Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆయుష్ మంత్రిత్వ‌ శాఖ‌, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ ల‌కు మ‌ధ్య‌ సంప్ర‌దాయ వైద్య‌ విధాన‌ రంగంలో స‌హ‌కార‌పూర్వ‌క‌ ఒప్పందానికి కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదం


సంప్ర‌దాయ వైద్య‌ విధాన‌ రంగంలో భార‌త ప్ర‌భుత్వ AYUSH మంత్రిత్వ‌ శాఖ‌, జెనీవా లోని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ (డ‌బ్ల్యు హెచ్ ఒ) ల మ‌ధ్య‌ స‌హ‌కార‌పూర్వ‌క‌ ఒప్పందం జ‌ర‌గ‌డానికి వీలుగా కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివ‌ర్గ సమావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ వ‌హించారు.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ (డ‌బ్ల్యు హెచ్ ఒ)తో జ‌రిగే ఈ దీర్ఘ‌కాలిక ఒప్పందం కార‌ణంగా ఆయుష్ వ్య‌వ‌స్థ‌ల‌కు బ్రాండింగ్ మ‌రింత‌గా పెర‌గ‌డ‌మే కాకుండా అంత‌ర్జాతీయంగా వీటికి ఆమోదనీయ‌త కూడా పెరుగుతుంది. విద్య, నైపుణ్యాల అభివృద్ధి ద్వారా, వ‌ర్క్‌షాపులు, ప్ర‌చుర‌ణ‌ల ద్వారా, డ‌బ్ల్యు హెచ్ ఒ, ఆయుష్‌ల మ‌ధ్య‌ భాగ‌స్వామ్య‌ కార్య‌క్ర‌మాల‌ ద్వారా AYUSH వైద్య‌ విధాన వ్య‌వ‌స్థ‌ల‌ పైన ఆయా దేశాల్లో చైత‌న్యం పెంపొందుతుంది. 2014- 2023 సంవ‌త్స‌రాల‌ మ‌ధ్య‌ సంప్ర‌దాయ వైద్య‌ విధానాల వ్యూహాన్ని అమ‌లు య‌డానికి డ‌బ్ల్యు హెచ్ ఒ కంక‌ణం క‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ఆయుష్ వైద్య విధాన వ్య‌వ‌స్థ‌ల్ని చూసిన‌ప్పుడు అవి డ‌బ్ల్యు హెచ్ ఒ ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందుతాయి.

ఆయుష్ మంత్రిత్వ‌ శాఖ‌కు కేటాయించిన బ‌డ్జెట్ నిధుల‌ నుంచే ఈ స‌హ‌కార కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డానికి గాను ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది.
ఇరు సంస్థ‌లు అంటే ఆయుష్ మంత్రిత్వ‌ శాఖ‌, ప్ర‌పంచ ఆరోగ్య‌ సంస్థ ప‌ర‌స్ప‌రం ఏకాభిప్రాయానికి వ‌చ్చిన త‌రువాత‌ జ‌రిగే ఒప్పందాల‌కు ఆమోదం రాగానే కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌వుతాయి.

దీర్ఘ‌కాలికంగా కొన‌సాగే ఈ ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంలో ఇండియా వేసే మొద‌టి అడుగు ఇలా ఉంటుంది. భార‌తీయ సంప్ర‌దాయ వైద్య వ్య‌వ‌స్థ‌ల‌కు స‌రైన అంత‌ర్జాతీయ ఆమోద‌నీయ‌త రావ‌డానికి వీలుగా కింద తెలిపిన సాంకేతిక డాక్యుమెంట్లు, ప్ర‌చుర‌ణ‌ల్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యు హెచ్ ఒ) చేప‌ట్టాల‌ని కోరుతుంది.
1. యోగాలో శిక్ష‌ణ‌కోసం నెల‌కొల్పిన‌ ప్ర‌మాణాలు;
2. ఆయుర్వేద ప్రాక్టీసులో నెల‌కొల్పిన‌ ప్ర‌మాణాలు;
3. యునాని వైద్యంలో నెల‌కొల్పిన‌ ప్ర‌మాణాలు;
4. పంచ‌క‌ర్మ ప్రాక్టీసులో నెలకొల్పిన‌ ప్ర‌మాణాలు.

ఆయుష్‌, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ (డ‌బ్ల్యు హెచ్ ఒ)లు దీర్ఘ‌కాలం పాటు క‌ల‌సి ప‌ని చేస్తాయి. ప‌ర‌స్ప‌రం ఆమోదం పొందిన కార్య‌క్ర‌మాల‌ను చేప‌డ‌తాయి. గుర్తింపు పొందిన సంప్ర‌దాయ, పూర‌క వైద్య‌ విధానాలు /వ‌్య‌వ‌స్థ‌ ల‌ (ట్రెడిష‌న‌ల్ అండ్ కాంప్లిమెంట‌రీ మెడిసిన్‌/ సిస్ట‌మ్స్.. టి అండ్ సిఎం) అభివృద్ధికి కృషి చేస్తాయి. టి అండ్ సిఎం కు సంబంధించిన ప్రాథ‌మిక అంశాల‌ పైన ప్ర‌పంచ ఆరోగ్య‌ సంస్థ ప్ర‌చుర‌ణ‌ల‌కు ఆయుష్ కృషి చేస్తుంది. ప్ర‌పంచ‌ వ్యాప్తంగా టి అండ్ సిఎం ప్రాక్టీసు చేసే వైద్యుల స‌మాచారాన్ని ఒక చోట పొందుప‌రుస్తారు. టి అండ్ సిఎం ప్రాక్టీసుకు సంబంధించి అంత‌ర్జాతీయ నియంత్ర‌ణ స‌హ‌కార వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తారు.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ, ఆయుష్‌ల మ‌ధ్య‌ ఒప్పందం ఆయుష్ వైద్య‌ విధానాల‌ను ప్రాక్టీసు చేసే వారికి ల‌బ్ధి చేకూరుస్తుంది.

