Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి స్విట్జ‌ర్లాండ్ పర్యటన సంద‌ర్భంగా ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ (జూన్ 06, 2016)

ప్రధాన మంత్రి స్విట్జ‌ర్లాండ్ పర్యటన సంద‌ర్భంగా ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ (జూన్ 06, 2016)


యువ‌ర్ ఎక్స్ లెన్సీ, ప్రెసిడెంట్ జోహాన్ శ్నీడర్ అమ్మాన్‌,

స్నేహితులారా,

ఎక్స్‌లెన్సీ., మీ హృద‌య‌పూర్వ‌క స్వాగ‌తానికి ధన్యవాదాలు. అస‌లు సిస‌లైన అంత‌ర్జాతీయ న‌గ‌రంగా ఖ్యాతి గ‌డించిన‌ జెనీవాలో మీతో క‌లసి ఇక్క‌డ నిలుచున్న ఈ స‌మ‌యంలో నాకు ఘ‌న‌మైన చ‌రిత్ర గుర్తుకొస్తోంది. ఇది అంత‌ర్జాతీయ న‌గ‌రం మాత్ర‌మే కాదు మాన‌వ‌తాపూర్వ‌క ఆత్మ‌ను క‌లిగిన న‌గ‌రం కూడా. మాన‌వాళి సేవ‌కు అంకిత‌మైన ”రెడ్ క్రాస్” లాంటి అంత‌ర్జాతీయ సంస్థ‌ల ప్ర‌ధాన కార్యాల‌యాలు జెనీవాలో అనేకం ఉన్నాయి.

స్నేహితులారా,

ప్ర‌పంచ‌వ్యాప్తంగా శాంతిని, మాన‌వ‌తా విలువ‌ల‌ను ప్ర‌బోధిస్తున్న దేశాలు మ‌న రెండు దేశాలు. గ‌త ఏడు ద‌శాబ్దాల్లో మ‌న రెండు దేశాల స్నేహం స్థిరంగా అభివృద్ధి చెందుతూ వ‌స్తోంది. ఈ రోజు నేను, ప్రెసిడెంట్ క‌లసి మ‌న రెండు దేశాల బ‌హుముఖీన ద్వైపాక్షిక సంబంధాల‌ను స‌మీక్షించాం. స్విస్ సి ఇ ఒ ల‌తో మేం వివ‌ర‌ణాత్మ‌కమైన చ‌ర్చ‌లు జరిపాం కూడా.

