పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్-2026’లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, విధాన రూపకర్తలు, అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలను ఉద్దేశించి- ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనడంపై ప్రగాఢ ఆనందం వెలిబుచ్చారు. ఈ ఏడాది ‘సామూహిక భవిష్యత్తు’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్త ఒడుదొడుకులు అన్ని దేశాల తలరాతలతో విడదీయరాని విధంగా ముడిపడి ఉండటాన్ని వివిధ పరిణామాలు నిస్సందేహంగా నిరూపించాయని ఆయన పేర్కొన్నారు. కానీ, భారత్ సదా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నదని, జి-20కి అధ్యక్షత వహించిన వేళ ‘ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు’ తారకమంత్రాన్ని అనుసరించడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. “ఈ సామూహిక భవిష్యత్తు భావన, దానితో ముడిపడిన బాధ్యతను నిర్వర్తించడమే కాకుండా నేటి 21వ శతాబ్దపు ప్రపంచంలోని అనేక సమస్యలకు చురుకైన పరిష్కారాలను సూచిస్తుంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
వ్యవస్థల వృద్ధి, వనరుల ఆయుధీకరణ, పెరుగుతున్న అపనమ్మకం తదితరాలపై ప్రపంచవ్యాప్త ఆందోళనను ప్రస్తావిస్తూ- ఇలాంటి పరిస్థితుల నడుమ భారత్‌ను వృద్ధికి, ఉజ్వల భవితకు శక్తిమంతమైన కూడలిగా అంతర్జాతీయ సమాజం పరిగణిస్తోందని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో 25 కోట్ల మంది పౌరులను పేదరిక విముక్తం చేయడం సహా ప్రపంచంలో శరవేగంగా పురోగమించే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థాయిని నిలబెట్టుకోవడంలో భారత్ విజయం సాధించిందన్నారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ‘సప్తధార’ పేరిట ప్రకటించిన తయారీ, సాంకేతికత, కాలుష్య రహిత ఆర్థిక వ్యవస్థ సహా ఏడు కీలక రంగాలపై ప్రభుత్వం నిశితంగా దృష్టి సారిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. అందువల్ల, దేశం ఇప్పుడు విధాన స్థాయిలో భావితరం సంస్కరణలను చేపడుతూ, పాలన స్థాయిలో సంస్కరణలను అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. జీవన సౌలభ్యం దిశగానూ పలు సంస్కరణలను ప్రవేశపెట్టినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. “సంస్కరణలు మాకు తప్పనిసరేమీ కాదు…కానీ, ఇది మా అంతిమ నిబద్ధత.. సంపూర్ణ విశ్వాసానికి నిదర్శనం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
దేశంలో ప్రస్తుత ఆర్థిక వాతావరణాన్ని మునుపటి నిర్బంధ విధానాలతో పోలుస్తూ- ‘ఉత్పత్తి ఆధారిత శిక్ష’ (పీఎల్‌పీ) విధానాన్ని ఒకనాటి ‘లైసెన్స్ రాజ్యం’ అమలు చేసిందని ప్రధానమంత్రి హాస్యస్ఫోరకంగా వ్యాఖ్యానించారు. ఆ విధానం కింద పరిమితిని మించి ఉత్పాదకత సాధించిన కంపెనీలకు జరిమానా విధింపు లేదా వస్తు నాశనం శిక్షగా ఉండేదని పేర్కొన్నారు. పౌరులను పరాధీనతలోకి నెట్టడానికి గత ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా కొరతను కొనసాగించాయని ఆయన విమర్శించారు. ఉపాధి కల్పనకు ఈ పద్ధతి తీవ్ర విఘాతంగా పరిణమించిందని ఆయన అన్నారు. “ఇలాంటి ధోరణిగల వారు నిత్యావసర వస్తువుల తీవ్ర కొరత కొనసాగాలని మాత్రే సదా అభిలషిస్తారు. పౌరులు లేమిలో మగ్గిపోవడమే వారి ఉద్దేశపూర్వక విధానం” అని శ్రీ మోదీ విమర్శించారు.
