Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త్‌-ఈజిప్టు మ‌ధ్య స‌ముద్ర‌యాన‌ వాణిజ్య ఒప్పందం


భార‌త్‌, ఈజిప్టు మ‌ధ్య స‌ముద్ర‌యాన‌ వాణిజ్య ఒప్పందంపై సంత‌కాలు చేయ‌టానికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌ న‌రేంద్ర మోదీ సార‌థ్యంలో స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ అనుమ‌తి మంజూరు చేసింది. షిప్పింగ్ రంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం ద్వారా ఇరుదేశాల‌కున్న ద్వైపాక్షిక ప్ర‌యోజ‌నాలను గుర్తించి ఒప్పందానికి అంగీక‌రించారు. వాణిజ్య షిప్పింగ్‌, ఇత‌ర స‌ముద్ర‌యాన వాణిజ్యం విష‌యాల్లో నిరంత‌ర ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం, స‌ల‌హాలను ప‌టిష్ఠ ప‌ర‌చాల‌న్న దృష్టితో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇరు దేశాల‌కూ అంగీకార‌యోగ్య‌మైన స‌మ‌యంలో, వేదిక‌లో ఒప్పందంపై సంత‌కాలు చేస్తారు.

రెండు దేశాలు స‌ముద్ర‌యాన వాణిజ్య సంబంధాలను మ‌రింత ప్రోత్స‌హించ‌టానికి, స్థిరంగా అభివృద్ధి చేసుకోవ‌టానికి ఈ ఒప్పందం వీలుక‌లిపిస్తుంది. వివిధ స‌ముద్ర నౌకాయాన వాణిజ్య వ్య‌వ‌స్థ‌ల్లోని సిబ్బంది, విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఆదాన ప్ర‌దానాల‌కు, స‌ముద్ర‌మార్గం, నౌకాకేంద్రాల్లో వాణిజ్య వ‌స్తువుల రాక‌పోక‌ల్ని వేగ‌వంతం చేయ‌టానికి అవ‌స‌ర‌మైన స‌మాచార ఆదాన ప్ర‌దానాల‌కు, సముద్ర‌యాన వాణిజ్యం, నౌకానిర్మాణం, మ‌ర‌మ్మత్తులు, స‌ముద్ర‌యాన శిక్ష‌ణ‌, స‌మాచార సాంకేతిక‌త (సిమ్యులేట‌ర్ల అభివృద్ధి స‌హా), నౌకాకేంద్రాల్లో స‌దుపాయాల క‌ల్ప‌న‌, త‌దిత‌ర స‌ముద్ర‌యాన కార్యక‌లాపాల్లో ఉమ్మ‌డి పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఈ ఒప్పందం ద్వారా వీల‌వుతుంది.