స్నేహితులారా,

ఇరు దేశాల మ‌ధ్య‌ గ‌ల ఆర్ధిక బంధాలు చాలా బ‌లోపేతంగా, ఉత్సాహ‌పూరితంగా ఉన్నాయి. భార‌త‌దేశంలో ఇంటింటా స్విస్ కంపెనీల పేర్లు వినిపిస్తుంటాయి. వ్యాపారం, పెట్టుబ‌డులు, శాస్త్ర సాంకేతికత‌, నైపుణ్యాల అభివృద్ధి రంగాల‌లో ఇరు దేశాల భాగ‌స్వామ్య సంబంధాలు రెండు దేశాల స‌మాజాలకు ల‌బ్ధి చేకూరుస్తాయి. ఇ ఎఫ్ టి ఎ తో ఎఫ్ టి ఏ చ‌ర్చ‌ల‌ను పున‌రుద్ధ‌రించ‌డానికి భార‌త‌దేశం త‌న సంసిద్ధ‌త‌ను తెలియ‌జేసింది. స్విస్ ఆర్ధిక వ్య‌వ‌స్థ బ‌లాల గురించి మాకు బాగా తెలుసు. భార‌త‌దేశంలోనూ అనేక గ‌ణ‌నీయ‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూసిన‌ప్పుడు భార‌త‌దేశ ఆర్ధిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే అది మాత్ర‌మే మాకు స‌రిపోదు. ఆక‌ర్ష‌ణీయ‌మైన, సుస్థిర‌మైన న‌గ‌రాల‌తోను, గ‌ణనీయ‌మైన ప్ర‌గ‌తి సాధించే వ్య‌వ‌సాయంతోను, ఉత్సాహంతో నిండిన త‌యారీ రంగంతోను, వేగంగా విధులు నిర్వ‌హించే సేవారంగంతోను భార‌తీయ ఆర్ధిక వ్య‌వ‌స్థ అభివృద్ధి చెందాల‌ని నేను కోరుకుంటున్నాను. దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ చోదక శక్తులు ప్రపంచ శ్రేణి రైలు మార్గాలు, రహదారి మార్గాలు, విమానాశ్ర‌యాలు, డిజిట‌ల్ కనెక్టివిటీ నెట్ వ‌ర్క్ ద్వారా ప‌ని చేయాలి. ప్ర‌తి ఒక్కరికీ నివ‌సించ‌డానికి గృహ‌ం, ప్ర‌తి ఇంటికీ విద్యుత్ అనేది వాస్త‌వికంగా సాధ్యమ‌వ్వాలి. భార‌త‌దేశానికి చెందిన 500 మిలియ‌న్లకు పైగా గ‌ల‌ యువ‌త నైపుణ్యాల‌ను పొంది ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌ల మాన‌వ‌ వ‌న‌రుల కొర‌త‌ను వారు తీర్చ‌గ‌ల‌రు. స్విస్ వృత్తి విద్యా శిక్ష‌ణ వ్య‌వ‌స్థ భార‌త‌దేశ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉంది కాబ‌ట్టి దానిని భార‌త‌దేశంలో కూడా అమ‌లు చేయాల‌నే విష‌యంలో ప్రెసిడెంట్, నేను ఏకాభిప్రాయానికి వ‌చ్చాం. నిన్న‌నే మ‌నం ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని జ‌రుపుకున్నాం. ఈ ఉత్స‌వ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా, భార‌తీయ నాగ‌రిక‌త సంప్ర‌దాయ‌ల‌కు క‌ట్టుబ‌డి భార‌త‌దేశం ప‌ని చేస్తుంది. ఆర్ధికంగా విక‌సిస్తున్న భార‌త‌దేశం ప‌ర్యావ‌ర‌ణంతోను, భూగోళంతోను స్నేహ‌పూర్వ‌కంగా ఉంటూ మ‌నుగ‌డ సాగించ‌ల‌దు. శిలాజ ఇంధ‌నం మీద‌కంటే పునర్వినియోగ ఇంధ‌నంపై ఆధార‌ప‌డ‌డ‌మే మా మార్గ‌ద‌ర్శ‌క సూత్రం.

స్నేహితులారా,

భార‌త‌దేశ అభివృద్ధి అవ‌స‌రాల‌కు, స్విస్ బ‌లాల‌కు మ‌ధ్య‌ గ‌ల కచ్చిత‌మైన బంధాన్ని మ‌నం చూడ‌గ‌లుగుతున్నాం. భార‌త‌దేశ ఆర్ధికాభివృద్ధిలో కీల‌క‌మైన భాగ‌స్వాములుగా ఉండ‌గ‌లిగే మ‌హ‌త్త‌ర‌మైన అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల‌ని నేను ఈ సంద‌ర్భంగా స్విస్ కంపెనీల‌ను ఆహ్వానిస్తున్నాను. అంతిమంగా భార‌త‌దేశంలోని 1.25 బిలియ‌న్ కు పైగా గల జ‌నాభా ఆర్ధిక సౌభాగ్యమ‌నేది మొత్తం ప్ర‌పంచానికే ల‌బ్ధిని చేకూర్చ‌గ‌ల‌దు.

