Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దైనిక్ జాగరణ్ 75వ వార్షికోత్సవం సందర్భం గా ఏర్పాటు చేసిన జాగరణ్ ఫోరమ్ లో ప్రధాన మంత్రి ప్రసంగం

దైనిక్ జాగరణ్ 75వ వార్షికోత్సవం సందర్భం గా ఏర్పాటు చేసిన జాగరణ్ ఫోరమ్ లో  
ప్రధాన మంత్రి ప్రసంగం

దైనిక్ జాగరణ్ 75వ వార్షికోత్సవం సందర్భం గా ఏర్పాటు చేసిన జాగరణ్ ఫోరమ్ లో  
ప్రధాన మంత్రి ప్రసంగం

దైనిక్ జాగరణ్ 75వ వార్షికోత్సవం సందర్భం గా ఏర్పాటు చేసిన జాగరణ్ ఫోరమ్ లో  
ప్రధాన మంత్రి ప్రసంగం


ఇక్కడకు విచ్చేసిన మహిళలు, సజ్జనులారా,

ముందుగా నేను దైనిక్ జాగరణ్ పత్రిక వజ్రోత్సవం సందర్భం గా పత్రిక చదువరులు అందరికి, ఈ ప్రచురణ తోను, దీని పంపిణీ తోను సంబంధం కలిగివున్న వారి కి, ప్రత్యేకించి పత్రిక విక్రేత సోదరుల కు శుభాకాంక్షలను తెలుపుతున్నాను.

గత 75 సంవత్సరాలు గా మీరందరూ విశ్రాంతి అనేదే లేకుండా కోట్లాది దేశ ప్రజల కు సమాచారాన్ని, వివిధ అంశాలను గురించిన పరిజ్ఞానాన్ని అందిస్తూవచ్చారు. దేశ పునర్నిర్మాణం లో దైనిక జాగరణ్ చాలా ముఖ్యమైన పాత్ర ను పోషించింది. ప్రజల కు సమకాలీన వ్యవహారాల ను గురించి అవగాహన ను కలుగజేయడంలో మీరు కీలక భూమిక ను నిర్వహిస్తూ వచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యం లో ప్రారంభమైన మీ కృషి ఇప్పుడు న్యూ ఇండియా లో కొత్త ఆశలు, కొంగొత్త తీర్మానాలు, కొత్త విలువ లతో ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతోంది. దైనిక్ జాగరణ్ పత్రిక పాఠకుల లో నేనూ ఒకడి ని.

పత్రిక ను చదివిన అనుభవం తో నేను ఒక విషయాన్ని చెప్పగలను. గడచిన దశాబ్ద కాలం లో దేశం లో మరియు సమాజం లో మార్పు లు తేవడానికి జరుగుతున్న ప్రచారాన్ని బలోపేతం చేయడానికి దైనిక్ జాగరణ్ ఎంతో కృషి చేసింది.
గడచిన నాలుగు సంవత్సరాల లో మీ గ్రూపు మరియు ఇతర ప్రసార మాధ్యమ సంస్థ లు జాతి నిర్మాణాని కి మూల స్తంభాలు గా తమ బాధ్యత ను ఉత్తమం గా నిర్వహించాయి. బేటీ బచావో బేటీ పఢావో గాని లేక స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను గురించి చైతన్యం తెచ్చి ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం లో ప్రసార మాధ్యమాలు సానుకూలమైన మరియు కీలక పాత్ర ను పోషించగలదు.

ఈ విషయం లో దైనిక్ జాగరణ్ కూడా తన అర్థవంతమైన సహకారాన్ని అందించడం లో ఎప్పుడూ అగ్ర భాగాన నిలచింది. ఇటీవల నేను మీ అందరి తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం జరిగింది. మీరంతా పరిశుభ్రత కోసం ఎంతటి అంకితభావం తో కృషి చేస్తున్నారో నాకు తెలియవచ్చింది.

