Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారాణసీ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన లు చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం


 

భారీ సంఖ్య‌ లో ఇక్కడకు విచ్చేసిన కాశీ కి చెందిన నా యువ‌ మిత్రులు, సోద‌రీమ‌ణులు, సోదరులు మరియు మిత్రులారా,
మీకు అంద‌రికీ నా శుభాభినంద‌న‌లు.

కాశీ ప్ర‌జ‌లు నా మీద చూపుతున్న ప్రేమాభిమానాల‌తో నేను ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నాను. కాశీ ని పదే పదే సంద‌ర్శించాల‌ని నాకు అనిపిస్తూ ఉంటుంది.

సోద‌రీమ‌ణులు మరియు సోదరులారా,

హర హర మ‌హాదేవ్,

బాబా విశ్వ‌నాథుడు మరియు గంగా మాత ల ఆశీస్సు ల‌తో దేశ సేవ‌ లో మ‌రొక కొత్త సంవ‌త్స‌రాన్ని ఆరంభించుకొనే భాగ్యం నాకు లభించింది. మీరు వ‌ర్షించే ఆశీస్సులు, అభిమానం ప్ర‌తి క్ష‌ణం న‌న్ను ఉత్తేజితం చేస్తూ ఉంటాయి. దేశ‌ ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న నా సంక‌ల్పాన్ని మ‌రింత ప‌టిష్ఠం చేస్తూ ఉంటాయి.

మిత్రులారా,

ఈ సేవాభావాన్ని మ‌రింత‌గా కొన‌సాగించేందుకు 550 కోట్ల రూపాయ‌ల‌కు పైబ‌డిన విలువ గల వివిధ ప్రాజెక్టు ల‌కు ఈ రోజున శంకుస్థాపన చేయ‌డమో లేదా ప్రారంభించ‌డమో జ‌రిగింది.

ఈ అభివృద్ధి పథకాలు ఒక్క వారాణసీ కి మాత్రమే చెందిన‌వి కాదు; చుట్టుప‌క్కల గ్రామాలకు కూడా విస్త‌రించాయి. విద్యుత్తు ను, నీటి ని అందించ‌డం తో పాటు రైత‌న్న‌లు, చేనేత కార్మికులు, హ‌స్త‌ క‌ళాకారుల‌కు క‌నీస మౌలిక స‌దుపాయాల‌ను ఈ పథకాలు అందిస్తాయి.

బనార‌స్ హిందూ విశ్వ‌విద్యాల‌యాన్ని 21వ శ‌తాబ్ద‌ానికి చెందిన ఒక ముఖ్యమైన విజ్ఞాన కేంద్రం గా అభివృద్ధి చేసేందుకు కొత్త ప్రాజెక్టు లను ఆరంభించడం జరిగింది. ఈ పథకాల‌ను పొందుతున్నందుకు వారాణసీ నివాసుల‌ను నేను అభినందిస్తున్నాను. వారికి ఇవే నా శుభాభినంద‌న‌లు.

మిత్రులారా,

మీ మ‌ధ్య‌కు నేను ఎప్పుడు వ‌చ్చినా కాశీ ప‌రివ‌ర్త‌న‌ కు మేం చేప‌డుతున్న ప్రాజెక్టుల‌న్నీ కాశీ నగర సంస్కృతి ని, ప్రాచీన వైభ‌వానని దృష్టి లో పెట్టుకొని మాత్ర‌మే చేప‌డుతున్నామ‌ని మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను. న‌గ‌రానికి గల పురాతన గుర్తింపు ను కాపాడుతూనే ఆధునిక స‌దుపాయాలు, మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తున్నాం.

మార్పు ను తీసుకు రావాల‌న్న ధ్యేయంతో కాశీ ప్ర‌జ‌లు నాలుగున్నర సంవ‌త్స‌రాల క్రితం చేసుకున్న సంక‌ల్పం అద్భుత‌మైంది. మీకు మీరు ఆ మార్పు తీసుకురాగ‌లిగారా? ఆ మార్పు మీకు క‌ళ్ల‌ కు క‌ట్టిన‌ట్టు క‌నిపిస్తోందా, లేదా? ధ‌న్య‌వాదాలు.

కాశీ లో స్థితిగ‌తుల‌ను భ‌గ‌వాన్ బోలేనాథునికే వ‌దలివేసిన రోజులూ మీరే క‌ళ్లారా చూశారు. అయితే బాబా విశ్వ‌నాథుని ఆశీస్సు ల‌తో వారాణసీ అభివృద్ధి కి మేం విజ‌య‌వంతంగా ఓ కొత్త దిశ ను చూపించ‌గ‌లిగాం.

కొద్ది సంవ‌త్స‌రాల క్రితం కాశీ ని సంద‌ర్శించిన వారు న‌గ‌రంలో నానాటికీ దిగ‌జారుడుగా ఉన్న వ‌స‌తులను, మౌలిక స‌దుపాయాలను చూసి బాధ‌ పడే వారు. ఎక్కడ చూసినా వేలాడుతూ ఉండే విద్యుత్తు తీగ ల త‌ర‌హా లోనే కాశీ అంతా గంద‌ర‌గోళంగా ఉండేది. స‌ర్వ‌త్రా ద‌ర్శ‌నం ఇచ్చే ఈ గంద‌ర‌గోళాన్ని స‌ర్వ‌తోముఖాభివృద్ధి గా మ‌ల‌చాల‌ని నేను అప్పుడే నిర్ణ‌యించుకున్నాను.

