పిఎంఇండియా
ఆర్థిక భారం నుంచి ఊరటసహా సామర్థ్యం మెరుగుకు దారితీసే నిర్ణయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి- దేశంలోని రైతులకు సాధికారత కల్పన దిశగా ఓ కొత్త కేంద్ర ప్రభుత్వ రంగ పథకానికి ఆమోదం తెలుపుతూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. జాతికి ఇంత తిండి పెట్టేందుకు అహర్నిశలూ పొలాల్లో చెమటోడ్చే రైతన్నకు పింఛన్ అందించేందుకు ఉద్దేశించిన వినూత్న పథకమిది. అలాగే స్వాతంత్ర్యానంతరం రైతులకోసమే రూపొందించిన తొలి పింఛన్ పథకం కూడా ఇదే కావడం విశేషం. దీనివల్ల తొలి మూడేళ్లలోనే సుమారు 5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా. సామాజిక భద్రతకు హామీ ఇచ్చే ఈ పథకం కింద మూడేళ్ల కాలానికిగాను కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 10,774.50 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.
ఈ పథకం ముఖ్యాంశాలివే:-
దేశంలోని సన్న, చిన్నకారు రైతులందరికీ వర్తించే స్వచ్ఛంద-భాగస్వామ్య పింఛన్ పథకమిది. ఇందులో 18-40 ఏళ్ల మధ్య వయస్కులు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదైనవారికి 60 ఏళ్లు పూర్తికాగానే నెలకు రూ.3000 వంతున పెన్షన్ లభిస్తుంది. ఉదాహరణకు… అర్హుడైన రైతు లబ్ధిదారు 29 ఏళ్లు నిండిన తర్వాత ఇందుకోసం నెలకు రూ.100 చొప్పున తన వాటాకింద జమచేయాల్సి ఉంటుంది. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద అంతే మొత్తాన్ని పింఛన్ నిధికి జమచేస్తుంది. లబ్ధిదారుకు 60 ఏళ్లు పూర్తయ్యాక పెన్షన్ అందుకుంటున్న కాలంలో మరణించినట్లయితే వారి జీవిత భాగస్వామికి పెన్షన్ మొత్తంలో 50 శాతం (రూ.1,500) కుటుంబ పింఛన్ కింద అందుతుంది. అయితే, సదరు జీవిత భాగస్వామి ఇదే పథకంలో చందాదారు అయి ఉండరాదు. ఒకవేళ లబ్ధిదారు తనవంతు నెలవారీ చందాలు చెల్లిస్తూ 60 ఏళ్లు రాకముందే మరణించినట్లయితే- వారి జీవిత భాగస్వామి ఆ మొత్తాన్ని చెల్లించడంద్వారా పథకంలో కొనసాగవచ్చు.
పథకాల మధ్య సమన్వయం-రైతులకు సౌభాగ్యం:-
ఈ పథకంలో ఆసక్తికర అంశమేమిటంటే- ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద పొందే ఆర్థిక సహాయం నుంచి రైతులు నేరుగా తమ స్వచ్ఛంద-భాగస్వామ్య పింఛన్ పథకానికి నెలవారీ చందా చెల్లించే వీలుండమే. ఇందుకోసం రైతులు MeitY కిందగల సార్వత్రిక సేవా కేంద్రాలలో నమోదు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
ప్రధాన వాగ్దానాల అమలు-వ్యవసాయ రంగానికి సాధికారత:-
స్వాతంత్ర్యం సిద్ధించిన 70 ఏళ్ల తర్వాత కూడా రైతుల కోసం ఇలాంటి పథకం అవసరం గురించి ఆలోచన చేసిన దాఖలాల్లేవు. అయితే, 2019 లోక్‘సభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకం గురించి తొలిసారి ప్రస్తావించాక క్రమేణా ఇది దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. అలాగే బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలోనూ ఇటువంటి పథకంపై హామీ ఇచ్చింది. తదనుగుణంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి మంత్రిమండలి సమావేశంలోనే అది కార్యరూపం దాల్చింది.