పూర్వ రంగం

గుర్తింపు పొందిన సంప్ర‌దాయ, పూర‌క వైద్య‌ విధానాలు /వ‌్య‌వ‌స్థ‌ ల‌ (టి అండ్ సిఎం) వ్యాప్తి కి, ప్ర‌చారానికి, వాటికి ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఆద‌ర‌ణను పెంపొందింప‌చేయ‌డానికి ఆయుష్ మంత్రిత్వ‌ శాఖ కృషి చేస్తోంది. ఇందుకుగాను ఆయుష్ మంత్రిత్వ‌ శాఖ‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తగినంత‌ మ‌ద్ద‌తు ఉంది. టి అండ్ సిఎంలో భాగ‌మైన ఆయుర్వేద‌, యోగ‌, ప్ర‌కృతి వైద్యం, యునాని, సిద్ధ‌, సోవా రిగ్పా, హోమియోప‌తీలను ప్రపంచ‌మంత‌టా ప్ర‌చారం చేయ‌డానికి గాను ప్ర‌పంచ ఆరోగ్య‌ సంస్థ‌తో క‌ల‌సి ప‌ని చేయ‌డం ద్వారా స‌హ‌క‌రిస్తూ, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్య‌క్ర‌మాల‌ను రూపొందిస్తోంది. ఐక్య‌ రాజ్య‌ స‌మితి ఆధీనంలో ప‌ని చేసే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యు హెచ్ ఒ) ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఆరోగ్య‌ సంబంధిత కార్య‌క్ర‌మాల‌ను చేప‌డ‌తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆరోగ్య‌ రంగానికి సంబంధించిన ప‌లు విష‌యాల్లో డ‌బ్ల్యు హెచ్ ఒ త‌న పాత్ర‌ను పోషిస్తోంది. ఆరోగ్య‌ రంగంలో ప‌రిశోధ‌న అజెండాను, ప్ర‌మాణాల‌ను నిర్దేశించ‌డం, సాక్ష్యాల‌తో కూడిన విధానాల‌ను త‌యారు చేయ‌డం, సాంకేతిక‌ప‌ర‌మైన స‌హ‌కారాన్ని అందించ‌డం, ఆయా దేశాల్లో ఆరోగ్య‌ రంగ ప‌రిణామాల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం, అంచ‌నా వేయ‌డం మొద‌లైన కార్య‌క్ర‌మాలను డ‌బ్ల్యు హెచ్ ఒ నిర్వ‌హిస్తుంటుంది.

ఆయుష్ మంత్రిత్వ శాఖ 2014 జులై 3న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ముందు త‌మ కార్య‌క‌లాపాల‌ను వివ‌రిస్తూ ప్ర‌జెంటేషన్ ఇచ్చింది. సంప్ర‌దాయ వైద్య‌ విధానాల‌కు ప్ర‌పంచ‌ వ్యాప్తంగా చ‌క్క‌టి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది కాబ‌ట్టి ఈ సంద‌ర్భంగా అందుబాటు లోకి వ‌చ్చే అవ‌కాశాల‌ను ఆయుష్ మంత్రిత్వ‌ శాఖ చ‌క్క‌గా ఉప‌యోగించుకోవాల‌ని ప్ర‌ధాన మంత్రి సూచించారు. వ‌న‌ మూలిక‌ల మందుల్ని ఎగుమ‌తి చేయ‌డంలో చైనాతో భార‌త‌దేశం పోటీ ప‌డాల‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. మ‌నిషిలోని మాన‌సిక, శారీర‌క ఆరోగ్య ల‌క్ష‌ణాల‌న్నిటినీ ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటూ వైద్యాన్ని అందించే త‌ర‌త‌రాల భార‌తీయ‌ సంప్ర‌దాయ వైద్య‌ విధానాల‌కు ఆద‌ర‌ణ పెంచ‌డానికి గాను ఒక మార్గ‌ద‌ర్శిని (రోడ్ మ్యాప్)ని త‌యారు చేయాలని దీనికి సంబంధించి విశ్వ‌స‌నీయ‌, అధికారిక‌ ప్ర‌చురణ‌ల‌ను తేవాల‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌త్యేకంగా చెప్పారు.

ఈ ఒప్పందం కార‌ణంగా భార‌తీయ సంప్ర‌దాయ వైద్య‌విధానాల (ఆయుర్వేదం, యునాని, సిద్ధ‌, యోగ అండ్ నాచురోప‌తీ, సోవా రిగ్పా, హోమియోప‌తి ల‌ను క‌లుపుకొని) స్థాయిని ప్ర‌పంచ వ్యాప్తంగా పెంచ‌డానికి, వాటికి ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఆద‌ర‌ణను విస్తృత‌ప‌ర‌చ‌డానికి గాను భార‌త‌దేశానికి, ప్ర‌పంచ ఆరోగ్య‌ సంస్థ‌కు మ‌ధ్య‌ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం రూపొందుతుంది. త‌ద్వారా ఆయుష్‌, డ‌బ్ల్యు హెచ్ ఒ ల మ‌ధ్య‌ దీర్ఘ‌కాలిక అనుబంధం కొన‌సాగుతుంది.