పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కీలకమైన మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన పనుల పురోగతిని ఈ రోజు సమీక్షించారు. నీతి ఆయోగ్ ఇచ్చిన ఒక సమర్పణను పరిశీలించిన సందర్భంగా రైల్వేలు, నవీకరణ యోగ్య శక్తి సహా పలు కీలక రంగాలలో చాలా పెద్ద పురోగతి చోటుచేసుకున్నట్లు గమనించారు.
కొత్త మరియు పునర్నవీకరణయోగ్యమైన శక్తి రంగంలో మొత్తం స్థాపిత సామర్ధ్యం 44 గీగావాట్ లను అధిగమించింది. కేంద్ర విధానాలు, రాష్ట్ర విధానాలలో భాగంగా చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడం జరిగింది. భవనాల పై కప్పుల మీద ఏర్పాటు చేసే సౌర పలకాల ద్వారా జరిగే శక్తి ఉత్పాదనతో సహా సౌర శక్తి ఉత్పాదనను మరింత అధికం చేయడానికి ఉద్దేశించిన ప్రణాళికలను, వ్యూహాలను గురించి సమావేశంలో ప్రధాన మంత్రికి వివరించడమైంది.
విమానయాన రంగంలో సురక్ష మరియు అనుసంధానం వంటి విధానాల పరంగా కీలకమైన రంగాలలో సాధించిన ప్రగతిని ప్రధాన మంత్రి అడిగి తెలుసుకున్నారు. భారత దేశంలోని 8 విమానాశ్రయాలు సంబంధిత శ్రేణిలో ప్రపంచవ్యాప్తంగా 5 అగ్రగామి విమానాశ్రయాల సరసన స్థానం సంపాదించాయని ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారు. ప్రాంతీయ అనుసంధానానికి మరింత ఊతం అందించే, విమానాశ్రయాలలో వినియోగదారులకు సంతృప్తిని కలిగించే సూచికలను మరింత మెరుగుపరిచే దిశగా చేపట్టిన చర్యలను గురించి కూడా ఈ సందర్భంగా ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
భారతీయ రైల్వేల రంగం రోజుకు 2.25 కోట్ల మంది ప్రయాణికులను చేరవేసే లక్ష్యాన్ని చేరుకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో కాపలా లేని 240 కూడళ్ళను తొలగించడం జరిగింది. విద్యుత్ రంగంలో ఇదే కాలంలో 3.5 కోట్ల ఎల్ ఇ డి బల్బులను పంపిణీ చేశారు.
ఓడ రేవుల రంగంలో ఒక నౌకకు సంబంధించి సరాసరి టర్న్ అరౌండ్ వ్యవధిలో చెప్పుకోదగ్గ పురోగతి నమోదు అయింది.
గ్రామీణ గృహ నిర్మాణరంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో 6 లక్షల ఇళ్ళను నిర్మించాలని లక్ష్యం పెట్టుకోగా అంతకు మించి 6.94 లక్షల ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
పెట్రోలియమ్- సహజ వాయువు రంగంలో పురోగతిని సమీక్షించిన ప్రధాన మంత్రి, పెట్రోలులో ఇథనాల్ ను కలిపే ప్రక్రియను వేగవంతం చేసేటందుకు ఏయే చర్యలను తీసుకుంటున్నదీ వాకబు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్ పి జి ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీలో భాగంగా 15 కోట్లకు పైగా కుటుంబాలకు లబ్ది చేకూరినట్లు అధికారులు ఆయనకు తెలియజేశారు.
ఈ సమావేశానికి వివిధ మౌలిక రంగాల మంత్రిత్వ శాఖలు, నీతి ఆయోగ్, ఇంకా ప్రధాన మంత్రి కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.