Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆకాశవాణి లో 2017 జూన్ 25వ తేదీ నాడు ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం పూర్తి పాఠం


ప్రియమైన నా దేశ వాసులారా,

 

న‌మ‌స్కారం,

 

వాతావ‌ర‌ణం మారిపోతోంది.. ఈసారి ఎండ‌లు ఎక్కువ‌గా ఉన్నాయి.  అయితే వ‌ర్ష రుతువు రావ‌డంతో వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోయింది.  దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కుండ‌పోత‌గా వ‌ర్షం కురిసి, వాతావ‌ర‌ణం ప్ర‌స‌న్నంగా మారింది.  వ‌ర్షాలు కురిశాక చ‌ల్ల‌ని గాలులు వీచ‌డంతో గ‌త కొన్ని రోజులుగా ప్ర‌జ‌ల‌కు ఎంతో ఊర‌ట క‌లిగింది.  మ‌న‌కంతా అనుభ‌వంలోకి వ‌చ్చిన విష‌య‌మే ఇది. మ‌నం ఎంత సంఘ‌ర్ష‌ణ‌లో ఉన్నా, ఒత్తిడితో న‌లిగిపోతున్నా- అది ఒకరి స్వీయ జీవితం కావ‌చ్చు లేదా ప్రజా జీవ‌నం కావ‌చ్చు- వ‌ర్షాల రాకడ ఒకరిలో ఉత్సాహాన్ని నింపి తీరుతుందనేది అనుభవైకవేద్యం.

 

దేశంలోని అనేక ప్రాంతాలలో జ‌గ‌న్నాథ ర‌థ‌ యాత్ర ను ఎంతో పవిత్ర భావంతో  జ‌రుపుతున్నారు.  ఈ పండుగను ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కూడా జరుపుకొంటున్నారు.  దేశంలోని అణగారిన వర్గాల వారు భగవాన్ జగన్నాథుడితో ప్రగాఢమైన అనుభూతులు పెనవేసుకొన్నారు. డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేడ్క‌ర్ జీవితాన్ని, ఆయన రాసిన పుస్తకాలను చ‌దివిన వారు ఆయన భగవాన్ జ‌గ‌న్నాథుని దేవాల‌యాన్ని, ఆ ఆలయ సంప్రదాయాలను మనస్పూర్తిగా ప్రశంసించారని గ్రహించి ఉంటారు. ఎందుకంటే, సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం ఈ రెంటిలోనూ స్వయంసిద్ధంగా ముడిపడివున్నాయి.  జ‌గ‌న్నాథ భ‌గ‌వానుడు నిరుపేద‌ల ఆరాధ్య‌ దైవం.  చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు కానీ, ఆంగ్లంలో juggernaut అనే ప‌దం ఉంది. ఎవ‌రూ ఆప‌లేని దివ్య‌మైన ర‌థం అని ఈ మాటకు అర్థం.  నిఘంటువులో juggernaut ప‌దానికి వ్యుత్పత్తి జగన్నాథ ర‌థం నుండే తీసుకోబడినట్లుగా ఉంటుంది.   దేశ‌మంతా జ‌గ‌న్నాథ ర‌థ యాత్ర‌ను త‌మ త‌మ సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా జ‌రుపుకోవ‌డం దీనికి కార‌ణం.  జ‌గ‌న్నాథ భ‌గ‌వానుడి ర‌థ యాత్రా మ‌హోత్స‌వ స‌మ‌యంలో దేశ ప్ర‌జ‌లందరికీ నేను శుభాకాంక్ష‌లు అందిస్తున్నాను.  భ‌గ‌వాన్ జ‌గ‌న్నాథుడి చ‌ర‌ణార‌విందాల‌కు ప్ర‌ణామాలు అర్పిస్తున్నాను.

 

భార‌త‌దేశం విశిష్ట‌త‌ల్లో భిన్న‌త్వంలో ఏక‌త్వం కూడా ఒక‌టి.  ఇదే మ‌న దేశ‌పు శ‌క్తి కూడా.  ప‌విత్ర రంజాన్ మాసం సంద‌ర్భంగా ప్ర‌జ‌లంతా ప్రార్థ‌న‌లు జ‌రుపుకుంటున్నారు.  ఇది ‘ఈద్’ ప‌ర్వ‌దినం. ‘ఈద్ -ఉల్- ఫిత్ర్’ సంద‌ర్భంగా నా త‌ర‌పున మీకంద‌రికీ అనేక శుభాకాంక్ష‌లు అందిస్తున్నాను.  పుణ్యాన్ని అందించే, దానాలు చేసే రంజాన్ మాసం చాలా ప‌విత్రం.  సంతోషాల‌ను పంచుకొనే ప‌విత్ర స‌మ‌యం ఇది.  మ‌నం ఎంత‌గా సంతోషాల‌ను పంచుకుంటామో అవి మ‌రింత‌గా ద్విగుణీకృత‌ం అవుతాయి.  రండి, మ‌న‌మంతా క‌లిసిక‌ట్టుగా ఈ ప‌విత్ర ప‌ర్వదిన సంద‌ర్భాల‌లో ప్రేరితుల‌మై సంతోషాల నిధుల‌ను పంచుకుందాం.  దేశాన్ని ప్ర‌గ‌తి ప‌థంలోకి న‌డిపిద్దాం.

