Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇందౌర్ లో ఇమామ్ హుసేన్ (ఎస్ ఎ) ప్రాణ సమర్పణం యొక్క స్మరణోత్సవం అశరా ముబారకా లో ప్రధాన మంత్రి ప్రసంగం


పరమ పావనులు డాక్టర్ సయ్యద్ నా ముఫద్దల్ సైఫుద్దీన్, లోక ప్రియ మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింహ్ చౌహాన్ గారు, ఇంకా ఈ రోజు ఇక్కడకు తరలివచ్చినటువంటి నా దావూదీ బోహ్రా సముదాయ పరివార సభ్యులారా,

ఈ రోజున మీ మధ్య ఉండడం నాకు ఒక స్ఫూర్తిదాయకమైన సందర్భమే కాకుండా ఇది నాకు ఒక కొత్త అనుభవం కూడాను.

పవిత్రమైన అశరా ముబారకా సందర్భం లో పాల్గొనే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీకు నేనెంతో కృతజ్ఞుడినై వుంటాను.

వివిధ దేశాలకు మరియు కేంద్రాలకు చెందిన మన సముదాయ ప్రజ సాంకేతిక విజ్ఞానం సహాయంతో మనతో సంధానం అయ్యారని తెలిసి ఆనందించాను. ఈ విధంగా సుదూర ప్రాంతాల నుండి సాంకేతికత ద్వారా వచ్చి మన తో కలసిన వారందరికీ నేను శిరస్సును వంచి నమస్కరిస్తున్నాను.

మిత్రులారా,

మీరు మీ జీవితాల్లో ఇమామ్ హుసేన్ సందేశాన్ని శతాబ్దాల తరబడి పాటిస్తూ ఆయన సందేశాన్ని ప్రపంచానికి, దేశానికి వ్యాప్తి చేస్తున్నారు. శాంతి కోసం, న్యాయం కోసం ఇమామ్ హుసేన్ జీవితాన్ని త్యాగం చేశారు. అన్యాయానికి, అహంకారానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ఆయన బోధనలు గతంలో కన్నా ప్రస్తుతానికి చాలా ముఖ్యమైనటువంటివి. ఇప్పడు ఈ సంప్రదాయాలను వ్యాప్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సయ్యద్ నా సాహెబ్ తో పాటు బోహ్రా సముదాయానికి చెందిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ మిశన్ తో సంబంధాన్ని కలిగివుండడం నాకు అమితానందాన్నిస్తోంది.

మిత్రులారా,

‘వసుధైవ కుటుంబకమ్’ భావన ను మనం నమ్ముతాం; యావత్తు ప్రపంచాన్ని ఒకే కుటుంబం గా పరిగణిస్తాం. మనం ప్రతి ఒక్కరితో భుజం భుజం కలిపి నడుస్తాం. ఇదే మన సమాజానికి బలం. ఇతర దేశాలతో పోలిస్తే వారసత్వం మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుంది.

భారతదేశం బలం తో బోహ్రా సముదాయం ప్రపంచానికి పరిచయం కావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. ప్రపంచం లో ఎక్కడకు వెళ్లినా ఎలా ఉన్నారు? అంటూ వారు నన్ను ఆప్యాయంగా పలకరిస్తారు.

మన గతం పట్ల మనం గర్విస్తున్నాం. అదే విధంగా వర్తమానం పట్ల విశ్వాసంతో ఉంటూ, ఉజ్వల భవిష్యత్తు కోసం ఒక తీర్మానం చేసుకుందాం. నేను ఎక్కడికి వెళ్లినా శాంతి, అభివృద్ధి పరంగా మన సమాజం చేస్తున్న కృషి ని గురించి నేను ఎప్పుడూ ప్రజలకు చెప్తూ ఉంటాను.