ఈ రోజున కాశీ అన్ని రంగాల్లో ప‌రివ‌ర్తన చెందడాన్ని మ‌నం చూస్తున్నాం. నేను పార్ల‌మెంటు సభ్యుడిని కావ‌డానికి ముందు కాశీ సంద‌ర్శించిన‌ అప్ప‌టి రోజులను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. వేలాడుతున్న విద్యుత్తు తీగలు చూసి వీటి నుండి వారాణసీ కి ఎప్పుడు విముక్తి క‌లుగుతుంద‌ని ఆశ్చ‌ర్యం తో తిల‌కిస్తూ ఉండే వాడిని. న‌గ‌రం లోని ప‌లు ప్రాంతాల్లో ఇప్పుడు అలా వేలాడే తీగలు క‌నిపించ‌వ‌న్న వాస్త‌వాన్ని మీ క‌ళ్ల‌తో మీరే చూడ‌వ‌చ్చు. భూగ‌ర్భం లో తీగలను నిక్షిప్తం చేసే ప‌ని త్వ‌రిత‌ గ‌తిన అన్ని ప్రాంతాల్లో అమ‌లవుతోంది.

పాత కాశీ ని ఇలా వేలాడే తీగల నుండి విముక్తం చేసే ప్రాజెక్టు తో స‌హా 5 ప్ర‌ధాన విద్యుత్తు పథకాలు ప్రారంభించ‌డమైంది. వారాణసీ స‌హా చుట్టుప‌క్కల గ్రామాల‌న్నింటికీ త‌గినంత విద్యుత్తును అందించాల‌నే ల‌క్ష్యాన్ని ఈ ప్రాజెక్టులు బ‌లోపేతం చేస్తాయి. వాటికి తోడుగా మ‌రో ఎలక్ట్రిసిటతీ స‌బ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జ‌రిగింది. ఇది పూర్త‌ి అయితే స‌మీప ప్రాంతాల్లో లో వోల్టేజి స‌మ‌స్య పూర్తిగా స‌మ‌సిపోతుంది.

మిత్రులారా,

వారాణసీ ని తూర్పు భార‌తాని కి స్వాగత ద్వారం గా తీర్చి దిద్దేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. వారాణసీ కి ప్ర‌పంచ స్థాయి మౌలిక వ‌స‌తుల క‌ల్పన ప్ర‌భుత్వ ప్రాధాన్యాలలో ఒకటిగా ఉంది. 21వ శ‌తాబ్ది అవ‌స‌రాల‌కు దీటుగా ర‌వాణా, వైద్యం, విద్య తదితర వ‌స‌తులను క‌ల్పించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

ఈ రోజున కాశీ నగ‌రం ఎల్ఇడి లైట్ల వెలుగు లో ధ‌గ‌ధ‌గ‌లాడిపోతోంది. రాత్రి వేళ‌ల్లో కూడా గంగా న‌ది ప్ర‌వాహాన్ని న‌గ‌రం లో ఎక్కడ నుండైనా స్ప‌ష్టం గా చూడ‌వ‌చ్చు. ఈ ఎల్ఇడి లైట్లు మీ జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే కాక విద్యుత్తు బిల్లులను కూడా త‌గ్గిస్తాయి. ఎల్ఇడి బ‌ల్బులు ఏర్పాటు చేసిన త‌రువాత వారాణసీ నగర నిగ‌మ్ ఎంతో సొమ్ము ను ఆదా చేయ‌గ‌లిగింది.

మిత్రులారా,

నాలుగేళ్ల క్రితం కాశీ ని సంద‌ర్శించిన వారెవ‌రైనా ఇప్పుడు ఇక్కడ విస్త‌రించిన రహదారులను స్ప‌ష్టంగా చూడ‌గ‌లుగుతారు. వారాణసీ చుట్టూ రింగ్ రోడ్డు ను నిర్మించాల‌నే చ‌ర్చ ఎంతో కాలంగా సాగుతోంది. కానీ అది ఇప్పుడే ఫైల్ లోకి ఎక్కింది. 2014 ఎన్నికల త‌రువాత రింగ్ రోడ్డు ఫైలు వెలుప‌లకు వ‌చ్చింది. ఇది సాకారం చేసిన‌ట్ట‌యితే ఆ విజ‌యం మోదీ కి ద‌క్కుతుంద‌న్న‌ భ‌యం తో గ‌తం లోని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆ ప్ర‌ణాళిక ను అమ‌లు లోకి తీసుకురాలేదు. ఫైలు ను మూలన ప‌డేశారు.

కానీ మీరు యోగీ గారి ప్ర‌భుత్వాన్ని ఎన్నుకున్న అనంతరం ఆ ప‌ని వేగంగా సాగుతోంది. హ‌ర్ హువా నుండి గాజీపుర్ వ‌ర‌కు నాలుగు దోవల రహదారి ప‌నులు ఇప్ప‌టికే పూర్త‌ి అయ్యాయి. హ‌ర్ హువా నుండి రాజా తాలాబ్, చందౌలి ల‌కు కొత్త స‌ర్క్యూట్ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ మార్గం లో గంగా న‌ది మీద ఒక కొత్త వంతెన ను నిర్మించ‌బోతున్నారు. దీని వ‌ల్ల వారాణసీ కి ట్ర‌క్కుల రాక‌పోకల తాకిడి త‌గ్గుతుంది.

మిత్రులారా,

కాశీ రింగ్ రోడ్డు నిర్మాణం వ‌ల్ల ఒక్క కాశీ కే కాక చుట్టుప‌క్కల జిల్లాల‌కు కూడా లాభం చేకూరుతుంది. ఈ రహదారులు బిహార్, నేపాల్, ఝార్ ఖండ్, మ‌ధ్య‌ ప్ర‌దేశ్ ల‌కు అత్యంత కీల‌కం కానున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వారాణసీ లోపల, ఇతర రాష్ట్రాల‌తో అనుసంధానం చేసే రోడ్ల విస్తరణ, పొడిగింపు ప‌నులు జ‌రుగుతున్నాయి. వారాణసీ- సుల్తాన్ పుర్, వారాణసీ-గోర‌ఖ్ పుర్, వారాణసీ-హందియా రోడ్ లింకు వంటివ‌న్నీ భాగం అయిన ఏడో నంబర్ జాతీయ ర‌హ‌దారి అభివృద్ధి కి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నాం.

