Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎన్ ఎమ్ యాప్ ద్వారా వివిధ సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కాల ల‌బ్ధి దారులను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి సంభాషణ కార్యక్రమంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం


స‌మ‌యానికి తెలివైన నిర్ణ‌యాలు తీసుకుంటూ జీవితంలో ఎదుర‌య్యే ప్ర‌తి స‌వాలును ఎదుర్కోవ‌డానికి త‌మ‌ను తాము సిద్ధం చేసుకునే ప్ర‌జ‌లు వీరు. ఈ కార్య‌క్ర‌మం ప‌ట్ల నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది. ఈ రోజు వీరు వెల్లడించే విష‌యాలు దేశంలోని ల‌క్ష‌లాది ప్ర‌జ‌ల‌కు త‌గిన ధైర్యాన్ని ఇస్తాయి. జీవితం శాశ్వ‌తం కాద‌నే విష‌యం మ‌నకు అంద‌రికీ బాగా తెలుసు. రాబోయే క్ష‌ణంలో ఏం జ‌రుగుతుందో, మ‌న జీవితాలలో రేపు ఏం జ‌రగబోతుందో.. మ‌న‌లో ఎవ‌రికీ తెలియ‌దు. జీవితంలో అకస్మాత్తుగా జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌ను, ఎదుర‌య్యే ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డానికి వీలుగా సామాజిక భ‌ద్ర‌త ప‌థ‌కాలు మ‌న‌కు కావల‌సినటువంటి బ‌లాన్ని ఇస్తాయి. ఇప్పుడు వీటి ద్వారా దేశంలోని ల‌క్ష‌లాది మంది ల‌బ్ధిని పొందుతున్నారు. ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న లేదా ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న లేదా అట‌ల్ పింఛ‌న్ పథకం లేదా ప్ర‌ధాన మంత్రి వ‌య వంద‌న యోజ‌న.. ఇలా ప‌లు ప‌థ‌కాల ద్వారా ప్ర‌జ‌లు ప్రయోజనం పొందుతున్నారు.

సామాజిక భ‌ద్ర‌త ప‌థ‌కాలు సామాన్య ప్ర‌జ‌ల‌కు సాధికారితను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా స‌మాజంలో ఆర్ధికంగా వెనుక‌బ‌డిన వారికి అండ‌గా నిలుస్తున్నాయి. వీటి వ‌ల్ల ఆయా వ‌ర్గాల ప్ర‌జ‌లు కష్ట‌కాలాన్ని ఎదుర్కొంటున్నారు. త‌ద్వారా వారు జీవిత యుద్ధంలో ఓడిపోవ‌డ‌మ‌నేది ఆగిపోయింది. మా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు దేశంలోని పేద ప్ర‌జ‌ల‌కు బ్యాంకు ఖాతాలు ఉండేవి కావు. ఆర్ధికంగా ఏదో ఒక ర‌కంగా భ‌రోసా ల‌భించ‌డ‌మ‌నేది ఏమాత్రం వుండేది కాదు.

మేము మూడు విష‌యాల‌ పైన దృష్టి పెట్టాము. బ్యాంకుల‌కు దూరంగా వున్న‌ స‌మాజం లోని ద‌ళితుల‌కు, అణ‌గారిన వ‌ర్గాల‌కు, దోపిడీకి గురైన‌ వారికి, అభాగ్యుల‌కు, గిరిజ‌నుల‌కు, మ‌హిళ‌ల‌కు బ్యాంకు సేవ‌ల‌ను అందజేసి వారికి సాధికారితను కల్పించాల‌నుకున్నాము. అలాగే చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు, చిన్న వ్యాపారుల‌కు ఆర్ధిక సాయాన్ని అంద‌జేయాల‌ని భావించాము. ఇక మూడోది ఆర్ధికంగా భ‌ద్ర‌త‌ లేని వారికి భ‌ద్ర‌తను క‌ల్పించాలని అనుకున్నాము. బ్యాంకుల‌కు దూరంగా ఉన్న‌ వారికి, ఆర్ధిక సాయం లేని వారికి సాయాన్ని, ఆర్ధిక భ‌ద్ర‌త లేని వారికి భ‌ద్ర‌తను చేకూర్చాల‌ని ఇలా మూడు విధాలుగా నిర్ణ‌యాలు తీసుకున్నాము.