శాంతి, సామరస్యం, సత్యాగ్రహం, దేశభక్తి విషయాలలో బోహ్రా సముదాయం పాత్ర చాలా ముఖ్యమైంది. మన దేశం పట్ల , మాతృభూమి పట్ల ప్రేమ ను, అంకితభావాన్ని కలిగి వుండాలని సయ్యద్ నా సాహెబ్ తన ప్రవచనాల ద్వారా బోధిస్తూ ఉండే వారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా దేశం కోసం, సమాజం కోసం, నియమాల కోసం, చట్టాల కోసం ఒక వ్యక్తి ఎలా జీవించాలో మనకు బోధిస్తూ ఉండే వారు.

గతంలో కూడా ఈ విలువలను నిలబెట్టేందుకు మహాత్మ గాంధీ తో కలసి పావనులు సయ్యద్ నా తాహిర్ సైఫుద్దీన్ సాహెబ్ కీలక భూమిక ను పోషించారు.

ఈ గొప్ప వ్యక్తులు ఇరువురూ ఒకసారి రైలు ప్రయాణం లో భేటీ అయినట్లు నేను ఎక్కడో చదివాను. ఆ తరువాత వారు ఇద్దరూ తరచు గా కలుసుకొనే వారు. ప్రతి ముఖ్యమైన సంఘటన ను గురించి లేదా ఉద్యమం గురించి ఒకరితో మరొకరు చర్చించుకొనే వారు.

మన స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర లో దండి యాత్ర ఒక సువర్ణ అధ్యాయం అని మనం అందరమూ ఎరుగుదుము. ఆ యాత్ర సమయం లో గౌరవనీయులైన బాపు, పావనులు సయ్యద్ నా సాహెబ్ నివాసం ‘సైఫీ విల్లా’ లో బస చేశారు.
మహాత్మ గాంధీ స్నేహాన్ని, ఆయన విలువలను గౌరవిస్తూ, సయ్యద్ నా తాహిర్ సైఫుద్దీన్ సాహెబ్ స్వాతంత్య్రం వచ్చిన అనంతరం తన సైఫీ విల్లా ను దేశానికి విరాళంగా ఇచ్చారు. అదే సైఫీ విల్లా ప్రస్తుతం దేశ యువతరానికి స్ఫూర్తిని ఇస్తోంది.

మిత్రులారా,

బోహ్రా సముదాయం తో నా బంధుత్వం చాలా పురాతనమైంది. నేను ఎల్లప్పుడూ మీ అందరిలో ఒకరిగా ఉంటాను. ఈ నాటికీ నా తలుపులు ఎల్లప్పుడూ మీ కోసం తెరచే ఉంటాయి. నా పట్ల మీరు, మీ యావత్తు పరివారం ప్రేమ ను, అభిమానాన్ని చూపడం నా అదృష్టం.

నా జన్మదినం రావడానికి ఇంకా చాలా రోజులు ఉన్నాయి. అయినా ఈ పవిత్రమైన వేదిక మీద నాకు దీవెనలను అందించడం దేశం సంక్షేమం దృష్ట్యా నాకు శక్తి ని ప్రసాదించింది. ఇది నిజంగా ఒక పెద్ద ఒప్పందం వంటిది. అందువల్ల మీ అందరికీ నేను కృతజ్ఞుడినై వుంటాను.

బోహ్రా వ్యాపార సముదాయ ప్రతినిధి లేని గ్రామమంటూ బహుశా ఒక్కటి కూడా ఉండదు. నేను గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు బోహ్రా సముదాయం నాకు ప్రతి క్షణం అండగా ఉండి మద్దతును ఇచ్చింది. ఆ సన్నిహిత సంబంధాలే ఈ రోజున నన్ను ఇక్కడి తీసుకువచ్చాయి.