సోద‌రీమ‌ణులు మరియు సోదరులారా,

వారాణసీ లో కోట్లాది రూపాయల వ్య‌యం తో ప‌లు రోడ్డు పథకాలు అమ‌లు లో ఉన్నాయి. గ‌తం లో మ‌హ‌మూర్ గంజ్, మండువాడీహ్ ప్ర‌యాణానికి ప్ర‌జ‌లు ఎన్నో ఇక్క‌ట్లను ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌చ్చేది. ఆ విష‌యాన్ని మీకు నేను గుర్తు చేయాల్సిన అవ‌స‌రం లేదు. కొన్ని ద‌శాబ్దాల త‌రువాత మండువాడీహ్ ఫ్లై ఓవ‌ర్ నిర్మాణం పూర్త‌ి అయింది. గంగాన‌ది మీద సామ్నేర్ ఘాట్ వంతెన నిర్మాణం పూర్త‌ి అయిన త‌రువాత రాం న‌గ‌ర్‌ కు రాక‌పోక‌లు సులభమైపోయాయి. అంధురా వంతెన విస్తరణ డిమాండు కూడా ఆ వంతెన అంత‌టి పురాత‌న‌మైందే. కొన్ని ద‌శాబ్దాల పాటు ఆ ప‌ని ని నిలిపివేశారు. ఆ ప‌ని కూడా పూర్త‌ి అయింది. రాజా తాలాబ్ పోలీస్ ఠాణా, జాఖిని ల మ‌ధ్య రహదారి విస్తరణ, శివ్ పుర్- ఫుల్వారియా రోడ్డు ను నాలుగు దోవల మార్గం గా విస్త‌రించ‌డం వంటి ప‌లు ప్రాజెక్టులు అమ‌లు లో ఉన్నాయి. అలాగే మత విశ్వాసాలు, ప‌ర్యటన అవ‌స‌రాల‌ను దృష్టి లో పెట్టుకొని అత్యంత కీల‌క‌మైన పంచ్ కోశి పాసేజ్ అభివృద్ధి ప‌నులు కూడా త్వ‌రిత‌ గ‌తిన అమ‌లులో ఉంది.

భ‌గ‌వ‌త్ వారధి, కోర్టు రోడ్డు ల మ‌ధ్యన రహదారుల నిర్మాణాన్ని 750 కోట్ల రూపాయల వ్య‌యం తో చేప‌ట్టాం. గ‌తం లో ఈ రహదారి ఎంత సంక్లిష్ట‌మైందో మీ అంద‌రికీ బాగా తెలుసును. నిముషాల ప్ర‌యాణానికి గంటల వ్య‌వ‌ధి ప‌డుతోంది. భారీ ట్రాఫిక్ జాం కార‌ణంగా ప్ర‌యాణికులు విమానాలు, రైలు ప్ర‌యాణికులు స‌కాలం లో చేర‌లేక వాటిని మిస్ అయిన రోజులు ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్త‌ి అయితే ఈ స‌మ‌స్య మొత్తం ప‌రిష్కారం అయిపోతుంది.

మిత్రులారా,

విమానాశ్ర‌యానికి రాక‌పోక‌లు సాగించే వారంద‌రూ వారాణసీ అభివృద్ధి చెందుతోంద‌న్న వాస్త‌వాన్ని క‌ళ్లారా చూడ‌గ‌లుగుతారు. వారాణసీ కి విమానాల్లో వ‌చ్చే ప‌ర్యట‌కుల సంఖ్య పెరిగింది. నాలుగు సంవ‌త్స‌రాల క్రితం 8 ల‌క్షల మంది ప్ర‌యాణికులు బాబ‌త్ పుర్ విమానాశ్ర‌యాన్ని వాడుకొనే వారు. ఇప్ప‌డు ఆ ప‌ర్యట‌కుల సంఖ్య 21 ల‌క్ష‌ ల‌కు పెరిగిపోయింది.

స్మార్ట్ వారాణసీ గా న‌గ‌రాన్ని ప‌రివ‌ర్తన చేసే దిశ‌ గా న‌గ‌రం లోని ర‌వాణా వ్య‌వ‌స్థ‌ ను ఆధునికీక‌రిస్తున్నాం. ఒకే త‌ర‌హా ర‌వాణా వ్య‌వ‌స్థ‌ పై భారాన్ని త‌గ్గించేందుకు ట్రాఫిక్ వ్య‌వ‌స్థ ను స‌మీకృతపరచే ప‌నులను చేప‌ట్టాం. ఇంటిగ్రేటెడ్ క‌మాండ్, కంట్రోల్ సెంట‌ర్ నిర్మాణం జ‌రుగుతోంది. న‌గ‌రం లోని అన్ని పాల‌న, ప్ర‌భుత్వ వ‌స‌తులు దీనితో అనుసంధానం అవుతాయి.

త్వ‌రిత‌ గ‌తిన సంచ‌రించేందుకు వీలు క‌ల్పించే మ‌ల్టి మోడ‌ల్ టర్మిన‌ల్ నిర్మాణం పూర్త‌ి అయితే ర‌వాణా, లాజిస్టిక్స్ కేంద్రం గా న‌గ‌రం రూపు దిద్దుకుంటుంది. న‌గ‌రానికి రోడ్లు, రైల్వే, జ‌ల‌ ర‌వాణా అనుసంధానం పెంపొంది ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపార సంస్థ‌ ల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంది.

