Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లఖ్ నవూ లో ‘కృషి కుంభ్ 2018’ ప్రారంభం సందర్భం లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం


నా మంత్రివర్గ సహచరుడు రాధామోహన్ సింహ్ గారు,  ప్రజాదరణ పొంది, విజయవంతం గా, ఉత్సాహవంతం గా పాలన సాగిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ గారు, జపాన్ ప్రభుత్వ సహాయ ఉప మంత్రి తకామి నకాడ గారు, ఇజ్రాయల్ రాయబారి మాయా కదోష్ గారు,  వ్యవసాయ శాస్త్రవేత్త లు, ఇతర ప్రముఖులు మరియు ఉత్తర్ ప్రదేశ్ నలు మూలల నుండి వచ్చినటువంటి నా ప్రియతమ రైతు సోదరులు మరియు రైతు సోదరీమణులారా..

ప్రయాగరాజ్ వద్ద అర్ధ-కుంభ మేళ జరగడానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉంది.  అయితే ఉత్తర్ ప్రదేశ్ లో నేటి నుండి మరో కుంభ్ ప్రారంభం అయింది.  ఉత్తర్ ప్రదేశ్ లోని వివిధ గ్రామాల నుండి వచ్చిన 50 వేల మంది రైతులు దేశం నలుమూలల నుండి, ప్రపంచం లోని పలు దేశాల నుండి విచ్చేసిన శాస్త్రవేత్త లు, పారిశ్రామిక వేత్త లు ఇప్పుడు లఖ్ నవూ లో జరుగుతున్న కృషి కుంభ్ లో భాగస్వాములయ్యారు.  మీ అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను.  ఉత్తర్ ప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుని గా ఎల్ల వేళ ల మీతో కలసి నడవడం మరియు మీరు సాగించే అబివృద్ధి పయనం లో నా వంతు ప్రయత్నం చేయడం నా బాధ్యత.

కొన్ని నెలల కిందట కృషి ఉన్నతి మేళా జరిగినప్పుడు పెద్ద ఎత్తున రైతు మేళా లను నిర్వహించాలంటూ నేను సలహా ను ఇచ్చాను.  ఇప్పుడు జరుగుతున్న కృషి కుంభమేళ మేళ దాని విస్తరణే.  ఇంత భారీఎత్తు న మేళా ను నిర్వహిస్తున్నందుకు యోగి గారి కి, ఆయన బృందానికి అభినందనలు.  ఈ కార్యక్రమం లో భాగస్వామ్యం వహిస్తున్నందుకు జపాన్ ప్రభుత్వానికి, ఇజ్రాయల్ ప్రభుత్వానికి కూడా నేను కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాను.  ఇదే సమయం లో మేళా లో పాలుపంచుకొంటున్న హరియాణా కూడా దీని నుండి ప్రయోజనాన్ని పొందనుంది. 

మిత్రులారా,

ఎప్పుడైనా,  ఏ కార్యక్రమం తో నైనా ‘కుంభ్’ పదం జత కలిసిందా అంటే దాని ప్రాముఖ్యం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది.  ఒక విధంగా చెప్పాలంటే  కుంభ్ ఎన్నో యోచన ల సమ్మేళనమే కాకుండా మానవత్వం యొక్క వ్యక్తీకరణ కూడాను.  ఈ సంప్రదాయాన్ని కృషి కుంభ్ నెరవేర్చుతుందని నేను నమ్ముతున్నాను.  వచ్చే మూడు రోజుల్లో ఆధునిక మెలకువ లకు మరియు ఇతర అవకాశాల కు కొత్త దారులు ఏర్పడనున్నాయి. 

మిత్రులారా,

రైతులకు ఆధునిక మెలకువ లను తెలియజేసే, వ్యవసాయాని కి సంబంధించిన యంత్రాల ను పరిచయం చేసే దాదాపు 200 స్టాల్స్ ను మేళా లో ఏర్పాటు చేసినట్లు నాకు చెప్పారు.  దీని వల్ల ప్రతి రైతు ప్రయోజనాన్ని పొందగలడని నా నమ్మకం.  అదే సమయం లో రైతులు నాణ్యమైన పంట లను పండించేందుకు తోడ్పడగలదు.