మిత్రులారా,

భవిష్యత్తులో ప్రసార మాధ్యమాలు నిర్వహిస్తున్న ఈ పాత్ర మరింత కీలకం కానుంది. డిజిటల్ రంగం లో వచ్చిన విప్లవం ప్రసార మాధ్యమాలు మరియు వార్తా పత్రికల వ్యాప్తి ని బాగా పెంచింది. న్యూ ఇండియా పునాదుల ను కొత్త ప్రసార మాధ్యమాలు మరింత పటిష్టం చేయగలవని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

మనం న్యూ ఇండియా ను గురించి మాట్లాడుతున్న ప్రతి సారి దాని వెనుక ఉన్న మౌలిక మంత్రాల ను గుర్తు పెట్టుకోవాలి. అవేమిటంటే ‘కనీస ప్రభుత్వం గరిష్ఠ పాలన’ మరియు “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్”. ప్రజల భాగస్వామ్యం తో అటువంటి వ్యవస్థ ను ఏర్పాటు చేసి అమలు చేయవచ్చుననే ఆలోచన ను గత నాలుగు సంవత్సరాలు గా అందరి కి తెలియజేస్తూ ముందుకు పోతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను స్వచ్ఛందం గా కొనసాగించడానికి ప్రజలు వారంతట వారు ముందుకు వస్తున్నారు.

పాలన లో ఇటువంటి భావన. మనకు సంబంధించింది అనే అభిప్రాయం మరియు సహకారం దేశం లో ఇప్పుడు బాగా బలపడింది.

ఇప్పుడు దేశ యువత దేశాభివృద్ధి లో తాము కూడా భాగస్వాములమని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నింటి ని అవి తమ కోసం తమకు సంబంధించినవి అని యువత భావిస్తున్నారు. తమ అభిప్రాయాల కు విలువ ఇచ్చి వినే వారు ఉన్నారనే భావన యువత లో వచ్చింది. అందుకే ప్రభుత్వం పట్ల, వ్యవస్థ పట్ల విశ్వాసం మున్నెన్నడూ లేనంతగా పెరిగింది. ప్రభుత్వం కోరుకున్న, నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తోంది; ప్రభుత్వం పారదర్శకం గా పనిచేస్తుందనే అభిప్రాయం ప్రజలకు కలిగినప్పుడే అలాంటి నమ్మకం ఏర్పడుతుంది.

మిత్రులారా,

ఈ జాగరణ్ ఫోరమ్ లో మీరు అనేక అంశాల ను గురించి చర్చిస్తారు. మరెన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. వాటికి జవాబులను కూడా అన్వేషిస్తారు. మీ వేదిక మీద నేను కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ ప్రశ్న ను ఇప్పుడు అడిగేది నేనైనా దీని వెనుక దేశ ప్రజలందరి ఉద్వేగం నిండి వుంది. మీరు తరచు గా విస్మయానికి గురవుతూ ఉండవచ్చు. మన దేశం ఎందుకు వెనుకబడివుంది ? ఈ ప్రశ్న మీ మది లో కూడా ఉండవచ్చు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన తరువాత కూడా ఇంకా దేశం ఎందుకు వెనుకబడివుంది? మనకు సారవంతమైన భూములు ఉన్నాయి. మన యువత ప్రతిభావంతులు; వారు కష్టపడి పనిచేస్తారు. మరి మనకు అపరిమితమైన ప్రకృతి వనరులు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నా మన దేశం ఎందుకు ప్రగతి ని సాధించడం లేదు ? మనకంటే చిన్న దేశాలు చాలా తక్కువ ప్రకృతి వనరులు ఉన్నప్పటికీ అనతికాలం లోనే మన కన్నా ముందుకు వెళ్లడానికి కారణం ఏమిటి ?

మన దేశ ప్రజల సామర్థ్యం తెలివితేటలు కారణం గా మనం చంద్రమండలానికి చంద్రయాన్ ను చేయగలుగుతున్నాం. చాలా తక్కువ ఖర్చు తో కుజగ్రహానికి కూడా వెళ్లి వచ్చాం. మరి గ్రామాల లో ఉన్న కోట్లాది మందికి రోడ్లు లేకపోవడానికి కారణం ఏమిటి ?

