Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాలు మరియు స్వామి వివేకానందుని శికాగో ప్రసంగానికి 125 వ సంవత్సరం సందర్భంగా విద్యార్థుల సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం


ఇక్కడ స్థలం తక్కువగా ఉండడంతో చాలా మంది వేరే గదిలో కూర్చున్నారని నాకు చెప్పారు. వారందరినీ కూడా సగౌరవంగా గుర్తు చేసుకుంటున్నాను.

ఈ రోజు సెప్టెంబర్ 11వ తేదీ. 2001 సంవత్సరానికి ముందు 9/11 ప్రాధాన్యం గురించి చాలా మందికి తెలియదు. అది ప్రపంచం తప్పిదం కాదు, ఒక గొప్పతనాన్ని మరుగుపరచి తెలియని స్థితి లోకి నెట్టివేసిన మన తప్పిదం. అలా జరిగి ఉండకపోతే, 21 వ శతాబ్ది లోని 9/11 మన మనస్సులలో ఇంత బలంగా నాటుకుపోయేది కాదు. 125 సంవత్సరాల క్రితమే 9/11 సంఘటన జరిగింది. మన దేశానికి చెందిన యువకుడు, కాషాయ వస్త్రాలను ధరించిన వాడు.. అంతవరకు ప్రపంచానికి అంతగా తెలియని రంగు దుస్తులు ధరించిన యువకుడు, బానిసత్వపు దేశ ప్రతినిధిగా ప్రపంచం భావించిన వాడు భారతదేశం సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాడు. వేలాది సంవత్సరాల బానిసత్వ శృంఖలాల అనంతరం సైతం దేశ మహోన్నత వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకొని దేశం, దేశ తత్వ సంపద, జీవన ప్రమాణాలు ప్రపంచానికి ఇవ్వగలిగినవి ఎంతో ఉన్నాయని వెల్లడించాడు. ఇది అత్యంత అసాధారణమైన విషయం.

మన చుట్టూ అన్నీ ప్రతికూలతలు, మన విశ్వాసాలకు విఘాతం, మన చుట్టూ నిరసన వాక్కులు నిండి ఉన్న వాతావరణంలో నాటి విశ్వాసాలను మనం గుర్తు కు తెచ్చుకోవాలి. ఇలాంటి ప్రతికూలతలు నెలకొన్న వాతావరణంలో మనం ఆచితూచి ఆలోచించవలసివుంటుంది. లేదంటే మన మాటలకు తప్పుడు భాష్యాలు ప్రచారం చేస్తారు. కానీ ఆయన వ్యక్తిత్వం లోని శక్తిని గమనించండి. ఇలాంటివి ఏవీ ఆయనను ఒత్తిడికి గురి చేయలేదు. తనలో అంతర్గతంగా ప్రజ్వరిల్లుతున్న అగ్ని, అంతర్ముఖంగా ఉన్న ఆలోచనల బలం, అపారమైన ఆత్మవిశ్వాసం గల వ్యక్తి మాత్రమే ప్రపంచానికి కొత్త బాటను చూపించే ప్రయత్నం, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం అందించే ప్రయత్నం చేస్తాడు. అంతకు ముందు ఎవరైనా “లేడీస్ అండ్ జెంటిల్ మెన్” అనే సంబోధన ను మాత్రమే ప్రపంచం విన్నది. కానీ “అమెరికాకు చెందిన సోదరులు మరియు సోదరీమణులారా” అని ఆయన సంబోధించినప్పుడు కొన్ని నిముషాల పాటు కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. ఈ పదాలతోనే భారతదేశం శక్తి ఏమిటో ఆయన ప్రపంచానికి చాటి చెప్పాడు. అది ఒక 9/11 సంఘటనే కదా ? ఆయన దేశవ్యాప్తంగా ప్రయాణించి తన లోని అంతర్గత భారత మాతను సందర్శించాడు. దక్షిణాది నుండి ఉత్తరాది వరకు, తూర్పు నుండి పశ్చిమం వరకు అన్ని భాషలను ఆకళింపు చేసుకున్నాడు. మాతృభూమి లోని అద్భుత శక్తిని గుర్తించిన ఆయన కొన్ని క్షణాల్లోనే ప్రపంచం యావత్తును తనదిగా మార్చేసుకున్నాడు. భిన్న సంస్కృతుల నేపథ్యంలో అక్కడ సమావేశమైన యావత్ ప్రపంచానికి ఏకత్వ భావనను అందజేశాడు. మొత్తం ప్రపంచాన్ని తన మాటల శక్తితో జయించాడు. అదే 9/11. అదే వాస్తవానికి ప్రపంచాన్ని జయించడం. కానీ 21వ శతాబ్ది ప్రారంభంలో జరిగిన 9/11 ప్రపంచంలో విధ్వంసాన్ని సృష్టించింది, ఎందరో అమాయకులను ఊచకోత కోసింది. అదే అమెరికా భూమిపై జరిగిన 9/11 సంఘటనలు రెండింటిలో ఒకటి ప్రేమను, ఏకత్వ భావాన్ని ప్రపంచంలో నింపితే, మరో సంఘటన విధ్వంసాన్ని రగిలించి ప్రపంచం యావత్తును గడగడ వణికించింది. ఆ రకంగా అది మొదటి 9/11 నుంచి నేర్చుకున్న పాఠాలు మరిచిపోయేలా చేసింది. అప్పుడే ప్రపంచం యావత్తు ఈ రెండు 9/11 సంఘటనల మధ్యన గల తేడాను గుర్తించగలిగారు.