నాకు చాలా స్పష్టంగా గుర్తుంది.. ఒకసారి సయ్యద్ నా సాహెబ్ పట్నా నుండి తిరిగి వెళ్తున్నారు; ఆయన సూరత్ కు వెళ్ళవలసి వుంది. ఆయన కు సమయం లేదు. అందువల్ల ఆయన్ను కలవడానికి నేనే విమానాశ్రయానికి వెళ్లాను. ఎందుకంటే, నేను కలవకుండా ఆయనను వెళ్లనివ్వడం నాకు ఇష్టం లేదు. ఆయనకు రావడానికి కుదరకపోతే నేనే వస్తానన్నాను. అప్పుడు మేం ఇద్దరం విమానాశ్రయం లో కూర్చున్నాం. ఒక చిన్న పిల్లవాడి పైన చూపించిన మాదిరి ప్రేమ ను ఆయన నాపైన చూపించారు. ఆయన తో మాట్లాడుతున్నప్పుడు, గుజరాత్ లో నీటి ఎద్దడి ని గురించి, చెక్ డ్యాము ల నిర్మాణాన్ని గురించి నేను చర్చించాను. అపుడు ఆయన వయస్సు 97 ఏళ్లో లేదా 98 ఏళ్లో ఉండి వుంటాయి. ఆ వయస్సు లో ఆయన ఒక సాధారణ సంభాషణ ఆధారంగా యుద్ధ ప్రాతిపదిక న పనులను మొదలుపెట్టారు. ఆయన కృషి చేసి గుజరాత్ లోని గ్రామాల్లో నీటిని సేకరించడానికి, నిల్వ చేయడానికీ చెక్ డ్యాములను నిర్మించారు. ఈ ప్రచారం ఎంతో విజయవంతంగా కొనసాగింది. గ్రామాల్లో నీటి వనరులు పెరిగాయి.

అంతేకాదు కొన్ని సంవత్సరాల క్రితం పోషకాహార లోపానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఒక కార్యక్రమం కోసం నేను బోహ్రా సముదాయం యొక్క సహాయాన్ని కోరాను. ఒక ప్రజా అవగాహన ప్రచారాన్ని చేపట్టవలసిందిగా నేను వారికి విజ్ఞ‌ప్తి చేశాను. ఈ తీవ్రమైన సమస్య నుండి గుజరాత్ బయటపడే విధంగా బొహ్రా సముదాయం ఆ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది.

దావూదీ బొహ్రా సముదాయం ఈ పవిత్రమైన అశరా ముబారకా లో పూర్తిగా నిమగ్నమై వుండగా యావత్తు దేశం పౌష్టికాహార మిశన్ కింద పౌష్టికాహార మాసాన్ని జరుపుకొంటోంది. ప్రతి మాత, శిశువు ల భద్రత కోసం దేశవ్యాప్తంగా ఈ ప్రచారం సాగుతోంది.

విద్య, ఆరోగ్యం, పిల్లలకు పౌష్టికాహారం వంటి అంశాలలో మీరు తీసుకొంటున్న ప్రతి చర్య సమాజాన్ని సాధికారిత దిశ గా నడిపించడానికి సహాయపడుతోంది. ‘‘ప్రాజెక్ట్ రైస్’’ లో భాగంగా మహారాష్ట్ర తో సహా దేశం లోని వివిధ ప్రాంతాలలో బాలల కు పుష్టికరమైన భోజనాన్ని అందిస్తున్నట్లు నాకు తెలిసింది. మీరు చేపట్టిన ఈ చర్య దేశ భవిష్యత్తు ను సాధికారపరచడానికి తప్పకుండా సహాయపడుతుంది.