ప్ర‌ధాన మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌న అనే ప‌థ‌కాన్ని ప్ర‌పంచ బ్యాంకు ఫైనాన్షియ‌ల్ టాక్స్ రిపోర్ట్ ప్ర‌శంసించింద‌నే విష‌యం తెలిస్తే మీరంద‌రూ ఎంత‌గానో సంతోషిస్తారు. 2014-2017 మ‌ధ్య‌ అంటే ఈ మూడు సంవ‌త్స‌రాల్లో ఈ ప‌థ‌కంలో 28 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు ప్రారంభ‌ం అయ్యాయి. ఆర్ధిక సేవ‌లను అందరి అందుబాటు లోకి తీసుకురావ‌డం జ‌రిగింద‌నే విష‌యాన్ని ప్ర‌పంచ‌ బ్యాంకు గుర్తించి ప్ర‌శంసించింది. ఈ స‌మ‌యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొద‌లైన బ్యాంకు ఖాతాలలో 55 శాతం ప్ర‌ధాన మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌న కింద మొద‌లైన‌వే. అంటే స‌గం కంటే ఎక్కువ ఖాతాలు ఈ ప‌థ‌కం కింద మొద‌లైన‌వే. గ‌తంలో మ‌న దేశంలో ఒక మాట అనే వారు.. ఏక్ బాజూ రామ్ అవుర్‌ ఏక్ బాజూ గావ్.. ఈ మాటలకు ఒక వైపు భార‌త‌దేశం, మ‌రోవైపు యావత్తు ప్ర‌పంచం అని అర్థం.

దీనితో పాటు ప్ర‌పంచ‌ బ్యాంకు నివేదిక లో ఉట్టంకించిన మ‌రో విష‌యాన్ని కూడా చెప్పాలి. 2014లో మా ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క‌ మునుపు భార‌త‌దేశంలో బ్యాంకు ఖాతాలు ఉన్న‌ వారు దాదాపు 50 నుండి 52 శాతం. ఈ సంఖ్య ఈ మూడు సంవ‌త్స‌రాల్లో 80 శాతం మించిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే మ‌హిళా ఖాతాదారుల సంఖ్య బాగా పెరిగింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల్లో సామాజిక భ‌ద్ర‌త ప‌థ‌కాలు ఉన్నాయ‌నే విష‌యం పైన‌, అవి భార‌త‌దేశంలో లేవ‌నే అంశాన్ని సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి చ‌ర్చించుకోవ‌డం జ‌రిగింది.

మేము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన‌ప్పుడు ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. దేశంలో సామాన్య మాన‌వులకు సామాజిక భ‌ద్ర‌త ఉండేది కాదు. భార‌త‌దేశంలో సంప్ర‌దాయ‌బ‌ద్దంగా ఉమ్మ‌డి కుటుంబ వ్య‌వ‌స్థ ఉండేద‌నే వాస్త‌వం అంద‌రికీ తెలిసిందే. ఒక ఇంట్లో పాతిక‌ మంది నుండి 30 మంది వ‌ర‌కు ఒకే చోట నివ‌సించే వారు. ఆ సామాజిక నిర్మాణ‌మే వారికి సామాజిక భ‌ద్ర‌త‌ను కల్పించేది. అయితే కాలక్ర‌మంలో కుటుంబ ప‌రిమాణం త‌గ్గుతూ వ‌చ్చింది. వృద్ధ త‌ల్లితండ్రులు ఒక చోట, వారి పిల్లలు మ‌రో చోట వేరు వేరుగా జీవిస్తున్నారు. సామాజిక వ్య‌వ‌స్థ‌లో మార్పులు వ‌స్తున్నాయి.

ఈ ప‌రిస్థితులలో మార్పును తీసుకురావ‌డానికి ఈ నూత‌న ప‌రిస్థితుల్లో భ‌ద్ర‌తను క‌ల్పించ‌డానికి ప్ర‌ధాన‌ మంత్రి జ‌న్ ధ‌న్ యోజనలో భాగంగా జీవిత రక్షణ, రూపే కార్డు, ప్రమాద రక్షణ పేరులతో బీమా సౌక‌ర్యాన్ని అందిస్తున్నాము. దీనికి తోడు సామాజిక భ‌ద్ర‌త ప‌థ‌కాలపేరు మీద పింఛ‌న్ పథకాన్ని, రెండు బీమా పథకాలను ప్రారంభించ‌డం జ‌రిగింది.

వీటి ఫ‌లితంగా ప్ర‌భుత్వ బీమా పథకం వినియోగ‌దారుల సంఖ్య బాగా పెరిగింది. ఇది 2014లో 4.8 కోట్లు లేదా 5 కోట్ల కంటే త‌క్కువ‌గా ఉంటే ఇప్పుడు ఈ సంఖ్య ప‌దింత‌లు పెరిగింది. సామాజిక భ‌ద్ర‌త పథకంలో భాగంగా ఉన్న వినియోగ‌దారుల సంఖ్య 50 కోట్ల‌కు చేరుకుంది. సామాజిక భ‌ద్ర‌త కార్య‌క్ర‌మాల కింద మొద‌లైన‌ ఈ ప‌థ‌కాలను ప‌లు సంద‌ర్భాల‌ను ఉద్దేశించి రూపొందించ‌డం జ‌రిగింది. వీటికి చెల్లించవలసిన ప్రీమియమ్ చాలా త‌క్కువ‌గా ఉటుంది. త‌ద్వారా స‌మాజం లోని ప్ర‌తి వ‌ర్గం, ప్ర‌తి ప్రాంతం, ప్ర‌తి సముదాయం ఈ ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధిని పొందుతుంది.