మిత్రులారా,

దేశ వ్యాప్తం గా అన్నిచోట్లా ఖరిఫ్ సీజన్ ముగియనుంది.  ఇప్పుడు రైతు సోదరులు, రైతు సోదరీమణులు తీరిక లేని పనుల్లో తలమునకలు గా ఉన్నారు.  ఈసారి కూడా రికార్డ్ స్థాయి ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది.  ఉత్తర్ ప్రదేశ్ రైతులు కష్టించి పని చేసి దేశ ఆహారధాన్యాల ఉత్పత్తి లో 20 శాతం ఆహారధాన్యాలను పండిస్తారు.  ఇందుకు గాను మీ అందరిని నేను అభినందిస్తున్నాను. దేశమంతటా ఉన్న ధాన్యం మండీ లలో బియ్యం, కాయధాన్యాల తో సహా అనేక పంట లను కొనుగోలు చేయడం జరుగుతోంది.  ఉత్తర్ ప్రదేశ్ లోనూ పలు ప్రాంతాల లో ఇందుకుగాను భారీ ఏర్పాట్లను చేసినట్లు నాకు చెప్పారు.  ఈసారి రైతులు వారి యొక్క పంట లకు పొందే ధరలు కనీస మద్దతు ధర పై ఆధారపడ్డ ధరలు.   ప్రభుత్వం 21 పంట లకు కనీస మద్దతు ధర లను పెంచి చరిత్ర సృష్టించిన సంగతి మీ అందరికీ తెలుసు.   రైతులు పొందే ధర లో కనీసం 50 శాతం వారి కి లాభం గా అందాలని నిర్ణయించడం జరిగింది. 

మిత్రులారా,

ఒక వైపు ఉత్తర్ ప్రదేశ్ రైతులు ఉత్పత్తి లో  రికార్డు ను సాధిస్తుండగా యోగి గారి ప్రభుత్వం ఆ ఉత్పత్తుల కొనుగోలు లో రికార్డు ను సృష్టిస్తోంది.  ఈ కారణం గా  యోగి గారి ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను.  ఈ సారి 50-55 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కొనుగోలు చేశారు.  అదే గత ప్రభుత్వ హయాంలో 7-8 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ కొనుగోలు చేసే వారు.  దానర్ధం ఏమిటంటే రైతుల ఉత్పత్తి కి మంచి ధర రావడంతో పాటు భారతీయ జనతా పార్టీ కి చెందిన యోగి ప్రభుత్వం 7-8 రెట్లు ఎక్కువ కొనుగోళ్ళు జరిపింది.  అంతేకాదు ఈ కొనుగోళ్ళన్నీ రైతుల నుండి నేరు గా అత్యంత అధునాతన టెక్నాలజీ ని ఉపయోగించి అంటే ‘ఇ-ఉపార్జన్’ ద్వారా మధ్య మదళారుల ప్రమేయం లేకుండా కొన్నవే.

మిత్రులారా,

ఈ మార్పు గోధుమలు, వరి ధాన్యం విషయం లోనే కాదు చెరకు విషయం లో కూడా కనిపించింది.  ఈ సీజన్ లో రైతు లకు 27 వేల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది.  దాంతో పాటు రైతు లకు  11 వేల కోట్ల రూపాయల పాత బకాయి లను కూడా చెల్లించారు.  చక్కెర మిల్లు లు చెల్లించవలసిన బకాయి లను కూడా తీర్చేందుకు యోగి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నాకు చెప్పారు.  ఇప్పుడు మొదటి సారి ఉత్తర్ ప్రదేశ్  ప్రభుత్వం బంగాళాదుంప లను కొనుగోలు చేయాలని నిర్ణయించడం నాకు సంతోషాన్ని కలిగించింది.  బంగాళాదుంప లకు సరైన ధర లభించని రైతు లకు ఇది తప్పకుండా మేలు చేస్తుంది. 

మిత్రులారా,

రైతుల మేలు కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు, చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కేంద్ర ప్రభుత్వ కట్టుబాటు లో భాగమే.  కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల గ్రామాలు, రైతులు మన ఆర్ధిక ప్రణాళిక లో ముఖ్యమైన భాగం గా మారాయి.  దేశాన్ని ముందుకు నడిపించే వాడు రైతేనని,  అలా కాకుండా రైతు ను జాతి ముందుకు తీసుకుపోవడం లేదని మాకు స్పష్టమైన నమ్మకం.  అందువల్ల వ్యవసాయానికి సంబంధించిన, రైతు లకు సంబంధించిన సమస్య లను ముక్కలు ముక్కలుగా కాకుండా సమగ్రమైన రీతి లో పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.  రైతు లకు సంబంధించిన ప్రతి చిన్న సమస్య ను కూడా పరిష్కరించడం పైన మా దృష్టి ని కేంద్రికరించాం. 