ప్రభుత్వం మొట్టమొదటి సారిగా ఆరోగ్య పరిరక్షణ కు అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అందుబాటు ధరల్లో ఆరోగ్య పరిరక్షణ ను, అనారోగ్యం నివారణ ను ప్రోత్సహించడం జరిగింది. మంచి నాణ్యమైన ఆసుపత్రులను, ఆరోగ్య కేంద్రాలను, వెల్ నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మందులను సరసమైన ధరలకు జన్ ఔషధీ స్టోర్స్ లో విక్రయించడం జరుగుతోంది. డయాలిసిస్ సదుపాయాలు ఉచితంగా లభ్యమవుతున్నాయి. గుండె శస్త్రచికిత్స కు, మోకాలు శస్త్రచికిత్స కు అవసరమైన పరికరాల ధర లను గణనీయంగా తగ్గించడమైంది. దేశం లోని 50 కోట్ల మంది పేద సోదరులకు, పేద సోదరీమణులకు ‘ఆయుష్మాన్ భారత్’ ఒక సంజీవని గా ఉంది.

ఇది చిన్న కార్యక్రమం ఏమీ కాదు. అమెరికా, కెనడా, మెక్సికో ల మొత్తం జనాభా కంటే ఎక్కువగా ఉన్న భారతదేశం జనాభా అవసరాలను ఈ ఆయుష్మాన్ భారత్ తీరుస్తుంది. మొత్తం యూరోప్ జనాభా తో సమానంగా ఉన్న భారతదేశ జనాభా అవసరాలను ఈ కార్యక్రమం నెరవేరుస్తుంది. ఇంత పెద్ద జనాభా సంక్షేమం కోసం ఉద్దేశించినటువంటి ఈ భారీ కార్యక్రమాన్ని గురించి మీరు ఒక్కసారి ఊహించండి.

ప్రతి కుటుంబానికి ఏడాదికి ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్స ను అందించడం జరుగుతుంది. ఇదేమీ చిన్న నిర్ణయం కాదు. 50 కోట్ల జనాభా లో ప్రతి కుటుంబం ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయల మేర వైద్య సదుపాయాన్ని పొందవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న చికిత్స ను కూడా ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా కొనసాగించవచ్చు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజైన సెప్టెంబర్ 25వ తేదీ నుండి దేశం అంతటా ఈ పథకం అమలులోకి రానుంది.

మిత్రులారా,

అవసరమైన వారికి పౌష్టికాహారాన్ని, ఆరోగ్య సేవలను, ఇంకా గృహ వసతి ని కల్పించడం కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మీ కృషి ఫలితంగా దాదాపు 11 వేల మందికి గృహ వసతి కల్పించబడినట్లు నాకు తెలిసింది. ప్రభుత్వం కూడా ఇళ్ళు లేని పేద సోదరులు, పేద సోదరీమణులందరికీ గృహ వసతి ని కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించింది.

సోదరులు, సోదరీమణులు కలుపుకొని మొత్తం ఒక కోటి మందికి పైగా ఇంటి తాళాలను అందించామని తెలిస్తే మీరు ఎంతో ఆనందపడతారు. ఇది ఒక ప్రకటన మాత్రమే కాదు. వారు నిజంగానే వారి ఇళ్ల తాళాలను తీసుకున్నారు. అన్య గృహ నిర్మాణ పనులు సైతం యుద్ధ ప్రాతిపదిక న పూర్తి కావస్తున్నాయి. విద్య, నైపుణ్య అభివృద్ధి రంగాలలో మీరు చేస్తున్న కృషి, ప్రభుత్వం చేస్తున్న కృషి ని మరింత పటిష్టపరుస్తోంది. తద్వారా ఫలితాలు రెట్టింపవుతున్నాయి. కేవలం రెట్టింపే కాదు, దీనివల్ల ఫలితాలు ఎన్నో రెట్లు అధికమవుతున్నాయి. సామాన్య ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి, వారి జీవన స్థాయి ని పెంపొందించడానికి మనం నిరంతరం కష్టపడుతూ ముందుకు పోతున్నాం.

