Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రైల్వేలకు చెందిన భిన్న రంగాల్లో జ‌పాన్‌, ర‌ష్యా ల‌తో అవగాహనపూర్వక ఒప్పందాలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్యక్ష‌త‌న బుధ‌వారం స‌మావేశ‌మైన కేంద్ర మంత్రిమండ‌లి ఈ కింద పేర్కొన్న స‌హ‌కార పూర్వక ఒప్పంద పత్రాలను, అవ‌గాహ‌న పూర్వక ఒప్పంద పత్రాల‌ను ప‌రిశీల‌న‌లోకి తీసుకుంది.

(i) రైల్వే రంగంలో స‌హ‌కారంపై 2015 డిసెంబ‌ర్ 11న జ‌పాన్‌కు చెందిన భూమి, మౌలిక సదుపాయాలు, ర‌వాణా, పర్యటక మంత్రిత్వ శాఖ‌ (ఎమ్ఎల్ఐటి) తో రైల్వే మంత్రిత్వ శాఖ కుదుర్చుకున్న స‌హ‌కార ఒప్పందం.

(ii) రైల్వే రంగంలో సాంకేతిక స‌హ‌కారంపై ర‌ష్యాకు చెందిన జాయింట్ స్టాక్ కంపెనీ “ర‌ష్య‌న్ రైల్వేస్‌”కు, రైల్వే మంత్రిత్వ శాఖ‌కు మ‌ధ్య 2015 డిసెంబ‌ర్ 24న కుదిరిన అవ‌గాహ‌నపూర్వక ఒప్పందం.

(iii) రైల్వే రంగంలో సాంకేతిక స‌హ‌కారం కోసం 2015 డిసెంబ‌ర్ 11న జ‌పాన్‌కు చెందిన రైల్వే టెక్నిక‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌టిఆర్ఐ), మరియు రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండ‌ర్డ్స్ ఆర్గ‌నైజేష‌న్ (ఆర్‌డిఎస్ఒ) ల మ‌ధ్య కుదిరిన అవ‌గాహ‌న ఒప్పందం.

పూర్వ రంగం

దేశంలో రైల్వేల అభివృద్ధిలో వివిధ సంస్థ‌ల నుంచి సాంకేతిక స‌హ‌కారం సాధించేందుకు విదేశీ ప్ర‌భుత్వాలు, జాతీయ రైల్వేల‌తో భార‌తదేశ రైల్వే మంత్రిత్వ శాఖ స‌హ‌కార‌, భాగ‌స్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. హై స్పీడ్ కారిడార్ లు, ప్ర‌స్తుత రూట్ల‌లో రైళ్ళ వేగాన్ని పెంచ‌డం, ప్ర‌పంచ‌ శ్రేణి రైల్వే స్టేష‌న్ల అభివృద్ధి, రైల్వే కార్య‌క‌లాపాల్లో వేగాన్ని పెంచ‌డం, భారీ సరకు రవాణా కార్యకలాపాలు, రైల్వే మౌలిక సదుపాయాల ఆధునికీక‌ర‌ణ వంటి విభాగాలలో స‌హ‌కరించుకోవాలని గుర్తించారు. అంతే కాకుండా రైల్వేల సాంకేతిక కార్యకలాపాలలో, ఇంకా విజ్ఞాన‌ సంబంధిత సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం, సాంకేతిక నిపుణుల సంద‌ర్శ‌న‌లు, శిక్ష‌ణ‌, ఇరు పక్షాల‌లో ఆస‌క్తి వ్యక్తం అయ్యే అంశాల‌పై సెమినార్లు, వ‌ర్క్‌షాపుల నిర్వ‌హ‌ణ వంటి కార్య‌క‌లాపాలు ఈ స‌హ‌కారంలో భాగంగా ఉంటాయి.

రైల్వే రంగంలో ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల్లో చోటు చేసుకుంటున్న తాజా ప‌రిణామాల‌పై అవ‌గాహ‌నను, విజ్ఞానాన్ని పంచుకొనేందుకు భారతీయ రైల్వేలకు ఒక వేదికను ఈ ఎమ్ ఒ యు లు క‌ల్పిస్తాయి. సాంకేతిక నిపుణులను ఇరు వైపులకు పంపించుకొనేందుకు, నివేదిక‌లను, సాంకేతిక ప‌త్రాలను ఇచ్చి పుచ్చుకొనేందుకు, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు, చర్చాగోష్ఠులు, కార్యశాలల నిర్వ‌హ‌ణ‌కు, ఇంకా ఇతరత్రా మార్గాలలో విజ్ఞానాన్ని పంచుకొనేందుకు కూడా ఈ ఎమ్ ఒ యు లు వీలు క‌ల్పిస్తాయి.

(i) కింద పేర్కొన్న రంగాలలో సాంకేతిక స‌హ‌కారంపై ఎమ్ఎల్ఐటి ఆఫ్ జ‌పాన్‌కు, రైల్వే మంత్రిత్వ శాఖ‌కు మధ్య మెమొరాండం ఆఫ్ కోఆపరేషన్ (ఎమ్ ఒ సి) కుదిరింది:-

(a) రైల్వే భ‌ద్ర‌త‌ ;

(b) ట్రెయిన్ సెట్లు/ ఇ ఎమ్ యు లు స‌హా రైలు పెట్టెలు, ఇంజను వగైరా (రోలింగ్ స్టాక్‌) స‌ర‌ఫ‌రా ;

(c) స్టేష‌న్ల అభివృద్ధి పైనా, భూముల విలువ‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవ‌డంపైనా స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం ;

