Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అవికానగర్‌లోని కేంద్రీయ గొర్రెలు, మరియు ఉన్ని పరిశోధనా సంస్థకు చెందిన 50 ఎకరాల భూమిని పశు చికిత్సల విశ్వవిద్యాలయం మరియు శిక్షణ, పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం రాజస్థాన్ ప్రభుత్వానికి బదలాయించడం


రాజస్థాన్ లోని టోంక్ జిల్లా మాల్ పురా తహశీల్ పరిధిలో అవికానగర్‌లో నెలకొన్న సెంట్రల్ షీప్ అండ్ వూల్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ (సి ఎస్‌ డబ్ల్యు ఆర్ ఐ) కి చెందిన 50 ఎకరాల స్థలాన్ని పశు చికిత్సల విశ్వవిద్యాలయం మరియు శిక్షణ, పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం రాజస్థాన్ ప్రభుత్వానికి ఉచితంగా బదిలీ చేసేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ పశు చికిత్సల విశ్వవిద్యాలయం మరియు శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని బీకానేర్ లో ఉన్న రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ వెటరినరి అండ్ ఏనిమల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు.

పైన పేర్కొన్న ప్రయోజనం నెరవేరడానికి మాత్రమే ఈ భూమిని ఉపయోగిస్తామని రాజస్థాన్ ప్రభుత్వం వాగ్దానం చేస్తే భూమి బదిలీ జరుగుతుంది. రాజస్థాన్ లో పశు చికిత్సలు, ఏనిమల్ సైన్స్ రంగాలలో పరిశోధనలు నిర్వహించడానికి కావలసిన సాంకేతిక పరమైన మద్దతును సి ఎస్‌ డబ్ల్యు ఆర్ ఐ/ ఐసిఎఆర్ లు ( ఎటువంటి ఆర్థిక ప్రమేయం లేకుండా ) అందజేయనున్నాయి. ఒకవేళ శిక్షణ కేంద్రం భవిష్యత్తులో కొనసాగని పక్షంలో పైన పేర్కొన్న 50 ఎకరాల భూమిని అప్పటికి ఏర్పాటైన మౌలిక సదుపాయాలు సహా ఉచితంగా వెటరినరి, ఏనిమల్ సైన్స్ లో పరిశోధనల కోసం సి ఎస్‌ డబ్ల్యు ఆర్ ఐ కి తిరిగి ఇచ్చివేస్తారు.

అవికానగర్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం సి ఎస్‌ డబ్ల్యు ఆర్ ఐ కి, యూనివర్సిటీకి మధ్య సమన్వయాన్ని పరస్పర ప్రయోజనాలు చేకూరే విధంగా బలోపేతం చేయగలదు. గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు జీవనోపాధి పరంగా భద్రతను పెంపొందించుకోవడానికి ఈ కేంద్రం తగిన శిక్షణను ఇచ్చి, తద్వారా వారి సాధికారతకు, ప్రత్యేకించి మహిళల సశక్తీకరణకు, లింగ వివక్ష బారి నుంచి మహిళలు బయటపడి సమానావకాశాలను సాధించుకొనేందుకు సహాయపడగలదు. పైపెచ్చు, ఈ కేంద్రం పశుగణాల పెంపకం ద్వారా సంబంధిత ఉత్పత్తులతో పాటు లాభదాయకతను ఇబ్బడిముబ్బడి చేసేందుకు పర్యావరణ పరంగా అనుకూలమైన, మన్నికైన మరియు ప్రాంతాలవారీగా నిర్దిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాల‌ను.. అదీ తక్కువ ఖర్చుతో.. అభివృద్ధి చేసి చూపించగలదు.

***