 

ప‌విత్ర రంజాన్ మాసం సంద‌ర్భంగా ఉత్త‌ర‌ ప్ర‌దేశ్ లోని బిజ‌్ నోర్ కు చెందిన ముబార‌క్ పూర్ గ్రామంలో జ‌రిగిన ఒక అద్భుత ఘ‌ట‌న నా స్మృతి ప‌థంలో మెదులుతోంది.  దాదాపు మూడున్న‌ర వేల మంది ముస్లిం సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌తో కూడిన కుటుంబం ఆ చిన్న గ్రామంలో నివ‌సిస్తోంది.   ఒక ర‌కంగా చెప్పాలంటే, ఆ ఊళ్లో ఎక్కువ జ‌నాభా క‌లిగిన వ్య‌క్తులు ముస్లిం సోద‌ర‌, సోద‌రీమ‌ణులే.  ఈ రంజాన్ సంద‌ర్భంగా గ్రామీణులంతా క‌లిసి మ‌రుగుదొడ్ల నిర్మాణం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.  వ్య‌క్తిగ‌త‌మైన మ‌రుగుదొడ్ల నిర్మాణం ప‌థ‌కం కింద ప్ర‌భుత్వం కూడా వీరికి త‌న త‌ర‌పున 17 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక స‌హాయం అందించింది.  మీకు ఈ విష‌యం తెలిసిన తరువాత ఆశ్చ‌ర్యంతో పాటు ఆనందం కూడా పెల్లుబుకుతుంది.  ఈ ప‌విత్ర రంజాన్ మాసంలో ఇక్క‌డ నివ‌సించే ముస్లిం సోద‌ర‌, సోద‌రీమ‌ణులు 17 ల‌క్ష‌ల ధ‌న స‌హాయాన్ని తిర‌స్క‌రించారు.  ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేశారు.  వారంతా ఏక‌మై “మా కోసం నిర్మించుకునే మ‌రుగుదొడ్ల‌ను మేమే క‌ట్టించుకుంటాం. డ‌బ్బులు మావే శ్ర‌మ‌దానం కూడా మాదే” అని చెప్పారు.  ఈ 17 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను కేంద్రం మ‌రో గ్రామం అభివృద్ధికి వినియోగించవ‌చ్చున‌ని వీళ్లు స‌ల‌హా ఇచ్చారు.  ఈ సంద‌ర్భంగా ముబార‌క్ పూర్ లోని గ్రామీణులంద‌రికీ ప‌విత్ర రంజాన్ సంద‌ర్భంగా అద్భుత‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్నందుకు అభినంద‌న‌లు అందిస్తున్నాను.  వాళ్లు చేసే ప్ర‌తి ఒక్క ప‌ని ఇత‌రుల‌కు ప్రేర‌ణ క‌లిగిస్తోంది.  అన్నింటిక‌న్నా ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే, ముబార‌క్ పూర్ ను వీళ్లంతా క‌లిసి బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న ర‌హిత ప్ర‌దేశంగా మార్చి వేశారు.  మ‌న దేశంలో మూడు ప్ర‌దేశాలు ఉన్నాయి.  సిక్కిం, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, కేర‌ళ రాష్ట్రాలు ఇది వ‌ర‌కే బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న లేని ప్ర‌దేశాలుగా ప్ర‌క‌టింప‌బ‌డ్డాయి.  ఈ వారంలో ఉత్త‌రాఖండ్‌, హ‌రియాణా లు కూడా ఈ జాబితాలో చేరిపోయాయి.  ఈ ఐదు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు అక్క‌డ ఉన్న అధికారుల‌కు, సామాన్య ప్ర‌జ‌లంద‌రికీ నేను ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అందిస్తున్నాను.  వీళ్లు చేసిన కార్యం చాలా అద్భుత‌మైన‌టువంటిది.

 

వ్య‌క్తిగ‌త జీవితంలో కానివ్వండి.. సామాజిక జీవితంలో కానివ్వండి.. ఏదైనా ఒక మంచి ప‌ని చేయాలి అంటే, దానికి చాలా ప్ర‌య‌త్నం చేయాల్సి ఉంటుంది.  మ‌న చేతి రాత స‌రిగా లేద‌నుకోండి, దానిని స‌రి చేయాలంటే చాలా కాలం పాటు ప్ర‌య‌త్నం చేయాల్సి ఉంటుంది.  అప్పుడు గాని మ‌న అల‌వాటు మారిపోదు.  ప‌రిశుభ్ర‌త విష‌యం కూడా ఇలాంటిదే.  ప‌రిశుభ్ర‌త‌కు భంగం క‌లిగించే దుర‌ల‌వాట్లు మ‌న‌కు జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి.  ఇలాంటి దుర‌భ్యాసాల నుండి విముక్తిని పొందేందుకు నిరంత‌రం ప్ర‌య‌త్నించాల్సి ఉంటుంది.  ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌స్సులో ఈ విష‌యం ప‌ట్ల అవ‌గాహ‌న పెంపొందించాల్సి ఉంటుంది.  ప్రేర‌ణ‌ను క‌లిగించే ఆద‌ర్శ‌మైన సంఘ‌ట‌న‌ల‌ను మ‌నం మాటిమాటికి నెమ‌రు వేసుకోవ‌డం అవ‌స‌రం.  నేటి ప‌రిస్థితుల్లో ప‌రిశుభ్ర‌త అనే కార్య‌క్ర‌మం ప్ర‌భుత్వానికి మాత్ర‌మే ప‌రిమితం కాలేదు.  ప్ర‌జ‌లంద‌రిలో ఇది ఒక ఉద్య‌మంగా మారిపోయింది.  ఈ విష‌యం నాకు ఎంతో సంతోషాన్ని క‌లిగించింది.   ప్ర‌భుత్వాల్లో ప‌ని చేస్తున్న వ్య‌క్తులు కూడా ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో ముందుకు వెళ్తున్నారు.  దీని వ‌ల్ల ప్ర‌భుత్వానికి ఎంతో బ‌లం చేకూరుతుంది.

