కొత్త తీర్మానంగా నిలుస్తాయి. ప్రపంచ న్యాయ వ్యవస్థ లో 150 సంవత్సరాలుగా అలహాబాద్ హైకోర్టు అస్తిత్వం కొనసాగుతోంది. ఇది ఇప్పుడు న్యాయ వ్యవస్థకు ఒక దర్శనీయ కేంద్రంగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇటువంటి దర్శనీయ స్థలంలో మీ అందరితో కలిసి ఉండి, మీతో నా ఆలోచనలను పంచుకొనే భాగ్యం దక్కినందుకు నేను గర్వపడుతున్నాను. దీనిని ఒక ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను.
ప్రధాన న్యాయమూర్తి తన హృదయాంతరాళం నుండి మాట్లాడిన మాటలు నేను విన్నాను. ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలలో వ్యక్తమైన బాధను అర్ధం చేసుకొన్నాను. దానిని పరిష్కరించేందుకు ఏదో ఒకటి చేయవలసిన అవసరాన్ని గుర్తించాను. భారతదేశం లోని న్యాయమూర్తుల తీర్మానాలను సాకారం చేయడానికి ఈ నాయకత్వం సహాయకారిగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ప్రభుత్వం మీతో ఉందని, మీ బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చేందుకు కావలసిన సహకారాన్ని అందిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. అలహాబాద్ హైకోర్టు శత వార్షికోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరైన అప్పటి రాష్ర్టపతి డాక్టర్ రాధాకృష్ణన్ వారి ఆలోచనలను పంచుకొన్నారు. 50 సంవత్సరాల క్రితం ఆయన ప్రసంగం లోని ఒక పేరాను ఇప్పుడు చదువుతూ ఆ ఆలోచనలను పునరుద్ఘాటిస్తున్నాను.
ఆ రోజు రాధాకృష్ణన్ “చట్టం అనేది తరచు మారిపోతూ ఉంటుంది. చట్టాలు సాంప్రదాయక విలువలను ఆచరిస్తూనే ఆధునిక ధోరణులను, సవాళ్లను ప్రతిబింబించేవిగా ఉంటూ ప్రజల స్వభావానికి చేరువగా ఉండాలి. చట్టాలను సమీక్షించే సమయంలో ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. ఎటువంటి జీవనాన్ని మనం కోరుకొంటున్నాం, చట్టం ఏమిటి, దాని అంతిమ లక్ష్యం ఏమిటి..? ప్రజాసంక్షేమం అంటే సంపన్నుల సంక్షేమం ఒక్కటే కాదు, దేశంలో ప్రతి ఒక్క పౌరుని సంక్షేమం. దానిని సాధించడమే చట్టాల లక్ష్యం కావాలి. అందుకు శ్రమించాలి” అని అన్నారు.
50 సంవత్సరాల క్రితమే డాక్టర్ రాధాకృష్ణన్ గారు న్యాయమూర్తులకు, పాలకులకు అత్యంత కీలకమైన సందేశాన్ని ఇచ్చారని నేను భావిస్తున్నాను. అది ఈ రోజుకు కూడా వర్తిస్తుంది, ఇప్పటికీ కొనియాడదగింది.
ఏదైనా ఒక నిర్ణయం మంచిదా లేక చెడుదా అని ఎలా నిర్ణయిస్తారు ?, దానికి గీటురాయి ఏమిటి ? అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకొన్నపుడు ఒక సగటు జీవిని గురించి ఆలోచించి ఆ నిర్ణయం ప్రభావం అతనిపై ఎలా ఉంటుందో ఆలోచించాలి. అది అతనిపై సానుకూల ప్రభావాన్నే చూపుతుందని భావించినట్టయితే ఆ నిర్ణయం విషయంలో ముందుకు సాగవచ్చు అని గాంధీ గారు చెప్పారు.