పరిపాలనలో పరిణామాత్మక మార్పును ప్రముఖంగా ప్రస్తావిస్తూ- విధ్వంసక ‘పీఎల్‌పీ’ నమూనా స్థానంలో ఇప్పుడు ఉత్పత్తి సంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ)ని పోల్చారు. ఆర్థిక ఫలితాలను ఆలోచన విధానంలో సంస్కరణ ప్రాథమికంగా ఎలా తీర్చిదిద్దుంతుందో ఆయన వివరించారు. ‘పీఎల్‌ఐ’ పథకం సాధించిన అద్భుత విజయాన్ని ఈ సందర్భంగా ఆయన సగర్వంగా ప్రకటించారు. ఈ పథకం ఒక్కటే రూ.2.5 లక్షల కోట్ల వాస్తవ పెట్టుబడులను ఆకర్షించిందని, రూ.22 లక్షల కోట్ల ఉత్పత్తి-అమ్మకాలను ప్రోత్సహించిందని తెలిపారు. అలాగే, రూ.15 లక్షల కోట్ల ఎగుమతుల సృష్టి సహా 14 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించిందని చెప్పారు. “మునుపటి లైసెన్స్ రాజ్యంలో శిక్షా విధానం నిరుద్యోగాన్ని పెంచితే, నేడు మా ప్రోత్సాహక విధానం లక్షలాది కొత్త ఉద్యోగాలను చురుగ్గా సృష్టిస్తోంది” అని శ్రీ మోదీ ప్రకటించారు.
జాతీయ ప్రగతి వేగానికి రాజకీయ స్థిరత్వం, విధానాల కొనసాగింపే కారణమంటూ పాలన-స్థాయి సంస్కరణలపై ప్రధానంగా దృష్టి సారించిన ఒక విస్పష్ట మార్గసూచీ గురించి ప్రధానమంత్రి వివరించారు. నిరంతర అధికారిక అనుమతుల అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తూ, నిర్బంధపూరిత ‘అనుమతి లేకపోతే నిషేధమే’ అనే విధానం నుంచి ‘నిషేధించకపోతే అనుమతి ఉన్నట్టే’ అనే ప్రగతిశీల ధోరణివైపు నేటి వినూత్న పరిణామాన్ని ఆయన వివరించారు. “ప్రభుత్వానికి, పౌరులకు మధ్య సంబంధానికి ప్రగాఢ విశ్వాసమే ప్రాథమిక ఆధారం తప్ప అనుమానాస్పద దృక్కోణం కాదు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
ఈ తత్వాన్ని ప్రతిబింబించే నిర్దిష్ట శాసనబద్ధ పురోగమనాన్ని వివరిస్తూ- ‘జన్ విశ్వాస్’ బిల్లును ప్రధానమంత్రి ప్రస్తావించారు. అనేక స్వల్ప విధానపరమైన ఉల్లంఘనలను ఇది నేరరహితం చేయడమే కాకుండా జైలు శిక్షకు బదులు జరిమానా విధింపు పద్థతిని ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. పరిశ్రమలపై భారం గణనీయంగా తగ్గించే దిశగా క్రమ పద్ధతిలో 40,000కు పైగా నిబంధనల తొలగింపు, కాలం చెల్లిన 1,500కు పైగా చట్టాల రద్దు వంటి చర్యలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. “ఈ భారీ సంస్కరణలన్నింటినీ కలిపి చూస్తే, మన వ్యాపారాల భుజం మీదినుంచి ఎంత పెద్ద భారం తొలగిపోయిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది,” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
రాజకీయ వ్యతిరేకత ఉన్నప్పటికీ చట్టబద్ధ వ్యవస్థల ఆధునికీకరణకు ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు ఆమోదం పొందడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎప్పుడో 19వ శతాబ్దం నాటి బ్రిటిష్ చట్టం స్థానంలో డిజిటల్ బ్యాంకింగ్ రికార్డులకు చట్టబద్ధ గుర్తింపునిచ్చే ఆధునిక చట్టం తేవడంతో సంక్లిష్టతలు గణనీయంగా తగ్గి, వాణిజ్య సౌలభ్యం ఇనుమడిస్తుందని ఆయన వివరించారు. “దీనివల్ల చట్టపరమైన సంక్లిష్టతలు గణనీయంగా తగ్గి, వ్యవస్థలో పారదర్శకత భారీగా పెరగడమే కాకుండా వాణిజ్య సౌలభ్యం గణనీయంగా మెరుగవుతుంది” అని శ్రీ మోదీ ధ్రువీకరించారు.