 

కొన్ని రోజుల క్రితం జ‌రిగిన ఒక అద్భుత‌ సంఘటన నా మదిలో మెదులుతోంది.  దానిని మీ ముందు ఉంచుతున్నాను.  ఈ సంఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో జరిగింది.  అక్కడి ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో ఒక బృహత్ కార్యాన్ని చేపట్టింది.  మార్చి 10వ తేదీ ఉదయం 6 గంటల నుండి మార్చి 14 ఉదయం 10 గంటల దాకా 100 గంటల పాటు నిరంతర ప్రచార కార్యక్రమం చేపట్టారు.  దీని లక్ష్యం ఏమిటీ అంటే, నూరు గంటల సమయంలో 71 గ్రామ పంచాయతీల్లో 10 వేల మరుగుదొడ్ల నిర్మాణం చేయడం.

 

ప్రియమైన నా దేశ వాసులారా, నూరు గంటల సమయంలో ప్రభుత్వం, ప్రజలు కలిసి పది వేల మరుగుదొడ్ల నిర్మాణం చేయడంలో సఫలీకృతులయ్యారన్న అంశం మీకు అపారమైన సంతోషాన్ని కలిగిస్తుంది.  71 గ్రామాలు బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా మారిపోయాయి.  ప్రభుత్వాల్లో పని చేస్తున్న వ్యక్తులకు, ప్రభుత్వ అధికారులకు, విజయనగరం జిల్లాకు చెందిన ఆ గ్రామంలోని పౌరులకు నేను అనేక అభినందనలు అందిస్తున్నాను.  వీళ్ళంతా కలిసికట్టుగా భగీరథ ప్రయత్నం చేసి ఇతరులకు ఆదర్శ వ్యక్తులుగా మారిపోయారు.

 

ఇటీవలి రోజుల్లో ‘మనసులో మాట’ (మన్ కీ బాత్) ప్రసంగాలు చేస్తున్న నాకు ప్రజల నుండి ఎన్నో సలహాలు వస్తున్నాయి.  కొన్ని సూచనలు NarendraModiApp కు వస్తున్నాయి. అలాగే మరికొన్ని సలహాలు MyGov.in కు వస్తున్నాయి.  ఉత్తరాలు అందుతున్నాయి. ఆకాశవాణి ద్వారా కూడా సలహాలు తామరతంపరగా వచ్చిపడుతున్నాయి.

 

అత్యవసర పరిస్థితిని స్మరిస్తూ శ్రీ ప్రకాశ్ త్రిపాఠి ఒక లేఖ రాశారు.  జూన్ 25వ తేదీ ప్రజాస్వామ్య చరిత్రలో కళంకితమైన కాలంగా పరిగణించారు.  ప్రజాస్వామ్యం పట్ల శ్రీ ప్రకాశ్ త్రిపాఠీకి ఉన్న గౌరవం, జాగరూకత ప్రశంసనీయమైంది.  ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదు.  ఒక సంస్కారం కూడా.  ప్రజాస్వామ్యం పట్ల నిరంతరం జాగరూకత అవసరం.  అందువల్ల ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విషయాల గురించి మనం పట్టించుకోవాలి.  ప్రజాస్వామ్యానికి సంబంధించిన మంచి అంశాల విషయంలో ముందంజ వేయాలి.  1975 జూన్ 25వ తేదీ ఒక కాళరాత్రిగా మారింది.  ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ఏ వ్యక్తి ఈ కాళరాత్రిని విస్మరించలేడు.  భారతీయులెవరూ దీనిని మరిచిపోలేరు.  ఒక రకంగా మొత్తం దేశాన్ని అప్పటి ప్రభుత్వం జైలుగా మార్చివేసింది.  ఎమర్జెన్సీ సమయంలో అప్పటి న్యాయ వ్యవస్థ కూడా భయంతో గజగజ వణికింది. పత్రికల నోళ్లు మూయించారు.  పత్రికల్లో పని చేసే వ్యక్తులు, విద్యార్థులు, ప్రజాస్వామ్యంలో కార్యం నిర్వహించే వ్యక్తులు ఆ కరాళమైన కాళరాత్రిని మాటిమాటికీ స్మరించుకుంటున్నారు.  ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల నిరంతర జాగరూకత వహించాలని ప్రయత్నిస్తున్నారు.  ఇలాంటి ప్రయత్నాలు ఇలాగే కొనసాగాలి సుమా.  ఆ సమయంలో శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి కూడా కారాగారంలో బంధించబడ్డారు.  ఎమర్జెన్సీ తరువాత ఒక సంవత్సరం గడిచింది.  అప్పుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి ఒక కవిత రాశారు.  ఆ కవితలో అలనాటి పరిస్థితిని వారు చక్కగా వర్ణించారు.