ఈ ఆలోచనను మన జీవితంలో భాగంగా ఎలా చేసుకోవాలి ? గాలి దిశను మార్చగల విధంగా మన జీవిత లక్ష్యాలను ఎలా తీర్చి దిద్దుకోవాలి ? స్వాతంత్ర్యానికి ముందు దేశ న్యాయ వ్యవస్థలోని వారు ప్రత్యేకించి అలహాబాద్‌కు చెందిన వారు స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. బ్రిటిష్ రాజ్యంపై నిర్భీతిగా పోరాటం సాగిస్తూ కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తిగా నిలచారు. తదుపరి రాజకీయ రంగంలోకి ప్రవేశించిన ఆ తరానికి చెందిన స్వాతంత్ర్య యోధులకు న్యాయ శాఖ నేపథ్యం ఉండేది. వారు స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపించడమే కాకుండా తదుపరి కాలంలో పాలన వ్యవస్థకు కూడా మార్గనిర్దేశం చేశారు. దేశాన్ని స్వేచ్ఛగా చూడడమే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరి కల. ఆ కలే లేకపోయి ఉంటే, స్వాతంత్ర్యం సాధ్యమయ్యేదే కాదు. ప్రతి ఒక్క పౌరుని గుండెలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించడమే గాంధీ గారి ప్రత్యేకత. చీపురు పట్టి రహదారులను శుభ్రం చేసే వ్యక్తి స్వాతంత్ర్య సాధన కోసమే తాను ఆ పనిని చేస్తున్నానని భావించే వాడు. అలాగే విద్యారంగంలో పని చేస్తున్న వారిలో ప్రతి ఒక్కరు అదే భావనతో ఉండే వారు. ఖాదీని ధరించే వారు దేశం కోసమే తాము అది ధరిస్తున్నట్టు భావించే వారు. అటువంటి స్ఫూర్తిని ఆయన వ్యక్తిగత హోదాలో ప్రతి ఒక్కరిలో రగిలించారు. స్వాతంత్ర్య ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన అలహాబాద్ వంటి ప్రదేశంలో ఈ రోజు నేనున్నాను.
మనం స్వాతంత్ర్యం సాధించి 70 సంవత్సరాలు పూర్తి అయింది. 2022వ సంవత్సరంలో 75 సంవత్సరాలను పూర్తి చేసుకోబోతున్నాం. దేశానికి స్ఫూర్తిని అలహాబాద్ అందించగలదా ? మనం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకొనే సమయానికి దేశాన్ని సరికొత్త శిఖరాలపై నిలపాలన్న ఆకాంక్ష సిద్ధింపచేయడానికి సాహసం, పునరుత్తేజం 125 కోట్ల మంది భారతీయులలో రగిలించి వారిని కార్యోన్ముఖులను చేయగలదా ? 2022 లక్ష్యంగా ప్రతి ఒక్క భారతీయునికి ఒక ప్రణాళిక ఉండాలి. మంచి ఫలితాన్ని సాధించగలమా అనే సందేహం ఏ ఒక్కరిలో ఉండకూడదన్నది నా భావన.
125 కోట్ల మంది భారతీయులు, మన సంస్థలు, ప్రభుత్వం, సమాజంలో అపారమైన బలం ఉంది. ఈ రోజు 150 సంవత్సరాలు పూర్తి చేసుకొంటున్న వేడుకను నిర్వహించుకొంటున్న ఈ తరుణంలో అప్పటి డాక్టర్ రాధాకృష్ణన్, మహాత్మ గాంధీ గారులు ప్రవచించిన సిద్ధాంతాలే స్ఫూర్తిగా దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే కట్టుబాటుతో ఎవరు ఏ రంగంలో ఉన్నా ముందుకు దూకాలి. ప్రధాన న్యాయమూర్తి మాటల్లో ఆ వేడి ఉంది. మనందరిలోనూ ఆ వేడి ఉంది. అదే ఇంధనంగా మారి, దేశంలో మార్పు ను తీసుకు రాగలుగుతుంది. మన స్వాతంత్ర్య యోధుల కలలే ఆధారంగా ప్రతి ఒక్కరు ఒక సంకల్పం తీసుకోవాలని, 75వ స్వాతంత్ర్య వేడుకల సమయానికి దానిని సాకారం చేసేందుకు కృషి చేయాలని దేశవాసులందరికీ ఈ వేదిక మీది నుండి నేను పిలుపునిస్తున్నాను. 125 కోట్ల మంది భారతీయులలో ప్రతి ఒక్కరు ఒక్క అడుగు ముందుకు వేసినా, 125 కోట్ల అడుగులు ముందుకు పడతాయి. అది వారి శక్తి.