మిత్రులారా,

భారతీయుల నూతన ఆవిష్కరణ లతో ప్రపంచ దేశాలు దేదీప్య మానం గా వెలిగిపోతున్నాయి. అదే సమయంలో కోట్లాది మంది భారతీయులకు విద్యుత్తు అందకపోవడానికి కారణం ఏమిటి ? స్వాతంత్ర్యం వచ్చిన ఆరు దశాబ్దాలయినా దేశ ప్రజలు మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూడవలసిన దు:స్థితి ఎందుకు ? ఈ ఆరు దశాబ్దాల లో చాలా మంది మహానుభావులు అధికారం లోకి వచ్చారు; వెళ్లారు. అయినప్పటికీ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్య లను కూడా వారు పరిష్కరించలేదు.

మిత్రులారా,

ఇప్పుడు కావలసింది లక్ష్యం కాదు ధ్యేయం; ధనం కాదు మోహం; పరిష్కారం కాదు కరుణ, బలం కాదు పని సంస్కృతి. కబీర్ దాస్ గారు ప్రవచించిన వాక్కు లను కొందరు వక్రీకరించి అపహాస్యం చేస్తుంటారు. “కల్ కరేసో ఆజ్ కర్ ఆజ్ కరేసో అబ్ కర్” (రేపటి పని ఈ రోజు చేయి; ఈ రోజు పని ని ఇప్పుడే చేయి అని ఈ మాటలకు భావం). అదే భావన ను దశాబ్దాల కిందట మన పని సంస్కృతి లో చేర్చి అమలుచేసి ఉన్నట్లయితే ఇప్పుడు మన దేశం ఖ్యాతి ఎంతటి ఉన్నత స్థితి లో ఉండేదో కొంచెం ఊహించండి.

మిత్రులారా,

ఇటీవల జలాంతర కేబుల్ వ్యవస్థ ద్వారా ఎలిఫెంటా దీవి లో మూడు గ్రామాల కు విద్యుత్తు సరఫరా జరుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల లో సంచలనాన్ని సృష్టించింది. ఆ వీడియో ను నేను చూశాను. బహుశా మీరంతా ఆ వీడియో ను చూసే వుంటారనుకుంటా. విద్యుత్తు కాంతుల తో వెలిగే ముంబయి నగరాన్ని చూస్తూ చీకటి లో మగ్గుతున్న తమ దు:స్థితి కి ఎలిఫెంటా దీవి లో నివసించే వారు ఎంత బాధపడే వారో ఒక్కసారి ఊహించండి. దురదృష్టవశాత్తు గత 70 సంవత్సరాలు గా వారు అంధకారం లో ఉన్నారు. కొద్ది రోజుల కిందట మేఘాలయ కు మొట్టమొదటిసారిగా రైల్వే సర్వీసులను ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఒక ఉత్తరం వచ్చింది. మేం అధికారం లోకి రాక మునుపు మేఘాలయ, మిజోరమ్, త్రిపుర లు దేశ రైల్వే చిత్రపటం లో ఉండేవి కాదు. ఈ రాష్ట్రాల ప్రజల జీవనాన్ని ఏ విధం గా, ఎవరు ప్రభావితం చేశారో ఊహించండి.