మానవ కేంద్రక పాలన ప్రాధాన్యాన్ని వివరిస్తూ- దేశవ్యాప్తంగా 6,500కు పైగా స్టేషన్లు, 10,000 లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి చెప్పారు. అలాగే, భారత రైల్వేల్లో భారీ భద్రత మెరుగుదలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశంలో 2014కు ముందుతో పోలిస్తే రైలు ప్రమాదాలు 90 శాతం దాకా తగ్గించడాన్ని శ్రీ మోదీ గుర్తుచేశారు. సుమారు 9,000 మానవ రహిత రైల్వే క్రాసింగ్‌లను ఉద్యమ తరహాలో తొలగించడంపై శ్రీ మోదీ మాట్లాడుతూ- “ప్రతి మానవ ప్రాణంపై, వారి అమూల్య సమయంపై సంపూర్ణ అవగాహనతో వ్యవహరించేలా వ్యవస్థలను రూపొందించాలి” అన్నారు.
రైల్వేల పరిశుభ్రతలో గణనీయ మార్పులను ఆధునిక పాలనకు ఓ కీలక ఉదాహరణగా ఆయన ఉటంకించారు. రైళ్లలో 2014 నుంచి 3.6 లక్షలకు పైగా బయో-టాయిలెట్ల ఏర్పాటు ద్వారా పట్టాలపై మానవ వ్యర్థాల సమస్యను పూర్తిగా తొలగించామని ప్రధానమంత్రి గుర్తుచేశారు. “ఈ భారీ మార్పు కేవలం శుభ్రతకు మాత్రమే పరిమితం కాదు.. ఇది ప్రధానంగా ప్రయాణికుల గౌరవం, పరిశుభ్రత, ఆధునిక పాలన సంబంధిత కీలకాంశం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సమయపాలన ప్రభుత్వ పాలన నాణ్యతకు ఓ ప్రధాన కొలబద్దగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. న్యూయార్క్, హాంకాంగ్, పారిస్ నగరాల వ్యవస్థలతో సమానంగా 99.9 శాతం సమయపాలన రికార్డు ‘ఢిల్లీ-మీరట్ నమో భారత్ రాపిడ్ రైలు’ సొంతమని చెప్పారు. అలాగే, ఢిల్లీ మెట్రో గురించి కూడా ప్రధానమంత్రి సగర్వంగా ప్రస్తావించారు. “ఇది కేవలం మెట్రో, నమో రాపిడ్ రైలు సంబంధిత కథనం మాత్రమే కాదు. కాలంతోపాటు వేగంగా మారుతున్న భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన గుర్తింపు” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
విధానపరమైన సంస్కరణలను ప్రస్తావిస్తూ- దేశాన్ని నిర్బంధ నియమాలతో దిగ్బంధించకుండా అవసరాలకు తగిన ప్రజాహిత, ప్రగతి హిత విధానాలను ప్రభుత్వం రూపొందిస్తున్నదని ప్రధానమంత్రి వివరించారు. దేశ మ్యాపింగ్ సొంత పౌరులకే చట్టవిరుద్ధంగా పరిణమించిన చారిత్రక అసంబద్ధతను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. అనంతర కాలంలో భౌగోళిక-ప్రాదేశిక సమాచార నియంత్రణల సడలింపు అంకుర సంస్థల అపార వృద్ధికి దోహదం చేసిన తీరును ప్రముఖంగా ప్రస్తావించారు. “దేశం, ప్రజల వాస్తవ అవసరాలకు తగినట్లు నిర్దిష్ట విధానాలను రూపొందించాలి” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