మిత్రులారా,

దేశానికి స్వాతంత్ర్యం సంపాదించుకొని 75 సంవత్సరాలు పూర్తి అయ్యే 2022వ సంవత్సరం కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే సంకల్పానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.  కనీస వ్యయం మరియు గరిష్ఠ లాభం అనే విధానం మేరకు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వ్యవసాయ అవసరాలకు  బాగా మేళవించడం జరిగింది.  దేశం లో ‘విత్తనం నుండి విపణి వరకు’ అనే బలమైన వ్యవస్థ ను రూపొందించడం జరుగుతోంది.  భూసార పరిరక్షణ నుండి మండీ ల అభివృద్ధి దాకా వివిధ రంగాల స్థితిగతుల ను మెరుగుపరచేందుకు అనేక యత్నాలు మొదలయ్యాయి.  భూ శ్రేష్టత ను తెలిపే 16 కోట్ల కు పైగా కార్డులను దేశ వ్యాప్తంగా రైతులకు పంచడమైంది.  వాటి లో 3 కోట్ల కార్డులు ఉత్తర్ ప్రదేశ్ లో పంపిణీ చేయడమైంది.  దీనివల్ల భూమి తీరు, రకం ఆధారం గా రైతులు వేయవలసిన పంట ను, ఎంపిక చేసిన పంట లకు వేయవలసిన ఎరువుల మోతాదు ను  నిర్ణయించుకోవచ్చు.

మిత్రులారా,

భూమి స్వరూపాన్ని, ఫల సామర్ధ్యాన్ని పరిరక్షించేందుకు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతోంది.  చెత్త నుండి తయారు చేసిన ఎరువు లను వాడాలని రైతు లను ప్రోత్సహిస్తున్నారు.  దేశ అవసరాల కు అనుగుణం గా ఉత్పత్తి జరిగేలా చూడాలనేది ఉద్దేశ్యం.  అంతేకాక యూరియా వంటి ఎరువులు తగినంతగా లభ్యం అయ్యేటట్టు చూడడం జరుగుతోంది.  అదే సమయం లో నీటిపారుదల సౌకర్యాలను పటిష్టపరచడం జరుగుతోంది.  భారీ నీటిపారుదల పథకాల కు తోడు గా నీటిపారుదల లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం జరుగుతోంది.  రైతు లలో  ‘ప్రతి చుక్క తో మరింత పంట’ను పొందాలన్న భావన ను పెంపొందించడం జరుగుతోంది.   బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి సూక్ష్మ నీటిపారుదల పద్దతులు మన నీటిపారుదల వ్యవస్థ లో భాగంగా మారుతున్నాయి. 

కొత్త నీటిపారుదల పారుదల మెలకువ ల అనుసరణ లో ఇజ్రాయల్ ప్రశంసలను అందుకొంది.  అదే సమయం లో జపాన్ కూడా అభినందనీయమైన రీతి లో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది.  అందువల్ల కృషి కుంభ్ భాగస్వామి గా ఆ రెండు దేశాల నిపుణత నుండి మీరు ప్రయోజనాన్ని పొందగలరు.

మిత్రులారా,

వాటితో పాటు ఇప్పుడు మనం విద్యుత్తు, డీజిల్ పంపుల నుండి సోలార్ పంపు లకు మారుతున్నాం.  ఈ వ్యవస్థ లతో పాటు నీటిపారుదల లో పంపులు చాలా ముఖ్యమైనవి.  ఈ దిశ లో భారీ కృషి జరుగుతోంది.  విద్యుత్తు, డీజిల్ పంపు లను సోలార్ పంపు లుగా మార్చాలని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.  ఇందులో భాగం గా వచ్చే నాలుగు సంవత్సరాల లో దాదాపు 28 లక్షల మంది రైతులకు చెందిన వ్యవసాయ క్షేత్రాలలో సోలార్ పంపు లను బిగించాలని సంకల్పం.  దీని వల్ల రెండు ప్రయోజనాలు.. ఒకటో ప్రయోజనం రైతులకు ఉచిత విద్యుత్తు లభ్యత; రెండో ప్రయోజనం విద్యుత్తు పంపిణీ చేసే డిస్ కమ్ లకు  మిగులు విద్యుత్తు ను విక్రయించడం.

