Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘గణాంక పరివర్తన, విశ్లేషణలు – పరిశోధన (విస్తార్) కోసం వికసిత్ భారత్ ఇనిషియేటివ్’కు కేబినెట్ ఆమోదం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర కేబినెట్… 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు రూ. 4,371.10 కోట్ల వ్యయంతో అమలు చేయనున్న ‘గణాంక పరివర్తన, విశ్లేషణలు – పరిశోధన (విస్తార్) కోసం వికసిత్ భారత్ ఇనిషియేటివ్’ పథకానికి ఆమోదం తెలిపింది.

వికసిత్ భారత్ 2047 ప్రధాన లక్ష్య సాధనలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం ‘విస్తార్’ పథకాన్ని తీసుకువచ్చింది. ఆధునిక సాంకేతికతతో, ఎప్పటికప్పుడు కచ్చితమైన అధికారిక గణాంకాలను అందించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. దీని ద్వారా డేటా సేకరణ వేగం మరింత పెరుగుతుంది. ప్రతి చిన్న వివరమూ స్పష్టంగా లభిస్తుంది. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతకు అనుగుణంగా ఉండే వివిధ డేటాసెట్లను ఒకదానితో ఒకటి సులభంగా అనుసంధానించడానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుంది.

అవసరమైన విధానాల ఆధారంగా ఎప్పటికప్పుడు వనరులను కేటాయించుకునే వ్యూహాత్మక సౌలభ్యాన్ని ‘విస్తార్’ పథకం కల్పిస్తుంది. ఇది భారీ సర్వేల నిర్వహణ, పరిశోధన పద్ధతులు, డిజిటల్ పరివర్తన, జాతీయ డేటా నిర్వహణ కోసం ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తుంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పరిధిలోని అన్ని గణాంక, డేటా నిర్వహణ కార్యకలాపాలు ఈ పథకం కిందకు వస్తాయి. దేశ అధికారిక గణాంక వ్యవస్థను ఆధునికీకరించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ పథకంలోని 3 ప్రధాన విభాగాలు:

విభాగం 1: సమగ్ర గణాంక కార్యకలాపాలు, వ్యవస్థ బలోపేతం

విభాగం 2: గణాంకాల బలోపేతానికి మద్దతు (ఎస్ఎస్ఎస్)

విభాగం 3: ఆర్థిక జన గణన (ఈసీ)

‘సమగ్ర గణాంక కార్యకలాపాలు, వ్యవస్థ బలోపేతం’ విభాగం కింద… గతంలో 43 ప్రధాన సర్వేలు నిర్వహించగా, 16వ ఆర్థిక సంఘ కాలవ్యవధిలో ఏకంగా 59 సర్వేలను నిర్వహించాలని ఎంవోఎస్‌పీఐ ప్రతిపాదించింది. వివిధ రంగాల్లోని కీలక డేటా లోపాలను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను మరింత సమర్థంగా మార్చడానికి, సకాలంలో అవసరమైన విధానపరమైన చర్యలు చేపట్టడానికి ఇది దోహదపడుతుంది. సాంకేతికత ఆధారిత డేటా సేకరణ, వినియోగదారులకు అనుకూలమైన డేటా విస్తరణలో ఇటీవల సాధించిన డిజిటల్ పురోగతి ఆధారంగా… గణాంక ప్రక్రియలను మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా డిజిటలైజ్ చేయడంపైనా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా డేటా ప్రాసెసింగ్, కచ్చితత్వంతో కూడిన పరిశీలన, విశ్లేషణల కోసం కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) సాంకేతికతలను తమ రోజువారీ విధుల్లో అంతర్భాగం చేయనుంది.