మిత్రులారా,

దేశం ఏ దిశ లో ఎంత వేగంగా ముందుకు పోతుందో, గతం లో ఎంత వేగం గా పని చేసిందనేది ప్రసార మాధ్యమాల మిత్రుల కు అధ్యయనం చేయడానికి, పరిశోధన సాగించడానికి మంచి అంశం. స్వాతంత్ర్యం వచ్చి 67 సంవత్సరాలు. 67 సంవత్సరాలు గడచిన తరువాత కూడా కేవలం 38 శాతం గ్రామీణ గృహాల లో మరుగుదొడ్ల నిర్మాణం జరగడానికి కారణం ఏమిటి ? నాలుగు సంవత్సరాల లో 98 శాతం ఇళ్ల లో మరుగుదొడ్ల నిర్మాణం ఎలా పూర్తి అయింది ? స్వాతంత్ర్యం వచ్చి 67 సంవత్సరాలు గడచిన అనంతరం కూడా 55 శాతం గ్రామాలకు మాత్రమే రోడ్డు వసతి ఉంది. అయితే నాలుగు సంవత్సరాల లో 90 శాతానికి మించి గ్రామాలకు రోడ్లు ఎలా విస్తరించగలిగారు ? స్వాతంత్ర్యం వచ్చి 67 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత కూడా 55 శాతం ఇళ్ల కు మాత్రమే వంట గ్యాస్ కనెక్షన్ లను ఇవ్వడానికి కారణం ఏమిటి ? ఆ తరువాత నాలుగు సంవత్సరాల లో గ్యాస్ కనెక్షన్ లు 90 శాతానికి ఎలా పెరిగాయి ? స్వాతంత్ర్యం వచ్చిన 67 సంవత్సరాల తరువాత కూడా కేవలం 70 శాతం గ్రామీణ గృహాలకు విద్యుత్తు సౌకర్యం ఉండేది. ఆ తరువాత నాలుగు సంవత్సరాల లో 95 శాతానికి మించి గ్రామీణ గృహాలకు విద్యుత్తు కనెక్షన్ లు ఎలా ఇవ్వగలిగారు ? మిత్రులారా, ఇదే విధం గా ప్రశ్నలు వేయడం మొదలుపెడితే గంటలు గడిచిపోతాయి. గత నాలుగు- నాలుగున్నర సంవత్సరాల లో వ్యవస్థ లో ఉన్న లోపాలను అధిగమించి వ్యవస్థాపరమైన నిర్వహణ ను పూర్తి చేయడం మున్నెన్నడు జరుగని అసమానమైన సంగతి.

స్వాతంత్ర్యం వచ్చిన 67 సంవత్సరాల తరువాత కూడా దేశం లోని సగం కుటుంబాల కు మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉండటానికి కారణం ఏమిటి ? ఇప్పుడు దేశం లో దాదాపు అన్ని కుటుంబాల కు కూడా బ్యాంకుల తో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి ? దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 67 సంవత్సరాల తరువాత కూడా 125 కోట్ల జనాభా ఉన్న దేశం లో కేవలం నాలుగు కోట్లమంది ఆదాయపు పన్ను రిటర్న్ లు దాఖలు చేయడమెందుకు ? కేవలం నాలుగు సంవత్సరాల లో కొత్తగా 3 కోట్ల మంది ని ఆదాయపు పన్ను శాఖ పరిధి లోకి ఎలా తేగలిగారు ? జిఎస్ టి అమలు చేయక ముందు కేవలం 66 లక్షల మంది వ్యాపారులు పరోక్ష పన్నుల వ్యవస్థ లో నమోదై ఉండటానికి కారణం ఏమిటి ? జిఎస్ టి అమలు చేసిన తరువాత కొత్త గా 54 లక్షల మంది నమోదయ్యారు. మిత్రులారా, ఇంతకు ముందు అధికారం లో ఉన్న ప్రభుత్వాలు ఈ పనులు ఎందుకు చేయలేక పోయాయి? ఇప్పుడు ఎలా సాధ్యమవుతోంది ?

ప్రజలు, అధికారుల పెత్తనం, సంస్థలు అన్నీ అవే. ఫైళ్ళ కదలిక కూడా అదే విధంగా ఉంది. కలం, కాగితం, కుర్చీ, బల్ల.. అన్నీ అవే. ఏదీ మారలేదు. మరి ఈ మార్పు ఎలా జరిగింది. అంటే దేశం మారగలదని ఈ పరిణామం చూపుతోంది. అయితే ఈ సందర్భం గా నేను మీకు ఒకటి గుర్తు చేయదలచాను. అదేమిటంటే సరైన నిర్ణయాలు తీసుకొని దిగువ స్థాయి లో అమలు చేయగలిగితే అది సాధ్యపడుతుంది.