2014 ఎన్నికలకు నేను ప్రచారం చేస్తున్న సమయంలో దేశం లోని చాలా మందికి నేను ఎవరో తెలియదు. నాకు ఎటువంటి గుర్తింపు లేదు. ఒక చిన్న కార్యక్రమంలో నన్ను ఇంటర్వ్యూ చేశారు. “నేను ఎన్ని కొత్త చట్టాలు రూపొందిస్తానో నాకు తెలియదు. నేను ప్రధాన మంత్రిని అయితే మాత్రం రోజుకో చట్టాన్ని తప్పనిసరిగా తొలగిస్తానని మాత్రం చెబుతున్నాను. ప్రభుత్వాలు సగటు జీవిపై విధించిన చట్టాల భారాన్ని తగ్గించాలనుకుంటున్నాను” అని ఆనాడు చెప్పాను.
మేం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికి అలాంటి కాలం చెల్లిపోయిన 1200 చట్టాలను రద్దు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అంటే రోజుకు ఒకటి కన్నా ఎక్కువ చట్టాలనే రద్దు చేశాం. భారాన్ని తగ్గించి మరింత సరళీకరించిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ మరింత సమర్థంగా పనిచేయడానికి దోహదపడుతుంది. నేటి సమాజంలో సాంకేతిక విజ్ఞానం ఈ ప్రయత్నంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడే ప్రధాన న్యాయమూర్తి చెప్పారు, పత్రాలతో పని లేకుండానే సెకండ్లలో ఫైలు దానికదే ముందుకు కదులుతుందని. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని న్యాయ వ్యవస్థను ప్రభుత్వం పటిష్ఠం చేసింది. పని సరళం అయిపోయింది. ప్రతి ఒక్క కేసు కోసం న్యాయమూర్తులు పుస్తకాలు ముందు వేసుకొని వాటిలో ప్రతి అక్షరం ఎంతో సూక్ష్మంగా చదివిన రోజులు ఉన్నాయి.
ఈ రోజు న్యాయవాదులు అప్పటి వలె కష్టపడాల్సిన అవసరం లేదు. వారు “గూగల్ గురు”ను అడిగితే చాలు. గూగల్ గురు వారికి కావలసిన సమాధానాన్ని అందిస్తుంది. సాంకేతిక విజ్ఞానం అన్నింటినీ సరళం చేసేసింది. న్యాయవాదులకు ఎనలేని శక్తిని అందించింది. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వాదనలో, ప్రతివాదనలో బలాన్ని చేకూర్చుకోవచ్చు. వాదనలలో సునిశితత్వాన్ని, నాణ్యతను అది తీసుకు వస్తుంది. వాదనలలో సునిశితత్వం పెరిగితే నిజాన్ని కనుగొనడం అంత కష్టం ఏమీ కాదు. ఈ ప్రక్రియ న్యాయ విధానాలలో వేగాన్ని పెంచుతుందని నేను అనుకొంటున్నాను. ఇది న్యాయ ప్రక్రియను వేగిరపరుస్తుంది. సాంకేతిక విజ్ఞానాన్ని ప్రతి దశలోనూ ఉపయోగించుకోవడం ఎలా ? ఈ రోజు కోర్టు కేసులకు సంబంధించిన తేదీల నిర్ణయం ఇంకా భౌతికంగానే జరుగుతోంది. ఎస్ఎమ్ఎస్ ఆధారంగా తేదీలు నిర్ణయించే రోజు ఎప్పుడు వస్తుంది ?