వివేకానందుల వారిని భిన్నంగా అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. లోతుగా చూస్తే వివేకానందునిలో రెండు అంశాలు మనకు కనిపిస్తాయి. ఆయన ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా, మాట్లాడే అవకాశం వచ్చినా భారతీయ తత్త్వ చింతన, ఎంతో విలువైన సంప్రదాయాలను గురించి గొప్పగా చెప్పే వాడు. ఇలా మాట్లాడడానికి ఆయన ఎప్పుడూ ఎలాంటి ఇరకాటాన్ని అనుభవించలేదు. అదే సమయంలో ఆయన దేశంలో ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా మన లోని చెడును విమర్శించే వాడు. మన లోపలి బలహీనతలను నిర్మొహమాటంగా చెప్పే వాడు. ఆ రోజు ఆయన ఉపయోగించిన మాటలు వింటే ఇప్పుడు అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. ఎవరైనా ఇంత శక్తివంతమైన మాటలు ఎలా ఉపయోగించగలరంటూ ఆశ్చర్యపోతారు. సమాజం లోని ప్రతి ఒక్క చెడు భావనను ఆయన దునుమాడే వాడు. సమాజం ఆచరించే ఆచారాలు, ఆరాధనా ధోరణులు, ఛాందస భావం వంటివి ఎత్తి చూపుతూ ఇలాంటి భావాలు అనుసరిస్తూ దేవాలయాల్లోనే ఆరాధనలు చేస్తూ మీరు భగవంతుని చేరలేరు అని ఒక 30 సంవత్సరాల యువకుడు చాటి చెప్పాడు. “మానవసేవే మాధవ సేవ” అని, “పేదల వద్దకు వెళ్లండి, వారికి సేవ చేయండి, మీరు భగవంతుని చేరగలరు” అని చెప్పే వాడు. ఎంత గొప్ప శక్తి ఆయనది! అదే వ్యక్తి దేశం వెలుపలకు వెళ్లినప్పుడు మహోజ్జ్వలమైన మన వారసత్వాన్ని ఎంతో గొప్పగా చెప్పి దేశంలో సంచరించినప్పుడు మాత్రం మన లోని సామాజిక దురాగతాలను దునుమాడే వాడు.

ఆయన ఋషుల కాలానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ గురువు కోసం ఎప్పుడూ అన్వేషించలేదు. సత్యాన్వేషణ మాత్రమే చేశాడు. మహాత్మ గాంధీ గారు సైతం జీవిత పర్యంతం సత్యాన్వేషణే చేశారు. అప్పట్లో వివేకానందుల వారి కుటుంబం ఆర్థికంగా ఎన్నో కష్టాల్లో ఉంది. రామకృష్ణ దేవులు ఆయనను కాళీమాత దగ్గరకు పంపి “ఆ మాత నుండి నీకు ఏం కావాలో అది కోరుకో” అని చెప్పారు. ఆ తరువాత కాళీమాతను ఏమైనా కోరావా అని అడిగితే “నేనేమీ కోరలేదు” అన్నాడాయన. ఆయన వ్యక్తిత్వం అంత గొప్పది. స్వయంగా కాళీమాత ముందు నిలచి కూడా ఏమీ కోరని నిష్కామ యోగి ఆయన. అంతటి అంతర్గత బలం ఆయనకు ఎక్కడ నుండి లభించింది ? ఈ రోజు కూడా సమాజంలో ఎన్నో దురాగతాలు ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా మనం పోరాడలేమా ? మౌనంగా వాటిని ఆమోదించాల్సిందేనా ? వివేకానందుల వారు అమెరికా గడ్డపైన నిలబడి అమెరికా లోని సోదరులు మరియు సోదరీమణులారా అని సంబోధించినప్పుడు గంతులు వేస్తూ ఈలలు వేశాం. అదే స్ఫూర్తితో సమాజం లోని మహిళలను గౌరవించలేమా ?, బాలికలను గౌరవంగా చూడలేమా ? అని నేను యువతను ప్రశ్నిస్తున్నాను. అలా చేసే వారికి శత వందనాలు చేస్తాను. బాలికలు కూడా మీ వలెనే భగవంతుని సృష్టి. మరి వారిని అదే భావనతో చూడలేకపోతే వివేకానందుల వారు ఉపయోగించిన సోదరులు మరియు సోదరీమణులారా అనే పదానికి చిందులేసే హక్కు ఎక్కడిదో పదేపదే మీరే ఆలోచించుకోండి.