దశాబ్దాల కిందట పౌరుల కు కనీస వసతుల ను కల్పించివుంటే ఇప్పుడు మన దేశం ఏ స్థాయి లో ఉండేదో కొంచెం ఊహించండి. నా దేశ ప్రజల కు ఈ సౌకర్యాలన్నీ కల్పించే అవకాశం నాకు లభించినందుకు నేను అదృష్టవంతుడి ని. అదే సమయం లో వాటి కోసం ప్రజలు ఇంత సుదీర్ఘ కాలం వేచి ఉండటం దురదృష్టకరం.

మిత్రులారా,

మన దేశం లో పేదలు, అణగారిన వర్గాలు, లేమి లో ఉన్న వారి కి కూడా మరుగుదొడ్లు, విద్యుత్తు కనెక్షన్, బ్యాంకు ఖాతా లు, వంట గ్యాస్ కనెక్షన్, విద్య, ఆరోగ్యం వంటి కనీస సదుపాయాలు లభించినప్పుడు వారు పేదరికాన్ని స్వయం గా ఎదిరించి గెలుస్తారు. అది నా నమ్మకం. వారు పేదరికం నుండి బయటకు వస్తారు. అదే విధం గా దేశం కూడా. ఈ మార్పు ను మీరు గత నాలుగు సంవత్సరాలు గా చూస్తున్నారు. వీటన్నింటికి గణాంకాలే ఆధారం. అయితే ఇటువంటి పనులు గతం లో ఎన్నడూ జరుగలేదు. ఇది గతం లో జరుగక పోవడానికి కారణం ఒక వేళ పేదరికం అంతం అయినట్లయితే వారు “గరీబీ హటావో” అని ఎలా నినదించ గలిగే వారు. ఒకవేళ వారు కనీస వసతులన్నీ కల్పించివున్నట్లయితే వారికి వోటు బ్యాంకు రాజకీయాలు జరిపేందుకు అవకాశం ఉండేది కాదు. అదే విధంగా బుజ్జగింపు విధానాన్ని అమలు చేయడం సాధ్యం అయ్యేది కాదు.

సోదరులు మరియు సోదరీమణులారా,

దేశం లోని ప్రజలందరికి ఇప్పుడు మేం కనీస వసతులను కల్పించినందువల్ల భారతదేశం ఇప్పుడు నవ శకం లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. కోట్లాది మంది భారతీయుల ఆశలను, ఆకాంక్షలను పూర్తి చేయాలనే కృతనిశ్చయం తో మేం ఉన్నాం. ఈ రోజు న మేం న్యూ ఇండియా కోసం ‘సంకల్ప్ సే సిద్ది’ యాత్ర దిశ లో సాగుతున్నాం. ఈ యాత్ర లో సాంకేతిక విజ్ఞానాన్ని భారత్ వినియోగిస్తున్న తీరు ప్రపంచం లోని వెనుకబడిన దేశాలు అభివృద్ధి చెందడానికి ఒక నమూనా గా కూడా ఉపయోగపడనుంది.

మిత్రులారా,

ఇప్పుడు సాంకేతిక విజ్ఞానాన్ని మానవ జీవనం లో అన్ని కోణాల కు జోడించే ప్రయత్నం జరుగుతోంది. సాంకేతికత కు ఉన్న శక్తి తోను, మానవ సూక్ష్మ గ్రాహ్యత తోను జీవనం సుఖవంతం అవుతుంది. మన వ్యవస్థలన్నీ సత్వరం కొత్త ప్రపంచం అవసరాల కు అనుగుణం గా, యోగ్యం గా మారుతున్నాయి. సౌర శక్తి మరియు జీవ ఇంధనం పై ఆధారపడిన అధునాతన వ్యవస్థ లను అభివృద్ధి చేయడం జరుగుతోంది.