ఈ రోజు నేను ఈ ప‌థ‌కాల ల‌బ్ధి దారుల‌తో మాట్లాడ‌బోతున్నాను. ఈ ప‌థ‌కాల గురించి నాకు తెలుసు. ఇవి విషాదానికి, ఆవేద‌న‌కు సంబంధించిన‌వి. ఏది ఏమైన‌ప్ప‌టికీ దుర‌దృష్ట‌క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్న‌ వారికి, విషాద‌క‌ర స‌మ‌యాల‌ను దాటిన‌ వారికి ఈ ప‌థ‌కాలు ఎలా ఉప‌యోగ‌ప‌డ్డాయో, సాయం చేశాయో తెలిస్తే ఈ దేశానికి చెందిన ఇత‌ర పేద ప్ర‌జ‌లు, సామాన్య ప్ర‌జ‌లు వీటి గురించి తెలుసుకుంటే వారు కూడా త‌మ క‌ష్టకాలాన్ని గట్టెక్కడానికి ఈ ప‌థ‌కాల‌ను ఉప‌యోగించుకోవ‌డానికి వీలు క‌లుగుతుంది. బాధాక‌ర‌మైన క్ష‌ణాల‌ను ప‌దే ప‌దే గుర్తు చేసుకోవ‌డం ఆవేద‌నభ‌రిత‌మే.. కానీ అలాంటి ప‌రిస్థితుల్లో ఎవ‌రైనా సాయం పొందితే ఇత‌రులు ఆ అనుభ‌వం గురించి తెలుసుకుంటే అప్పుడు వారు త‌మ‌ను తాము భావి క‌ష్టాల‌ బారి నుండి ర‌క్షించుకుంటారు.

ప్రియ‌మైన నా దేశ ప్ర‌జ‌లారా, ఈ విష‌యాన్ని మీరంద‌రూ గ‌మ‌నించే వుంటారు.. మ‌న కుటుంబ స‌భ్యుడిని కోల్పోతే ఆ న‌ష్టాన్ని పూడ్చ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు. ఈ న‌ష్టాన్ని దేవుడు కూడా పూడ్చ‌లేరు. అయితే ఆ బాధిత కుటుంబం కొంత మేర‌కు ఆర్ధిక సాయాన్ని అందుకుంటే ఈ క‌ష్ట‌కాలంలో అది ఆదుకుంటుంది. ఎంతో కొంత చేయూత ల‌భిస్తే వారు తిరిగి మామూలు జీవితంలోకి రాగ‌లుగుతారు. ఈ ల‌క్ష్యంతోనే ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా ప‌థ‌కాన్ని ప్రారంభించ‌డమైంది.

ఈ ప‌థ‌కం లో భాగంగా అంద‌జేసే జీవిత బీమా సౌక‌ర్యానికిగాను 330 రూపాయలప్రీమియమ్ ను చెల్లిస్తే 2 ల‌క్ష‌ల రూపాయల బీమా ల‌భిస్తుంది. ఈ విషయాన్ని నా దేశ ప్ర‌జ‌లు గ్ర‌హించాలి. ఏడాదికి కేవ‌లం 330 రూపాయలు క‌డితే చాలు. అంటే రోజుకు ఒక రూపాయి చెల్లిస్తే చాలు. ఇంత త‌క్కువ మొత్తానికి ఈ రోజుల్లో మార్కెట్లో మ‌న‌కు ఏమీ ల‌భించ‌డం లేదు. వినియోగ‌దారులు ఈ ప‌థ‌కం ద్వారా తాము ఏ విధంగా ల‌బ్ధి పొంద‌గ‌ల‌మో తెలుసుకోవాలి. ఈ ప‌థ‌కం ద్వారా ఇంత‌వ‌ర‌కూ 5.5 కోట్ల‌ మందికి పైగా ల‌బ్ధి ని పొందారు. ఈ పథ‌కం లో భాగంగా ఇప్ప‌టికే వినియోగ‌దారుల‌కు కోట్లాది రూపాయ‌లు చెల్లించ‌డం జ‌రిగింది. ల‌బ్ధి పొందిన‌ వారిలో కొంత‌మంది ఇక్క‌డ ఉన్నారు. వారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి వారి అనుభ‌వాల‌ను తెలుసుకుందాము.

మ‌నంద‌రికీ తెలుసు, ప్ర‌మాదాల‌నేవి ముందే చెప్పి రావు. సంక్షోభాలు ముందే చెప్పి మ‌న‌ మీద‌కు దాడి చేయ‌వు. బాగా డ‌బ్బున్న‌ వారినే విషాదం చుట్టుముడుతుంద‌ని, పేద‌వాళ్ల‌కు విషాదాలు ఉండ‌వ‌ని ఎక్క‌డా లేదు. అలాగే మీరు బీద‌ వారు క‌దా అని మీకు విషాద‌క‌ర ప‌రిస్థితులు క‌ల‌గ‌వు. ధ‌నంతులు క‌దా అని వారికి దూరంగా విషాద‌ం ఉండ‌దు. ఏ విధంగా తీసుకున్నా అది నిజం కాదు. విషాద‌క‌ర ప‌రిస్థితులనేవి ఎప్పుడైనా క‌ల‌గ‌వ‌చ్చు. ఇలాంటి క‌ష్టాల‌ను ఎదుర్కోవ‌డానికి మ‌న‌ల్ని మ‌నం స‌న్న‌ద్దులం చేసుకోవాలి. మ‌న ఆర్ధిక భ‌ద్ర‌త‌ను మ‌నం ముందే ఏర్పాటు చేసుకోవాలి.