సమాజ సేవే మాధవసేవ అన్న వివేకానందుల వారి మాటలను గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా ? 30 సంవత్సరాల యువకుడు ఆ రోజు ప్రపంచంలో తన మాటల శక్తితో అలలను సృష్టించాడు. బానిసత్వ భావన మన చుట్టూ అలముకున్న ఆ రోజుల్లో రెండు సంఘటనలు భారతదేశం శక్తిని చాటాయి. రవీంద్రనాథ్ టాగోర్ కు నోబెల్ బహుమతి లభించడం ఒకటైతే, వివేకానందుల వారి 9/11 ప్రసంగం రెండోది. ఈ రెండూ ప్రపంచం అంతటా చర్చనీయాంశంగా నిలచాయి. ఇద్దరూ బెంగాలీలే. వారి చర్యలు భారతీయ అంతర్గత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాయి. భారతదేశం, శ్రీ లంక, బాంగ్లాదేశ్.. మూడు దేశాలకూ రవీంద్రుడే జాతీయ గీతాలను సమకూర్చారని ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా చెప్పగలగడం నాకెంత గర్వకారణమో మీరే ఆలోచించండి. మన ఈ చారిత్రక వైభవం మనకు గర్వకారణం కాదా? నేడు భారతదేశం ప్రపంచం లోనే యువ శక్తి అపారంగా ఉన్న దేశం. ఈ రోజు దేశ యువతలో 80 కోట్ల మంది ఆనాడు వివేకానందుల వారు శికాగో ప్రసంగాన్ని చేసినప్పుడు ఆయన వయసుతో సమానమైన వయస్సు లోని వారు. 65 శాతం మంది ఆయన కన్నా తక్కువ వయసులోని వారు. వారికి వివేకానందుల వారికి మించిన స్ఫూర్తి ఏది ? ఆయన ప్రపంచానికి బోధించడమే కాదు, ఆలోచనలను ఆదర్శాలుగా మార్చాడు. ఆలోచనలు, ఆదర్శాలు కలగలిపి ఒక వ్యవస్థను నెలకొల్పాడు. 120 సంవత్సరాల క్రితం ఆయన రామకృష్ణ మిశన్ ను స్థాపించాడు. వివేకానంద మిషన్ అని పేరు పెట్టుకోలేదు. అది చాలా చిన్న విషయమే కావచ్చు. 120 సంవత్సరాల క్రితం ఆయన స్థాపించిన ఆ సంస్థ నేటికీ ఎలాంటి పక్కదారి పట్టకుండా అవే సిద్ధాంతాలు ఆచరిస్తోంది. అంత బలమైన పునాదిని ఆయన వేశాడు. ఆయన ఆలోచనలో ఎంత స్పష్టత ఉంది, ఆయన కార్యాచరణ ప్రణాళిక ఎంత బలమైంది ? ఆ అద్భుతమైన సాంప్రదాయక చిహ్నంలో కొద్ది క్షణాలు గడిపే భాగ్యం నాకు లభించింది. వివేకానందుల వారి 9/11 ఉపన్యాసం శత వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శికాగో ను సందర్శించే భాగ్యం నాకు దక్కింది. వివేకానందుల వారు ప్రసంగించిన మందిరం లోనే నిలబడి శత వార్షికోత్సవ ప్రసంగం ఇవ్వడం నా అదృష్టం. అప్పుడు ఎంత భావోద్వేగం చెలరేగిందో నాకే తెలుసు. ఆ ప్రసంగం 125 వ వార్షికోత్సవ వేడుకల గురించి ప్రపంచంలో ఎవరైనా ఆలోచించారా ?

నేను ఇక్కడకు వచ్చినప్పుడు వందేమాతరమ్ గీతాలాపనను విన్నాను. ఎంత గట్టిగా వినిపించగలిగితే అంత గట్టిగా వినిపించారు. వెంట్రుకలు నిక్కబొడిచాయా, లేదా ? ఈ మాటలను ఇక్కడ ఉన్న వారినే కాదు, యావత్ దేశవాసులను నేను అడుగుతున్నాను. అలాగే, వందేమాతరమ్ పాడే హక్కు మనకు ఉందా అని అడుగుతున్నాను. ఈ మాటలు మీ మనసులను గాయపరుస్తాయని నాకు తెలుసును. పాన్ నములుతూ ఈ భూమాతపై ఉమ్మి వేసే వారు, చెత్తాచెదారం పడేసే వారు వందేమాతరాన్ని ఎలా ఆలాపిస్తారు ? వందేమాతరమ్ పాడే తొలి హక్కు ఎవరికైనా ఉందంటే అది మనం పడేసే చెత్తాచెదారాన్ని తుడిచే పారిశుధ్య కార్మికులకే. సంపూర్ణంగా జల వనరులు, అన్ని రకాల ఉత్పాదక సాధనాలు గల మాతృభూమిని మనం శుభ్రం చేయాలా, వద్దా? చెప్పండి. ఈ భూమాతను మలినం చేసే హక్కు మనకు లేనేలేదు. గంగా నదిని మనం గౌరవిస్తుంటే, గంగ మన పాపాలన్నింటినీ ప్రక్షాళనం చేస్తుందన్న విశ్వాసం ఉంటే, తన తల్లితండ్రులను జీవితంలో ఒక్కసారైనా గంగానది లో పవిత్ర స్నానానికి తీసుకువెళ్లాలన్న ఆశయం ఉన్నప్పుడు గంగానదిని కలుషితం చేయకుండా ఆపలేమా ? వివేకానందుల వారు ఈనాడు కూడా జీవించి ఉంటే ఆయన మనను మందలించి ఉండే వాడా లేదా ? ఎందరో వైద్యులు.. అత్యుత్తమ వైద్యులు ఉన్నందుకు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉన్నామని కొన్ని సార్లు అనుకుంటూ ఉంటాం. వైద్యులు ఉన్నందుకు కాదు మనం ఆరోగ్యంగా ఉన్నది.. కేవలం పారిశుధ్యం పని చేస్తున్న వారి వల్ల మనం ఆరోగ్యంగా ఉన్నాం. దేవాలయాల కన్నా ముందు మరుగుదొడ్లు కట్టండి అని నేను ఇచ్చిన పిలుపు నాకు గుర్తుంది. అప్పుడు చాలా మంది నన్ను తిట్టుకున్నారు. కానీ ఇళ్లలో మరుగుదొడ్డి లేని కారణంగా వివాహం నిరాకరణకు గురైన యువతులు ఎందరో ఉన్నారు. వేలాది సంవత్సరాలుగా మనం ఇదే భూమిపై నివసిస్తున్నాం. దానిని మార్చాలని ఎంత మంది ఆలోచించారు. అందుకే మనం వివేకానందుల వారిని గుర్తుకు తెచ్చుకోవాలి. వివేకానందుల వారి 9/11 వాక్కులు కేవలం మాటల మూటలు కావు. వాటిలో శక్తి ఉంది. విశ్వాసం ఉంది. లేదంటే దీన్ని పాములను మచ్చిక చేసుకుని పాములను పట్టే వారి భూమి గానే ప్రపంచం గుర్తుపెట్టుకొని ఉండేది. ఏది తినవచ్చునో, ఏది తినకూడదో చెప్పే వారి భూమి గానే గుర్తుంచుకునేది.

