Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర జాబితాలోని ఇతర వెనుకబడిన తరగతుల జాబితా ఉపవర్గీకరణకు ఏర్పాటైన కమిటీకి మరో రెండు నెలల గడువు ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం


దేశం లో భిన్న వర్గాలకు చెందిన ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగానే ఒబిసి కులాలు/ జాతులకు చెందిన వారందరికీ ప్రభుత్వ ప్రయోజనాలు సమానంగా అందేలా చూడడం కోసం రాజ్యాంగంలోని 340 అధికరణం కింద ప్రభుత్వం ఒక కమిషన్ ను నియమించింది. కేంద్ర జాబితాలోని ఒబిసిల్లో ఉపవర్గీకరణ అంశం పరిశీలించడం ఈ కమిటీ బాధ్యత.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఇతర వెనుకబడిన వర్గాల ఉపవర్గీకరణకు ఏర్పాటైన కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు అంటే 2019 జూలై 31 వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది.

ఈ కమిటీ ప్రస్తుత గడువు 2019 మే 31తో ముగిసిపోయింది. కమిషన్ కు పొడిగింపు ఇవ్వడం ఇది ఆరో సారి.

ప్రభావం:

కేంద్ర జాబితాలోని ఇతర వెనుకబడిన వర్గాల ఉపవర్గీకరణ కమిషన్ గడువు పొడిగించడం వల్ల ఆ కమిషన్ వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపేందుకు మరింత అవకాశం కలుగుతుంది. దాని వల్ల కమిషన్ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించగలుగుతుంది.

పూర్వరంగం:

రాజ్యాంగంలోని 340వ అధికరణం కింద 2017 అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రపతి ఆమోదం మేరకు ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. జస్టిస్ (రిటైర్డ్) జి రోహిణి సారథ్యంలోని ఈ కమిషన్ 2017 అక్టోబర్ లో పని ప్రారంభించింది. ఒబిసిల్లో ఉపవర్గీకరణ విషయంలో రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర స్థాయి వెనుకబడిన వర్గాల కమిషన్లతో సంప్రదింపులు నిర్వహించింది. గతంలో కమిషన్ జారీ చేసిన సంప్రదింపుల పత్రంపై ఆయా వర్గాలు వెలిబుచ్చిన అభిప్రాయాలపై మరింత విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉన్నట్టు కమిషన్ భావించింది. పూర్తి స్థాయిలో అర్హత గల ఏ వర్గానికి కొత్త జాబితాలో స్థానం లేకుండా పోవడాన్ని నివారించాలంటే మరింత విస్తృతమైన చర్చలు అవసరమని నివేదించింది. ఇందుకు మరో రెండు నెలల గడువు పట్టవచ్చు.

ఈ అంశం ఆధారంగానే 2019 జూలై 31 వరకు తమకు మరో రెండు నెలల గడువు ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని అభ్యర్థించింది.