కాశీ సంద‌ర్శ‌కుల ప్ర‌యాణ కాలాన్ని త‌గ్గించేందుకు ఫెరి స‌ర్వీసు అభివృద్ధి ప్రాజెక్టు కూడా పురోగమన ప‌థం లో ఉంది. వార‌ణాసి-హ‌ల్దియా మ‌ధ్య తొలి జాతీయ జ‌ల‌ర‌వాణా వ్య‌వ‌స్థ నిర్మాణంలో ఉంది. వాహ‌నాల‌న్నింటినీ సిఎన్ జి వాహ‌నాలుగా మార్చే ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి.

సోద‌రీమ‌ణులు మరియు సోదరులారా,

వారాణసీ ప్ర‌జ‌లు కంటోన్మెంట్ స్టేశన్ ఫొటో ల‌ను సోశల్ మీడియా లో ఎంతో ఆనందం తో పోస్ట్ చేస్తున్న‌ప్పుడ‌ల్లా నా ఆనందం రెట్టింప‌వుతూ ఉంటుంది. కంటోన్మెంట్ స్టేశన్ త‌ర‌హా లోనే న‌గ‌రం లోని మండువాడీహ్ లేదా సిటీ స్టేశన్ అభివృద్ధి ప‌నులు కూడా వేగ‌వంతం అయ్యాయి. వాట‌న్నింటినీ ఆధునికీక‌రిస్తున్నాం. రైళ్ల‌ లో కాశీ సంద‌ర్శ‌కులంద‌రూ కొత్త కాశీ ఫొటో ల‌ను స్టేశన్‌ లోనే చూడ‌గ‌లుగుతారు.

మిత్రులారా,

వారాణసీ ని అల‌హాబాద్, ఛాప్రా ల‌తో క‌లిపే రైలుమార్గం లో ట్రాక్ డ‌బ్లింగ్ ప‌నులు పురోగమన ప‌థం లో ఉన్నాయి. వారాణసీ- బ‌లియా మ‌ధ్యన రైలుమార్గం విద్యుదీకరణ పూర్త‌ి అయింది. వారాణసీ- అల‌హాబాద్ సిటీ స్టేశన్ డ‌బ్లింగ్, విద్యుదీకరణ ప‌నులు జ‌రుగుతున్నాయి.

మౌలిక వ‌స‌తుల‌తో పాటుగా వారాణసీ ని దేశం లోని ఇతర న‌గ‌రాల‌తో రైలు ద్వారా సంధానించే ప్ర‌య‌త్నం కూడా ఎన్నో రెట్లు వేగం అందుకుంది. గత నాలుగేళ్లుగా వారాణసీ కి కొత్త రైళ్లు అనేకం వ‌చ్చాయి. వారాణసీ-ఢిల్లీ, వ‌డోదర, పట్ నా మ‌హామానా ఎక్స్ ప్రెస్, వారాణసీ-పట్ నా జ‌న‌శ‌తాబ్ది ఎక్స్ ప్రెస్ ల వంటి ఆధునిక వ‌స‌తులు గల రైళ్లు ప్ర‌జ‌ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. హుబ్లి, మైసూరు, గువాహాటీ ల వంటి ఇతర న‌గ‌రాల‌తో రైలు సంధానం ఎంతో బ‌లోపేతం అయింది.

మిత్రులారా,

ఇప్పుడు వారాణసీ కి చేరుకోవడం సులభంగా మారిపోవడమే కాక దీనిని సుందరీకరించడం జరుగుతోంది. ఇప్పుడు వారాణసీ లోని ఘాట్లు చెత్తాచెదారంతో కాకుండా చ‌క్క‌ని కాంతుల‌ తో స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. గంగామాత ఒడిలో ప‌డ‌వ‌లు, నావ‌ల్లో కూడా ప్ర‌యాణం చేయ‌డం సాధ్య‌మ‌యింది. భ‌క్తులు వారాణసీ లోని దేవాల‌యాల‌ను త్వ‌రితంగా చేరేందుకు కూడా ఏర్పాట్లు జ‌రిగాయి. ప‌ర్యాట‌కం ద్వారా ప‌రివ‌ర్తన ప్ర‌చారోద్య‌మం అవిశ్రాంతంగా సాగుతోంది.

సోద‌రీమ‌ణులు మరియు సోదరులారా,

గత నాలుగు సంవత్సరాల గా కాశీ వైభ‌వాన్ని ప‌రిర‌క్షించ‌డం తో పాటు ఆ వైభ‌వం అందాన్ని ఇనుమ‌డింప‌చేసే ప‌నులు జ‌రుగుతున్నాయి. మైదాజిన్ టౌన్‌హాలు నుండే మ‌హాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రారంభించారు. చారిత్రక వైభ‌వానికి మారుపేరైన హెరిటేజ్ భ‌వ‌న్ ప్ర‌తిష్ఠ‌ ను పున‌రుద్ధ‌రించే ప్ర‌య‌త్నం కూడా జ‌రుగుతోంది. దానిని మ‌రో సారి వెలుగు లోకి తెచ్చే ప్ర‌య‌త్నం ప్రారంభ‌ం అయింది.