ఈ రోజు ఒక అధికారి ఒక నగరంలో పనిచేస్తున్నాడు; ఆయన హాజరు కావలసిన కేసు విచారణకు వస్తోంది; ఆ అధికారి బదిలీ అయ్యాడు. ఆ కేసు విచారణకు హాజరయ్యేందుకు ఆయన తాను పని చేస్తున్నప్రదేశాన్ని వదిలి, తన పని పక్కన పెట్టి గతంలో పని చేసిన ప్రదేశానికి ఎందుకు వెళ్లాలి? వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం మనం కల్పించలేమా ? ఆ విధానంలో తక్కువ సమయంలోనే ప్రశ్నించడం పూర్తి చేయొచ్చు కదా ? ఇలా చేయడం వల్ల వారి సమయాన్ని ఆదా చేసి పాలన యంత్రాంగంపై భారాన్ని తగ్గించవచ్చు. ఖైదీలను విచారణ కోసం న్యాయస్థానానికి తీసుకు వెళ్లడానికి భద్రత, ఇతరత్రా అవసరాలపై ఎంతో ఖర్చవుతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ రోజు యోగి గారు అధికారంలోకి వచ్చారు. ఈ ధోరణి ఆగవచ్చు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కారాగారాలను న్యాయస్థానాలతో అనుసంధానం చేసినట్టయితే భారీ మొత్తంలో వ్యయాలను మనం తగ్గించవచ్చు. మొత్తం ప్రక్రియను మనం సరళం చేయవచ్చు. ఐసిటి ద్వారా మన న్యాయ వ్యవస్థ పూర్తి ప్రయోజనాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. భవిష్యత్ న్యాయ వ్యవస్థకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాలు రూపొందించాలని నేను స్టార్ట్- అప్ల లోని యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. సాంకేతిక విజ్ఞానంతో న్యాయ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి వారు కృషి చేయాలి. నాలుగు కోణాల నుండి మనం ప్రయత్నం చేసినట్టయితే ఒకదానికి మరొకటి బలంగా నిలచి మంచి ఫలితాలను సాధించగలుగుతాం.
దిలీప్ గారికి, ఆయన యావత్తు బృందానికి, గౌరవ న్యాయమూర్తులు, మిత్రులు అందరికీ 150వ వార్షికోత్సవం సందర్భంగా మరోసారి అభినందనలు తెలియచేస్తున్నాను. ఇప్పుడు 2022 కల్లా 75వ స్వాతంత్ర్య దిన సంకల్పాన్ని సాకారం చేసే దిశగా అడుగేయాలని, ఈ కృషిలో ఎటువంటి అవకాశాన్ని జారవిడుచుకోరాదని నేను కోరుతున్నాను. మన దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు, కొత్త తరానికి న్యూ ఇండియా ను అందించేందుకు మనం శ్రమించాలి. ఈ ఒక్క ఆకాంక్షతో మీ అందరికీ నేను నా యొక్క కృతజ్ఞతలును వ్యక్తం చేస్తున్నాను.
మీకు ఇవే ధన్యవాదాలు.
The Allahabad HC is like a 'Tirtha Kshetra' for our judiciary: PM @narendramodi pic.twitter.com/Hi9fVjO7Cv
— PMO India (@PMOIndia) April 2, 2017
Those associated with the legal profession played a vital role in the freedom struggle & protected our people against colonialism: PM pic.twitter.com/E9sOGCzOZU
— PMO India (@PMOIndia) April 2, 2017
Gandhi Ji was special because he integrated everything he did, be it cleanliness or Khadi, with the freedom of India: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 2, 2017
Let us think about the India we want to create when we mark 75 years of freedom in 2022. Let every citizen prepare that roadmap: PM
— PMO India (@PMOIndia) April 2, 2017
Over 1200 obsolete laws have been scrapped by the Government since May 2014: PM @narendramodi pic.twitter.com/OzEqM4jzsg
— PMO India (@PMOIndia) April 2, 2017
Technology is playing a big role in this century and I see technology having a big scope in the judiciary as well: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 2, 2017
I urge those involved with the start up sector to innovate on aspects where technology can help the judiciary: PM @narendramodi pic.twitter.com/XiYRc5VP3u
— PMO India (@PMOIndia) April 2, 2017