ప్రపంచం లోని ఏ ఒక్క సంప్రదాయం కన్నా మన సంప్రదాయం తక్కువ కాదని వివేకానందుల వారు చెబుతూ ఉండే వాడు. ఆర్యా అని మనం యావత్తు ప్రపంచాన్ని మనం సంబోధిస్తున్నామంటే మొత్తం ప్రపంచాన్ని నాగరకంగా తయారు చేస్తున్నాం. యాచకునికి కూడా ఎంతో జ్ఞాన సంపద ఉన్న దేశం మనది. తనకు భిక్ష వేసిన వారికి, వేయని వారికి కూడా మంచి జరగాలనే కోరుకుంటాడు. వివేకానందుడు గర్వపడింది అందుకే. నేను ‘మేక్ ఇండియా’ నినాదాన్ని ఇస్తే, దానిని ఎంతో మంది వ్యతిరేకించారు. మేక్ ఇన్ ఇండియా కు బదులు దానిని మేడ్ ఇన్ ఇండియా గా మార్చాలని కొందరు సూచించారు. మరి కొందరు మేక్ ఇన్ ఇండియా కు ఎంతో తెలివైన అభిభాషణలు చెప్పారు. కానీ శతాబ్ది క్రితం వివేకానందుల వారికి, జంషెడ్ జీ టాటా కు మధ్య సంభాషణను గురించి తెలుసుకోండి. ఆనాడే ఆ 30 సంవత్సరాల యువకుడు జంషెడ్ జీ తో జరిగిన సంభాషణలో మేక్ ఇన్ ఇండియా ప్రస్తావనను తీసుకువచ్చాడు. దేశంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరాడు. వివేకానందుని మాటలు తనకు స్ఫూర్తి ఇచ్చాయని ఆయనే స్వయంగా చెప్పారు. అందుకే భారతదేశంలో ఆయన పరిశ్రమలను స్థాపించాడు. వివేకానందుల వారి మాటల నుండే తొలి వ్యవసాయ విప్లవం జీవం పోసుకొందంటే మీరు ఆశ్చర్యపోతారు. మన దేశంలో తొలి వ్యవసాయ విప్లవానికి మూలపురుషుడైన డాక్టర్ సేన్ ఒక సంస్థను స్థాపించి దానికి వివేకానంద వ్యవసాయ పరిశోధన సంస్థ గా నామకరణం చేశారు. మన దేశంలో వ్యవసాయం శాస్త్రీయంగా, ఆధునికంగా ఉండాలన్నదే దాని అంతరార్ధం. ఆ రోజుల్లోనే వివేకానందుల వారి ఆలోచనల్లో అంత ఆధునికత ఉంది.