వారాణసీ లోని ప్ర‌ధాన ఉద్యానవనాల‌న్నింటినీ పున‌రుద్ధ‌రించి, అభివృద్ధి చేసి, ఆధునికీక‌రించే కృషి జ‌రుగుతోంది. సార‌నాథ్ యాత్రికుల కోసం లైట్ అండ్ సౌండ్ శో ను కూడా ప్రారంభించాం. ప‌ర్యట‌కాన్ని ప్రోత్స‌హించ‌డం ల‌క్ష్యంగా మత, ప‌ర్యాటక ప్రాధాన్యం గల బుద్ధ థీమ్ పార్కు, సార‌నాథ్ చెరువు, గురుధామ్ దేవాల‌యం, మార్కండేయ మ‌హ‌దేవ్ దేవాల‌యం ఇప్ప‌టికే ఆధునికీక‌రించ‌డం జ‌రిగింది. భైర‌వ్ కుండ్, సాగ‌ర్ నాథ్ కుండ్, ల‌క్ష్మీకుండ్, దుర్గానాథ్ కుండ్ ల ఆధునికీకరణ కూడా పూర్త‌ి అయింది. గత నాలుగేళ్లు గా కాశీ ప్ర‌జ‌లు ఎంతో ఆనందంగా వివిధ దేశాల నాయ‌కుల‌కు స్వాగ‌తం ప‌లికారు. జ‌పాన్ ప్ర‌ధాని శ్రనీ శింజో ఆబే, ఫ్రాన్స్ అధ్య‌క్షుడు శ్రీ మాక్రాన్, జ‌ర్మ‌నీ అధ్య‌క్షుడు శ్రీ ఫ్రాంక్ వాల్ట‌ర్ లు కాశీ ప్రజల అతిథి మ‌ర్యాదల గురించి ఎల్లప్పుడూ పొగడుతూ ఉంటారు. నిజానికి కాశీ న‌గ‌రానికి జ‌పాన్ ఒక ఆధునిక వ‌స‌తులు గల స‌మావేశ మందిరాన్ని కానుక‌గా అందించింది.

మిత్రులారా,

వచ్చే ఏడాది ఆరంభం లో కాశీ ఇచ్చే ఆతిధ్యం మీదే ప్రతి ఒక్కరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన భారతీయుల కుంభ మేళా ను జనవరి లో కాశీ నిర్వహిస్తోంది. అందువల్ల, ఇందుకోసం ప్రభుత్వం తన పూర్తి స్థాయి లో కృషి చేస్తోంది. అయినా, మీ సహకారం అనివార్యం. కాశీ లోని ప్రతి పౌరుడూ ముందుకు రావాలి. కాశీ కి సంబంధించిన అన్ని అంశాలను, వారసత్వాన్ని ప్రతిబింబించే విధం గా ప్రతి మారుమూల ప్రాంతం, ప్రతి వీధి ఉండాలి. భారత సంతతి ప్రజలు తమ జీవిత పర్యంతం గుర్తు పెట్టుకొనే విధంగా పరిశుభ్రత కు, ఆతిథ్యానికి మనం ఒక ఉదాహరణ గా నిలవవలసిన అవసరం ఉంది. ప్రవాసీ భారతీయ దినోత్సవానికి వచ్చే వారు కాశీ కి పర్యటక రాయబారులు గా మారే విధంగా ఒక మధురానుభూతి ని పొందాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు వారు ఎక్కడికి వెళ్లినా కాశీ కి సంబంధించిన మనోహరమైన వివరాల గురించి చెప్పుకుంటారు.

సోదరీమణులు మరియు సోదరులారా,

పరిశుభ్రత విషయం లో కాశీ ఒక మార్పు ను సాధించింది. ఈ రోజున ఘాట్ లు, వీధులు, కాశీ లోని ప్రతి మారుమూల ప్రాంతం లోనూ పరిశుభ్రత ఒక కొత్త రూపు ను సంతరించుకుంది. పరిశుభ్రత తో పాటు చెత్త నిర్మూలన లోనూ దృఢమైన పరిష్కారాలను కనుగొనడం జరిగింది. ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి వ్యర్ధాల నుండి ఎరువులను ఉత్పత్తి చేస్తున్నారు.

వ్యర్ధాల నుండి ఎరువులను ఉత్పత్తి చేసే ఒక భారీ కర్మాగారాన్ని కర్సరా లో నెలకొల్పారు. అనుదినం అనేక మెట్రిక్ టన్నుల వ్యర్ధాలను సేకరించడం జరుగుతోంది. ఆ వ్యర్ధాన్ని కంపోస్టు గా మారుస్తున్నారు. వ్యర్థం నుండి విద్యుత్తు ను ఉత్పత్తి చేసే ప్లాంటు ను కూడా కర్సరా లో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటు ద్వారా విద్యుత్తు ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనికి తోడు భవానియా, పోఖడీ, పహాడియా మండీ, ఐ డి ఏ కాంప్లెక్స్ లలో బయోఫ్యూయల్ ప్లాంటులను ఏర్పాటు చేయడమైంది.

మిత్రులారా,

గంగోత్రి నుండి గంగా సాగర్ వరకు గంగా నది ని శుద్ధి చేసే పనులు ఏక కాలంలో చురుకుగా కొనసాగుతున్నాయి. నది ని శుభ్రం చేయడంతో పాటు సమీప గ్రామాలు, నగరాల నుండి చెత్త నది లో కలవకుండా నిరోధించడం జరుగుతోంది. ఆ విధంగా, సుమారు 21 వేల కోట్ల రూపాయలతో 200 కు పైగా ప్రాజెక్టులను ఆమోదించడం జరిగింది.

ఇదే ఉద్దేశ్యం తో వారాణసీ లో 6 వందల కోట్ల రూపాయల కు మించిన విలువతో కూడిన ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. దీనాపూర్, రామనా లలో మురుగు నీటి శుద్ధి ప్లాంటు నిర్మాణం వేగవంతంగా కొనసాగుతోంది. మురుగునీటి ప్లాంటు కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన పనులు కూడా కొనసాగుతున్నాయి. వేలాదిగా నిర్మిస్తున్న మురుగునీటి చాంబర్ లతో పాటు 150కి పైగా కమ్యూనిటీ టాయిలెట్ లు కూడా నిర్మించడం జరిగింది. మురుగునీటి పారుదల పనులతో పాటు మంచినీటి సరఫరా వ్యవస్థ ను మెరుగుపరచడానికి కూడా కృషి జరుగుతోంది. వేలాది గృహాలకు మంచి నీటి సరఫరా కనెక్షన్ లు ఇవ్వడం, వాటర్ మీటర్ లను బిగించడం వంటి పనులు కూడా కొనసాగుతున్నాయి.