మిత్రులారా,

పేదలు, మధ్య తరగతి ప్రజలకు సంబంధించి ప్రభుత్వం మరొక విషయం పైన దృష్టి ని కేంద్రీకరించింది. ఆ విషయం పరిశుభ్రత కు సంబంధించింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ రోజు 125 కోట్ల మంది భారతీయులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి గ్రామం లో, ప్రతి వీధి లో దీని పట్ల ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.

నాలుగు సంవత్సరాల క్రితం వరకు, అంటే నేను ప్రధాన మంత్రి ని కాక మునుపు భారతదేశం లో కేవలం 40 శాతం ఇళ్ల కు మరుగుదొడ్లు ఉన్నాయి. చాలా తక్కువ కాల వ్యవధిలో ఈ సంఖ్య 90 శాతానికి పెరిగింది. అతి త్వరలో దేశం బహిరంగ మల మూత్రాదుల విసర్జన రహిత (ఒడిఎఫ్) దేశం గా విజయవంతంగా రూపు దిద్దుకొంటుందని నేను విశ్వసిస్తున్నాను.

పరిశుభ్రత విషయంలో ఇందౌర్ దేశం లో ఎప్పుడూ ఉన్నత స్థానంలో కొనసాగుతోంది. ఈ కారణంగా ఇందౌర్ ప్రజలను, ఎన్నికైన ప్రజా ప్రతినిధులను, కార్పొరేషన్ సభ్యులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింహ్ చౌహన్ ను, ఆయన మొత్తం బృందాన్ని నేను మనసారా అభినందిస్తున్నాను.

ఇందౌర్ ఒక్కటే కాక భోపాల్ కూడా అద్భుతమైన రీతిలో కృషి చేసింది. ఆ విధంగా, నా యువ మిత్రులు, మధ్య ప్రదేశ్ కు చెందిన ప్రతి వ్యక్తి ఈ ఉద్యమానికి ప్రేరణ గా నిలచారు. పరిసరాల పరిశుభ్రత కోసం, స్వచ్ఛత కోసం మీ సముదాయం అందిస్తున్నటువంటి సహకారాన్ని గురించి మీ అందరికీ తెలుసు. సయ్యద్ నా సాహెబ్ కూడా పర్యావరణ పరిరక్షణకు, పరిశుభ్రతకు వ్యక్తిగతంగా ఒక ప్రేరణ గా నిలచారు. బడే సయ్యద్ నా సాహెబ్ శత జయంతి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రామానికి నన్ను ఆహ్వానించినట్లు నాకు జ్ఞ‌ాపకం ఉంది.

ఇతరులు శత జయంతి ఉత్సవాలను ఎలా జరుపుకుంటారో నాకు తెలియదు కానీ ఆ రోజు పిచ్చుక లను రక్షించుకోవడానికి ఒక ఉద్యమం ఎలా ప్రారంభమైందన్న సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. పిచ్చుకలు గూడు కట్టుకోడానికి వీలుగా ప్రతి ఒక్కరికీ ఒక పెట్టి ఇచ్చారు. ఇంతకు మించిన పర్యావరణ పరిరక్షణ మరేముంటుంది ? ఇవి మన విలువలు. అవి పర్యావరణ పరిశుభ్రత కోసం ఒక స్వచ్ఛమైన మనస్సుతో ముడి పడి ఉన్నాయి.

గుండె లో, మనస్సు లో పరిశుభ్రత ఉండవలసిన అవసరం ఉందని ఇప్పుడే సయ్యద్ నా సాహెబ్ నాతో చెప్పారు. ఇందౌర్ ప్రతిష్ట ను దృష్టి లో పెట్టుకుని పర్యావరణం, పరిశుభ్రతల సందేశాలతో కలిపి అశరా ముబారకా ను నిర్వహిస్తున్నట్లు నాకు చెప్పారు.

ఇక్కడ ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించారు. ఈ కార్యక్రమాన్ని చెత్త కు చోటు ఉండని విధంగా రూపొందించారు. ప్రతి రోజూ దాదాపు 10 టన్నుల చెత్త ను రీసైకిల్ చేసి ఎరువుగా మారుస్తున్నారు. దానిని రైతులకు ఉచితంగా అందజేస్తున్నారు.