 

జ్యేష్ఠ మాసం బాగా అలిగింది.

శరత్ కాల చంద్రిక ఉదాసీనంగా రగిలింది

రెచ్చగొట్టే జ్యేష్ఠమాసం

చచ్చుబడిన శరత్ కాల కౌముది

శ్రావణ మాసపు భారత కుంభం ఒలికిపోయింది

ఒక ఏడాది గడిచిపోయింది

 

దుష్టుల కబంధ హస్తాల్లో చిక్కిపోయిన విశ్వం

కకావికలైన పక్షులు

కబంధ హస్తాల్లో చిక్కిన ప్రజలు

కకావికలైన పక్షులు

నేల నుండి నింగి దాకా

నేల నుండి నింగి దాకా

స్వాతంత్య్రం గీతం ప్రతిధ్వనించింది

ఒక ఏడాది గడిచిపోయింది

 

దారి చూస్తున్న కన్నులు

లెక్కపెడుతున్న రోజులు

ఎదురు చూస్తున్న నయనాలు

లెక్కపెడుతున్న రోజులు

మళ్లీ వస్తుంది ఏమో

మళ్లీ వస్తుంది ఏమో

మనసుకు కలిగిన శోకం వెళ్లిపోయింది

ఒక ఏడాది గడిచిపోయింది.. ఇలాగ సాగిందా కవిత.

 

ప్రజాస్వామ్యాన్ని ఆరాధించే వ్యక్తులు గట్టిగా పోరాటం చేశారు.  భారతదేశం చాలా విశాలమైంది.  అవకాశం దొరకినప్పుడు భారత ప్రజలందరూ ప్రజాస్వామ్యం పట్ల నరనరాల్లో జీర్ణించుకుపోయిన తమ భక్తిని ప్రకటించుకున్నారు.  ఎన్నికల సమయంలో తమ బలాన్ని ప్రదర్శించారు.  ప్రజల నరనరాల్లో వ్యాపించిన ఈ భావన మనకు సంప్రదాయం.  ఈ సంప్రదాయాన్ని మనం మరింత బలపరచాలి.

 

ప్రియమైన నా దేశ వాసులారా,

 

నేడు ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచం ముందు తల ఎత్తుకు తిరుగుతున్నాడు.  మన దేశం గర్వకారణమని భావిస్తున్నాడు.  2017 జూన్ 21 వ తేదీ ప్రపంచమంతా యోగమయంగా మారిపోయింది.  జలపాతాల నుండి పర్వతాల దాకా ప్రభాత కాలంలో ప్రజలందరూ సూర్య కిరణాలకు స్వాగతం పలికారు.  ఈ విషయం భారతీయులందరికీ గర్వకారణం.  దీని అర్థం ఇంతకు ముందు ప్రజలకు యోగా గురించి జ్ఞానం లేదని కాదు.  నేటికీ ప్రజలంతా యోగ సూత్రంలో బంధించబడ్డారు.  మొత్తం ప్రపంచాన్ని కలిపే సూత్రంగా యోగం పరిణమించింది.  ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు జూన్ 21న యోగాసనాలు వేశాయి.  చైనాలో ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ పైన యోగా చేశారు.  పెరూలో వరల్డ్ హెరిటేజ్ సైట్ మాచూ పిచ్చూ పై సముద్రానికి 2 వేల 400 మీటర్ల ఎత్తున ప్రజలు యోగా చేశారు.  ఫ్రాన్స్ లో ఐఫిల్ టవర్ వద్ద యోగా జరిగింది.  యుఎఇ లో, అబూ ధాబీ లో 4 వేల కన్నా ఎక్కువ మంది ప్రజలు సామూహికంగా యోగాసనాలు వేశారు.  అఫ్గానిస్తాన్ లోని హెరాత్ లో భారత్, అఫ్గాన్ స్నేహ సేతువుగా ప్రసిద్ధి చెందిన సల్మా సేతువు పై యోగా చేశారు.  ఇలా చేయడం వల్ల ఉభయ దేశాల స్నేహం విషయంలో కొత్త అంశాన్ని జోడించినట్లయింది.  సింగపూర్ లాంటి చిన్న ప్రదేశంలో పది ప్రదేశాల్లో కార్యక్రమాలు జరిగాయి.  ఒక వారం పాటు ప్రచార కార్యక్రమం నిర్వహించారు.  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్య రాజ్య సమితి  (యుఎన్) పది తపాలా స్టాంపులు విడుదల చేసింది.  యుఎన్ ముఖ్య కేంద్రంలో యోగా గురువులతో చర్చా సమావేశం జరిగింది.  యుఎన్ లోని ప్రభుత్వ సిబ్బంది, దూతల కార్యాలయంలోని వ్యక్తులందరూ ఇందులో పాల్గొన్నారు.

