పిఎంఇండియా
కామన్వెల్త్ గేమ్స్ విజేతలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు. గత దశాబ్ద కాలంగా భారత క్రీడా రంగం మారుతున్న తీరును ప్రస్తావిస్తూ… గత 12-13 ఏళ్ల పదవీ కాలంలో జాతీయ క్రీడాకారులను తన నివాసానికి ఆహ్వానించి, సత్కరించటం సాధారణ, అపూర్వమైన సంప్రదాయంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. సాధారణ ప్రచారాల కన్నా అంకితభావం, నిరంతర కృషితో భారత అథ్లెట్లు సాధించిన విజయాలు… పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. “పాఠశాలలకు వెళ్లి మనం చెప్పిన మాటల కన్నా, మీ పతకాలు వారికి ఎక్కువ స్ఫూర్తిని కలిగిస్తాయి” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
తన కుమార్తెలను క్రీడా రంగంలోకి తీసుకువస్తానని గతంలో ఇచ్చిన మాటను గుర్తుచేసుకుంటూ ఒక క్రీడాకారిణిని ప్రధానమంత్రి కలిశారు. ఆమె పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రాబోయే కామన్వెల్త్ గేమ్స్ లో ఆమె కుమార్తెలు మూడు పతకాలు సాధిస్తారని ప్రధానమంత్రికి చెప్పారు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని అభినందించటమే కాక, అత్యుత్తమ ప్రతిభను కనబరచాలనే సంకల్పాన్ని ప్రోత్సహించారు.
క్రీడాకారుల భావోద్వేగ ప్రయాణాన్ని ప్రధానమంత్రి కొనియాడారు. గురుపూర్ణిమ రోజున సాధించిన విజయాన్ని గురువుకు అంకితం చేసిన క్రీడాకారుడి పట్టుదలను… నాలుగేళ్ల పాటు నిరంతరం గాయాలు, వ్యక్తిగత ఇబ్బందులు ఎదుర్కొని పోడియంపై జాతీయ జెండా ఎగురుతుండగా కన్నీరు పెట్టుకున్న మరో అథ్లెట్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. దేశ విజయాలు కేవలం వ్యక్తిగత విజయాలకే పరిమితం కాకుండా భావితరాలకు ఎప్పటికీ నిలిచిపోయే స్ఫూర్తినిస్తాయని అన్నారు. “మీ విజయాలు రాబోయే తరాలకు ఎంతో స్ఫూర్తి” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు సాధిస్తున్న విజయాల పట్ల పెరుగుతున్న గౌరవం, ప్రత్యర్థుల్లో కలుగుతున్న భయం గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. ఇప్పుడు ప్రపంచ స్థాయి క్రీడాకారులు భారతీయ ప్రత్యర్థులతో పోటీ పడాల్సి వస్తే ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా పెరుగుతున్న భారత బాక్సర్ల ప్రాముఖ్యతను కొనియాడారు. ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న నిరంతర మద్దతు… పోటీని ఎంతగానో మార్చేశాయని అథ్లెట్లు చెబుతున్న అభిప్రాయాలను ఆయన గుర్తుచేసుకున్నారు. “ప్రపంచ స్థాయి క్రీడాకారులు ఇప్పుడు ఈ బాక్సర్లను చూసి భయపడుతున్నారు” అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
క్రీడలను ప్రోత్సహించటం వెనకున్న ఉద్దేశాన్ని స్పష్టం చేస్తూ.. ఖోలో ఇండియా కార్యక్రమం ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తూనే, క్రీడాకారులు ఎల్లప్పూడూ నేర్చుకుంటూనే ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. కేవలం క్రీడా సదుపాయాల కల్పనతోనే కాక, సమగ్ర క్రీడా సంస్కృతిని నిర్మించటంపై దేశ క్రీడా విజయాలు ఆధారపడి ఉంటాయన్నారు. “ఒకవైపు క్రీడా వసతులు, మరోవైపు క్రీడా సంస్కృతి ఏర్పడినప్పుడే దేశం పతకాలను సాధిస్తుంది” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
కార్గిల్ విజయ్ దివాస్ రోజున పాకిస్తాన్ అథ్లెట్‌ను 5-0 తేడాతో ఓడించి, ఆ విజయాన్ని భారత సైనిక వీరులకు అంకితం చేసిన ఇండియన్ ఆర్మీ అథ్లెట్ దేశభక్తిని కొనియాడారు. ఇలాంటి దేశభక్తి క్రీడా విజయాలకు అసాధారణమైన కీర్తిని తెస్తుందని అన్నారు. ఆర్మీ కోచ్ నరేంద్ర రాణా గురించి ప్రస్తావిస్తూ… “నరేంద్ర” అన్న పేరులోని విశేషం గురించి నవ్వుతెప్పించే సంఘటనను వివరిస్తూ అథ్లెట్‌తో సరదాగా మాట్లాడారు. “మీరు పతకాల సంఖ్యను పెంచటమే కాదు… ఒక తరాన్ని తయారు చేశారు” అని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
స్థానిక క్రీడా కేంద్రాల నుంచి అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించే స్థాయికి ఎదిగేందుకు కీలకమైన శిక్షణా వసతులను కల్పించినందుకుగాను భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఐ)కి కృతజ్ఞతలు తెలిపిన ఓ క్రీడాకారుడిని ప్రధానమంత్రి ప్రశంసించారు. “ఇది నాకు ఎంతో గర్వకారణం. మీరు కష్టపడి పనిచేసి, నన్ను గుర్తుంచుకున్నారు. నేను మీకు కృతజ్ఞుడను” అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
వారణాసి, భోపాల్ వంటి వివిధ ప్రాంతీయ కేంద్రాల్లో మెరుగుపరచిన క్రీడా మౌలిక సదుపాయాల గురించి ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు. అక్కడ క్రీడాకారులు శిక్షణ పొందటంతో పాటు వారణాసిలోని కాశీ విశ్వనాథుడు, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను కూడా సందర్శించారు. 2018లో ప్రారంభమైనప్పటి నుంచి ఖేలో ఇండియా విధానం, ఎస్ఏఐ అందిస్తున్న నిరంతర మద్దతును అభినందించారు. యువ ప్రతిభావంతులు ఉన్నత స్థాయి పోటీలకు వెళ్లేందుకు ఇవి ఎంతగానో దోహదపడ్డాయన్నారు. “భవిష్యత్తులోనూ మీరు మరిన్ని విజయాలు సాధిస్తారనే విశ్వాసం నాకుంది. మనం మళ్లీ ఇక్కడే కలుద్దాం” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
పలుమార్లు పతకం సాధించిన విజేత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు మిఠాయిలు తినిపించి వేడుకను నిర్వహించారు. సానుకూల దృక్పథంతో క్రీడాకారులు విజయాల పరంపరను కొనసాగించాలని ప్రోత్సహించారు. వరుసగా మూడోసారి పతకాలు గెలిచిన క్రీడాకారుల బృందాన్ని చిరునవ్వుతో ఆశీర్వదించారు. “ఆడేవాళ్లే గెలుస్తారు” అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
***