ఈ రోజు 9/11 సంఘటన మహాత్ముని సిద్దాంతాలే జీవిత పర్యంతం ఆచరించిన ఇద్దరు మహోన్నతులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, ఆచార్య వినోబా భావే గారుల శత జయంతితో కూడా మిళితమై ఉంది. ఈ రోజున పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచనలు, పేదల సంక్షేమం కోసం ఆయన పడిన తపన, చేసిన సేవ గురించి అధ్యయనం చేసిన వారికి వివేకానందుని బోధనలకు ఆధునిక రూపం అన్న భావన కలుగుతుంది. వినోబాభావేకు అత్యంత సన్నిహితుల్లో దాదా ధర్మాధికారి ఒకరు. ఆ రోజుల్లో గాంధీజీ ఏం ఆలోచించినా, ఏం చెప్పినా వినోబా దాన్ని ఆచరించే వారని ధర్మాధికారి రాశారు. ఆయన తన గ్రంథంలో కొన్ని హాస్య సందర్భాలను కూడా ప్రస్తావించారు. ఒకప్పుడు ఒక యువకుడు ఉద్యోగాన్వేషణలో సహాయం కోరుతూ వినోబా దగ్గరకు ఆయన సహచరుని ద్వారా వచ్చాడు. అతనికి ఏదైనా ఉద్యోగం లభించేలా చూసే విషయం ధర్మాధికారి కి వినోబా అప్పగించారు. అప్పుడు ధర్మాధికారి నీకేం తెలుసు ? అంటూ ఆ యువకుడిని అడిగితే, నేను పట్టభద్రుడిని అని మాత్రమే ఆ యువకుడు చెప్పాడు. ఎన్నిసార్లు అడిగినా అతని నుండి అదే సమాధానం వచ్చింది. చివరికి నీకు టైపింగ్ వచ్చునా అని ధర్మాధికారి అడిగారు. తనకు తెలియదని ఆ యువకుడు బదులిచ్చాడు. వంట వచ్చునా, టీ, స్నాక్స్ తయారు చేయగలవా ? అడిగిన ప్రతి ప్రశ్నకు తెలియదనే సమాధానంతో పాటు నాకివేమీ రావు, నేను పట్టభద్రుడిని అని సమాధానం వచ్చింది. విద్య అంటే మన ఆలోచనలను విప్లవాత్మకం చేయగల శక్తి కావాలి. ఏదో సమాచారం మెదడులో గుప్పించి అక్కడ ఉన్న ఆలోచనలను కూడా వినాశం చేసేది కాకూడదు, జీవిత పర్యంతం మీకు అర్ధం కాని బ్రహ్మ పదార్ధం కాకూడదు అన్న వివేకానందుల వారి మాటలు ఇక్కడ గుర్తు తెచ్చుకోవలసిన అవసరం ఉంది. ఏదైనా ఐదు ఆలోచనలు మనసులో రగిలి వాటినే జీవిత లక్ష్యాలు, స్వభావంగా మార్చుకున్న వ్యక్తే మొత్తం గ్రంథాలయం అంతటినీ హృదయస్థం చేసిన వ్యక్తి కన్నా ఎక్కువ విద్యావంతుడు అన్నది వివేకానందుల వారి మాటల్లోని సారం. నైపుణ్యాల నుండే అపారమైన జ్ఞాన సంపద లభిస్తుంది. ఈ రోజు ప్రపంచం మనిషి లోని జ్ఞానం కన్నా అతనికి ఉన్న సర్టిఫికెట్ కే విలువ ఇస్తోంది. అందుకే ఈ ప్రభుత్వం నైపుణ్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.

నైపుణ్యాల అభివృద్ధి అనేది మన దేశానికి కొత్తేమీ కాదు. గతంలో ఎవరిపైనా ఎలాంటి బాధ్యతా పెట్టకుండా అన్ని శాఖలకు అది విస్తరించి ఉంది. వ్యక్తుల ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా వారు చూపిన బాటలోనే అది రూపు దిద్దుకుంటూ వచ్చింది. ఇప్పుడు నైపుణ్యాల అభివృద్ధి అంతటినీ ప్రభుత్వం ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చింది. ఒక కొత్త శాఖను ఏర్పాటు చేసింది. యువత నైపుణ్యాలను ఒక సరైన బాటలో పెట్టి, వారు ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా నిలబడి ఉద్యోగాలు కల్పించే శక్తిగా తీర్చిదిద్దే బాధ్యత ను ఆ శాఖకు అప్పగించింది. నా దేశ యువతీయువకులు ఉద్యోగార్థులు కాకూడదన్నదే నా కోరిక. అందుకే నవ్యతను, పరిశోధనను ఎప్పుడూ ప్రోత్సహించి గట్టి మద్దతు ఇచ్చే వివేకానందుల వారిని నా ఆలోచనల్లో నింపుకున్నాను. ఎందుకూ పనికిరాని పాత ఆలోచనలు ఎంత గొప్పవైనా సరే, వాటిని వదలివేసి వెలుపలకు రావాలని వివేకానందుల వారు యువతను కోరాడు. ఒక నిరంతర ప్రక్రియగా నవ్యతపై ఆలోచించినప్పుడే సామాజిక జీవనం పురోగమిస్తుంది. ఆ భావన, సాహసం నేటి యువతకు కావాలని నేను కోరుతున్నాను. నది గట్టు మీద నిలబడి ప్రవాహాన్ని చూస్తూ ఉండే వాడు ఎప్పుడూ మునక వేయడు, కానీ నదిలో దిగిన వ్యక్తి మాత్రమే మునిగిపోతాడు, మునిగిపోతూనే జీవించే ప్రయత్నం చేస్తాడు. ఈత ను నేర్చుకొని బయటకు వస్తాడు. ఒడ్డున నిలబడి అలలను లెక్కించడం కన్నా ఆ అలలను దాటే సాహసం చేసే వాడే నీటిలో లేదా సరస్సులో దిగి పోరాటం చేయడం నేర్చుకుంటాడు. అలాంటి యువ జనాభానే వివేకానందుల వారు కోరుకున్నాడు.