 

ఈసారి యోగా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు చేసింది.  గుజరాత్ లోని అహమదాబాద్ లో సుమారు 55 వేల మంది ప్రజలు ఒక్కసారిగా యోగా చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.  లఖనవూలో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది.  అయితే, నాకు తొలిసారిగా వర్షంలో యోగా చేసే అదృష్టం కలిగింది.  మైనస్ 20, 25, 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే సియాచిన్ లో కూడా మన సైనికులు యోగా చేశారు.  మన సాయుధ దళాలు కానివ్వండి, సరిహద్దు భద్రతా దళాలు కానివ్వండి, ఐటి బి పి  సైనికులు కానివ్వండి, సిఆర్ పిఎఫ్ దళాలు కానివ్వండి, సిఐఎస్ఎఫ్ సైనికులు కానివ్వండి.. అందరూ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక కుటుంబంలోని మూడు తరాల వారు కలిసి యోగ చేసి, దానికి సంబంధించిన ఫొటోలు పంపించండి అని నేను కోరాను.  కొన్ని టీవీ ఛానళ్లలో దీనికి సంబంధించిన వార్తలు వచ్చాయి.  నాకు చాలా ఫొటోలు వచ్చాయి.  వాటిలో కొన్నింటిని ఎన్నుకుని NarendraModiApp లో భద్రపరచడం జరిగింది.  ప్రపంచ వ్యాప్తంగా యోగ చర్చలు జరిగే ఈ వేళలో మనకు ఒక విషయం స్పష్టమైంది.  యోగా చేయడం వల్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించే మన సమాజం ఆరోగ్య స్థితి నుండి సురక్షిత స్థితికి చేరుకుంటోంది.  యోగా వల్ల మనకు ఆరోగ్యం లభిస్తుంది.  దీంతో పాటు భద్రత కోసం యోగం ఒక అద్భుతమైన సాధనం అని మనం గ్రహించాలి.

 

(సౌండ్ బైట్)

 

‘‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు, గుజరాత్ లోని అహమదాబాద్ నుండి నేను డాక్టర్ అనీల్ సోనారాను మాట్లాడుతున్నాను.  మీకు నేను ఒక ప్రశ్న వేయాలనుకున్నాను.  కేరళలో మీరు ఒక విషయం చెప్పారు.  మనం వివిధ కార్యక్రమాల్లో అతిథులకు పుష్పగుచ్ఛాన్ని కానుకగా అందిస్తాం.  దానికి బదులుగా పుస్తకాలు ఇవ్వాలి.  అది ఒక స్మృతి చిహ్నంగా నిలిచిపోతుంది.  ఈ ప్రక్రియను మీరు గుజరాత్ లో మీ కార్యాలయంలోనే ప్రారంభించారు.  అయితే ఇటీవల ఇలాంటి సంప్రదాయం మనకు ఎక్కడా కనిపించదు.  దీని కోసం మనం ఏమైనా చేయవచ్చా.  దీని కోసం మనం ఏదైనా ప్రయత్నం ఎందుకు చేయకూడదు ?  ఇది దేశవ్యాప్తంగా అమలు అయ్యేటట్టు మనం చేయగలిగింది ఏమీ లేదా ?, సార్’’ అంటూ ఆయన మాట్లాడారు.

 