నిర్బంధం తొలగిపోవడంతో సానుకూల ప్రభావం పొడసూపడాన్ని ప్రస్తావిస్తూ- వ్యవసాయం, రక్షణ, కంటెంట్ క్రియేషన్ వంటి రంగాలు సహా భారత డ్రోన్ పరిశ్రమ సాధించిన అద్భుత వృద్ధిని ప్రధానమంత్రి ప్రశంసించారు. మునుపటి నిర్బంధ నిబంధనల నీడలో ఇదంతా అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. “డ్రోన్ విహారానికి అవరోధంగా నిలిచిన సంకెళ్లను మేం పూర్తిగా ఛేదించాం. ఈ రోజున దేశీయ డ్రోన్ పరిశ్రమ అసాధారణ వేగంతో దూసుకుపోతోంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సరిహద్దు మౌలిక సదుపాయాలను ఒక బలహీనతగా కాకుండా, భారీ వ్యూహాత్మక శక్తిగా పరిగణించే వినూత్న ఒరవడిని ప్రధానమంత్రి ఉటంకించారు. సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ) కేవలం (2024, 25) రెండేళ్లలో 250 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను దేశానికి అంకితం చేసిందని ఆయన సగర్వంగా పేర్కొన్నారు. “రక్షణాత్మక ఆలోచన ధోరణి మౌలికంగా మారడంతో సరిహద్దు మౌలిక సదుపాయాల స్వరూపం కూడా చురుగ్గా మారిపోయింది” అని శ్రీ మోదీ అభివర్ణించారు.
అత్యంత కట్టుదిట్టమైన పరిమితులుగల రంగాల్లో విప్లవాత్మక, ప్రగతిశీల సంస్కరణలు చేపట్టామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు అణుశక్తిని ప్రైవేట్ రంగం పరిధిలోకి విజయవంతంగా తరలించిన శాంతి బిల్లు సహా 40కి పైగా ఆయుధ కర్మాగారాలను 7 ఆధునిక కార్పొరేట్ సంస్థలుగా చారిత్రక రీతిలో పునరేకీకరించడాన్ని ప్రధానమంత్రి ఉదాహరించారు. ఈ సాహసోపేత చర్యలే దేశ స్వావలంబనను వేగిరపరచాయని, 2014తో పోలిస్తే రక్షణ ఎగుమతులు 55 రెట్లు పెరిగాయని ఆయన వివరించారు. “భారత్ నేడు స్వీయ రక్షణ అవసరాలు తీర్చుకోవడంలోనూ చురుగ్గా స్వావలంబన సాధిస్తోంది. అలాగే, రక్షణ ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
జీవన సౌలభ్యం దిశగా చేపట్టిన సంస్కరణలు దైనందిన కార్యకలాపాలలో అంతర్లీనం కావడాన్ని ప్రస్తావిస్తూ- కిరాణా సరుకుల ఆర్డర్, క్యూఆర్ కోడ్ స్కాన్ వగైరాల నుంచి తక్షణ వ్యక్తిగత నగదు బదిలీ దాకా డిజిటల్ వ్యవస్థ పురోగమనం సామాన్య భారతీయుల జీవితంలో విప్లవాత్మకంగా ఇమిడిపోవడాన్ని ప్రధానమంత్రి ఉటంకించారు. “ఈ విజయాలన్నీ అద్భుతమైనవి మాత్రమే కావు.. అసాధారణమైనవి కూడా. అయితే, ఇప్పుడవి దేశంలోని సామాన్యుడి జీవనంలోనూ విడదీయరాని, అత్యంత ప్రభావశీల భాగంగా మారాయి” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
దేశంలోని మధ్యతరగతి ప్రజానీకం జీవితాల్లో వచ్చిన పరిణామాత్మక మార్పులు అనేక అభివృద్ధి చెందిన దేశాలలో నేటికీ సుదూర స్వప్నంగా మిగిలిపోయాయని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “భారత్‌లో సంస్కరణలతో జనజీవనం పూర్తిగా మారిపోయింది… అనేక అభివృద్ధి చెందిన దేశాలలో ఇలాంటి మార్పు నేటికీ ఓ కలగానే మిగిలిపోయింది” అని శ్రీ మోదీ వివరించారు.
