పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ఐసిడబ్ల్యుఎఫ్) మార్గదర్శక సూత్రాల సవరణకు ఆమోదం తెలిపింది.
2009లో ఐసిడబ్ల్యుఎఫ్ ను ఏర్పాటు చేశారు. విదేశాలలో నివసిస్తున్న భారత జాతీయులకు వారు విపత్తును ఎదుర్కొన్న సమయాలలోను మరియు అత్యవసర పరిస్థితులలోను వారికి సహాయం చేయడానికి ఈ నిధిని ఉద్దేశించారు. ఈ నిధి ద్వారా అందించే సంక్షేమ చర్యల పరిధిని విస్తరించడం కోసం మార్గదర్శక సూత్రాలలో సవరణలు ప్రవేశపెట్టారు. విదేశాలలో నివసిస్తున్న భారత జాతీయులు విపత్తు పరిస్థితులలో చిక్కుకున్నప్పుడు వారికి సహాయం అందించడం, సముదాయ సంక్షేమ కార్యకలాపాలు చేపట్టడంతో పాటు, వాణిజ్య సంబంధ సేవలను మెరుగుపరచడం.. ఈ మూడు కీలకమైన అంశాలు కూడా నూతన మార్గదర్శక సూత్రాల పరిధిలోకి వస్తాయి. విదేశాలలో నివసిస్తున్న భారత జాతీయులు సహాయం కోసం అభ్యర్థించినప్పుడు, వాటిని శీఘ్రంగా మన్నించే విషయంలో ఇండియన్ మిషన్స్ అండ్ పోస్ట్ స్ కు మరింత సౌలభ్యాన్ని ఈ మార్గదర్శక సూత్రాలు ప్రసాదిస్తాయని ఆశిస్తున్నారు.
విదేశాలలో నివసిస్తున్న భారత జాతీయులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న వేళల్లో వారికి సహాయం అందించడమే కాకుండా, లిబియా, ఇరాక్, యెమెన్, దక్షిణ సుడాన్ ఇంకా ఉద్రిక్తమయ ప్రాంతాలలో చిక్కుబడిన భారత జాతీయులను అత్యవసర పరిస్థితిలో సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఐసిడబ్ల్యుఎఫ్ కీలకమైనటువంటి తోడ్పాటును అందించింది. 2013లో నితాకత్ ఘటన సందర్భంగా కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో, 2017 సంవత్సరంలో క్షమాబిక్ష ఘటనలలో తగిన ఆధార పత్రాలు లేనటువంటి భారతీయ శ్రామికులకు ఐసిడబ్ల్యుఎఫ్ అండగా నిలిచింది.
పెద్ద ఎత్తున వేగవంతంగా చోటు చేసుకున్న తరలింపులు, ఫండ్ ద్వారా అందించినటువంటి సహాయం సర్వత్రా ప్రశంసలకు పాత్రమయ్యాయి. విదేశాలకు వలస పోతున్న శ్రామికులు క్లిష్ట కాలాలలో భారతదేశం నుండి ఆశించదగిన మద్దతు విషయమై వారిలో ఒక విధమైనటువంటి విశ్వాసాన్ని కూడా ఇది రేకెత్తించింది.
విదేశాలలోని ఇండియన్ మిషన్స్ అండ్ పోస్ట్ స్ అన్నింటికీ ఐసిడబ్ల్యుఎఫ్ తోడ్పాటు లభిస్తుంది. విదేశాలలో ఇండియన్ మిషన్స్ అండ్ పోస్ట్ స్ అందించే వివిధ వాణిజ్య సంబంధ సేవలపై పన్ను ను విధించడం ద్వారా ఐసిడబ్ల్యుఎఫ్ కు నిధులను సమకూర్చుతున్నారు.