పిఎంఇండియా
ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ వేడుకలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ఈ వేడుకకు ఉన్న భావోద్వేగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. క్యాంపస్‌లోని ఉత్సాహభరితమైన, కలలతో నిండిన వాతావరణాన్ని గుర్తు చేసుకున్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో వర్చువల్‌గా హాజరైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ… పట్టభద్రులైన విద్యార్థులతో నేరుగా ఈ కార్యక్రమానికి హాజరవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. “ఇవాళ క్యాంపస్‌లో మీతో ఈ అద్భుతమైన అనుభవాన్ని పంచుకోవటం నాకు కూడా ఎంతో ప్రత్యేకం” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
విద్యపరంగా సాధించిన విజయాల పట్ల విద్యార్థులకు, వారి కుటుంబాలకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ఈ పట్టాలు కేవలం విద్యాపరమైన విజయం మాత్రమే కాదని, దేశానికి సేవ చేయాలనే బాధ్యతకు ప్రతీకలని స్పష్టం చేశారు. పతకాలు సాధించిన వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. క్యాంపస్‌లో కృత్రిమ మేధకు సంబంధించిన నూతన కార్యక్రమాల ప్రారంభాన్ని కొనియాడారు. “మీరు దేశానికి ఎంతో సేవ చేయాలనే కలతో ఇక్కడి నుంచి బయటకు అడుగుపెడుతున్నారు” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఓరియంటేషన్ రోజు నుంచి స్నాతకోత్సవం వరకు జరిగిన విద్యార్థుల ప్రయాణాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. మొదటి జీతాలు అందుకోవటం, అంకుర సంస్థలను ప్రారంభించటం నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమవటం వరకు విద్యార్థుల్లోని విభిన్న ఆకాంక్షలను ఆయన ప్రస్తావించారు. “జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనే ఉత్సాహంతో, ఈ అద్భుతమైన ప్రయాణం పట్ల మీరు సంతృప్తితో ఉండాలి” అని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.
ప్రస్తుత క్షణాలను ఉత్సాహంతో గడపాలని విద్యార్థులను ప్రోత్సహిస్తూ… కుమాన్, అరా, కరా, వింధ్య, నీలగిరి, కైలాష్, హిమాద్రి హాస్టళ్ల మధ్య ఉండే సరదా పోటీలు, జియా సరాయ్ పోహా, సత్పురా మెస్ పరాఠాల వంటి స్థానిక రుచికరమైన వంటకాలను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. “భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయి బాధ్యతలను నిర్వర్తించే సమయంలో, ఇక్కడి జ్ఞాపకాలు మీకు ఖచ్చితంగా నూతనోత్తేజాన్ని కలిగిస్తాయి” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
విద్యాసంస్థ అందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలుపుతూ… సహచరులు, అధ్యాపకులు, మార్గదర్శకులు, సహాయక సిబ్బందిని గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులు జీవితాంతం ఉండే ఆస్తులుగా, రెండో కుటుంబంగా భావించాలని ప్రధానమంత్రి కోరారు. “భవిష్యత్తులో మీరు సాధించే ప్రతి విజయంలో ఈ వ్యక్తులందరినీ గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతతో ఉండాలి” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రపంచంలో వేగంగా మారుతున్న భౌగోళిక-రాజకీయ పరిస్థితులకు, వ్యూహాత్మక మార్పులకు సాంకేతిక రంగంలో వస్తున్న