21వ శతాబ్దం అవసరాల ను దృష్టి లో పెట్టుకొని కొత్త తరం మౌలిక సదుపాయాల ను అభివృద్ధి చేయడం జరుగుతోంది. రహదారులు, రైల్వేలు, విమాన మార్గాలు, జలమార్గాల ను అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఈ మధ్య కోల్ కాతా, వారాణసీ ల మధ్య జలమార్గాన్ని ప్రారంభించడం మీరు చూసే ఉంటారు.

డ్రైవర్ ఉండని ‘ట్రైన్ 18’ను ప్రయోగాత్మకం గా నడిపి చూడటం జరిగింది. ఈ విషయం మీ పత్రిక లో కూడా వచ్చింది. ఇప్పుడు విమానయానం బాగా చౌక గా మారింది. రైలు లో ఏసీ కోచ్ ప్రయాణాని కి బదులు విమానం లో వెళ్లేందుకు ఎక్కువ మంది ప్రయాణికులు ఇష్టపడుతున్నారు. దీని కి కారణం చిన్నచిన్న రెండో శ్రేణి మరియు మూడో శ్రేణి నగరాలను కూడా ఉడాన్ పథకం లోకి తీసుకు రావటం. కొత్త విమానాశ్రయాలను, కొత్త విమాన మార్గాలను ఏర్పాటు చేయటం కూడా జరిగింది. మొత్తం వ్యవస్థ లో మార్పులు ఎలా సంభవిస్తున్నాయనేది అర్థం చేసుకోవటం అవసరం. ఇంతకు ముందు వంట గ్యాస్ సిలిండర్ల రీఫిల్ ను సరఫరా చేయడానికి చాలా రోజులు పట్టేది. ఇప్పుడు ఒకటి రెండు రోజుల్లో సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. గతం లో ఎక్కువ ఆదాయపు పన్ను ను చెల్లించినపుడు పన్ను వాపస్ ఇవ్వటానికి నెలలు పట్టేది. ఇప్పుడు కేవలం కొద్ది వారాల్లో వాపస్ ఇస్తున్నారు.

గతం లో కొత్త పాస్ పోర్టు ను పొందటానికి ప్రజలు నెలల కొద్దీ వేచి ఉండవలసి వచ్చేది. ప్రస్తుతం పాస్ పోర్టు ను కేవలం ఒకటి రెండు వారాలలో జారీ చేయడం జరుగుతోంది. విద్యుత్తు సరఫరా కనెక్షన్ ను గాని, నీటి సరఫరా కనెక్షన్ ను గాని పొందడం ఇప్పుడు చాలా సులభం. ప్రభుత్వ సేవల లో చాలా భాగం ఇప్పుడు ఆన్ లైన్ లో అందుబాటు లో ఉన్నాయి. మొబైల్ ఫోన్ లలోనూ లభిస్తున్నాయి. దీనికి నుక ఒకే ఒక ఆలోచన ఉంది. అది సేవల ను పొందటం లో సామాన్యుడు ఎటువంటి ఇబ్బందులకు లోను కాకూడదనేది; అతడు చాంతాడంత బారు లో నిలబడకూడదనేది; అతడు అవినీతికర పద్ధతుల బారి నుండి విముక్తుడు కావాలనేది; రోజువారీ ఇక్కట్టుల బారి నుండి స్వేచ్ఛ ను పొందాలనేదీనూ.

మిత్రులారా,

ప్రభుత్వ సేవల ను ప్రజల ముంగిట కు తీసుకు పోవటమే కాక ప్రభుత్వ పథకాల వల్ల అవసరార్ధులు లబ్ధి ని పొందేలా చూడాలన్న సూత్రానికి ప్రభుత్వం కట్టుబడివుంది. గృహ నిర్మాణం కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, వంట గ్యాస్ కనెక్షన్ ల కోసం ఉజ్వల యోజన, విద్యుత్ కనెక్షన్ ల కోసం మరుగుదొడ్ల నిర్మాణం కోసం సౌభాగ్య యోజన లను ప్రారంభించి ప్రభుత్వం ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రభుత్వం లబ్ధిదారుల ను గుర్తించి తరువాత ఈ పథకాల నుండి ప్రయోజనాన్ని పొందవలసిందిగా వారిని ప్రోత్సహించడం జరుగుతోంది. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పిఎమ్ జెఎవై).. అదే ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ లక్ష్యం దేశం లో 50 కోట్ల మంది కి పైగా పేదల కు ఆరోగ్య సేవ లను అందజేయటం. సంక్షేమాని కి మరియు న్యాయమైనటువంటి సేవల కు ఇది మంచి ఉదాహరణ.