మిత్రులారా, 

ఆహారధాన్యాలు పండించే రైతు ను మునుపు ‘అన్నదాత’ అనే వాళ్ళం.  ఇప్పుడు రైతు కు ఇంధన ఉత్పత్తి సామర్ధ్యం వచ్చింది.  ఆ విధంగా ఇంధన ఉత్పత్తిదారు లేక ‘ఊర్జాదాత’ అయ్యారు.   అన్నదాత ను ఇక ముందు ఊర్జాదాత అని కూడా పిలవవచ్చును. 

మిత్రులారా,

దీని వల్ల రైతుల జీవితాల్లో భారీ మార్పు లు వస్తాయని చెప్పడానికి నేను ఒక దృష్టాంతాన్ని ఉదహరిస్తాను.  కొన్నాళ్ళ కిందట నేను గుజరాత్ కు వెళ్ళాను. అక్కడ ఒక గ్రామం లో కొన్ని రైతు కుటుంబాల వారు సమష్టి గా తమ పొలాల్లో సౌర పట్టిక లను, సోలార్ పంపులను బిగించారు.  ఆ విధంగా వారు సౌర శక్తి నుండి విద్యుత్తు ను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు.  వారు దాన్ని తమ పొలాల్లో సోలార్ పంపుల కోసం వాడారు.  ఆ విధంగా వారి విద్యుత్తు అవసరాలు తీరాయి.  అంతే కాదు వారు వాడగా మిగిలినటువంటి విద్యుత్తు ను విక్రయించి ఏటా 50 వేల రూపాయలకు పైగా ఆర్జిస్తున్నారు. 

మిత్రులారా,

రైతులకు విజ్ఞాన శాస్త్ర ఫలితాలను అందించేందుకు ప్రభుత్వం తీవ్రం గా ప్రయత్నిస్తోంది.  రైతులను, శాస్త్రవేత్త లను పరిశోధన కేంద్రాల తో నేరు గా అనుసంధానించే పని మొదలైంది.  తద్వారా శాస్త్ర పరిశోధన ఫలితాలను వీలైనంత తక్కువ సమయం లో రైతు లకు అందించాలన్నది ఉద్దేశం.   దేశ వ్యాప్తంగా దాదాపు 700 కృషి విజ్ఞాన కేంద్రాల ను ఏర్పాటు చేయడం జరిగింది.  వ్యవసాయ పరిశోధన కు సంబంధించిన ఆధునిక సంస్థ లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వారాణసీ లో వరి పరిశోధన కేంద్రాన్ని స్థాపించడం జరుగుతోంది.  వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడంతో పాటు రైతు లకు గరిష్ఠ ధర ను ఇప్పించేందుకు ప్రభుత్వం యత్నాలు ప్రారంభించింది.  ఫూడ్ ప్రాసెసింగ్ రంగం లో నూటి కి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కు ప్రభుత్వం అవకాశం కల్పించింది.  టొమాటో లు అమ్మడం కన్నా సీసా లో టొమాటో సాస్ అమ్మడం వల్ల ఎక్కువ ఆదాయం వస్తుందని మనందరికీ తెలుసు.  అదే విధంగా పచ్చి మామిడికాయ లు అమ్మితే వచ్చే ఆదాయం కన్నా మామిడికాయ పచ్చడి అమ్మితే వచ్చే ఆదాయం ఎక్కువ.   అదేవిధంగా మిరపకాయలు అమ్మడం కన్నా కారంపొడి అమ్మడం వల్ల వచ్చే ఆదాయం ఎక్కువ.  దీనినే విలువను పెంచడం అంటారు.  అంతే కాకుండా ఈ ఏడాది బడ్జెట్ లో టొమాటోలు, ఉల్లిపాయలు, బంగాళదుంపల విలువ ను పెంచేందుకు 500 కోట్ల రూపాయల కేటాయింపు తో టిఒపి (టోమాటోలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు) పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.  ఇది ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బంగాళాదుంప రైతు లకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.  దీనివల్ల వ్యవసాయ రంగంలో పెట్టుబడుల కు కొత్త అవకాశాల ను తెరచి యుపి కి లాభం చేకూరుస్తోంది.  ఉత్తర్ ప్రదేశ్ లో నిర్వహించిన పెట్టుబడిదారుల సమ్మేళనం లో ఫూడ్ ప్రాసెసింగ్ రంగం లో సుమారు 16 వేల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదన లు అందాయి.  వాటిలో 3500 కోట్ల రూపాయల విలువైన 14 ప్రాజెక్టు లను ఇప్పటికే ప్రారంభించడమైంది. 