ఈ ల‌క్ష్యంతో ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న ను ప్రారంభించ‌డం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌తి ఏడాది 12 రూపాయ‌ల ప్రీమియమ్ ను చెల్లిస్తే చాలు రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల ప్ర‌మాద ప‌రిహారం ల‌భిస్తుంది. అంటే నెల‌కు ఒక రూపాయి ప్రీమియమ్ ను చెల్లిస్తే సరిపోతుంది. ఇంత‌వ‌ర‌కు దేశంలో 13 నుండి 14 కోట్ల మంది ఈ ప‌థ‌కంలో చేరారు. మెక్సికో, జ‌పాన్ ల జ‌నాభాను తీసుకుంటే ఆ దేశాల జ‌నాభా కంటే మ‌న దేశంలో ఈ బీమా సౌక‌ర్యం క‌లిగిన‌ వారే ఎక్కువ మంది ఉంటారు. ఇంత పెద్ద బీమా రక్షణను, కోట్ల కొద్దీ ప్ర‌జ‌లు ఈ పథకంలో చేర‌డం- అది కూడా అతి త‌క్కువ స‌మ‌యంలో చేర‌డం- చూస్తూ ఉంటే ఈ దేశంలో ప్ర‌జ‌ల‌కు బీమా విలువ‌ను గురించి, దాని ప్ర‌యోజ‌నాలను గురించి త‌గిన చైత‌న్యం ఉన్న‌ట్లే.

ఒక కుటుంబంలో ఎవ‌రైనా కుటుంబ‌ స‌భ్యుడు ప్ర‌మాదానికి గురైతే ఆ వ్య‌క్తి కుటుంబానికి ఆ క్లిష్ట స‌మ‌యం పెను స‌వాలుగా మారుతుంది. వారి క‌ల‌ల‌న్నీ క‌ల్ల‌లు అవుతాయి. వ‌చ్చే సంవ‌త్స‌రం బీమా తీసుకుందామ‌ని ఎవ‌రైనా భావించినా, లేదా రాబోయే మూడు సంవ‌త్స‌రాల్లో తీసుకుందామ‌ని అనుకున్నా.. ఇలాంటి ఆలోచ‌న‌ల‌న్నీ ఎలాంటి ఫ‌లితం ఇవ్వ‌వు. అంతే కాదు సాధార‌ణంగా ప్ర‌జ‌లు బీమా సౌక‌ర్యార‌న్ని తీసుకోకుండా నిర్ల‌క్ష్యం వహిస్తుంటారు. కొన్నిసార్లు వాళ్లు ఇలా అంటారు.. ‘ముందు ముందు బీమాను తీసుకుంటాను. త‌ప్ప‌కుండా తీసుకుంటాను. చాలా స‌మ‌యం వుంది క‌దా. ఇప్పుడు బీమా అవ‌స‌రం ఏముంది ?’.. ఇలాగ అనుకుంటూ ఉంటారు. ఈ రోజున మొత్తం దేశ‌మంతా దీన్ని గ‌మ‌నిస్తూంది. బీమాకు సంబంధించిన ఈ ఆలోచ‌న‌లలో మార్పు రావాలి. సామాజిక భ‌ద్ర‌త కార్య‌క్ర‌మాలలో ఇంకా మ‌రెంతో మంది చేరాలి.

కొన్ని రోజుల క్రితం, రోజువారీ కూలీ ప‌ని చేసుకునే వారు బీమా ను గురించి ఏమాత్రం ఆలోచించే వారు కాదు. బీమా ప్రీమియమ్ అనేది వారికి అడ్డంకిగా ఉండ‌డం వ‌ల్ల వారు ఆ ప‌ని చేయ‌లేక‌పోయే వారు. చేతిలో వున్న డ‌బ్బును వ‌ర్తమాన అవ‌స‌రాల‌కు వాడాలా లేక భ‌విష్య‌త్తు ను భ‌ద్రంగా ఉంచుకోవ‌డానికి వినియోగించుకోవాలా ? అనే సందేహం వారిలో ఉండేది. కాయగూరలు అమ్ముకునే వారు, ఆటో రిక్షా కార్మికులు, దిన‌స‌రి వేతన కూలీలు.. ఇంకా చిన్న చిన్న ప‌నులు చేసి ఎలాగోలా జీవితాన్ని గ‌డిపే వారు.. బీమా తీసుకోవ‌డం కాదు దాని గురించి ఆలోచించ‌డం కూడా అసాధ్య‌మే.