మిత్రులారా,

రహదారులు, విద్యుత్తు, నీటి సరఫరా వంటి సదుపాయాలను వారాణసీ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా కల్పించడం జరిగింది. ఒక పార్లమెంటు సభ్యునిగా కొన్ని గ్రామాలను అభివృద్ధి చేయవలసిన బాధ్యత నా పై ఉంది. అటువంటి ఒక గ్రామమైన నాగేపుర్ లో ఒక భారీ నీటి పథకాన్ని ప్రారంభించాను. నాగేపుర్, జయపుర్, కకారియ, దోమరీ మొదలైన అన్ని గ్రామాలూ, ఇప్పుడు రహదారులు, నీటి సరఫరా, విద్యుత్తు సరఫరా ల వంటి సౌకర్యాలు కలిగివున్నాయి. ఆట స్ధలం, స్వతంత్రోపాధి కేంద్రాలు, రైతులకు ఉత్తమ సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణ సదుపాయాల వంటి ఇతర ఏర్పాట్లను కూడా సమకూర్చడం జరిగింది.

మిత్రులారా,

మీ చురుకైన సహకారం తో కాశీ ఇప్పుడు తూర్పు భారతదేశానికి ఒక ఆరోగ్య కేంద్రం గా అభివృద్ధి చెందుతోంది. వివిధ ప్రాంతాల లోని ఆసుపత్రులు వారాణసీ ని తూర్పు భారతదేశం లో ఒక ప్రధాన వైద్య కేంద్రం గా మారుస్తాయి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్ యు) కు చెందిన కొత్త, అత్యాధునిక అత్యవసర వైద్య కేంద్రం వేలాది ప్రజల ప్రాణాలను కాపాడుతోంది. వారాణసీ లో నిర్మాణ దశ లో ఉన్న కొత్త క్యాన్సర్ ఆసుపత్రి మరియు సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి ఆధునిక చికిత్స సదుపాయాలను అందించడంలో కీలక పాత్రను పోషించనుంది.

ప్రపంచ శ్రేణి ఆరోగ్య సంస్థ ను అభివృద్ధి చేసేందుకు బిహెచ్ యు ఇటీవల ఎఐఐఎంఎస్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

మిత్రులారా,

బిహెచ్ యు లో ఒక ప్రాంతీయ నేత్ర పరిశోధన సంస్థ ను ఈ రోజున ప్రారంభించడం జరిగింది. దాదాపు 54 సంవత్సరాల క్రితం లాల్ బహాదుర్ శాస్త్రి, ఇక్కడ నేత్ర చికిత్సా విభాగాన్ని ప్రారంభించారు. దాన్ని ఒక ప్రాంతీయ కేంద్రంగా విస్తరించే అవకాశం నాకు కలిగింది. ఈ సదుపాయం పూర్తిగా అభివృద్ధి చెందాక తూర్పు ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, ఝార్ ఖండ్, నేపాల్ ల నుండి కోట్లాది ప్రజలు ప్రయోజనాన్ని పొందుతారు.

అంతేకాదు, ఇక నుండి కాశీ ప్రజలు కంటి చికిత్స కోసం పెద్ద పెద్ద నగరాలకు ప్రయాణించవలసిన అవసరం లేదు. కంటి పొర నుండి తీవ్రమైన కంటి వ్యాధుల వరకు అన్నీ తక్కువ ఖర్చు తోనే నయం చేసుకోవచ్చు. దీనితో పాటు ఈ సంస్థ ఉత్తమ ప్రతిభ తో కూడిన వైద్యులను తయారుచేస్తుంది. శ్రేష్ఠమైన పరిశోధన కు సహాయపడుతుంది.

మిత్రులారా,

వారాణసీ లో కొత్త ఆసుపత్రులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న ఆసుపత్రులను మెరుగుపరచడం కూడా జరిగింది. పాండేపుర్ లోని ఇఎస్ఐ ఆసుపత్రి ని 150 కోట్ల రూపాయలతో ఆధునికీకరించడం జరిగింది. దీనితో పాటు ఆసుపత్రులలో ప్రస్తుతం ఉన్న పడక ల సంఖ్య ను కూడా పెంచడం జరిగింది. ప్రైవేటు ఆసుపత్రులను కూడా ప్రోత్సహించడం జరిగింది. దీనికి తోడు తెహసిల్, బ్లాక్ స్థాయిలలో పలు ఆరోగ్య పరిరక్షణ కేంద్రాలను, ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగింది.

మిత్రులారా,

ఉత్తరప్రదేశ్ లో బిజెపి కి చెందిన యోగి గారు ఎన్నిక అయ్యాక పనులన్నీ మునుపు ఎన్నడూ లేనంత వేగం తో పురోగమిస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ లో చేరినందుకు యోగి గారి ని నేను అభినందిస్తున్నాను.

ఉత్తర్ ప్రదేశ్ సహా దేశం లో పలుప్రాంతాలలో 50 కోట్ల మంది పేద సోదరీమణులు మరియు సోదరులకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స ను అందజేయాలన్న ప్రతిజ్ఞ తో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ పథకాన్ని సెప్టెంబర్ 23వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమలుచేయనున్నారు.