ఈ ప్రక్రియ లో భాగంగా మీరు పర్యావరణానికి సేవ చేయడమే కాకుండా, ‘‘చెత్త నుండి ఇంధనం’’ అనే ప్రభుత్వ ఆలోచన ను ఆచరణ లో పెడుతున్నారు. ఈ చర్య రైతు సోదరులకు, రైతు సోదరీమణులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటువంటి ప్రయోగాల నుండి పాఠాలను నేర్చుకొని పరిశుభ్రత తో అనుసంధానం కావాలని స్వచ్చాగ్రహులకు నేను విన్నపం చేస్తున్నాను. మన భవిష్యత్తు కార్యక్రమాలు, ‘‘చెత్త నుండి ఇంధనం’’పైన దృష్టి ని కేంద్రీకరిస్తాయి. ‘‘స్వచ్ఛతా హీ సేవా’’ ఉద్యమం రేపు సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభమై, అక్టోబర్ 2వ తేదీ మహాత్మ గాంధీజీ జయంతి వరకు కొనసాగనుంది.

పరిశుభ్రత ను గురించి అవగాహన కల్పించే స్వచ్ఛాగ్రహులు, మత గురువులు, కళాకారులు, క్రీడాకారులు, పారిశ్రామిక వేత్తలతో పాటు సమాజం లోని ప్రముఖ వ్యక్తులందరితో రేపు ఉదయం 9 గంటల 30 నిముషాలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడుతాను. ఆ తరువాత ఇది ఒక రికార్డు గా నమోదు అవుతుంది. రేపు ఒకే సమయం లో కోట్లాది ప్రజలు పరిశుభ్రత పనిలో నిమగ్నమై ఉంటారు.

అంతేకాక అక్టోబర్ 2వ తేదీ నాడు మహాత్మ గాంధీ 150వ జయంతి కి సంబంధించిన ఉత్సావాలు ఆరంభం అవుతాయి. గౌరవనీయులైన బాపు 150వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని సయ్యద్ నా సాహెబ్ మనకు ఒక సందేశాన్ని ఇచ్చారు. వచ్చే రెండు సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పరిశుభ్రత సందేశం తో పాటు బాపు చూపిన మార్గం లో పయనించవలసిందిగా ఆయన ప్రపంచాన్నీ, మన దేశాన్నీ ప్రోత్సహిస్తారు.

ఈ పరిశుభ్రత ప్రచార ఉద్యమం లో పాల్గొనవలసిందిగా దావూదీ బోహ్రా సముదాయాన్ని, మధ్యప్రదేశ్ లోని నా సోదరులను, నా సోదరీమణులనూ ఆహ్వానించడానికి నేను ఈరోజు ఇక్కడ ఇందౌర్ కు వచ్చాను.

మిత్రులారా,

ఈ సందర్భంగా మరొక విషయంలో మిమ్మల్ని అభినందించదలచాను. మీలో చాలా మంది వాణిజ్యానికి, వ్యాపారానికి సంబంధించిన వారు ఉన్నారు. నియమాలను అనుసరిస్తూ, ఒక క్రమ పద్ధతి లో పని ఎలా చేయాలో మీరు ఒక నమూనా ను రూపొందించారు. ఒక క్రమశిక్షణ తో వ్యాపారాన్ని ఎలా విస్తరించాలో మీరు చేసి చూపించారు. సయ్యద్ నా సాహెబ్ ఇదే విషయాన్ని తరచు చెబుతుండే వారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ప్రపంచంలో ఎక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నప్పటికీ దావూదీ బోహ్రా సమాజం ఒక ప్రత్యేక గుర్తింపును , గౌరవాన్ని దక్కించుకొంది.