కొన్ని రోజుల క్రితం, నేను చాలా ఇష్టమైన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను.  కేరళలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయి.  పి.ఎన్. పనికర్ ఫౌడేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది.  ప్రజల్లో పుస్తకాలు చదివే ప్రవృత్తి పెరగాలని, పుస్తకాల పట్ల చైతన్యం పెరగాలని ఈ ఫౌండేషన్ రీడింగ్ డే, రీడింగ్ మంత్ సెలబ్రేషన్ జరిపింది.  ఆ కార్యక్రమానికి వెళ్లే అదృష్టం నాకు కలిగింది.  అక్కడ పుష్ప గుచ్ఛానికి బదులుగా పుస్తకాలు ఇస్తారట.  నాకు ఇది ఎంతో నచ్చింది.  కొన్నేళ్ల క్రితం మర్చిపోయిన అంశాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చుకునే అవకాశం నాకు కలిగింది.  గుజరాత్ లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుష్పగుచ్ఛానికి బదులు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించాను.  లేదా చేతి రుమాలుతో స్వాగతం చేయాలనుకున్నాం.  ఆ చేతి రుమాలు ఖాదీతో తయారైనటువంటిది.  ఖాదీ ఉద్యమానికి కూడా మనం ప్రోత్సాహం ఇవ్వాలి కదా.  గుజరాత్ లో నేను ఉన్నంత కాలం ఈ సంప్రదాయం అలాగే నిలిచింది.  ఇది ఒక అలవాటుగా మారిపోయింది.  ఇక్కడికి వచ్చాక ఈ అలవాటు తప్పిపోయింది.  కేరళకు వెళ్లి వచ్చాక మళ్లీ అలవాటు ఏర్పడింది.  వెంటనే నేను ప్రభుత్వాధికారులకు ఆదేశాలు ఇవ్వడం ప్రారంభించాను.  మెల్లగా ఇది మన స్వభావంలో ఒక భాగంగా మారిపోవాలి.  ఒక పుష్పగుచ్ఛం కొద్దిసేపటికి వాడిపోతుంది.  ఒకసారి చేతిలోకి తీసుకుంటాం, మళ్లీ వదిలి వేస్తాం.  అయితే, పుస్తకం విషయంలో అలా కాదు.  అది మన ఇంట్లో ఒక భాగమైపోతుంది.  కుటుంబంలో ఒక భాగంగా మారిపోతుంది.  ఖాదీ చేతి రుమాలుతో స్వాగతం చెప్తే ఎంతో మంది పేదలకు మనం సహాయం చేసినట్లవుతుంది.  ఖర్చు కూడా తగ్గిపోతుంది.  సరిగ్గా ఇచ్చిన వస్తువు ఉపయోగపడుతుంది.  ఇలాంటి అంశాలు నేను వివరిస్తున్నాను.  వీటికి చారిత్రాత్మకమైన విలువ ఉంది.  గత ఏడాది లండన్ కు వెళ్లినప్పుడు బ్రిటిష్ రాణి ఎలిజిబెత్ నన్ను భోజనానికి పిలిచారు.  అక్కడ మాతృ వాత్సల్య భరితమైన వాతావరణం నెలకొంది.  ఆప్యాయంగా రాణి గారు ఆతిథ్యం అందించారు.  తరువాత ఆమె నాకు ఓ చిన్న చేతి రుమాలును ఇచ్చారు.  నూలుతో తయారైన రుమాలు అది.   నాకు అందించే వేళలో ఆమె కళ్ళలో ఒక మెరుపు మెరిసింది.  తన పెళ్లి రోజున ఈ చేతి రుమాలును మహాత్మ గాంధీ గారు తనకు కానుకగా ఇచ్చారని, వివాహ సందర్భంలో ఆయన ఇచ్చిన శుభాకాంక్షగా ఇది మిగిలిపోయిందని ఆమె వివరించారు.  మహాత్మ గాంధీ అందించిన కానుకను ఎలిజిబెత్ రాణి ఇన్నేళ్లపాటు భద్రపరచడం ఆశ్చర్యకరం.  నేను వెళ్ళినపుడు నాకు ఆ రుమాలును చూపించి, దానిని స్పర్శించవలసిందిగా ఆమె కోరారు.  మహాత్మ గాంధీ గారు ఇచ్చిన చిన్ని కానుక ఆమె జీవితంలో ఒక చరిత్రాత్మకమైన వస్తువుగా మిగిలిపోయింది.  ఇలాంటి మంచి అలవాట్లు రాత్రికి రాత్రే రావని నాకు తెలుసు.  ఇలాంటి మాటలు ప్రస్తావించినప్పుడు మనల్ని విమర్శించే వాళ్లకు కొదువ ఉండదు.  ఎన్ని విమర్శలు వచ్చినా ఇలాంటి మాటలు కొనసాగాలి.  ప్రయత్నాలు కూడా కొనసాగాలి.  ఎక్కడికైనా వెళ్లినప్పుడు నాకు ఎవరైనా పుష్పగుచ్ఛం అందించాలనుకుంటే వాళ్లను వద్దు అని మందలిస్తానని దీని అర్థం కాదు.  ఈ విమర్శలు జరుగుతూనే ఉంటాయి.  మనం మన ప్రయత్నం కొనసాగించాలి.  మెల్లగా పరిస్థితిలో మార్పులు వస్తాయి.

 

