Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అయోధ్య తీర్పు విష‌యంలో శాంతి, సామ‌ర‌స్య‌త‌ను కాపాడాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి పిలుపు


అయోధ్య తీర్పు కు సంబంధించి ప్ర‌జ‌లు శాంతి, సామ‌ర‌స్యాలతో మెల‌గ‌వ‌ల‌సిందిగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈరోజు పిలుపునిచ్చారు. “ అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు త‌న తీర్పును వెలువ‌రించింది. ఈ తీర్పును ఒక‌రికి గెలుపు లేదా మ‌రొక‌రికి ఓట‌మిగా చూడ‌రాదు . అది రామ భ‌క్తికానివ్వండి, ర‌హీమ్ భ‌క్తి కానివ్వండి. మ‌నం రాష్ట్ర‌భ‌క్తి స్ఫూర్తిని బ‌లోపేతం చేయాలి. ఈ సంద‌ర్భంగా శాంతి, సామ‌ర‌స్యం వెల్లివిరియు గాక‌.

సుప్రీంకోర్టు వెలువ‌రించిన అయోధ్య తీర్పు చెప్పుకోద‌గిన‌ది, ఎందువ‌ల్ల నంటే, ఏ వివాదాన్ని అయినా చ‌ట్ట ప్ర‌క్రియ స్ఫూర్తితో సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని ఇది ప్ర‌ముఖంగా తెలియ‌జేస్తున్న‌ది. ఇది స్వేచ్ఛ‌, పార‌ద‌ర్శ‌క‌త‌, మన న్యాయ‌వ్య‌వ‌స్థ ముందుచూపును పున‌రుద్ఘాటిస్తోంది. చ‌ట్టం ముందు అంద‌రూ స‌మాన‌మే అనే దానిని ఇది తెలియ‌జేస్తున్న‌ది .

ద‌శాబ్దాలుగా న‌లుగుతున్న ఈ అంశాన్ని న్యాయ‌వ్య‌వ‌స్థ సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించింది. ప్ర‌తి ఒక్క‌రి త‌ర‌ఫున‌, ప్ర‌తి అంశం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవడంతోపాటు బిన్న అభిప్రాయాలు వ్య‌క్తం చేసేందుకు త‌గిన అవ‌కాశం ఇవ్వ‌డం జ‌రిగింది. ఈ తీర్పు న్యాయ ప్ర‌క్రియ‌పై ప్ర‌జ‌ల‌లో విశ్వాసాన్ని మ‌రింత పెంపొందించ‌గ‌ల‌దు.

ఈరోజు వ‌చ్చిన తీర్పు సంద‌ర్భంగా 130 కోట్ల మంది భార‌తీయ ప్ర‌జ‌లు ప్ర‌శాంత‌త‌ను, శాంతిని పాటించ‌డం అనేది, శాంతియుత స‌హ‌జీవ‌నానికి గ‌ల భార‌త‌దేశ అంత‌ర్గ‌త క‌ట్టుబాటును తెలియజేస్తున్న‌ది. ఈ ర‌క‌మైన ఐక్య‌త‌, అంద‌రూ ఒక్క‌టేన‌న్న భావ‌న మ‌న‌దేశ అభివృద్ధి ప‌థాన్ని శ‌క్తిమంతం చేస్తుంది. ప్ర‌తి ఒక్క భార‌తీయుడు సాధికార‌త పొందుగాక‌”