వేగవంతమైన పురోగతే ప్రధాన కారణమని ప్రధానమంత్రి తెలిపారు. శరవేగంగా మారుతున్న ఈ కాలాన్ని… సవాళ్లు, సరికొత్త అవకాశాల సమ్మేళనంగా అభివర్ణించారు. “ఈ మార్పుల మధ్య నా మాటను గుర్తుంచుకోండి. నిరంతరం నేర్చుకునే తత్వమే అంతిమంగా విజయాన్ని అందిస్తుంది” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఐఐటీ డిగ్రీ కేవలం ఉత్తమ సీజీపీఏ లేదా అధిక వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలకు మాత్రమే పరిమితం కాదని… సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించగల సత్తాకు ప్రపంచ స్థాయి గుర్తింపని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. “క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు మీకు తెలుసని మీ డిగ్రీ ప్రపంచానికి చాటి చెబుతుంది” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
విద్యా రంగంలో పట్టుదలతో సాధించే విజయాల లాగానే జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను కూడా చిన్న భాగాలుగా విభజించి, విశ్లేషిస్తే పరిష్కారాలు లభిస్తాయని యువతకు ప్రధానమంత్రి సూచించారు. “జీవితంలో కష్టాలతో పాటు నూతన అవకాశాలు కూడా వస్తాయి. వాటిని అందుకునేందుకు మీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి” అని శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
విద్యా వాతావరణానికి, వాస్తవ ప్రపంచ పరిస్థితులకు మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ… విశ్వవిద్యాలయ పరీక్షల్లా కాకుండా జీవితంలో వచ్చే అసలైన సవాళ్లు పాఠ్యపుస్తకాలు దాటి ఉంటాయని ప్రధానమంత్రి తెలిపారు. ముందుగా నిర్ణయించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంలోనే కాక, సమాజం నిర్లక్ష్యంగా అంగీకరించిన సమస్యలను గుర్తించి పరిష్కరించటంలోనే నిజమైన విజయం దాగి ఉంటుందని స్పష్టం చేశారు. “ప్రపంచం ప్రశ్నలుగా పరిగణించటం మానేసిన అంశాలను ధైర్యంగా గుర్తించటమే చాలామంది పూర్వ విద్యార్థుల విజయానికి ప్రధాన కారణం” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
గత తరాలు మోపిన చారిత్రక భారం గురించి మాట్లాడుతూ… స్వాతంత్ర్యం సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఎన్నో త్యాగాలు, కఠోర దీక్షతో సుదీర్ఘమైన శకం కొనసాగిందని అన్నారు. రాబోయే మూడు దశాబ్దాల్లో దేశాభివృద్ధి లక్ష్యాలతో వృత్తిపరమైన మార్గాలను అనుసంధానించుకోవటం ద్వారా వారసత్వాన్ని నిర్వచించుకోవాలని యువతకు సవాలు విసిరారు. “ప్రతీ నిర్ణయం వెనుక దేశానికి కలిగే ప్రయోజనం, నెరవేరే జాతీయ అవసరమే ప్రాతిపదికగా ఉండాలని” శ్రీ నరేంద్ర మోదీ సూచించారు.
ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో దేశాన్ని సమగ్ర స్వయంసమృద్ధి వైపు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ నిర్మాణానికి యువత సాధికారతే బలమైన పునాది అని చెప్పారు. గతంలో కేవలం ప్రభుత్వాలకే పరిమితమైన కీలక రంగాలను యువ ఆవిష్కర్తల కోసం తెరిచేలా తమ ప్రభుత్వం వ్యూహాత్మక విధానపరమైన నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ‘‘దేశంలో యువత ఎంత సాధికారత సాధిస్తే… యావత్ భారత్ అంత బలోపేతం అవుతుంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రభుత్వం