Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు-విభాగాల కార్యదర్శులతో ప్రధానమంత్రి అధ్యక్షతన 3వ అత్యున్నత స్థాయి సమావేశం


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం తన అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వంలోని భారత ప్రభుత్వ కార్యదర్శులతో 3వ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, అనుసంధానం, భద్రత, విదేశీ వ్యవహారాలు, పరిపాలన సంబంధ వ్యవహారాలపై వారితో చర్చించారు. న్యూఢిల్లీలోని నం.7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోగల అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొన్న ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో భవిష్యత్ కార్యాచరణపై ఆయన కూలంకషంగా సమీక్షించారు.

అనేక అంశాలపై ఇప్పటికే రెండు కార్యదర్శుల బృందాలతో చర్చలు నిర్వహించినట్లు ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. తక్షణ సమస్యలు, గణాంకాల గురించి ఆలోచించడమే కాకుండా, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంపై దీర్ఘకాలిక దృక్పథంతో మేధా మధనం చేయాలని కార్యదర్శులకు ఆయన సూచించారు.

విభాగాల మధ్య అడ్డుగోడల సమస్యను అధిగమించడంపై మాట్లాడుతూ- ఇది సంస్థాగతంగానే కాకుండా ఆలోచన విధానం పరంగానూ సవాలేనని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అడ్డుగోడలు ఎలాంటివైనా అధికారులు తమ వాస్తవిక బాధ్యతను గుర్తించి, కర్తవ్యబద్ధులై స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సమష్టి కృషి ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ- కోవిడ్ మహమ్మారి సమయంలో, పశ్చిమాసియా సంక్షోభం వేళ అన్ని విభాగాల అధికారులు సమర్థంగా పనిచేసిన అనుభవాన్ని ప్రధానమంత్రి ఉదాహరించారు. ప్రభుత్వ యంత్రాంగం పని సంస్కృతిలో అలాంటి సమన్వయం సహజ లక్షణం కావాలని ఆయన ఆకాంక్షించారు.

మానవ జోక్యం, విచక్షణాధికార ప్రయోగం సహా కృత్రిమ మేధను (ఏఐ) సమర్థంగా వాడుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. ఏఐ సామర్థ్యాన్ని మానవ నైపుణ్యంతో మేళవించగల వినూత్న మార్గాలను అన్వేషించాలని కార్యదర్శులను కోరారు.

సమాచారం (డేటా) ఒక జాతీయ సంపద మాత్రమేగాక భవిష్యత్తుకు వనరు వంటిదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. డేటా సమీకరణ, నిల్వ-నిర్వహణ కోసం ప్రభుత్వం వివిధ వనరులను పెట్టుబడిగా పెడుతున్నదని గుర్తుచేశారు. కానీ, వివిధ శాఖల మధ్య విభజన రేఖలు, విచ్ఛిన్న వ్యవస్థల ఫలితంగా దాని పూర్తి సామర్థ్యం ఎప్పుడూ సద్వినియోగం కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. వివిధ ప్రయోజనాల కోసం డేటాను సమీకరించి, నిర్వహించే విధానంలో ఎన్నో తేడాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. వివిధ రకాల సమాచారం మధ్య మెరుగైన అనుసంధానం, సమర్థ వినియోగాన్ని సుసాధ్యం చేయగల మార్గాలను అన్వేషించాలని ఆయన పిలుపునిచ్చారు.

సరికొత్త దృక్పథంతో విధానాల రూపకల్పన దిశగా ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య భాగస్వామ్యం ఇనుమడించాలని ప్రధానమంత్రి సూచించారు. విశ్వవిద్యాలయాలు, యువతతో విస్తృత భాగస్వామ్యం ద్వారా సరికొత్త, అసాధారణ ఆలోచనలకు ఆస్కారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

రక్షణ రంగం సహా పరిశోధన-ఆవిష్కరణలపై మరింతగా దృష్టి సారించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేశీయ రక్షణ పరిశ్రమను మరింత బలోపేతం చేస్తూ, అంతర్జాతీయ పోటీతత్వాన్ని మరింత పెంచాల్సిన అవసరాన్ని ప్రస్ఫుటం చేశారు. రక్షణ రంగ సంబంధిత కొత్త కోర్సులకు రూపకల్పన, మానవ వనరుల అభివృద్ధిని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించారు.

దేశీయ సముద్రరంగ బలోపేతానికి సమగ్ర విధానం ఎంతో అవసరమని ప్రధానమంత్రి చెప్పారు. నౌకా నిర్మాణ రంగానికి మౌలిక సదుపాయాల హోదా ఇచ్చామని, దీనికి నిర్దేశించిన లక్ష్యాలు ఉద్యమ స్థాయిలో నెరవేరుతున్నదీ, లేనిదీ అంచనా వేయాలని పిలుపునిచ్చారు. మన దేశం ఓడరేవుల అభివృద్ధి నుంచి వాటి సారథ్యాన పురోగమనం వైపు పయనించాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు.

భారత తయారీ రంగం, ఎగుమతి సామర్థ్యాలకు సముద్ర మౌలిక సదుపాయాల ద్వారా పూర్తి ప్రయోజనం లభించాలంటే రెండు రకాల యూనిట్లకూ మధ్య మెరుగైన అనుసంధానం అత్యంత అవశ్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

సంక్లిష్ట సవాళ్ల పరిష్కారంతో పాటు దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ‘ఏకోన్ముఖ ప్రభుత్వ’ విధానం, లోతైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

అధికారుల మధ్య తరచూ ఇష్టాగోష్ఠి సహా జట్టు స్ఫూర్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా జూనియర్ సహోద్యోగులతో ఉన్నతాధికారులు మరింత వ్యక్తిగత, సౌహార్ద సంబంధాలను పెంచుకోవాలని హితవు పలికారు. అలాగే కింది కేడర్లు, విభాగాలన్నిటా బలమైన సంధానం ఏర్పరచుకోవాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో భాగంగా రంగాలవారీ ప్రాథమ్యాలు, వాటికి ఎదురయ్యే అవరోధాలు, అమలు సంబంధిత సవాళ్లపై కార్యదర్శులు తమ అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖలు-విభాగాల కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.

 

***