(d) రైళ్ళ‌లో ప‌ర్యావ‌ర‌ణ‌ మిత్ర సాంకేతిక విజ్ఞాన సంబంధ స‌మాచార మార్పిడి ;

(e) సిగ్న‌లింగ్, టెలిక‌మ్యూనికేష‌న్లు ;

(f) రైల్వే విద్యుదీక‌ర‌ణ‌ ;

(g) సివిల్ స్ట్రక్చర్, రైల్వే ట్రాక్ వ్య‌వ‌స్థ ;

(h) రైలు నియంత్రణ వ్య‌వ‌స్థ ;

(i) ప్ర‌కృతి వైప‌రీత్యాల నష్ట తీవ్రతను తగ్గించుకొనే దిశగా తీసుకొనదగ్గ చర్యలు ;

(j) ఉభ‌య‌ పక్షాలు సంయుక్తంగా నిర్ధరించిన మేరకు ఏవైనా ఇత‌ర రంగాలలోనూ పరస్పరం సహకారాన్ని అందించుకోవడం.

ఈ ఎమ్ ఒ సి మొదట్లో మూడు సంవ‌త్స‌రాల పాటు అమ‌లులో ఉంటుంది. ఆ త‌రువాత మ‌రో రెండు సంవ‌త్స‌రాలకు వర్తించేటట్లుగా దానంతట అదే నవీకరణకు లోనవుతుంది.

(ii) సాంకేతిక స‌హ‌కారంపై రైల్వే మంత్రిత్వ శాఖ‌కు, ర‌ష్య‌న్ రైల్వేకు మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ ఒ యు) ప్ర‌ధానాంశాలు :

(a) భార‌తదేశంలో హై స్పీడ్ రైళ్ళు ;

(b) రైళ్లు గంటకు 160- 200 కిలోమీట‌ర్ల వేగంతో ప్రయాణించినా త‌ట్టుకోగ‌ల విధంగా భారతీయ రైల్వేలలోని ప్ర‌స్తుత మార్గాలను ఆధునికీక‌రించ‌డం ;

(c) శాటిలైట్ నావిగేష‌న్‌, డిజిట‌ల్ క‌మ్యూనికేష‌న్ సాధనాల మీద పనిచేసేటట్లు నవీన నియంత్రణ, భ‌ద్ర‌తా సంబంధిత వ్య‌వ‌స్థ‌ల‌ను ఆధునికీక‌రించ‌డం ;

(d) ఉప‌గ్ర‌హ‌, భూ స‌మాచార సాంకేతిక ప‌రిజ్ఞానాలు ;

(e) ర‌వాణాలో భద్ర‌త‌, సైబ‌ర్ సెక్యూరిటీ ;

(f) రోలింగ్ స్టాక్‌ ;

(g) హెవీ హాల్ ట్రాన్స్ పోర్టేషన్ ;

(h) భార‌తీయ రైల్వేల అవసరాలను తీర్చేందుకు మాన‌వ వ‌న‌రుల‌ శిక్ష‌ణ‌ సంస్థ; విద్యార్థుల‌కు సెకండ‌రీ, ఉన్న‌త స్థాయి వృత్తి విద్యా కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌, మేనేజ‌ర్లు, సిబ్బందికి ఆధునిక శిక్ష‌ణ‌ ;

(i) స్టేష‌న్ లలో సరికొత్త అభివృద్ధి కార్యక్రమాలు;

(j) డెడికేటెడ్ ఫ్రైట్ రైల్ కారిడార్ ల నిర్మాణం ;

k) ట్రాక్ సూప‌ర్‌స్ర్ట‌క్చ‌ర్‌ నిర్మాణం, వంతెన‌లు, సొరంగాలు సహా సివిల్ ఇంజినీరింగ్ పనులు, ఆధునికీక‌ర‌ణ‌లో, పున‌ర్నిర్మాణంలో స‌హ‌కారం.. ఇంకా

l) శ్లాబ్ ట్రాక్‌లు.

ఈ స‌హ‌కార ఒప్పందం తొలుత మూడు సంవ‌త్స‌రాల పాటు అమ‌లులో ఉంటుంది. ఆ త‌రువాత మ‌రో రెండు సంవ‌త్స‌రాలు అమలు అయ్యేటట్లు దానంతట అదే నవీకరణకు లోనవునతుంది.

(iii) సాంకేతిక స‌హ‌కారంపై ఆర్‌డిఎస్ఓ, జ‌పాన్‌కు చెందిన ఆర్‌టిఆర్ ఐల ఒప్పందం ప్ర‌ధానాంశాలు :-

(a) రైళ్ళ నిర్వ‌హ‌ణ‌లో భ‌ద్ర‌త‌ ;

(b) రైళ్ళ నిర్వ‌హ‌ణ‌లో ఆధునిక ప‌రిజ్ఞానాలు;

(c) ప‌ర్యావ‌ర‌ణ‌మిత్ర సాంకేతిక విజ్ఞాన వినియోగం;

(d) త్రూపుట్ ఎన్ హాన్స్ మెంట్ చ‌ర్య‌లు;

(e) ఉభ‌య‌ పక్షాల‌కు అంగీకార‌ం కుదిరిన మేరకు మరే ఇతర విభాగంలోనైనా సహకారం.

ఈ ఎమ్ ఒ యు తొలుత మూడు సంవ‌త్స‌రాల పాటు అమ‌లులో ఉంటుంది. ఆ త‌రువాత ప‌ర‌స్ప‌ర లిఖితపూర్వ‌క అంగీకారంతో దీనిని మ‌రో ఏడాది పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది.

***