సోదరీమణులు మరియు సోదరులారా,

ఆరోగ్యం తో పాటు విద్య ను పటిష్ఠపరచడంపై కూడా ప్రభుత్వం దృష్టి ని కేంద్రీకరించింది. సంప్రదాయ విద్య తో పాటు ఆధునిక విద్య ను అందించాలని మాలవీయ గారు కలలు కన్నారు. ఆయన కల లను సాకారం చేసే కృషిలో భాగంగా బిహెచ్ యు ను విస్తరించాలి; అనేక కేంద్రాలను ప్రారంభించాలి.

వైదిక విజ్ఞానాన్ని 21వ శతాబ్దపు విజ్ఞాన శాస్త్రం తోను, భవిష్యత్తు సాంకేతిక విజ్ఞాన శాస్త్ర పరిష్కారాలతోను సంధానించడమైంది. వేద యుగాన్ని సమకాలీన పరిస్థితులతో అనుసంధానించడమైంది. ఒక పక్క, వేద విజ్ఞాన శాస్త్ర కేంద్రానికి శంకుస్థాపన చేయడం జరిగింది; మరో పక్క, అటల్ ఇంక్యుబేశన్ సెంటరు ను కూడా ప్రారంభించడమైంది.

యువ మిత్రులారా,

మన పురాతన సంస్కృతి, సంప్రదాయాల పై ఎంత గౌరవం ఉందో, మన భవిష్యత్ సాంకేతిక విజ్ఞానంపై కూడా మనకు అంత గౌరవం ఉంది. 80 కోట్ల మంది కి మించిన యువజనుల శక్తి ని కలిగి వున్న ఈ దేశం తాత్కాలిక సాంకేతిక యవనిక పైన ఒక ముద్ర ను వేస్తోంది. భావి సాంకేతిక పథం లోకి పయనిస్తూ బిహెచ్ యు లో అటల్ ఇంక్యుబేశన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. బిహెచ్ యు లోని ఈ ఇంక్యుబేశన్ సెంటర్ సమీప భవిష్యత్తు లో స్టార్ట్- అప్ సంస్థలకు ఒక కొత్త శక్తి ని సమకూర్చుతుంది.

దేశ వ్యాప్తంగా ఉన్న 80 స్టార్ట్- అప్ సంస్థ లు ఈ కేంద్రం లో కలవాలనుకొంటున్నాయని, 20 స్టార్ట్- అప్ లు ఇప్పటికే కలిశాయని నాతో చెప్పారు. ఈ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నేను వారాణసీ యువత కు, ముఖ్యంగా ఎవరైతే ఒకే రకమైన భావజాలంతోను, ధైర్యం తోను ముందుకు వచ్చారో వారి కి ఇవే నా అభినందనలు.

మిత్రులారా,

గత నాలుగు సంవత్సరాలలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ, రైతుల పరిస్థితి గణనీయంగా మెరుగుపడ్డాయి. త్వరగా పాడయ్యే వస్తువులు, పదార్థాల రవాణా కేంద్రాన్ని జులై నెల లో రాజా తాలాబ్ లో ప్రారంభించడం జరిగింది. రైతుల పంటలు పాడైపోకుండా చూడడంతో పాటు ఈ సరకు రవాణా కేంద్రాలు వారాణసీ మరియు చుట్టుపక్కల ప్రాంతాల లోని రైతుల ఉత్పత్తులకు అదనపు ఆదాయం సమకూర్చుకోడానికి సహాయపడుతున్నాయి. బంగాళ దుంపలు, టొమాటో లు వంటి కూరగాయలను నిలవ చేసుకోవడంతో పాటు ఇది రైల్వే స్టేశన్ కు చాలా దగ్గరలో ఉంది. దీనివల్ల, కూరగాయలు, పండ్లు పాడవకుండా ఇతర రాష్ట్రాలకు రవాణా చేయడానికి వీలు కలుగుతుంది.

దీనితో పాటు అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. అంటే భవిష్యత్తు లో ఉత్తమ నాణ్యత కలిగిన ధాన్యాన్ని నిలవ చేయడంలో కాశీ ఒక ప్రధాన పాత్ర ను పోషించనుంది. రైతు సోదరీమణులు మరియు రైతు సోదరులు ఒక ప్రత్యామ్నాయ ఆదాయ వనరు ను పొందే విధంగా మేం ఏర్పాట్లు చేస్తున్నాం. రైతు సోదరీమణులు మరియు రైతు సోదరులు వ్యవసాయం తో పాటు పశు సంరక్షణ ను, తేనెటీగల పెంపకాన్ని చేపట్టే విధంగా మేం ప్రోత్సహిస్తున్నాం.

కొద్ది సేపటి క్రితం రైతులకు తేనెటీగల పెట్టెలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ నమూనా ఫోటో లను అందజేశారు, కానీ పెట్టెలను ఇంతకు ముందే ఇవ్వడం జరిగింది. దీని వెనుక ఉన్న లక్ష్యం ఇదే. తేనెటీగలు దిగుబడి పెంచడానికి సహాయ పడడమే కాకుండా తేనె ఉత్పత్తి ద్వారా ఆదాయం పెరగడానికి ఒక మాధ్యమంగా కూడా ఉపయోగపడుతాయి. రికార్డు స్థాయి లో ఆహార ధాన్యాల దిగుబడి తో పాటు మన దేశం లో రికార్డు స్థాయిలో తేనె ఉత్పత్తి కూడా జరుగుతోందని తెలిస్తే మీరు చాలా ఆనందపడతారు.