భారత్‌లో డిజిటల్ విప్లవ పునాదుల గురించి ప్రస్తావిస్తూ- ప్రపంచంలోనే అత్యంత చౌకగా డేటా లభ్యత, అత్యంత వేగవంతమైన 5జి నెట్‌వర్క్ గల దేశంగా నిలిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మొబైల్-బ్యాంకింగ్ సేవలతో ఆధార్ అనుసంధానం ద్వారా అవాంతరాలు లేని ఇ-కేవైసీ, డిజిటల్ ప్రామాణీకరణ సాధ్యమైందన్నారు. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు వరకూ అన్నింటా ఇది విప్లవాత్మక మార్పులు తెచ్చిందని ఆయన చెప్పారు. “మీరు ఇవాళ ఓ బ్యాంకు ఖాతా తెరవాలంటే, అక్షరాలా ఆ బ్యాంకునే ప్రభుత్వం నేరుగా మీ ముంగిటకు చేర్చింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
దూర వైద్యం భారీ ప్రభావాన్ని ప్రకటిస్తూ- దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 50 కోట్ల దూరవైద్య సంప్రదింపులు నమోదయ్యాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే, లోగడ ఆస్పత్రి వెళ్లాలంటే సుదూరం ప్రయాణించాల్సిన ప్రజలకు కీలక ఆరోగ్య సంరక్షణ ఇప్పుడు వారి అరచేతిలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఈ సదుపాయాలతో ఆరోగ్య రంగంలో సౌలభ్యం కల్పించిన ‘ఇ-సంజీవని’ వేదిక పాత్ర ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. “ఇవాళ డాక్టర్ నేరుగా ప్రజల వాకిటికే చేరారు… ఈ మేరకు అరచేతిలోని మొబైల్ తెరపై అందుబాటులోకి వచ్చారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో ప్రయాణానుభవం ఆధునికీకరణను ప్రశంసిస్తూ- విమానాశ్రయాలలో ‘డిజి యాత్ర’ అనువర్తన విస్తృత వినియోగం, రహదారులపై ‘ఫాస్టాగ్’ అమలు తదితరాల ద్వారా నిరాటంక, నిర్నిరోధ ప్రయాణానికి భరోసా లభించిందని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించార. “సమయం భారీగా ఆదా అవుతోంది.. జీవితం గణనీయంగా సులభమవుతోంది.. కోట్లాది ప్రజలు సురక్షిత ప్రయాణంపై దృష్టి సారిస్తున్నారు” అని శ్రీ మోదీ వివరించారు.