మీ ప్రవర్తన ద్వారా నిజాయతీ తో, చిత్త శుద్ధి తో వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో మీరు ఒక ఆదర్శాన్ని నెలకొల్పారు. దేశం లోని వ్యాపారవేత్త ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కు వెన్నెముక. దేశం లో ఉపాధి అవకాశాలను కల్పించడానికి వ్యాపార వేత్త చాలా ముఖ్యం. వీలైనంత వరకు అతడిని ప్రోత్సహించడానికే మేం ప్రయత్నిస్తున్నాం. ఇదే మా ప్రాధాన్యం.

అయితే మన చేతి వేళ్ళు అన్నీ ఒకేలా ఉండవు అనేది వాస్తవం. మోసం చేయడమే వ్యాపారం అని మన లో కొంత మంది భావిస్తూ ఉంటారు. చట్టం దృష్టి లో అందరూ సమానం అనే సందేశాన్ని ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలలో విజయవంతంగా ప్రచారం చేసింది. వస్తువులు, సేవల పన్ను (జిఎస్ టి), దివాలా కోడ్ ల వంటి అనేక చట్టాల ద్వారా నిజాయతీపరులైన వ్యాపారవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహించింది. నా బోహ్రా సముదాయం వీటి నుండి అత్యధిక ప్రయోజనాన్ని పొందుతోంది.

గత నాలుగు సంవత్సరాలలో దేశంలో, ప్రపంచంలో పెట్టుబడిదారులలో విశ్వాసం పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణం. ప్రస్తుత పరిస్థితులలో మేక్ ఇన్ ఇండియా లో భాగంగా మొబైల్ ఫోన్ లు, కార్లు, ఇతర వస్తువుల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. పెట్టుబడులు కూడా రికార్డు స్థాయి లో పెరిగాయి. ఫలితంగా గత త్రైమాసికం లో 8 శాతం కంటే ఎక్కువగా వృద్ధి రేటు నమోదు అయింది. ఇది మీ కృషి వల్ల, 125 కోట్ల భారతీయులు కష్టపడి పనిచేయడం వల్ల సాధ్యమైంది. ప్రపంచం లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్ధిక వ్యవస్థగా మన దేశం నిలచింది.

ఇప్పుడు మన దేశం రెండు అంకె ల వృద్ధి రేటు దిశ గా ముందుకు పోతోంది. మనం పురోగమిస్తున్న రేటు వంతున ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ మన దేశం తప్పక లక్ష్యాన్ని సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

ప్రపంచం ముందు భారతదేశ ప్రతిష్ట ను ఇనుమడింపజేసేందుకు మీరందరూ పోషిస్తున్న పాత్ర చాలా కీలకమైంది. గతం లో ప్రాచీన భారతదేశానికి ఎటువంటి మహత్తరమైన స్థానం ఉండేదో ఇప్పుడు ఆ ప్రాభవాన్ని ‘న్యూ ఇండియా’ కు తిరిగి తీసుకువచ్చే అవకాశం మనకు లభించింది.

మన దేశాన్ని పునర్నిర్మించడానికి మనం అవిశ్రాంతంగా ముందుకు సాగుదాం. ఆ విశ్వాసంతో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
మరొకసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సయ్యద్ నా సాహెబ్ గారి కి, ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. మీ ప్రేమ ను, అభిమానాన్ని, దీవెనలను నాపై ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చారు. మీ ఆశీస్సులే నా ఆస్తి, నా బలం. ఈ బలం నా ఒక్కడిదే కాదు, 125 కోట్ల మంది భారతీయులకు కూడా. ఈ దీవెనలను, బలాన్ని, సమృద్ధి ని, నేను నా దేశ ప్రజలకు అంకితమిస్తున్నాను. నా హృదయాంతరాళంలో నుండి మరొక్క మారు మిమ్మల్ని అభినందిస్తున్నాను.

ధన్యవాదాలు.

**