ఈ రోజు ఈ అసాధ్య‌మైన పనిని సాధ్యం చేయ‌డం జ‌రిగింది. మ‌న ద‌ళితుల‌ కోసం, అణ‌గారిన వ‌ర్గాల‌ కోసం, దోపిడీకి గుర‌వుతున్న వారి కోసం, వెన‌క‌బ‌డిన వ‌ర్గాల‌ కోసం, పేద ప్ర‌జ‌ల‌ కోసం, మ‌న సోద‌రీమ‌ణుల‌ కోసం, బిడ్డ‌ల‌ కోసం దీనిని సాధ్యం చేయ‌డం జ‌రిగింది. నెల‌కు ఒక రూపాయి ప్రీమియమ్ ను చెల్లిస్తే చాలు బీమా సౌక‌ర్యాన్ని అందివ్వ‌డం జ‌రుగుతోంది. దేవుని మీద భారం వేసి జీవితాన్ని గ‌డుపుతున్న అత్యంత నిరుపేద‌ల‌కు కూడా బీమా సౌక‌ర్యం వ‌ర్తిస్తుంది. ఇప్పుడు మ‌రింత మంది గురించి మాట్లాడుదాము.

వృద్ధుల‌ను తీసుకుందాము. జీవితంలో వృద్ధాప్యం అనేది చాలా ముఖ్య‌మైన కాలం. అనేక అవ‌స‌రాల‌ కోసం మ‌నం ఇత‌రుల మీద ఆధార‌ప‌డే స‌మ‌యం మ‌న జీవితంలో ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో జీవ‌నం గ‌డ‌ప‌డానికిగాను పింఛ‌న్ సౌక‌ర్యాన్ని రూపొందించ‌డం జ‌రిగింది. త‌ద్వారా ఆర్ధికంగా సొంత కాళ్ల మీద నిల‌బ‌డి వృద్ధాప్యంలో జీవించ‌వ‌చ్చు. మా ప్ర‌భుత్వానికి మ‌న పెద్ద‌ల ఆశీర్వాదాలు ల‌భిస్తాయ‌ని ఆశిస్తున్నాను. వారి ఆశీర్వాదాల‌తో దేశ ప్ర‌గ‌తి కోసం మా కృషిని కొన‌సాగించ‌గ‌ల‌మ‌ని భావిస్తున్నాను. మా ప్ర‌భుత్వం దేశం లోని వయోవృద్ధ పౌరుల సంక్షేమం కోసం నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేస్తోంది. అందుకే మా ప్ర‌భుత్వం వారి జీవితాలు ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా కొన‌సాగేందుకు వీలుగా వారి ఆర్ధిక స‌మ‌స్య‌ల‌ను, ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తోంది.

వృద్ధాప్యంలో వచ్చే స‌మ‌స్య‌ల తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని మా ప్ర‌భుత్వం గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో అనేక విధానాల‌ను, ప‌థ‌కాల‌ను రూపొందించింది. గ‌త ఏడాది మా ప్ర‌భుత్వం ప్ర‌ధాన మంత్రి వ‌య వంద‌న యోజనను ప్రారంభించింది. 60 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికి ఈ ప‌థ‌కం లో ప‌ది సంవత్సరాల పాటు గ్యారంటీ గా 8 శాతం రిట‌ర్న్‌ లను చెల్లించ‌డం జ‌రుగుతుంది. వ‌డ్డీ లో వ‌చ్చే హెచ్చు త‌గ్గులు ఈ ప‌థ‌కం పైన ప్ర‌భావాన్ని చూప‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాము.

రిట‌ర్న్‌లు 8 శాతం కంటే త‌క్కువ‌గా ఉంటే ఆ తేడా ను ప్ర‌భుత్వ ఖ‌జానా నుండి భ‌ర్తీ చేయడం జరుగుతుంది. ఈ ప‌థ‌కం కింద వయోవృద్ధ పౌరులు ప్ర‌తి మాసం గానీ, మూడు నెల‌లకు ఒక‌సారి గానీ, ఆరు నెల‌ల‌కు ఒక‌సారి గానీ లేదా సంవ‌త్స‌రానికి ఒక‌సారి గానీ రిట‌ర్న్‌లను తీసుకోవ‌చ్చు. ఈ ప‌థ‌కంలో సీనియ‌ర్ సిటిజన్ లు 15 ల‌క్ష‌ల రూపాయల దాకా పెట్టుబ‌డిగా పెట్ట‌వ‌చ్చు. ఇంత‌వ‌ర‌కు దేశంలో 3 ల‌క్ష‌ల మందికి పైగా సీనియ‌ర్ పౌరులు ఈ ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. దీనికి తోడు మా ప్ర‌భుత్వం మ‌న సీనియ‌ర్ సిటిజ‌న్ లకు ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తోంది. ఒక సంవత్సరానికి ప‌న్ను మిన‌హాయింపును 2.5 ల‌క్ష‌ల‌ రూపాయల నుండి 3 ల‌క్ష‌ల‌ రూపాయలకు పెంచ‌డం జ‌రిగింది. అంతే కాదు వ‌డ్డీ ఆదాయాన్ని త‌గ్గించే ప‌రిమితిని 10 వేల‌ రూపాయల నుండి 50 వేల‌ రూపాయలకు పెంచ‌డం జ‌రిగింది. దీని అర్థం సీనియ‌ర్ సిటిజన్ ల డిపాజిట్ లకు సంబంధించి 50 వేల‌ రూపాయల వర‌కు వ‌చ్చే వ‌డ్డీ ఆదాయంపైన ఎలాంటి ప‌న్ను లేకుండా మిన‌హాయించ‌డం జ‌రిగింది.