ఎన్నికలలో తక్షణ ప్రయోజనార్థం కాకుండా దీర్ఘకాలిక ఫలితాల ప్రాతిపదికన తీసుకున్న నిర్ణయాల ద్వారానే విప్లవాత్మక వాస్తవ జాతీయ పరిణామం సాధ్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. “వర్తమానం, భవిష్యత్తు.. రెండింటిపైనా నిశితంగా దృష్టి సారిస్తే ఆ నిర్ణయాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తుంది. దేశాన్ని మౌలికంగా మార్చగల అటువంటి నిర్ణయాలకు వీలు కల్పించేది ఆ దృక్కోణమే” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
ఈ సుస్థిర విధానాన్ని విశదీకరిస్తూ- రైతులకు, మధ్యతరగతి ప్రజలకు భారీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే ‘పీఎం కుసుమ్ యోజన’, ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ వంటివాటిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఉచిత విద్యుత్తును మాత్రమే ప్రకటించి ఉంటే- అది భారీ సంచలనంగా మారేదని, తద్భిన్నంగా ప్రభుత్వం 50 లక్షలకు పైగా కుటుంబాలు ఇంటి పైకప్పు మీద సౌరశక్తి ప్లాంట్లపై సబ్సిడీతో అమర్చుకునేలా సాధికార మార్గాన్ని ఎంచుకుందని ఆయన పేర్కొన్నారు. “భారీ, సుస్థిర విద్యుత్ సరఫరా కోసం ప్రతి ఇంటి పైకప్పు మీద సూర్యరశ్మి ప్రసరించేలా మేం నిర్ణయం తీసుకున్నాం” అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
సూర్య ఘర్ పథకం అమలుతో ప్రస్ఫుటమవుతున్న ప్రగాఢ సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని వివరిస్తూ- “పేద కుటుంబాలు తమ విద్యుత్ బిల్లును సున్నా స్థాయికి తేవడమే కాకుండా మిగులు విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా ఆదాయం కూడా పొందుతున్నాయి. తద్వారా ఆధునిక ఉపకరణాల కొనుగోలుకు వీలు కల్పిస్తోంది. మరోవైపు విద్యుత్ కోత ఆలోచన లేకుండా పిల్లలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా, ఈ సూర్య ఘర్ పథకం, దాని వెలుగులు దేశంలోని అనేక కుటుంబాలకు శాశ్వత ప్రయోజనం చేకూరుస్తూనే ఉంటాయి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
దేశంలోని యువత, మహిళలు, రైతులు, మధ్యతరగతి వర్గాల కోసం జీవన-వాణిజ్య సౌలభ్యాన్ని నిరంతరం విస్తరిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. వికసిత భారత్ సంకల్ప సాకారం దిశగా ప్రభుత్వ సంస్కరణల రథం మరింత వేగం పుంజుకుంటుందని భరోసా పలికారు. దేశీయ శక్తిసామర్థ్యాలు ప్రపంచంపై ప్రసరించే ప్రగాఢ ప్రభావాన్ని స్పష్టం చేస్తూ- దేశ ప్రగతి ప్రస్థానాన్ని సురక్షితం చేసుకోవడం ద్వారా అంతర్జాతీయ సమాజానికీ అపార స్థిరత్వం ప్రసాదించగలమని ఆయన ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ- “భారత్ ఎంత స్థిరంగా నిలుస్తుందో.. దేశ భవిష్యత్తు ఎంత సురక్షితంగా ఉంటుందో అంతగా ప్రపంచానికి భద్రత భావననిచ్చే శక్తి ఇక్కడి నుంచే ఉత్పన్నమవుతుంది” అని ఉద్ఘాటిస్తూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.
***
Addressing the Economic Times World Leaders Forum.@EconomicTimes https://t.co/XohLKVrp4h
— Narendra Modi (@narendramodi) August 21, 2026
The world sees India as a bright spot for growth and hope. pic.twitter.com/hyQZKtm1s3
— PMO India (@PMOIndia) August 21, 2026
India is pushing ahead with reforms across sectors. pic.twitter.com/Ne88D6J2Mr
— PMO India (@PMOIndia) August 21, 2026
Our government is rewarding higher production with incentives. pic.twitter.com/sSSnOhatZb
— PMO India (@PMOIndia) August 21, 2026
India has political stability and continuity in its policies. pic.twitter.com/b2e04sCv1H
— PMO India (@PMOIndia) August 21, 2026
A clear roadmap for reforms, with a strong focus on governance. pic.twitter.com/4uyLo5nQ8r
— PMO India (@PMOIndia) August 21, 2026
We are moving from a "Prohibited unless permitted" approach to "Permitted unless prohibited." pic.twitter.com/oGPgib706N
— PMO India (@PMOIndia) August 21, 2026
The relationship between the government and citizens should be based on trust, not suspicion. pic.twitter.com/gDz9nbRYqy
— PMO India (@PMOIndia) August 21, 2026
Today, we are shaping policies that are pro-people, pro-growth and pro-development. pic.twitter.com/MOyLqPoR4W
— PMO India (@PMOIndia) August 21, 2026