పిఎంఇండియా
కాశ్మీర్ నుంచి వలసపోయినవారికి అందించినట్లుగానే ఉగ్రవాదం కారణంగా జమ్మూలోని పర్వత ప్రాంతాల నుంచి వలసవెళ్ళిన వారికి కూడా సాయం అందించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. జమ్మూడివిజన్లోని పర్వతప్రాంతాల నుంచి వలసవెళ్ళిన వారికి కాశ్మీర్ నుంచి వలసవెళ్ళినవారితో సమానంగా సాయం అందించాలన్నది ప్రతిపాదన సారాంశం. దీనికి ఏటా 13.45 కోట్ల రూపాయలవుతుందని అంచనా.
1990 ఆరంభంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల విధ్వంసం కారణంగా కాశ్మీర్ లోయ నుంచి భారీస్థాయిలో ప్రజలు వలసబాట పట్టారు. లోయలోంచి వలసవెళ్ళినవారితోపాటు, జమ్మూ డివిజన్లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలా కుటుంబాలు భద్రతా కారణాల రీత్యా దగ్గర్లోని సురక్షిత టౌన్లకు వలసవెళ్ళాయి. ప్రస్తుతం 1054 జమ్మూ వలస కుటుంబాలు నమోదై ఉన్నాయి.
ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం జమ్మూడివిజన్ పర్వతప్రాంతాల నుంచి వలస వచ్చినవారికి ఒక్కొక్కరికి నెలకు రూ.400 చొప్పున (కుటుంబానికి గరిష్ఠంగా రూ.1,600) నగదు, పశుదాణా కోసం రూ.300; రేషన్‌పై వస్తువులు (9కిలోల గోధుమపిండి, ఒక్కోమనిషికి 2కిలోల బియ్యం, 10 లీటర్ల కిరోసిన్) అందజేస్తోంది.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో జమ్మూడివిజన్ పర్వతప్రాంత వలస ప్రజలకు కాశ్మీర్ వలసవాదులతో సమానంగా సాయం అందుతుంది. అంటే ప్రతి ఒక్కరికి రూ.2,500 చొప్పున నగదు (కుటుంబానికి రూ.10వేలు గరిష్ఠం), రేషన్/దాణా ల్లో సాయం లభిస్తుంది. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి అయ్యే ఖర్చును కేంద్రం తర్వాత తిరిగి చెల్లిస్తుంది.
Cabinet approved providing relief to the militancy affected migrants of the hilly areas of Jammu division at par with the Kashmiri Migrants.
— PMO India (@PMOIndia) November 18, 2015