ప్రియమైన నా దేశ వాసులారా,  ప్రధాన మంత్రిగా నాకు ఎన్నో కర్తవ్యాలు ఉంటాయి.  ఫైళ్లలో మునిగిపోతాం.  అయితే, నాకు ఒక అలవాటు ఉంది.  ప్రతి రోజూ నాకు వచ్చే ఉత్తరాల్లో కొన్నింటిని చదువుతాను.  సామాన్య ప్రజలతో నాకు సంబంధాన్ని పెంపొందించేవి ఈ ఉత్తరాలే.  రకరకాల ఉత్తరాలు వస్తాయి.  నాకు ఒక ఉత్తరం వచ్చింది.  ఈ ఉత్తరం గురించి మీకు తప్పక చెప్పాలనుకుంటున్నాను.  సుదూర తమిళ నాడులో మదురై నగరంలో నుండి ఒక గృహిణి అరుళ్ మొళి శరవణన్ గారు నాకు ఒక ఉత్తరం రాశారు. నా పిల్లల చదువుసంధ్యలను దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక ప్రయత్నంతో ఆర్థికంగా బలపడాలని ఆశించాను.  నా కుటుంబానికి వేడినీళ్ళకు చన్నీళ్ళుగా ఉపయోగపడాలని అనుకున్నా.  బ్యాంకులో నుండి డబ్బులు తీసి కొన్ని వస్తువులను ఖరీదు చేసి అమ్మే విషయం గురించి ఆలోచించారు.  ఇంతలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన Government e-Marketplace అనే అంశం నా మదిలో మెదిలింది.  నేను దాని కోసం ఎందరినో అడిగాను.  అన్వేషణ కొనసాగించాను.  ఆ పథకంలో నేను నా పేరు నమోదు చేయించుకున్నాను.  భారతీయులందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను.  మీరు కూడా ఇంటర్ నెట్ పై ఈజీఇఎమ్ అనే సైటుకు వెళ్లండి.  అక్కడ ఒక కొత్త రకమైన వ్యవస్థ ఉంది.  ఎవరైనా ప్రభుత్వానికి చిన్న చిన్న వస్తువులను సరఫరా చేయాలనుకుంటే ఉదాహరణకు బల్బులు, డస్ట్ బిన్ లు, చీపుర్లు, కుర్చీలు, టేబుళ్ళు పంపించాలనుకున్నా, అమ్మాలనుకున్నా ఇందులో తన పేరు రిజిస్టర్ చేసుకోవాలి.  తన వద్ద ఉన్న వస్తువుల క్వాలిటీ గురించి అందులో రాయాలి.  దాని ధర ఎంతో వివరించాలి.  ప్రభుత్వ అధికారులు ఈ సైట్ కు తప్పనిసరిగా వెళ్లాలి.  తక్కువ ధరకు చక్కటి ప్రమాణాలు కలిగిన వస్తువులను అమ్మే వ్యక్తులను మనం గుర్తించాలి.  ఆ వ్యక్తికి సామాగ్రి పంపించమని ఆదేశాలు ఇవ్వాలి.  ఇక లంచగొండితనానికి ఇక్కడ ఆస్కారం లేదు.  సంపూర్ణమైన పారదర్శకత ఉంది.  ఇక్కడ సంఘర్షణకు చోటు లేదు.  సాంకేతిక పరిజ్ఞానం ఆధారంతో అన్నీ స్పష్టంగా జరుగుతాయి.  ఈజీఇఎమ్ లో రిజిస్టర్ అయిన వ్యక్తుల సరకుల వివరాలను తప్పనిసరిగా ప్రభుత్వాధికారులు పరిశీలిస్తారు.  మధ్యవర్తులు లేని కారణంగా కారుచౌకగా వస్తువులు లభిస్తాయి.  ఈ అరుళ్ మొళి మేడమ్ కూడా ఈ వెబ్ సైట్ పై తాను అమ్మదలిచిన వస్తువుల జాబితాను నమోదు చేసుకున్నారు.  ఆవిడ నాకు రాసిన ఉత్తరం చాలా ఆశ్చర్యకరంగా ఉంది.  ఆమె రాశారు “ముద్రా’’ పథకం ద్వారా నాకు పెట్టుబడి లభించింది.  నా వ్యాపారం ప్రారంభమైంది. ఈజీఇఎమ్ లో నా వద్ద అమ్మకానికి సరుకుల వివరాలన్నీ పొందుపరిచాను.  ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి నాకు ఆర్డర్ కూడా లభించింది అని.  ఆమె తన ఉత్తరంలో ప్రధాన మంత్రి కార్యాలయం వారు రెండు ఫ్లాస్క్ లను కొనుక్కున్నారు.  వీటి తాలుకు 1600 రూపాయల పేమెంట్ కూడా నాకు అందింది.  ఇదే నిజమైన సాధికారిత.  సన్నకారు పరిశ్రమలను ప్రోత్సహించాలి మనం.  అరుళ్  మొళి నాకు ఉత్తరం రాయకపోయి ఉంటే ఈజీఇఎమ్ ప్రక్రియ ద్వారా సుదూర ప్రాంతానికి చెందిన ఒక మహిళ వ్యాపారం చేస్తున్న అంశం తెలిసేది కాదు.  ఆమె అందించిన వస్తువులు ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరుకోవడం విశేషం.  ఇదే మన దేశంలోని బలం.  ఇందులో పారదర్శకత ఉంది.   సాధికారిత నెలకొంది.  నూతన ఉద్యమం ప్రారంభించే ప్రయత్నం ఉంది.  తమ వద్ద ఉన్న సరుకులను విక్రయించదలచిన వ్యక్తులు ఈజీఇఎమ్ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు.  ప్రభుత్వం ఉండనే ఉంటుంది.  పాలన మాత్రం పటిష్టంగా సాగుతుంది.  ఇందుకు ఇదే ఉదాహరణ.  చౌక ధరలో చాలా సులభంగా వస్తువులు లభిస్తాయి.  సామర్థ్యం పెరుగుతుంది.  పారదర్శకత పెరుగుతుంది.

 

ప్రియమైన నా దేశ వాసులారా,

 