సేవల రంగానికి సంబంధించిన ‘హెడ్‌లైన్ ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్’, అసంఘటిత రంగానికి సంబంధించిన ‘ఇండెక్స్ ఆఫ్ అన్‌ఇన్‌కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్’ వంటి సరికొత్త సూచీలను విడుదల చేయడానికి ఎంవోఎస్‌పీఐ సన్నద్ధమవుతోంది. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో విడిగా ఉన్న డేటాను ఏకీకృతం చేయడానికి, పథకాల లక్ష్యాలను మెరుగుపరచడానికి, సమాచార పునరావృతాన్ని తగ్గించడానికి, ఏఐ ఆధారిత నిర్ణయాలకు మార్గం సుగమం చేయడానికి మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది. దీని కోసం డేటా కేటలాగింగ్, మెషిన్ రీడెబిలిటీ, పరస్పర అనుసంధాన సౌలభ్యం, షేరింగ్ ప్రోటోకాల్స్, ప్రాథమిక దశ నుంచే డేటా గోప్యత వంటి డేటా సమన్వయ పునాదులను మంత్రిత్వశాఖ మరింత బలోపేతం చేయనుంది. సాంప్రదాయిక సర్వేలకు అదనంగా మొబైల్ ఫోన్, స్కానర్, ఈ-కామర్స్ వంటి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా లభించే డేటాను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం ద్వారా సర్వేకు సమాధానమిచ్చేవారిపై భారాన్ని తగ్గించడంతో పాటు… డేటా లోపాలను భర్తీ చేసి, సాక్ష్యాధారాలతో కూడిన విధాన రూపకల్పనకు ఎంవోఎస్‌పీఐ శ్రీకారం చుట్టనుంది. విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్ పథకాలను ప్రవేశపెట్టడం, వివిధ విద్యా, పరిశోధనా సంస్థల నుంచి పరిశోధన ప్రతిపాదనలను ఆహ్వానించడం ద్వారా యువత, పరిశోధకులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తూ వారి సామర్థ్యాలను పెంపొందించడానికి మంత్రిత్వశాఖ పూర్తి భరోసా కల్పిస్తుంది.

‘గణాంకాల బలోపేతానికి మద్దతు’ (ఎస్ఎస్ఎస్) విభాగం కింద… ఫలితాల ఆధారిత నూతన విధానం (ఎస్ఎస్ఎస్ 2.0) ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గణాంక సామర్థ్యాలను పూర్తిగా ఆధునికీకరించడానికి ఆయా ప్రభుత్వాలకు నిధులు అందించనున్నారు. జిల్లా, ఇతర క్షేత్ర స్థాయిల్లో అత్యంత కచ్చితమైన, వివరణాత్మకమైన డేటాను సేకరించేలా రాష్ట్ర స్థాయి సామర్థ్యాన్ని పెంపొందించడం, స్థానికంగానే డేటా ప్రాసెసింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, స్థానిక విధాన రూపకల్పనలో ఈ డేటా వినియోగాన్ని భాగంగా మార్చడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక జాతీయ సర్వేల్లో (ఉదాహరణకు పీఎల్ఎఫ్ఎస్, హెచ్‌సీఈఎస్, ఏఎస్‌యూఎస్ఈ వంటివి) జిల్లా స్థాయి అంచనాలను, పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల స్థాయి అంచనాలను మరింత విస్తృతంగా రూపొందించడానికి ఎంవోఎస్‌పీఐ సాంకేతిక మద్దతును అందిస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయి జీడీపీ, రాష్ట్ర స్థాయి ఐఐపీ గణనలను పటిష్ఠం చేయడానికీ ఈ నిధులు తోడ్పడతాయి.

‘ఆర్థిక జన గణన’ (ఈసీ) విభాగం కింద… రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో 8వ ఆర్థిక జన గణనను నిర్వహించడానికి ఎంవోఎస్‌పీఐ సన్నద్ధమవుతోంది. ఇది గ్రామ పంచాయతీ, వార్డు స్థాయి వరకు గల అన్ని వ్యవసాయేతర సంస్థలు, వాటిలో పనిచేసే కార్మికుల వివరాలతో కూడిన కచ్చితమైన డేటాను అందించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలోని అసంఘటిత రంగ స్థితిగతులను అంచనా వేయడానికి తోడ్పడుతుంది. నిర్దేశిత సంస్థాగత సర్వేలు, వ్యూహాత్మక చర్యలను సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ‘జాతీయ గణాంక వ్యాపార రిజిస్టర్’ (ఎస్‌బీఆర్) రూపకల్పనకు ఈ గణన పునాదిగా పనిచేస్తుంది. జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లోని ప్రణాళికాకర్తలకు, విధాన నిర్ణేతలకు ఎంతగానో ఉపయోగపడే ఈ ఆర్థిక జన గణన డేటా… స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో అసంఘటిత రంగం వాటాను కచ్చితంగా అంచనా వేయడానికి మార్గం సుగమం చేస్తుంది.

 

****