ఈ రోజు ప్రభుత్వం స్టార్ట్- అప్ ఇండియా, స్టాండ్- అప్ ఇండియా ల వంటి ప్రచారోద్యమాలను నడుపుతోంది. ముద్ర పథకంలో భాగంగా యువతకు ఎలాంట పూచీకత్తులు అవసరం లేకుండానే రుణాలు లభిస్తున్నాయి. ప్రజల ఇబ్బందులకు కారణం అవుతున్న సవాళ్లకు పరిష్కారాలతో కొత్త కొత్త ఉత్పత్తులను తయారు చేసి వారి ముందుకు యువత వెళ్లాలని నేను కోరుతున్నాను. భారతదేశం అతి పెద్ద విపణి. ప్రతిభ, సామర్థ్యాల కోసం దేశం ఎదురు చూస్తోంది. మేధస్సును, జ్ఞానాన్ని వివేకానందుల వారు వేరు చేయగలిగినట్టుగానే మనం నైపుణ్యాల ప్రాధాన్యాన్ని గుర్తించాలి. అది రాత్రికి రాత్రి జరిగేది కాదు. అందుకే నీతి ఆయోగ్ ద్వారా మేం అటల్ ఇనవేశన్ మిశన్ ను ఏర్పాటు చేశాం. దానికి మద్దతుగా అటల్ టింకరింగ్ లాబ్ లను కూడా ఏర్పాటు చేశాం. అది ఒక నిశ్శబ్ద ఉద్యమం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తోంది. ప్రణబ్ దా రాష్ట్రపతిగా ఉండగా నేను ఒకసారి రాష్ట్రపతి భవన్ ను సందర్శించాను. 12 నుండి 15 మంది బాలబాలికలు వారి నూతన ఆవిష్కరణలతో వచ్చారు. ఆ పిల్లలను నేను కలుసుకోవాలని ప్రణబ్ దా భావించారు. వారిలో సగం మంది 8వ, 9వ, 10వ తరగతుల విద్యార్థులే. చెత్తాచెదారాన్ని ఎంత ఉత్పాదకంగా మార్చవచ్చో అనే ప్రాజెక్టు ను వారు తీసుకువచ్చారు. అది పారిశుధ్య ఉద్యమానికి ఎంతటి బలాన్ని ఇస్తుంది. మన దేశంలో ప్రతిభకు లోటు లేదన్నదే నేను ఇది చెప్పడం లోని అంతరార్ధం. ఆ ప్రతిభను సరైన దారిలో పెట్టేందుకు మనం ప్రయత్నించాలి.

విదేశాంగ విధానంపై నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ వివేకానందుల వారి విదేశాంగ విధానాన్ని ఎవరైనా చదివారా ? 120 సంవత్సరాల క్రితమే వివేకానందుల వారు ప్రవచించిందే ఇప్పుడు ప్రపంచంలో జరుగుతోంది. ఏకీకృత ఆసియా (వన్ ఏశియా) ను గురించి ఆయన చెప్పాడు. యావత్ ప్రపంచం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఇప్పుడు ఆసియానే ప్రపంచానికి కొత్త దిశలో నడిపించగల సామర్థ్యాలు కలిగి ఉంది. మన సాంస్కృతిక వైభవంలో వన్ ఏశియా ఒక భాగం. 21వ శతాబ్ది ఆసియాదే అని నేడు యావత్తు ప్రపంచం ఘోషిస్తోంది. కొందరు అది భారత శతాబ్ది అని, మరి కొందరు చైనా శతాబ్ది అని చెబుతారు, కాని అది ఆసియా శతాబ్ది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ ప్రపంచంలో వన్ ఏశియా పాత్ర ఏమిటి ? దానికి గల మౌలిక బలాలేమిటి ? అంటే ఆసియా కు వేలాది సంవత్సరాల వారసత్వపు తత్త్వ చింతన ఉంది. 125 సంవత్సరాల క్రితమే వివేకానందుల వారు అందించిన వన్ ఏశియా స్ఫూర్తి ఉంది. అందుకే ఈ రోజు మనం ఆధునిక భావనలో వివేకానందుల వారిని గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ఆంత్రప్రెన్యోర్ శిప్ ను ప్రోత్సహించే వాడు. ఆయన ఎక్కడ మాట్లాడినా, మొదట వ్యవసాయ విప్లవం, ఆ తరువాత నవ్యత, మూడోది ఆంత్రప్రెన్యోర్ శిప్.. లను గురించి ప్రస్తావించే వాడు. సమాజం లోని వైషమ్యాలపై పోరాడాలని కోరే వాడు. అస్పృశ్యత ఒక పాపం అని నినదించే వాడు. అదే విధంగా నిరంతరం పేదల అభ్యున్నతిని గురించి ఆలోచించే వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, వరుసలో చివర ఉన్న వ్యక్తికి లాభం చేకూరుతుందా, లేదా అన్నది చూడండి. అవునంటూ సమాధానం వస్తే మీ నిర్ణయం ఎప్పుడూ సరైందే అని మహాత్ముడు చెప్పే వారు.