స్నేహితులారా,

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించి వున్న వాస్త‌విక‌త‌ల‌క‌నుగుణంగా అంత‌ర్జాతీయ సంస్థ‌ల్లో సంస్క‌ర‌ణ‌లు తేవాల‌నే నిబ‌ద్ధ‌త‌ను భార‌త‌దేశం, స్విట్జ‌ర్లాండ్ లు క‌న‌బ‌రుస్తున్నాయి. ఐక్య రాజ్య‌ స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో స‌భ్య‌త్వం కోసం ఇరు దేశాలు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ విష‌యంలో స‌హ‌క‌రించుకోవ‌డానికి ఉభయ దేశాలు అంగీక‌రించాయి. అణు శ‌క్తి స‌ర‌ఫ‌రాదారుల వర్గం (న్యూక్లియ‌ర్ స‌ప్ల‌య‌ర్స్ గ్రూప్‌)లో భార‌త‌దేశ స‌భ్య‌త్వం కోసం స్విట్జ‌ర్లాండ్ మ‌ద్ద‌తు ప‌లికినందుకు ప్రెసిడెంట్ కు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. న‌ల్ల‌ ధ‌నం, ప‌న్నుల ఎగ‌వేత స‌మ‌స్య‌లపై భార‌త దేశం పోరాటం చేస్తోంది. ఈ విష‌యంలో స్విట్జ‌ర్లాండ్ వేగంగా త‌న ద‌గ్గ‌రున్న స‌మాచారాన్ని భార‌త‌దేశానికి అందించాలి. అప్పుడే ప‌న్ను ఎగ‌వేత‌దార్ల‌ను కోర్టుకు ఈడ్చ‌వ‌చ్చు. ఈ అంశంపైన మేం చ‌ర్చ‌లు చేశాం. ఆటోమేటిక్ గా స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవాల‌నే నిర్ణ‌యంపైన వెంట‌నే చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం ఈ విష‌యంలో చాలా ముఖ్యం.

స్నేహితులారా,

ఇరు దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య‌ బ‌ల‌మైన బంధాలు ఇరు దేశాల బంధాల‌కు బ‌ల‌మైన పునాదిగా నిలుస్తాయి. భార‌త‌దేశ సినిమా ప‌రిశ్ర‌మ కార‌ణంగా స్విట్జ‌ర్లాండ్ లోని అంద‌మైన ప‌చ్చిక మైదానాల‌ను చ‌ల‌న‌చిత్రాల్లో చూసి ఆనందిస్తున్నాం. స్విస్ ప‌ర్యాట‌కులు కూడా పెద్ద సంఖ్య‌లో భార‌త‌దేశాన్ని సంద‌ర్శించాలి. వారికి ఇదే మా ఆహ్వానం. ఈ సంవ‌త్స‌రం ప్రారంభంలో స్విస్ జాతీయుల‌ కోసం ఇ-టూరిస్ట్ వీసా సౌక‌ర్యాన్ని ప్రారంభించాం.

స్నేహితులారా,

మ‌న స్నేహ‌సంబంధాన్ని ప్ర‌తిబింబించేలా అనేక విజ‌య‌ గాధ‌లు ఉన్నాయి. టెన్నిస్ క్రీడ‌లో పేరుగాంచిన స్విస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ తో భార‌త‌దేశ క్రీడాకారులు సానియా మీర్జా, లియాండ‌ర్ పేస్ లు జోడీ క‌ట్టి అనేక గ్రాండ్ స్లామ్ ల‌ను గెలుచుకున్నారు. ఇరు దేశాల‌కు ఉమ్మ‌డిగా ఉన్న నిబ‌ద్ద‌త‌లు, విలువ‌లు, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య‌ గ‌ల బంధాలు, ఎంతో ప‌టిష్టంగా వృద్ధి సాధిస్తున్న ఆర్ధిక భాగ‌స్వామ్యం ఉభయ దేశాల బంధాల‌ను ఉన్న‌త శిఖ‌రాల‌కు తీసుకుపోతాయ‌ని నేను బ‌లంగా న‌మ్ముతున్నాను. జెనీవాలో నాకు ఆతిథ్య‌మిచ్చినందుకు, ఎక్స్‌లెన్సీ.. మీకు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను.

మీకు ఇవే నా ధన్యవాదాలు.