ఒకవైపు యోగా గురించి మనం గర్వపడుతున్నాం.  మరో వైపు అంతరిక్షంలోకి విజయవంతంగా ఉపగ్రహాలను పంపిస్తున్నాం.  ఇది కూడా మనకు గర్వకారణం.  ఒకవైపు మన పాదాలు యోగంతో ముడిపడి నేలపై నిలిచాయి.  మన స్వప్నాలు మాత్రం సుదూరమైన ఆకాశంలో క్షితిజాలను దాటి ప్రయాణిస్తున్నాయి.  గత కొన్ని రోజులుగా క్రీడా రంగంలో, శాస్త్ర విజ్ఞ‌ాన రంగంలో మనం ఎన్నో చమత్కారాలు చేశాం.  మన భారతదేశం నేల మీదే కాదు నింగిపై కూడా అభివృద్ధిని సాధించింది.  రెండు రోజుల క్రితం ఇస్రో సంస్థ 30 నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది.  ఈ ప్రయత్నంలో భారత్ తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా లాంటి 14 దేశాలు కూడా పాలుపంచుకున్నాయి.  ఈ నానో ఉపగ్రహాల సహాయంతో వ్యవసాయరంగంలో ఎన్నో వింతలు చేయవచ్చు.  ప్రకృతి వైపరీత్యాల గురించి ముందస్తు సమాచారం లభిస్తుంది.  కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన నా స్మృతిలో మెదులుతోంది.  ఇస్రో జిశాట్ 19ను విజయవంతంగా ప్రయోగించింది.  ఇంతవరకు భారత్ అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల్లో చాలా బరువైనది ఇదే.  మన భారతదేశంలోని పత్రికలన్నీ ఈ ఉపగ్రహం బరువు ఏనుగుతో సమానమని అభివర్ణించాయి.  జూన్ 19వ తేదీన మార్స్ మిషన్ జరిగి వెయ్యి రోజులు పూర్తి అయ్యాయి.   మీకంతా తెలిసిన విషయమే మార్స్ మిషన్ కోసం మనం అంతరిక్షంలో విజయవంతంగా ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నాం.  ఈ మిషన్ వ్యవధి 6 నెలలు.  ఆ ఉపగ్రహం జీవన కాలం కూడా ఆరు నెలలు.  ఆరు నెలలు గడిచిపోయినా మన మంగళయాన్ మిషన్ ఇంకా పని చేస్తూనే ఉంది.  ఫొటోలు పంపిస్తోంది.  సమాచారం అందిస్తోంది.  విజ్ఞానానికి సంబంధించిన డేటాను అందిస్తోంది.  అనుకున్న వ్యవధి కన్నా ఎక్కువ కాలం పని చేయగలుగుతోంది.  వెయ్యి రోజులు పూర్తి చేసుకోవడం అంతరిక్ష యాత్రలో ఒక మహత్తరమైన అడుగు.

 

ఈ రోజుల్లో మనం క్రీడా రంగంలో కూడా ప్రగతిని సాధించాం.  క్రీడారంగం పట్ల మన యువతీయువకుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.  చదువులతో పాటు యువకులు క్రీడా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు.  ఇవన్నీ వాళ్ల ఉజ్జ్వల భవిష్యత్తుకు తార్కాణాలు.  మన క్రీడాకారులు విజయపరంపరలతో మన దేశం క్రీడా రంగంలో గర్వకారణమైన స్థితికి చేరుకుంది.  మన కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా వ్యాపించాయి.  ఇటీవల మన దేశానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ కిదాంబి శ్రీకాంత్ ఇండోనేశియా ఓపెన్ లో దిగ్విజయం సాధించాడు.  మన కీర్తి పతాకాన్ని వినువీధిలో ఎగురవేశాడు.  ఈ మహత్తర విజయానికి శ్రీకాంత్ ను, ఆయన కోచ్ ను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను.  కొన్ని రోజుల క్రితం పరుగుల రాణి పి.టి. ఉష గారు నెలకొల్పిన ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ లో సిన్ థెటిక్ ట్రాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది.  క్రీడా రంగానికి మనం అందించే ప్రాముఖ్యాన్ని బట్టి క్రీడాకారులు తమ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవడం జరుగుతుంది.  వ్యక్తిత్వ వికాసంలో క్రీడలు అద్భుతమైన పాత్రను పోషిస్తాయి.  సమగ్ర వ్యక్తి నిర్మాణంలో క్రీడలు చాలా ముఖ్యమైనవి.  మన దేశంలో ప్రతిభావంతులకు ఏ మాత్రం కొరత లేదు.  మన కుటుంబాల్లో పిల్లలు ఇష్టపడితే క్రీడా రంగంలో వాళ్లకు అవకాశాలు అందించాలి.  ఆట మైదానం నుంచి వాళ్లను తెచ్చి, గదిలో బంధించి పుస్తకాల పురుగులుగా మార్చడం తగదు.  చదువులతో పాటు క్రీడా రంగంలో కూడా వారు ముందంజ వేయాలి.  విద్యార్థులకు క్రీడారంగంలో ఏ మాత్రం ఆసక్తి ఉన్నా పాఠశాలలో, కళాశాలలో, కుటుంబంలో అన్ని చోట్లా వ్యక్తులు ప్రోత్సహించాలి.  రాబోయే ఒలంపిక్స్ సందర్భంగా భారతీయులందరూ కొత్తగా కలలు కనే దిశగా ముందుకు సాగాలి.

 

ప్రియమైన నా దేశ వాసులారా, మరొక్కసారి పండుగల వాతావరణంతో ఈ వర్ష రుతువు మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.  ఈ సమయంలో మనకు కలిగిన అనుభూతి నిత్య నవీనమైంది.  మరొక్కసారి మీకందరికీ నా శుభాకాంక్షలు.. రాబోయే ‘మనసులో మాట’ (మన్ కీ బాత్) కార్యక్రమంలో మరికొన్ని మాటలు ముచ్చటిస్తాను.

నమస్కారం.

 

***