Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భం గా, ప్రధాన మంత్రి నేతృత్వాన రాంచీ లో సామూహిక యోగాభ్యాస ప్రదర్శన


అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భం గా ఇవాళ రాంచీ లో నిర్వహించిన భారీ సామూహిక యోగాభ్యాస ప్రదర్శన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు.

ఈ కార్యక్రమం ప్రారంభాని కి ముందు ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ ‘‘శాంతి, సామరస్యం, ప్రగతి కి యోగాభ్యాసమే తారకమంత్రం’’ అన్నది మన నినాదం కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమం లో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. యోగాభ్యాస సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయడం లో పత్రికా, ప్రసార, సామాజిక మాధ్యమాల్లో కీలకపాత్ర పోషిస్తున్న పాత్రికేయులు తదితరుల కృషి ని ప్రశంసించారు.

ఆధునిక యోగా సందేశాన్ని నేడు నగరాల నుంచి గ్రామాలకే కాకుండా పేద, గిరిజన సమాజాల నివాసాలకూ విస్తరింపజేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాన మంత్రి చెప్పారు. పేదలు, గిరిజనులు అనారోగ్యం సోకినపుడు తీవ్రమైన బాధలు పడుతుంటారని, అందుకే వారి జీవితాల్లో యోగాభ్యాసం ఒక తప్పనిసరి భాగం కావాలని ఆయన నొక్కి చెప్పారు.

అనారోగ్య నివారణతో పాటు, కాలానుగుణం గా నేడు ఆరోగ్య శ్రేయస్సు పైనా మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. యోగా ద్వారా మనకు ఈ శక్తి సమకూరుతుందని- ప్రాచీన భారతీయ తత్త్వం, యోగా స్ఫూర్తి ఇదేనని ఆయన చెప్పారు.

ఏదో కొద్దిసేపు నేల మీదనో, చాప మీదనో కేవలం కొన్ని కసరత్తుల వంటివి చేయడం ద్వారా యోగా వల్ల సంపూర్ణ ఫలితం లభించదన్నారు. యోగా అంటే క్రమశిక్షణ, అంకితభావం అని, యోగా తోపాటు, వీటిని కూడా మనం జీవితమంతా అభ్యాసం చేయాలని ఆయన సూచించారు.

యోగా అన్నది వయస్సు, రంగు, కులం, మతం, సిద్ధాంతం, తెగ, పేద, ధనిక, రాష్ట్రం, సరిహద్దులనే వాటికి అతీతమని, యోగా అందరి కీ చెందినదని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. యోగా ఎల్లప్పుడూ మన సంస్కృతి లో ముఖ్యమైన భాగం. మనమందరం యోగా సాధన ను మరో స్థాయికి తీసుకెళ్లాలి.

అతిథుల గది నుంచి సమావేశ మందిరాల దాకా, పార్కుల నుంచి క్రీడా ప్రాంగణాల వరకు, వీధుల నుంచి శ్రేయో కేంద్రాల దాకా యోగా నేడు ప్రజాదరణ పొందుతున్నదని ప్రధాన మంత్రి చెప్పారు.

యోగా అనేది ప్రాచీనమైనది మాత్రమేగాక, ఆధునికమైనదని, అది నిత్య పరిణామం, నిరంతరతలకు ప్రతీక అని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.

కొన్ని శతాబ్దాలు గా యోగా సారాంశం ఒక్కటే: ఆరోగ్యవంతమైన శరీరం, నిశ్చలమైన మనస్సు, ఐక్యతా స్ఫూర్తి ఇందులో అంతర్భాగమని ప్రధాన మంత్రి చెప్పారు. విజ్ఞానం, శ్రమ, అంకితభావాల పరిపూర్ణ సమ్మేళనాని కి యోగా దోహదపడుతుందని వివరించారు.

ప్రపంచం యోగా ను దైనందిన జీవితం లో భాగం చేసుకుంటున్న నేపథ్యం లో ఈ అంశాని కి సంబంధించిన పరిశోధన పై మనం దృష్టి సారించాలి. ఆ మేరకు వైద్యశాస్త్రం, భౌతిక చికిత్స, కృత్రిమ మేధస్సు వంటి అంశాల తో యోగా ను జోడించాలని ఆయన చెప్పారు.