డిజిటల్ టెక్నాలజీ, యాంత్రీకరణ, మానవ సూక్ష్మగ్రాహ్యత ల వంటి వాటి ని ప్రజా సంక్షేమాని కి ఎలా వినియోగించవచ్చో ‘ఆయుష్మాన్ భారత్’ మనకు తెలియపరుస్తుంది. ఈ పథకం లో భాగం గా మొదట లబ్ధిదారుల ను గుర్తించి, ఆ సమాచారాన్ని లేక డాటా ను సాంకేతికత సాయం తో నమోదు చేసి గోల్డెన్ కార్డు లను జారీ చేయడం జరుగుతుంది. గోల్డెన్ కార్డు మరియు ఆయుష్మాన్ మిత్ర ఆ రెండు టెక్నాలజీ మరియు మానవ సూక్ష్మగ్రాహ్యత ల మిశ్రమ ఫలితం. దాని తో దుర్భర దారిద్ర్యం లో ఉన్న ప్రజల కు ఆరోగ్య సేవలను అందించటం జరుగుతుంది.

మిత్రులారా,

ఈ పథకాన్ని ప్రారంభించి ఇప్పటికీ వంద రోజులయినా కాలేదు. కేవలం మూడు నెలల కన్నా తక్కువ సమయం లో, దేశం లో దాదాపు 4.5 లక్షల మంది పేదలు దీని వల్ల లాభపడ్డారు, లేక ఆసుపత్రులలో చికిత్స ను పొందుతున్నారు. ‘ఆయుష్మాన్ భారత్’ వల్ల గర్భిణీల శస్త్రచికిత్సల కాక క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా చికిత్స అందించటం జరుగుతోంది.

కాబట్టి, అభివృద్ది కి దూరంగా ఉన్న బలహీన వర్గాల వారి గురించి కొంచెం ఆలోచించండి. ఎవరీ ప్రజలు? కార్మికులు, శ్రామికులు, రైతులు, రైతు కూలీలు, కార్ఖానా కూలీలు, బండి ని లాగే వారు, రిక్షా ను తోలే వారు, దర్జీ పని చేసేవారు, రజకులూను.

గ్రామాల లోను, పట్టణాల లోను నివసించే వారిలో కొందరు జబ్బు పడితే వారి ముందు ఉండే ప్రధాన సమస్య- వారి వద్ద ఉన్న సొమ్ముతో చికిత్స చేయించుకోవడమా? లేక, చికిత్సను వాయిదా వేసి ఆ సొమ్ముతో రోజువారీ ఖర్చులు తీర్చుకోవడమా? మందులు కొనాలా ? పిల్లవాడి స్కూల్ ఫీజు కట్టాలా ? అనేది వారి ముందు తల ఎత్తే ప్రశ్న లు. పేదలు ఈ ప్రశ్నలు అన్నింటికీ ఆయుష్మాన్ భారత్ రూపం లో సమాధానాన్ని పొందారు.

మిత్రులారా,

పేదలకు సాధికారిత ను కల్పించే ప్రయత్నాలు ఇంతటితో ముగియలేదు. వీటిని సమీప భవిష్యత్తు లో విస్తరించడం జరుగుతుంది. సాంకేతిక విజ్ఞానం సహాయం తో మధ్య దళారుల ను తొలగించేందుకు, ఉత్పత్తిదారుల ను వినియోగదారుల ను దగ్గర చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. మన చట్టాలు , విధానాలు చాలా స్పష్టం గా ఉన్నాయి. ప్రతి స్థాయి లో అవినీతి నిర్మూలన కు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఈ రంగం లో మన ప్రయత్నాల ను యావత్తు ప్రపంచం గమనిస్తోంది. అందువల్ల భారతదేశం ఇప్పుడు అపరిమిత సంభావ్యత లు ఉన్న దేశం గా పరిగణించబడుతోంది.