కొద్ది రోజుల క్రితం కొంతమంది యువకులు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అటల్ గారి పరిపాలనా కాలంలో నిర్మాణమైన స్వర్ణ చతుర్భుజి ని చుట్టి వచ్చే కార్యక్రమం అది. వారందరూ ఆరు వేల కిలోమీటర్ల దూరం సైకిళ్ల మీద రిలే రేస్ ను నిర్వహించారు. “నిబంధనలు పాటించండి, భారతదేశం పాలించగలుగుతుంది” అన్నది వారు తమతో మోసుకుపోయిన అద్భుతమైన నినాదం. 125 కోట్ల మంది భారతీయులు దీనిని పాటించినట్టయితే వివేకానందుల వారు చెప్పినట్టు ప్రపంచానికి భారతదేశం గురు స్థానాన్ని వహించగలుగుతుంది. అంటే భారతదేశం తనంత తానుగా పరిపాలించినట్టే కదా ? దానిని సాధించగలిగే నిబంధన మనం అనుసరించాలి. వివేకానందుల వారి ప్రసంగానికి 125 సంవత్సరాలు అయిన శుభ వేళ ప్రపంచం గతిని మార్చేందుకు కృషి చేసిన వివేకానందులు, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, ఆచార్య వినోబా భావే గారుల వంటి మహానుభావులను గుర్తు చేసుకోవాలి. వారందరూ ప్రకృతిని ప్రేమించిన వారే. మొక్కల్లో భగవంతుని దర్శించిన వారే. నదులను మాతలుగా గౌరవించిన వారే. యావత్తు విశ్వాన్ని తమ కుటుంబంగా భావించిన వారే. వారి చేతలకు గర్వపడుతూ, వారి బోధనలను మనం సమయానుకూలంగా అన్వయించుకుంటూ ముందుకు సాగాలి.

నా యువ మిత్రులారా,

వివేకానందుల వారు స్థాపించిన రామకృష్ణ మిశన్ 125 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2022 నాటికి స్వతంత్ర భారతదేశం 75 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సమయంలో మన జీవిత లక్ష్యాలకు అనుగుణమైన ప్రతిజ్ఞను మనం స్వీకరించగలమా ? విశ్వవిద్యాలయాలకు విద్యార్థి సంఘాల నేతలందరూ విద్యార్థి నాయకులేనా అని అప్పుడప్పుడూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. అక్కడే మన విద్యార్థి రాజకీయాలు ప్రారంభమవుతున్నాయి. అది ఇప్పుడు ఏ స్థాయికి వెళ్లిందో మనం ఊహించుకోవచ్చు. విద్యార్థి రాజకీయాల్లో వెలుపలి శక్తులు కూడా జోక్యం చేసుకునే స్థితి ఏర్పడింది. ఎన్నికల సమయంలో ఇవి చేస్తాం, అవి చేస్తాం అంటూ వారు హామీలు ఇస్తూ ఉంటారు; కానీ ఏ ఒక్కరైనా విశ్వవిద్యాలయం కేంపస్ ను పరిశుభ్రంగా ఉంచుతామనన్న హామీని ఇచ్చారా ? ఎన్నికల అనంతరం ఏ కేంపస్ కు వెళ్లినా చెత్తాచెదారంతో అక్కడంతా నిండిపోయి ఉంటుంది. అయినప్పటికీ వందేమాతరమ్ గేయాన్ని పాడుతాం. 2022 నాటికి భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాలకు సమాయత్తం అవుతున్న తరుణంలో గాంధీ గారు, భగత్ సింగ్ గారు, రాజ్ గురు గారు, సుఖ్ దేవ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, స్వామి వివేకానంద గార్లు కలలుగన్న భారతదేశాన్ని ఆవిష్కరించలేమా ? ఇది సాధిస్తాను అని సంకల్పించుకుని ప్రతి ఒక్కరూ ఒక్కో అడుగునే వేస్తే 125 కోట్ల అడుగులు ముందుకు పడతాయి.

కళాశాలల్లో కొన్ని ప్రత్యేక దినోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. కొందరు దాన్ని మంచిగా భావిస్తారు, కొందరు చెడుగా చెబుతారు, మరి కొందరు నిరసనలు తెలియచేస్తారు. ఉదాహరణకు గులాబీ దినోత్సవం. దానికి వ్యతిరేకులు కొందరుంటారు. అలాంటి వారు ఇక్కడ కూడా ఉండి ఉంటారు. కానీ నేను దానిని వ్యతిరేకించను. మనం తయారు చేయాల్సింది మర మనుషులను కాదు, సృజనాత్మకతను ప్రోత్సహించాలి. ఒక వ్యక్తి తన లోని అంతర్గత భావాలను బయటపెట్టేందుకు యూనివర్సిటీ కేంపస్ ను మించింది ఏదీ లేదన్నది నా భావన. హరియాణా లోని ఒక కళాశాల తమిళ దినోత్సవం, పంజాబ్ లోని ఒక కళాశాల కేరళ దినోత్సవం జరపడం గురించి ఎప్పుడైనా విన్నామా ? ఇలాంటివి నిర్వహించి వారి పాటలు విన్నా, కళాశాలలో తమిళ, మలయాళ చలనచిత్రాలను ప్రదర్శించి తిలకించినా, వారు స్వస్థలంలో ఎలాంటి ఆటలు ఆడుతారో సహ విద్యార్థుల్లో ఆ రాష్ట్రాలకు చెందిన వారిని అడిగి తెలుసుకొని వాటిని ఆడినా, ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ ఆవిర్భవించదా ? మీరంతా భిన్నత్వంలో ఏకత్వాన్ని గురించి నినదిస్తూ ఉంటారు, కానీ ఆ భిన్నత్వాన్ని చూసి మనం గర్వపడుతున్నామా?. దేశం లోని ప్రతి ఒక్క రాష్ట్రం గురించి, ప్రతి ఒక్క భాష ను గురించి గర్వపడని రోజున మనం ఏం సాధించగలుగుతాం ? తమిళ నాడుకు చెందిన విద్యార్థులను కలిసినప్పుడు నేను వణక్కమ్ అని చెబితే వారు ఎంత సంతోషించారో నాకు కళ్లెదుట కనిపిస్తోంది. అలాంటి వాతావరణాన్ని మనం కల్పించాలా వద్దా ? మన కళాశాలలో సిక్కు గురు దినోత్సవాన్ని నిర్వహిస్తే సిక్కు గురువుల త్యాగాల గురించి తెలుసుకోగలుగుతాం. లేదంటే పంజాబ్ అంటే భాంగ్డా మాత్రమే అనే అభిప్రాయంలో ఉండిపోతాం. పంజాబ్ అంటే భాంగ్డా, పరాఠానే కాదు. సృజనాత్మకతను మించిన జీవితం లేదు.