సీనియ‌ర్ సిటిజ‌న్ ల మేలు కోసం ఇంత‌వ‌ర‌కూ అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలన్నింటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు వ‌స్తాయి ? సంఖ్యల‌ను చూస్తే దీనికి సంబంధించి కొన్ని విష‌యాలు తెలుస్తాయి. మా ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క ముందు 2013-14లో 5 ల‌క్ష‌ల రూపాయల ఆదాయం వ‌చ్చే ఒక సీనియ‌ర్ సిటిజ‌న్.. 13 వేల రూపాయలు లేదా 13,500 రూపాయలు లేదా దాదాపు 13,390 రూపాయలను ప‌న్ను రూపంలో చెల్లించవలసి వ‌చ్చేది. మా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఈ మొత్తం ఫార్ములా లో మార్పులు చేశాము.

2018-19లో ఈ ప‌న్ను 2,600 రూపాయలకు చేరుకుంది. అంటే గ‌తంలో ఈ ప‌న్ను 13 వేల రూపాయలు ఉంటే ఇప్పుడు ఇది 2,600 రూపాయలకు చేరుకుంది. దీని అర్థం ఈ ప‌న్ను మూడింత‌లు త‌గ్గింది. ఇది ఎంతో పెద్ద మార్పు. సీనియ‌ర్ సిటిజ‌న్ ల సంక్షేమానికి సంబంధించిన స‌మ‌స్య‌ల విష‌యంలో ఎలాంటి ఆర్ధిక ప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌ణాళికాబ‌ద్దంగా వ్య‌వ‌హ‌రించింది.

వృద్ధాప్యం మొద‌లైందంటే చాలు, ప్ర‌తి ఒక‌రికి ఆరోగ్య సంబంధ‌మైన స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతుంటాయి. చికిత్స‌ల‌ కోసం, మందుల‌ కోసం చేసే వ్య‌యం పెరుగుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని జ‌న ఔష‌ధి ప‌థ‌కాన్ని ప్రారంభించ‌డం జ‌రిగింది. దీని ద్వారా అంద‌రికీ అందుబాటు ధ‌ర‌లలో ఉండేలా మందుల‌ను అందించ‌డం జ‌రుగుతుంది. అదే విధంగా స్టెంటుల ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డం జ‌రిగింది. గ‌తంతో పోలిస్తే మోకాలి శస్త్ర చికిత్సలకు
అయ్యే ఖ‌ర్చు త‌గ్గిపోయింది.

తాము బ‌తికే ఉన్నామ‌ని తెలియ‌జేయ‌డానికిగాను గ‌తంలో వృద్ధులు స్వ‌యంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాలకు వెళ్లవలసి వ‌చ్చేది. ఇప్పుడు జీవ‌న ప్ర‌మాణాలను పెంచే సౌక‌ర్యాల కార‌ణంగా అనేక ప‌నులు సులువు అవుతున్నాయి. సీనియర్ సిటిజ‌న్ లకు ఉప‌యోగ‌ప‌డేలా నేడు మేము వారికి అనేక సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తున్నాము. అవి సుల‌వుగా, అనుకూలంగా ఉండేలా చూస్తున్నాము. త‌ద్వారా వారు ఇక్క‌డికి అక్క‌డకు తిర‌గవలసిన అవ‌స‌రం ఉండ‌దు. అంతే కాదు ఆరోగ్యంగా, ఆత్మాభిమానంతో జీవించ‌వ‌చ్చు. ఈ దిశ‌గా మేము చ‌ర్య‌లు తీసుకొని వారికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము.

సీనియ‌ర్ సిటిజ‌న్ లు ఎవ‌రిమీదా ఆధార‌ప‌డ‌కుండా వారి జీవితాన్ని వారు ఎంతో గౌర‌వ‌ప్ర‌దంగా గ‌డ‌పాలి. వారికి ప్ర‌తి నెలా కొంత డ‌బ్బు పింఛ‌న్ రూపంలో అందుతుండాలి. ఇందుకోసం ప్ర‌భుత్వం అట‌ల్ పింఛ‌న్ స్కీమును మొద‌లుపెట్టింది. ఈ ప‌థ‌కం లో ఇప్ప‌టి వ‌ర‌కూ 4 కోట్ల‌ మందికి పైగా న‌మోద‌యి వున్నారు. వీరిలో 40 శాతం మంది మ‌న సోద‌రి అర్చ‌న లాంటి మ‌హిళ‌లు ఉన్నారు. ఈ ప‌థ‌కం లో భాగంగా ఒక్కొక్క‌రికి 4 వేల రూపాయలను డిపాజిట్ చేయ‌డం జ‌రుగుతోంది.