తెచ్చిన వ్యూహాత్మక సంస్కరణల కారణంగా అంతరిక్ష రంగంలో అనూహ్యమైన వృద్ధి నమోదైందని ప్రధాని శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు. గతంలో ప్రపంచంలో కేవలం కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైన సొంత రాకెట్ల రూపకల్పన, ప్రయోగాలను.. ఈరోజు మన దేశానికి చెందిన యువ ఇంజనీర్లు విజయవంతంగా చేసి చూపిస్తున్నారని కొనియాడారు. ‘‘ఒకప్పుడు పరిమితంగా ఉన్న అంతరిక్ష రంగం నేడు మన దేశంలోని వేలాది మంది యువతకు సరికొత్త అవకాశాలు అందించే అద్భుతమైన ఆకాశంగా మారిపోయింది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
దేశీయంగా సెమీకండక్టర్ల తయారీలో సాధిస్తున్న వేగవంతమైన పురోగతిని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో దీనిపై వ్యక్తమైన సందేహాలను పటాపంచలు చేస్తూ… దేశంలో తొలి ఉత్పత్తి యూనిట్లు ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయని, ఇది జాతీయ ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచిందని చెప్పారు. ‘‘ఈరోజు మన దేశంలో ఒక యువకుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో… ‘‘భారత్‌లో సొంతంగా ఒక చిప్‌ను తయారు చేసిన మొదటి తరం నాదే‘ అని గర్వంగా చెప్పుకుంటున్నాడు’’ అని శ్రీ మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
దేశంలో డ్రోన్ రంగం తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను ప్రధాని వివరించారు. వ్యవసాయం, వైద్య సేవలు అందించడం మొదలుకొని దేశ రక్షణ రంగం వరకు అన్ని చోట్లా యువ ఆవిష్కర్తలు డ్రోన్ సాంకేతికతతో అద్భుతాలు సృష్టిస్తున్నారని చెప్పారు. ‘‘నేడు నూతన ఉత్సాహంతో దూసుకుపోతున్న యువత ఈ రంగంలో నమ్మశక్యం కాని సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నారు’’ అని శ్రీ మోదీ చెప్పారు.
దేశంలో కొనసాగుతున్న అద్భుతమైన అంకుర సంస్థల విప్లవానికి ప్రస్తుత యువతరమే ప్రధాన కారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. దేశంలో యూనికార్న్‌లు, డిజిటల్ చెల్లింపులు, ఫిన్‌టెక్ రంగాల విస్తరణ వల్ల ఆర్థిక రంగంలో మునుపెన్నడూ లేని వేగం వచ్చిందని అన్నారు. ఇది లక్షలాది మందికి సరికొత్త వ్యాపార వేదికలను కల్పించిందని చెబుతూ, తద్వారా ఏర్పడిన అపారమైన ఆర్థిక వేగాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రసాతావించారు. ‘‘ఈ విప్లవాత్మక మార్పులన్నీ దేశంలోని లక్షలాది మంది యువతకు సరికొత్తగా ఎదగడానికి, మొదటిసారిగా ఏదైనా సరికొత్త ఆవిష్కరణ చేయడానికి అద్భుతమైన అవకాశాలను ఇచ్చాయి’’ అని ప్రధాని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
రాబోయే కాలంలో ప్రపంచ సాంకేతిక రంగంలో భారత్ ఆధిపత్యం సాధించేందుకు అవసరమైన కీలక రంగాలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కృత్రిమ మేధ, డేటా సెంటర్లు, కీలక ఖనిజాలు, లోతైన సముద్ర అన్వేషణ, క్వాంటం కంప్యూటింగ్, ఇంధన భద్రత వంటి భవిష్యత్తు రంగాల గురించి ఆయన మాట్లాడారు. ‘‘ఇలాంటి ఎన్నో అత్యాధునిక రంగాలు మీ అపారమైన ప్రతిభ కోసం, మీ సాహసోపేతమైన ఆవిష్కరణల కోసం, మీ బలమైన నాయకత్వం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి’’ అని యువతను ఉద్దేశించి ప్రధాని అన్నారు.