మిత్రులారా,

కొంతకాలం కిందట అర్జెంటీనా లో జరిగిన జి20 శిఖర సమ్మేళనం సందర్భం గా అక్కడ నేను వివిధ దేశాల నాయకుల తో సమావేశమయ్యానన్నది మీకు తెలిసిన విషయమే. మేము మన ఆలోచన లను గురించి ప్రపంచం లోని శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ ల ముందు ఉంచాం. భారతదేశం కొన్ని సూచనలను అంత్రజాతీయ సమాజం ముందు పెట్టింది. ఆర్థిక నేరగాళ్లు, తప్పించుకుని ఇతర దేశాలకు పారిపోయిన వారు ప్రపంచంలో ఎక్కడా కూడా సురక్షితమైనటువంటి ఆశ్రయాన్ని పొందే వీలు ఉండకుండా చూడాలనేదే దీని ధ్యేయం. మన ప్రయత్నాలు ఒక నాటి కి సఫలం అవుతాయని నేను నమ్ముతున్నాను.

మిత్రులారా,

ఈ విశ్వాసానికి గల కారణాలలో ఒక కారణం ఏది అంటే ప్రపంచం ప్రస్తుతం భారతదేశాన్ని ఆలకిస్తూ భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇవాళ అనేక దేశాలతో మన సంబంధాలు ఎంతగానో మెరుగుపడిపోయాయి. ఆ ఫలితాల ను మీరందరు, మరి యావత్తు దేశ ప్రజలంతా గమనిస్తూ వున్నారు. మరి మూడు నాలుగు రోజుల క్రితం దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ ను మీరు చూశారు. అదంతా మన దేశానికి ఉన్నటువంటి ఆత్మ విశ్వాసం వల్ల సాధ్యపడింది.

మిత్రులారా,

ఈనాడు ఖరాఖండిగా, ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం బలంగా ఉన్న కారణం గా సాధ్యం అయింది. సంపూర్ణ సంఖ్యాధిక్యం తో ఎన్నికైన ప్రభుత్వం మన సామర్ధ్యం, వనరులు, విలువలు, సంప్రదాయం, సంస్కృతి, భద్రత అనే అంశాల పైన దృష్టి ని కేంద్రీకరించి న్యూ ఇండియా నిర్మాణాని కి కృషి చేస్తోంది. ప్రభుత్వం అభివృద్ధి స్రవంతి లోని ఐదు అంశాల ను దృష్టి లో పెట్టుకొని ముందడుగు వేస్తోంది. అవి.. పిల్లల విద్య, యువతకు ఆదాయం, వృద్ధుల కు మందులు, రైతుల కు సాగునీరు మరియు ప్రజల కష్టాలను తీర్చడం.

న్యూ ఇండియా కంటున్న కొంగ్రొత్త కలల ను నేరవేర్చుకోవడం లో దైనిక్ జాగరణ్ మరియు యావత్తు ప్రసార మాధ్యమాలు కీలక పాత్ర ను పోషించగలవు. వ్యవస్థ సాగుతున్న తీరు పై ప్రశ్నల ను గుప్పించడం మీ బాధ్యతే కాక హక్కు కూడాను. మీ సూచన లను మరియు విమర్శ లను నేను ఎల్లప్పుడూ స్వాగతిస్తాను.

దైనిక్ జాగరణ్ గ్రూపు తన స్వతంత్రాన్ని మరియు తటస్థ వైఖరి ని కొనసాగిస్తూనే జాతి నిర్మాణాని కి నిరంతరం కృషి చేస్తుంది. ఆ ఆశ తో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. 75 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు మీ అందరినీ నేను మరొక్క మారు అభినందిస్తున్నాను; మరి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కై మీకు ఇవే నా శుభాకాంక్షలు. అనేకానేక ధన్యవాదాలు.