నూతి లోని కప్ప ను గురించి వివేకానందుల వారు ఒక కథ ను చెప్తూ ఉండే వాడు. మనం అలా ఉండకూడదు. ప్రపంచం అంతటితో కలిసిపోకపోతే మనం ఒక మూలకే పరిమితం అయిపోతాం. మనం ఉపనిషత్తుల నుండి ఉపగ్రహాల యుగం వరకు సుదీర్ఘంగా ప్రయాణించాం. మనకు, మానవతకు అనుకూలంగా ఉన్నది ఏదైనా అంగీకరించడానికి మనం ఎప్పుడూ వెనుకాడలేదు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని భయకంపితులమూ కాలేదు. ఏది ఎదురైనా పరిష్కరించగల సామర్థ్యం మనకు ఉంది. మనం కొంత కాలం బానిసత్వంలో బతికాం, చుట్టూ రక్షణ వలయం ఉన్నవాతావరణంలో నివసించాం. కానీ ఈ రోజు అపార శక్తి సంపన్నులుగా నిలబడ్డాం. వెలుపలి ప్రపంచం ఆందోళనలను గురించి తెలుసుకోగలుగుతున్నాం. ఈ రోజు ప్రపంచంలో నేను ఎక్కడకు వెళ్లినా భారతదేశం గురించిన ఆలోచనా ధోరణిలో మార్పును సుస్పష్టంగా చూడగలుగుతున్నాను. మన రాజకీయ శక్తితో దానిని సాధించలేదు. 125 కోట్ల ప్రజాబలంతో దాన్ని సాధించాం. ఆధునిక భారతం మన కల. అందుకు దీటైన ఆధునిక భారతావని ని మనం నిర్మించుకోలేమా ? నా దేశం లోని యువత ప్రపంచం లోని ఇతర దేశాల యువతతో సమానంగా నిలబడలేరా ? వారు ఎందుకు శక్తివంతులు కాలేరు ? నేను ఒకప్పుడు ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని చూశాను. ఆయన ఒక విషయాన్ని గురించి ప్రస్తావించారు. బహుశా ఆయన ఎక్కడో నా ప్రసంగాన్ని చదివి ఉంటారు. అప్పటికి నేను రాజకీయాల్లో లేను. సోదరా, దేశం ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి అని ఆయన నన్ను అడిగారు. ఏమిటో మీరే చెప్పండి అన్నాను. ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశం ఇలా ఉంది, రెండు వేల సంవత్సరాల క్రితం ఇలా ఉంది. బుద్ధుని సమయంలో ఇలా ఉంది, రాముని సమయంలో ఇలా ఉంది అని చెప్పుకొనే స్వభావం నుండి మనం బయటపడలేకపోతున్నాం. కానీ ఈ రోజు ప్రపంచం నీ ప్రస్తుత స్థితి ఆధారంగానే నిన్ను మదింపు చేస్తుంది. మహోజ్జ్వలమైన వారసత్వపు సంపదను కలిగి వుండడం మన అదృష్టమే, కానీ దానిని పొగడే వైఖరి నుండి మనం బయట పడడం లేదు. మీ గతాన్ని గురించి గర్వపడుతూనే ముందుకు సాగేందుకు దానిని స్ఫూర్తిగా తీసుకోవాలి. వెనుకడుగు వేయించి మనను నిలువరించేదిగా ఆ వారసత్వం ఉండకూడదు. మన గొప్పతనం గురించి కథలుగా చెప్పుకునే వైఖరి నుండి మనం బయటకు రావాలి. యవ్వనంతో ఉండడం నీ స్థితికి గుర్తింపు కాదు, మనసు నవ్యంగా ఉండాలి. నిన్నటి లోనే జీవనం సాగించే వారు యువకులుగా పరిగణన లోకి రారు. ఇలా సాగింది మా సంభాషణ. గతం నుండి మంచి ని గ్రహించి భవిష్యత్తును అర్ధం చేసుకొని ముందుకు కదలిన వారే అసలైన యువకులుగా పరిగణన లోకి వస్తారు. అలాంటి యువ స్వభావంతో ముందంజ వేయాలని మీరంతా ప్రతిజ్ఞ చేయండి. ఈ మాటలతో నేను పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి, వివేకానందుల వారికి, వినోబా గారికి అంజలిని ఘటిస్తున్నాను. మరి నా దేశంలోని యువ సభ్యులందరికీ ఇవే నా శుభాభినందనలు .

మీకు ధన్యవాదాలు.

***