దేశంలో అధునాతన పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్, దాదాపు లక్ష కోట్ల రూపాయల భారీ నిధుల లక్ష్యంతో ఏర్పాటు చేసిన అనుసంధాన్ నేషన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) వంటి పటిష్టమైన మద్దతు వ్యవస్థలను ఆయన గుర్తుచేశారు. ‘‘ రోజు దేశానికి కొత్త పరిశోధనలు ఎంతగానో అవసరం. అందుకే మా ప్రభుత్వ పరిపాలనా దృష్టి పూర్తిగా పరిశోధనపైనే ఉంది’’అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
విద్యా వనరులు, పరిశోధనా పత్రాలను దేశంలోని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానమంత్రి వివరించారు. ఇందులో భాగంగా ‘వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్’ (ఒకే దేశం ఒకే చందా) కార్యక్రమాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పరిశోధన పత్రికలు, దేశంలోని చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లో ఉండే వారికి కూడా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అందుబాటులోకి వస్తాయని ప్రధాని శ్రీ మోదీ చెప్పారు. దేశంలో పరిశోధనల రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని, ఈ విషయంలో యువతపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు. ‘‘దేశంలో పరిశోధనలకు సంబంధించిన ఈ అద్భుతమైన మహత్కార్యం మీ అందరి అచంచలమైన కృషి, నిశ్చయమైన నిబద్ధత ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది’’అని స్పష్టం చేశారు.
ఈ సోషల్ మీడియా యుగంలో విద్యార్థులు తప్పుదోవ పట్టకుండా ప్రధాని శ్రీ మోదీ ఒక కీలకమైన సలహా ఇచ్చారు. ఉద్యోగాల్లో వచ్చే జీతాలు, ఉద్యోగ నియామకాలు, అంకుర సంస్థల విజయాలను తమ తోటివారితో పోల్చుకుని మానసిక ఒత్తిడికి గురికావద్దని పట్టభద్రులకు సూచించారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెడుతూ, స్వీయ అభివృద్ధి కోసం శ్రమించాలని కోరారు. ‘‘జీవితం అనేది ఎప్పటికీ ఒక లీడర్-బోర్డు కాదు… మీ అసలైన పోటీ ఇతరులతో కాదు, మీతోనే అనేది గుర్తుంచుకోండి’’ అని ప్రధాని హితవు పలికారు.
డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, వారికి మార్గనిర్దేశం చేసిన విద్యాసంస్థల సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ‘‘యువత భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండాలని, వారు నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను’’ అని పేర్కొంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
Delighted to join the Convocation Ceremony of IIT Delhi. My best wishes to all the graduating students.@iitdelhi https://t.co/Lhuq4yUzJW
— Narendra Modi (@narendramodi) August 8, 2026
Those who learn, win! pic.twitter.com/lWCEzFLeNL
— PMO India (@PMOIndia) August 8, 2026
Keep your curiosity alive in life… Keep your learning instinct alive. pic.twitter.com/nsPmpNlRfk
— PMO India (@PMOIndia) August 8, 2026
Today, India is working towards becoming self-reliant in every sector. pic.twitter.com/D3a2CSPHWY
— PMO India (@PMOIndia) August 8, 2026
Today, new sectors are emerging in the country for our youth. pic.twitter.com/NRWRmP9YXf
— PMO India (@PMOIndia) August 8, 2026
********
MJPS/SS/PRK
Delighted to join the Convocation Ceremony of IIT Delhi. My best wishes to all the graduating students.@iitdelhi https://t.co/Lhuq4yUzJW
— Narendra Modi (@narendramodi) August 8, 2026
Those who learn, win! pic.twitter.com/lWCEzFLeNL
— PMO India (@PMOIndia) August 8, 2026
Keep your curiosity alive in life... Keep your learning instinct alive. pic.twitter.com/nsPmpNlRfk
— PMO India (@PMOIndia) August 8, 2026
Today, India is working towards becoming self-reliant in every sector. pic.twitter.com/D3a2CSPHWY
— PMO India (@PMOIndia) August 8, 2026
Today, new sectors are emerging in the country for our youth. pic.twitter.com/NRWRmP9YXf
— PMO India (@PMOIndia) August 8, 2026