గ‌త మూడు సంవ‌త్స‌రాల్లో మేం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను స‌మ‌గ్రంగా తీసుకున్న‌ప్పుడు దాదాపు 20 కోట్ల‌ మంది బీమా సౌక‌ర్యం పరిధిలోకి వ‌చ్చారు. వారి భ‌విష్య‌త్తును ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న‌, ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి యోజ‌న‌, అట‌ల్ పెన్షన్ స్కీముల‌ ద్వారా ఈ సౌక‌ర్యాల‌ను అందిస్తున్నాము. ఈ ల‌బ్ధి దారుల్లో స‌గానికి పైగా గ్రామీణ ప్రాంతాల‌నుంచి వ‌చ్చిన‌ వారే.

ప్రతి ప‌థ‌కం వెనుక రెండు ముఖ్య‌మైన అంశాలు ఉంటాయి. ఒకటోది ప్ర‌తి ఒక‌్కరు బీమా రక్షణను పొందాలి. అంతే కాదు వారు దానిని అతి త‌క్కువ ప్రీమియానికి పొందాలి. త‌ద్వారా స‌మాజంలో అత్యంత నిరుపేద‌లు కూడా ప్రయోజనం పొందుతారు. పేద ప్ర‌జ‌ల విష‌యంలో మా ప్ర‌భుత్వం చాలా సున్నితంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. మా ప్ర‌భుత్వం పేద ప్ర‌జ‌ల సంక్షేమంపైన దృష్టి పెట్టింది. వారికి సాధికారితను కల్పించడం కోసం సుస్థిరంగా ప‌ని చేస్తోంది.

మ‌నం ఇప్పుడే వివిధ పథకాల ల‌బ్ధిదారుల‌ నుండి విన్నాము.. ప్ర‌భుత్వం చేప‌డుతున్న వివిధ ప‌థ‌కాల ద్వారా వారి కుటుంబాలు ఎలాంటి ఆర్ధిక మ‌ద్ద‌తు పొందాయో తెలుసుకున్నాము. క‌ష్ట‌ కాలంలో ఈ మ‌ద్ద‌తు ఎలా ల‌భించిందో చూశాము.

వారి గాథలు మ‌నంద‌రికీ స్ఫూర్తిని ఇస్తాయ‌ని నేను న‌మ్ముతున్నాను. మ‌నకు అంద‌రికీ బీమా సౌక‌ర్యం ఎంత ముఖ్య‌మో దీని ద్వారా తెలుస్తోంది. మీరంతా ఈ బీమా ప‌థ‌కాల‌ నుండి ప్ర‌యోజ‌నం పొందాల‌ని మీ అంద‌రికీ నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. మీ చుట్టుప‌క్క‌ల ఉన్న‌ వారికి, మీ కార్యాలయాలలో ఉన్న‌ వారికి ఈ ప‌థ‌కాలను గురించి తెలియ‌జేయండి. వీటి ద్వారా ల‌బ్ధి ని పొంద‌ండంటూ వారిని ప్రోత్స‌హించండి.

ఇక్క‌డ ఈ స‌మావేశానికి హాజ‌రైన ల‌బ్ధిదారులంద‌రూ ఈ ప‌థ‌కాల వ‌ల్ల చేకూరే ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించి స‌జీవ సాక్ష్యాలు. మీ అంద‌రినీ నేను అభ్య‌ర్థిస్తున్నాను.. మీరు మీ చుట్టుప‌క్క‌ల ఉన్న‌ వారిని ప్రోత్స‌హించి వారు ఈ ప‌థ‌కాల‌ను ఉప‌యోగించుకునేలా చూడ‌గ‌ల‌రు. బ్యాంకులలో గాని, తపాలా కార్యాలయాలలో గాని ప్ర‌ధాన మంత్రి సుర‌క్ష బీమా యోజ‌న‌, ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న ల‌లో మీరు మీ పేర్ల‌ను న‌మోదు చేసువ‌చ్చు. ఏదైనా బ్యాంకు శాఖకు వెళ్లి అక్క‌డ అట‌ల్ పింఛ‌న్ స్కీములో మీ పేరును న‌మోదు చేసుకోవ‌చ్చు. దేశంలో ఏదో ఒక ఎల్ ఐసి కార్యాల‌యాన్ని సంద‌ర్శించి ప్రధాన మంత్రి వ‌య వంద‌న యోజ‌న ప‌థ‌కంలో చేర‌వ‌చ్చు.