మిత్రులారా,

వ్యవసాయాన్ని లాభదాయకం గా మార్చేందుకే ఈ చర్యలన్నీ తీసుకోవడం జరిగింది.  వాటి తో పాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఇతర చర్య లను కూడా తీసుకోవడం జరుగుతోంది.  హరిత విప్లవం విజయం తరువాత మనం శ్వేత విప్లవం, మధుర విప్లవం, నీలి విప్లవం వంటి కొత్త దారుల్లో వెళ్ళడం మొదలుపెట్టాం.  పాల ఉత్పత్తి , తేనె ఉత్పత్తి, గుడ్లు లేక చేపల ఉత్పత్తి లో మనం రికార్డు సృష్టిస్తున్నాం.  చేప ల ఉత్పత్తి లో ఉన్న మత్స్యకారుల కుటుంబాల కు ప్రయోజనాన్ని చేకూర్చే నిర్ణయాన్ని భారత ప్రభుత్వం రెండు రోజుల కిందట తీసుకొంది.  వారికోసం 7500 కోట్ల రూపాయల తో కొత్త నిధి ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

మిత్రులారా,

కృషి కుంభ్ కు వచ్చిన మీరంతా.. రైతులు, వ్యవసాయ నిపుణులు, శాస్త్రజ్ఞులు.. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ కు ముఖ్యులు.  ఎందుకంటే రానున్న రోజుల్లో మీ ప్రయత్నాలు త్వరిత గతి న అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ పై ప్రభావాన్ని చూపుతాయి.  మీరందరూ కలసికట్టు గా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే చర్యలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి చర్చించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.  తక్కువ ఎరువుల వాడకం, తక్కువ నీటి తో ఎక్కువ లాభాన్ని పొందడం, పంట లను నిల్వ చేయడానికి గిడ్డంగు లను అభివృద్ధి చేయడం, రోబో, డ్రోన్ ల వంటి వాటిని సమర్ధవంతంగా వినియోగించడం వంటి అనేక అంశాల ను గురించి చర్చించవలసిన అవసరం ఉంది. 

దీనికి తోడు, కొత్త సాంకేతికత సహాయం తో వరి, తదితర పంటల మోడు లను సంపద గా మార్చే విషయం యోచించాలి.  చెత్త ను సంపద గా మార్చవచ్చును.  పంట నూర్పిళ్ళ కు ముందు, ఆ తరువాత వ్యవసాయ క్షేత్రం లో పనికిరానిదంటూ ఏదీ లేదు.  పొలం లో ప్రతిదీ బంగారమే.  రైతు తన పొలాన్ని సమర్ధవంతంగా ఉపయోగిస్తే ఏదీ వ్యర్ధం గా పోదు.  చెత్త నుండి సంపద ను సృష్టించవచ్చు.  ఈ దిశ లో సమర్ధవంతంగా పని చేయవలసిన అవసరం ఉంది. గడ్డి దుబ్బు లను,  పంట మోడు లను తగులబెట్టడాన్ని ఆపేందుకు ప్రభుత్వం పంటల నుండి వచ్చే వ్యర్దాలపై  50-80% రాయితీ ని ఇస్తోంది.  రైతు సోదరులు తప్పనిసరి గా గడ్డి దుబ్బు లను,  పంట మోడు లను తగులబెట్టకుండా టెక్నాలజీ ఆధార పరిష్కారాలతో  నివారించాలి.  దాని వల్ల పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం. 

వచ్చే మూడు రోజుల్లో జరిగే చర్చలు వ్యవసాయాన్ని లాభసాటి గా మార్చేందుకు, విలువను పెంచేందుకు  దోహదపడుతాయని,  ఉత్తర్ ప్రదేశ్ లోని వివిధ జిల్లాల ప్రత్యెక అవసరాలను తీర్చేందుకు తోడ్పడే కొత్త ప్రయోగాలపై చర్చలు కేంద్రీకృతం అవుతాయని నేను నమ్ముతున్నాను. 

కృషి కుంభ్ ఉత్తరప్రదేశ్ తో పాటు యావత్తు దేశ వ్యవసాయ వ్యవస్థ కు ఒక కొత్త దిశ ను చూపించగలదని నేను ఆశిస్తున్నాను.  ఆ ఆశాభావం తో మీ అందరికి మరొక్క మారు ఇవే నా శుభాకాంక్షలు.

మీకందరకూ ధన్యవాదాలు.

**