సోదరీమణులు మరియు సోదరులారా,

వారాణసీ, తూర్పు భారతదేశం మట్టి కి బంగారంగా మార్చే నేత పనివారికి, కళాకారులకు పుట్టినిల్లు. హస్త కళ ల పరిశ్రమ కు, వారాణసీ కి చెందిన కళాకారులకు సాంకేతిక సహకారాన్ని సమకూర్చడానికి వాణిజ్య సదుపాయాలను అందించే కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారిని కొత్త విపణులకు అనుసంధానించడం జరుగుతోంది. అంతేకాక, నేత పనివారికి అవసరమైన ఉత్పత్తి సదుపాయాలు కల్పించడానికి, 9 ప్రదేశాలలో కామన్ ఫెసిలిటేశన్ సెంటర్ లను నెలకొల్పారు. నేత పని మరింత సులువుగా చేసేందుకు ఉపయోగపడే (నేతలో నిలువు పోగులు పోసే) యంత్రాలను నేత పని చేసే సోదరీమణులకు సోదరులకు అందజేయడం జరిగింది.

అంతేకాక కుమ్మరి సోదరీమణలు మరియు కుమ్మరి సోదరులకు, బురద, మట్టితో పనిచేసే కళాకారులకు కూడా సాంకేతిక సహకారాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా ఈ రోజు అనేక సోదరీమణులకు, సోదరులకు విద్యుత్తు ఉపకారణాలను అందజేయడం జరిగింది. వీటితో పాటు బురద, మట్టి వంటివి కలపడానికి, ఎండబెట్టడానికి ఆధునిక యంత్రాలను అందజేయడం జరిగింది. దీని వల్ల మీ శ్రమ తగ్గుతుంది; గిన్నెలు, అలంకార వస్తువులు తయారుచేయడానికి పట్టే సమయాన్ని ఆదా చేసుకోవచ్చు

మిత్రులారా,

వారాణసీ లోని పౌరులందరి జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా అవిశ్రాంత కృషి జరుగుతోంది. గొట్టపు మార్గం ద్వారా వంట గ్యాస్ సరఫరా అవుతున్న కొన్ని నగరాలలో ఒకటిగా ఇప్పడు కాశీ నిలిచింది. ఇందుకోసం, అలహాబాద్ నుండి వారాణసీ వరకు గొట్టపు మార్గాన్ని వేశారు. ఈ రోజు వరకు వారాణసీ లో దాదాపు 8 వేలకు పైగా గృహాలకు గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ ను ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో మరో 40 వేలకు పైగా గృహాలకు గ్యాస్ పైప్ లైన్ ను వేసే పని కొనసాగుతోంది. వారాణసీ, దాని చుట్టుపక్కల గ్రామాలలో దాదాపు 60 వేలకు పైగా గ్యాస్ కనెక్షన్ లు ఇవ్వడంతో ఉజ్వల యోజన మహిళల జీవితాలను సులభతరం చేసింది.

మిత్రులారా,

‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’’ (అందరితో కలిసి అందరి వికాసం) అనే మార్గం లో పయనిస్తూ కాశీ ఒక ఉత్సాహం తో తన భవిష్యత్తు ను లిఖించుకొంటోంది. వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. అటువంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో చాలా ప్రాజెక్టుల పనులు చివరి దశ లో ఉన్నాయి. కేవలం కొన్ని నెలల్లో పూర్తి కానున్నాయి. విమానాశ్రయం నుండి కోర్టు వరకు రింగ్ రోడ్డు, వరి పరిశోధన సంస్థ, బినాపూర్-గోయిత మురుగు నీటి శుద్ధి ప్లాంటు, మల్టి మోడల్ టెర్మినల్, అంతర్జాతీయ ప్రమాణాలతో కేన్సర్ ఆసుపత్రి వంటి కొన్ని భారీ ప్రాజెక్టులు పూర్తి అయిన తరువాత ఈ నగరం అభివృద్ధి కొత్త శిఖరాలను చేరుతుంది.

మిత్రులారా,

ఈ ప్రాజెక్టులు వారాణసీ లో అపరిమిత ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. వారాణసీ అభివృద్ధి వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలను కల్పించింది. రండి, మనం అందరమూ కలసి అంకిత భావం తో వారాణసీ లో పరివర్తన కోసం తీసుకున్న సంకల్పానని పటిష్టపరుద్దాం. ఒక కొత్త కాశీ ని, న్యూ ఇండియా ను నిర్మించడం కోసం ఉమ్మడిగా కృషి చేద్దాం.

మీరు ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులకు గాను మీ అందరినీ మరొక సారి అభినందిస్తున్నాను. మీ ప్రేమ, ఆశీర్వచనాలతో మీరు నాకు స్ఫూర్తి గా నిలుస్తారని భావిస్తున్నాను. సోదరీమణులు మరియు సోదరులారా, మీరు నన్ను మీ ప్రధాన మంత్రి గా ఎన్నుకున్నప్పటికీ ఒక పార్లమెంటు సభ్యునిగా నేను మీకు బాధ్యుడినై, జవాబుదారు గా ఉంటాను. గత నాలుగు సంవత్సరాలు గా ఒక పార్లమెంటు సభ్యునిగా నేను చేసిన పని ఏమిటో మీకు ఈ రోజు వివరించాను. ఒక ప్రజా ప్రతినిధిగా, నేను మీ సేవకుడిని. మీరు నా యజమాని లేదా అధిష్ఠానం (హై కమాండ్). అందువల్ల నేను ఖర్చు చేసిన ప్రతి పైసా ను గురించి, నేను పనిచేసిన ప్రతి క్షణం గురించి మీకు తెలియజేయడం నా బాధ్యత.

ఒక పార్లమెంటు సభ్యునిగా, నేను చేసిన అభివృద్ధి పనులను మీముందు వివరించే అవకాశం కలిగినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. మీ అభిమానానికి, ఆశీస్సులకు మరొక్క మారు మీకు అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

నాతో పాటు గట్టిగా చెప్పండి –

భారత్ మాతా కీ జయ్.

భారత్ మాతా కీ జయ్.

భారత్ మాతా కీ జయ్.

అనేకానేక ధన్యవాదాలు.

**