మీకు మ‌రొక్క విష‌యాన్ని చెప్పాల‌ని అనుకుంటున్నాను.. సీనియ‌ర్ సిటిజ‌న్ లు గౌర‌వ‌ప్ర‌దంగా జీవించ‌డానికి వీలుగా ఎలాంటి ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయో చూడండి. ఇందుకోసం ప‌థ‌కాలు ఉన్నాయి. మ‌న దేశ సీనియ‌ర్ సిటిజ‌న్ లు ఎంతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన వారు. వారు త‌రువాతి త‌రాల‌కు ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారు. మీకు ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు ఎందుకంటే దీనిని గురించి బయట చ‌ర్చ చేయ‌డం లేదు. నేను ఎర్ర‌ కోట‌ నుండి ప్ర‌సంగిస్తూ వంట‌గ్యాస్ స‌బ్సిడీకి సంబంధించి ఒక ప్ర‌క‌ట‌న చేశాను. గ్యాస్ స‌బ్సిడీ అవ‌స‌రం లేని వారు దానిని వ‌దిలేయాల‌ని కోరాను. దేశంలోని ఒక కోటీ ఇరవైఅయిదు ల‌క్ష‌ల మంది గ్యాస్ స‌బ్సిడీని వ‌దులుకున్నారు.

రైల్వే టికెట్ల విష‌యంలో ప్ర‌స్తుతం మ‌న సీనియ‌ర్ సిటిజ‌న్ లు కొంత‌మేర‌కు ల‌బ్ధి పొందుతున్నారు. అయితే రైల్వే శాఖ రిజ‌ర్వేష‌న్ ఫార‌మ్‌లో ఈ విష‌యాన్ని పొందుప‌రచింది. మీరు స‌బ్సిడీని వ‌దిలేయాల‌ని అనుకుంటున్నారా ? అని అడుగుతోంది. మీరు మీ టికెట్ కు సంబంధించి మొత్తం డ‌బ్బును చెల్లించాల‌ని అనుకుంటున్నారా ? అని అడుగుతోంది.

ఈ విష‌యంలో మ‌నంద‌ర‌మూ గ‌ర్వించాలి. దేశంలోని ల‌క్ష‌లాది మంది సీనియ‌ర్ సిటిజ‌న్ లు రైల్వే స‌బ్సిడీ సౌక‌ర్యాన్ని వ‌దులుకోవ‌డానికి ముందుకు వ‌చ్చారు. రైలు టికెట్ విష‌యంలో స‌బ్సిడీని వ‌దులుకుంటున్నారు. వారి ప్ర‌యాణానికి సంబంధించి పూర్తి మొత్తాన్ని చెల్లిస్తున్నారు. దీనికి సంబంధించి బహిరంగంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌కుండానే, ప్ర‌చారం చేయ‌కుండానే, ఎక్క‌డా చ‌ర్చ చేయ‌కుండానే స్వ‌చ్ఛందంగా స‌బ్సిడీని వ‌దులుకోవ‌డం జ‌రుగుతోంది. దీనిని కేవ‌లం రిజ‌ర్వేష‌న్ ఫార‌మ్ మీద అడుగుతున్నాము. గౌర‌వ‌ప్ర‌దంగా జీవిస్తున్న మ‌న సీనియ‌ర్ సిటిజ‌న్ లు చాలా పెద్ద త్యాగం చేస్తున్నారు. ఇది దేశానికి సంబంధించి చిన్న వార్త కాదు.

మ‌న దేశ ప్ర‌జ‌లు ఇలాంటి ప‌నులు ఎన్నెన్నో చేస్తుంటే, మ‌న సీనియ‌ర్ సిటిజ‌న్ లు ఇలాంటి త్యాగాలు చేస్తుంటే, మ‌నంద‌ర‌మూ కూడా ఏదో ఒక‌టి చేయాల‌ని భావిస్తుంటే, మీకోసం ప్ర‌తిరోజూ ఏదో ఒక మంచి జ‌రుగుతూనే ఉంటుంది. ద‌య‌చేసి ముందుకు రండి. పేద ప్ర‌జ‌ల సంక్షేమం కోసం పాటుప‌డ‌డం కొన‌సాగుతుంది. త‌ద్వారా మ‌న మాతృమూర్తుల‌ కోసం, సోద‌రీమ‌ణుల‌ కోసం సంక్షేమ కార్య‌క్ర‌మాలను చేప‌ట్ట‌వ‌చ్చు. త‌ద్వారా మ‌న సీనియ‌ర్ సిటిజ‌న్ లు, కురు వృద్ధులు.. గౌర‌వ‌నీయ వ్య‌క్తులు అంతా గౌర‌వ‌ మ‌ర్యాద‌ల‌తో కూడిన జీవితాన్ని గ‌డ‌ప‌డానికి అవ‌కాశం ల‌భిస్తుంది. మీ అంద‌రికీ మ‌రోసారి నా మన:పూర్వకమైన కృత‌జ్ఞ‌తలను తెలియ‌జేస్తున్నాను.

మీకు ఇవే ధన్యవాదాలు.